చైనాకు హాంకాంగ్ ‘తలనొప్పి’.. మకావు మాత్రం ‘మచ్చుతునక’..

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సోఫీ విలియమ్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనాలో మకావు కలయికకు 20 ఏళ్లు పూర్తయ్యాయి. దాదాపు 31 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ నగరం.. ఒకప్పుడు పోర్చుగీసు వలస పాలనలో ఉండేది. 1999 డిసెంబర్ 20న చైనాతో కలిసింది.
హాంకాంగ్ లాగే మకావుకూ చైనా స్యయం ప్రతిపత్తి కల్పించింది. 50 ఏళ్లపాటు ఇది కొనసాగుతుంది.
‘ఒకే దేశం, రెండు వ్యవస్థలు’ విధానంలోనే మకావులో కూడా పాలన వ్యవస్థ ఉంది. రక్షణ, విదేశాంగ వ్యవహారాలు మాత్రమే చైనా నియంత్రణలో ఉంటాయి.
అయితే, ఆరు నెలలుగా నిరసనలతో హాంకాంగ్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. అక్కడి నేరస్తులను చైనాకు అప్పగించేందుకు వీలుగా తెచ్చిన ఓ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నిరసనలు మొదలయ్యాయి. లక్షల మంది వీధుల్లోకి వచ్చి చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు.
అయితే, హాంకాంగ్‌లా స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ మకావులో పరిస్థితి మాత్రం భిన్నం.
మకావు ప్రజలు గొప్ప దేశ భక్తులని చైనా ప్రభుత్వం మెచ్చుకుంటోంది. ‘ఒకే దేశం, రెండు వ్యవస్థలు’ విధానానికి మంచి ఉదాహరణగా నిలుస్తోందని అంటోంది.

ఫొటో సోర్స్, AFP
చైనాలో మకావు కలయికకు 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా శుక్రవారం జరిగిన సంబరాల్లో చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ పాల్గొన్నారు. ఐకమత్యాన్ని కాపాడుకునే సంప్రదాయం కొనసాగాలని అన్నారు.
హాంకాంగ్ విషయంలో గానీ, మకావు విషయంలో గానీ ఇతరుల జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
‘‘ఇవి పూర్తిగా చైనా అంతర్గత వ్యవహారాలు. బయటి శక్తులేవీ మాకు నిర్దేశించాల్సిన అవసరం లేదు. జోక్యాన్ని మేం ఎప్పుడూ సహించం’’ అని జిన్‌పింగ్ అన్నారు.
మకావు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా హో ఇయట్-సెంగ్‌తో జిన్‌పింగ్ ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. హోకు చైనా ప్రభుత్వ మద్దతు ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా దక్షిణ తీరంలో ఉన్న మకావు చాలా ప్రాధాన్యం ఉన్న ఓడరేవు పట్టణం. గాంగ్జౌకు దక్షిణాన, హాంకాంగ్‌కు 65 కి.మీ.ల దూరంలో ఇది ఉంది.
1557లో మకావును పోర్చుగల్ లీజుకు తీసుకుంది. 1887లో అధికారికంగా పోర్చుగీస్ వలస పాలిత ప్రాంతంగా మార్చింది.
‘‘మకావుకు ఆహారం అంతా చైనా నుంచే వచ్చేది. పోర్చుగీస్ పాలకులకు చైనా సహకారం ఉండేది. మకావు చైనాకు అత్యంత చేరువగా ఉండటంతో, తమ పాలన ముగిశాక పోర్చుగీస్ పాలకులు ఆ దేశంతో చర్చించాల్సి వచ్చింది’’ అని యూనివర్సిటీ ఆఫ్ మకావులోని సెంటర్ ఫర్ మకావు స్టడీస్ డైరెక్టర్ ఆగ్నెస్ లామ్ అన్నారు.
1999 డిసెంబర్ 20న మకావు విలీనం జరుగుతుందని, 1987లో పోర్చుగల్, చైనా సంయుక్త ప్రకటన చేశాయి.

