హాంకాంగ్‌పై చట్టం చేసిన అమెరికా, చైనా కన్నెర్ర

హాంకాంగ్‌పై అమెరికా చట్టం

ఫొటో సోర్స్, Reuters

హాంకాంగ్‌లో ఆందోళనకారులకు మద్దతు కొనసాగిస్తే, దానికి ప్రతిగా తాము కూడా తగిని రీతిలో బదులివ్వాల్సి ఉంటుందని చైనా అమెరికాను హెచ్చరించింది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒక రోజు ముందు హాంకాంగ్‌కు మద్దతుగా హ్యూమన్ రైట్స్ అండ్ డెమాక్రసీ యాక్ట్‌ ఆమోదించారు.

మిగతా చైనా నుంచి హాంకాంగ్‌కు స్వయం ప్రతిపత్తి కొనసాగించాలా అనే అంశంపై ఈ చట్టప్రకారం అమెరికా వార్షిక సమీక్ష చేస్తుంది.

ఈ చర్యలపై చైనా విదేశాంగ శాఖ స్పందించింది. వాస్తవాలను అమెరికా నిర్లక్ష్యం చేయడమే కాకుండా, వాటిని తారుమారు చేసి చూపిస్తోందని ఆరోపించింది.

"అమెరికా బహిరంగంగా ఇలాంటి హింసాత్మక నేరాలకు మద్దతిస్తోంది. విధ్వంసం చేస్తున్నవారు, నిప్పు పెడుతున్నవారు, ఏ నేరం చేయని అమాయకులపై దాడులు చేస్తున్నవారు చట్టాలను, నియమాలను అతిక్రమిస్తున్నారు. పౌర వ్యవస్థకు కూడా నష్టం కలిగిస్తున్నారు" అని చైనా ప్రతినిధి ఒక ప్రకటన చేశారు.

"ఇలాగే తప్పుడు మార్గంలో వెళ్తే, చైనా కూడా దానికి బదులివ్వాల్సి ఉంటుంది" అని ఆయన చెప్పారు.

హాంకాంగ్‌పై అమెరికా చట్టం

ఫొటో సోర్స్, Reuters

ఈ బిల్లులో ఏముంది?

హాంకాంగ్‌లో హింసాత్మకంగా మారిన వ్యతిరేక ప్రదర్శనలు మొదలైనప్పుడు, అంటే ఈ ఏడాది జూన్‌లో అమెరికా పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. గత నెలలో దాదాపు సభ్యులందరి నుంచీ దీనికి మద్దతు లభించింది.

హాంకాంగ్ చైనాలో భాగం, కానీ దాని చట్టపరమైన, ఆర్థిక వ్యవస్థలు చాలా వరకూ చైనా నుంచి వేరుగా ఉంటాయని ఈ బిల్లులో చెప్పారు.

"వార్షిక సమీక్ష ద్వారా హాంకాంగ్ పౌర స్వేచ్ఛను చైనా ఉల్లంఘిస్తోందా, అక్కడ నిబంధనల ప్రకారం పాలన నడుస్తోందా అనేది చూసుకుంటాం" అని ఈ బిల్లులో పేర్కొన్నారు.

హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి కొనసాగేలా, దాని ప్రత్యేక వాణిజ్య హోదా అలాగే ఉండేలా కూడా అమెరికా చూసుకుంటుంది.

మిగతా అంశాలు కాకుండా హాంకాంగ్‌కు ప్రత్యేక వాణిజ్య హోదా అంటే అమెరికా.. చైనాకు వ్యతిరేకంగా అమలు చేసిన ఆంక్షలు లేదా వ్యాపార సుంకాల ప్రభావం దానిపై ఉండవు.

అహింసా ప్రదర్శనల్లో భాగమైన హాంకాంగ్ ప్రజలందరూ తమ వీసాకు దరఖాస్తు చేయడానికి ఈ బిల్లు ప్రకారం అమెరికా అనుమతి ఇస్తుంది.

అమెరికా, చైనా ట్రేడ్ వార్‌‌కు సంబంధించి జరుగుతున్న చర్చలపై కొత్త బిల్లు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

హాంకాంగ్‌పై అమెరికా చట్టం

ఫొటో సోర్స్, EPA

చైనా స్పందన ఏంటి?

అమెరికా రాయబారిని పిలిపించిన చైనా విదేశాంగ శాఖ, తమ దేశ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం మానుకోవాలని కోరింది.

అమెరికా బిల్లు వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని హాంకాంగ్ ప్రభుత్వం కూడా అంటోంది. దీనివల్ల పరిస్థితులు సరిదిద్దుకోడానికి సహకారం లభించదని చెప్పింది.

"హాంకాంగ్‌ ప్రజలందరికీ అమెరికా చట్టం ఒక గొప్ప విజయం" అని హాంకాంగ్ ప్రదర్శనల్లో ప్రముఖ కార్యకర్త జోషువా వాంగ్ చెప్పారు.

హాంకాంగ్ పరిస్థితి ఎలా ఉంది?

ఇటీవల హాంకాంగ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్య మద్దతుదారులు ఎక్కువ స్థానాలు గెలిచారు. ఆ తర్వాత నిరసనలు కూడా తగ్గాయి.

హాంకాంగ్‌లో ఒక అప్పగింత చట్టం గురించి ఈ ఏడాది జూన్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. కానీ మెల్లమెల్లగా ఈ ప్రదర్శనలు ప్రజాస్వామ్యానికి మద్దతు పలికే ఉద్యమంగా రూపుదిద్దుకున్నాయి.

తర్వాత, ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు-నిరసనకారుల మధ్య చాలాసార్లు ఘర్షణలు జరిగాయి. పోలీసులు చాలాసార్లు బలప్రయోగం కూడా చేశారు.

ఆందోళనకారులు కూడా ఎన్నో ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని పెట్రోల్ బాంబులతో దాడులు చేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)