ఫొటో సోర్స్, AFP
మకావుకు సొంతంగా ప్రభుత్వం ఉంది. న్యాయపరమైన, ఆర్థికపరమైన అంశాలు దాని పరిధిలోనే ఉంటాయి.
ప్రత్యేక కరెన్సీ, చట్టాలు కూడా ఉన్నాయి. మకావులో జూదం చట్టబద్ధంగానే సాగుతుంది. ఈ ప్రాంత ఆదాయంలో సింహ భాగం దాని నుంచే వస్తోంది.
మకావు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నియామకంలో సాధారణ పౌరులకు ప్రత్యక్ష నిర్ణయాధికారం ఉండదు. చైనా ప్రభుత్వం ఆమోదించిన ఓ కమిటీ ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ను నియమిస్తుంది. ఈ కమిటీలో 400 మంది సభ్యులుంటారు.
‘‘చైనాతో ‘ఒకే దేశం, రెండు వ్యవస్థలు’ విధానంపై మాకు అభిప్రాయ భేదాలు లేవు. మా హద్దులు మాకు బాగా తెలుసు’’ అని లామ్ బీబీసీతో చెప్పారు.
మకావు జనాభా 60 వేలకుపైనే ఉంటుంది. తలసరి జీడీపీ విషయంలో మకావు ప్రపంచంలోనే మూడో అత్యుత్తమం.
‘‘గతంలో హాంకాంగ్ కన్నా మకావు ఆర్థికంగా వెనుకబడి ఉండేది. అమెరికన్ గేమింగ్ పరిశ్రమల కోసం చైనా మకావు ద్వారాలను తెరిచింది. మకావును అంతర్జాతీయ గేమింగ్ కేంద్రంగా మార్చింది. ఇప్పుడు తలసరి జీడీపీలో మకావు హాంకాంగ్‌ను దాటేసింది’’ అని లండన్‌లోని ఎస్‌ఓఏఎస్ చైనా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ స్టీవ్ సాంగ్ చెప్పారు.
‘‘మకావులోని ప్రస్తుత జనాభాలో దాదాపు సగం చైనా నుంచి వచ్చినవారే. చైనా దృష్టిలో ‘ఒకే దేశం, రెండు వ్యవస్థలు’ విధానానికి మకావు ఓ మచ్చుతునక’’ అని అన్నారు.
‘‘హాంకాంగ్ ప్రజలు స్వయంపాలన, స్వేచ్ఛ, హక్కుల కోసం పోరాడుతున్నారు. కానీ, మకావు ప్రజల్లో అలాంటి భావన కనిపించదు. ఇక్కడి ప్రజల్లో అత్యధిక మంది చైనా ప్రభుత్వానికి మద్దతుగా ఉండేవారే. వీళ్ల జీవితాలు సాఫీగా సాగుతున్నాయి. అందుకే ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉద్యమాలకు మకావులో మద్దతు దొరకడం చాలా కష్టం’’ అని న్యూ మకావు అసోసియేషన్ అనే ప్రజాస్వామ్యవాద పార్టీ మాజీ అధ్యక్షుడు జేసన్ చావో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఇక్కడ మకావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుంటాయి. అయితే, నిరసనకారులు చైనా జోక్యం చేసుకుని తమకు సాయం చేయాలని కోరుతుంటారు’’ అని అన్నారు.
హాంకాంగ్ ఆందోళనలకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించేందుకు మకావులోనూ ప్రయత్నాలు జరిగాయి. గత ఆగస్టులో ఇలాంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకుంది.
సెప్టెంబర్‌లో ప్రదర్శన చేపట్టేందుకు అనుమతివ్వాలని కొందరు చేసుకున్న అభ్యర్థనను మకావు హైకోర్టు తోసిపుచ్చింది.
చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టకుండా మకావు ప్రభుత్వం ఓ చట్టం కూడా చేసింది.
2003లో ఇలాంటి చట్టమే హాంకాంగ్‌లో తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీన్ని వ్యతిరేకిస్తూ దాదాపు ఐదు లక్షల మంది వీధుల్లోకి రావడంతో, హాంకాంగ్ ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంది.
ఇవి కూడా చదవండి:
- పౌరసత్వ సవరణ చట్టం: బీజేపీ తొందరపడిందా.. ఈ స్థాయి వ్యతిరేకతను ఊహించలేదా
- వీగర్ ముస్లింలను కట్టుదిట్టమైన జైళ్ళలో బంధించి 'బ్రెయిన్‌వాష్' చేస్తున్న చైనా
- "అమ్మను చూడగానే కన్నీళ్లొచ్చాయి"- పన్నెండేళ్ళ తర్వాత కన్నతల్లిని కలుసుకున్న భవానీ
- 'హైదరాబాద్ ఎన్కౌంటర్' బూటకం, పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. సుప్రీం కోర్టులో నిందితుల కుటుంబ సభ్యుల పిటిషన్
- పౌరసత్వ సవరణ చట్టాన్ని తిరస్కరించే అధికారం రాష్ట్రాలకు ఉందా?
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
- YouTube: ఎనిమిదేళ్ల ఈ అబ్బాయి ఏడాదిలో రూ. 184 కోట్లు సంపాదించాడు
- కృత్రిమ దీవులు నిర్మిస్తామన్న చైనా కంపెనీలు.. అక్కర్లేదన్న పసిఫిక్ దేశం తువాలు
- సనా గంగూలీ ‘The End of India’పై చర్చ.. ‘ఆ పోస్ట్ వాస్తవం కాదు’ - సౌరవ్ గంగూలీ
- ‘నా శరీరం కోసమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు’ :దిల్లీలో ఆఫ్రికా యువతులతో సెక్స్ కుంభకోణంపై బీబీసీ పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








