న్యూజీలాండ్: హెచ్‌ఐవీ బాధితుల కోసం ప్రపంచంలోనే తొలి స్పెర్మ్ బ్యాంకు

వీర్యం

ఫొటో సోర్స్, Science Photo Library

ప్రపంచంలోనే తొలిసారిగా హెచ్‌ఐవీ బాధితుల వీర్య నిధి (స్పెర్మ్ బ్యాంకు)ని న్యూజీలాండ్‌లో ఏర్పాటు చేశారు. హెచ్‌ఐవీపై ప్రజల్లో ఉన్న అపోహలను పోగొట్టే ఆలోచనతో ఇది ఏర్పాటు చేశారు.

ఇప్పటికే ముగ్గురు హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నవారు వీర్యాన్ని దానం చేసేందుకు ఈ బ్యాంకులో పేర్లను నమోదు చేయించుకున్నారు. ఆ ముగ్గురిలోనూ ఆ వైరస్ తీవ్రత చాలా తక్కువగా ఉంది. అంటే, సెక్స్, ప్రసవం ద్వారా వారి నుంచి హెచ్‌ఐవీ ఇతరులకు వ్యాప్తి చెందదు.

డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఉన్నందున బాడీ పాజిటివ్, న్యూజీలాండ్ ఎయిడ్స్ ఫౌండేషన్, పాజిటివ్ ఉమెన్ ఇన్‌కార్పోరేట్ అనే మూడు స్వచ్ఛంద సంస్థలు కలిసి 'స్పెర్మ్ పాజిటివ్‌' పేరుతో ఈ కేంద్రాన్ని ప్రారంభించాయి.

దీని ద్వారా హెచ్ఐవీ సంక్రమణ గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించడంతో పాటు, ఆ వైరస్ బాధితుల పట్ల సమాజంలో ఉన్న అపోహలను దూరం చేసే అవకాశం ఉంటుందని ఈ సంస్థలు ఆశిస్తున్నాయి.

హెచ్‌ఐవీ ఎయిడ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఈ బ్యాంకులో హెచ్‌ఐవీ పాజిటివ్ ఉన్నవారి నుంచి మాత్రమే వీర్యాన్ని స్వీకరిస్తారు. అయితే, వారిలో వైరస్ స్థాయి తక్కువగా ఉండాలి, అది ఇతరులకు ఏ రకంగానూ సంక్రమించకూడదు.

"నాకు హెచ్‌ఐవీ ఉందన్న విషయాన్ని నేను పనిచేసే సంస్థ యజమానికి చెప్పాను. ఆ తరువాత వారి నుంచి నాకు బెదిరింపులు వచ్చాయి. దాంతో, చివరికి నేను ఆ ఉద్యోగాన్ని వదిలేయాలన్న నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని ముగ్గురు దాతలలో ఒకరైన డామియన్ తెలిపారు.

"సరైన చికిత్స తీసుకుంటే ఆ వైరస్ ఇతరులకు సంక్రమించకుండా అడ్డుకోవచ్చు. నా మహిళా స్నేహితుల్లో చాలామంది వారికి హెచ్‌ఐవీ ఉన్నా పిల్లలను కంటున్నారు. సరైన మందులు వాడితే మేము కూడా అందరిలాగే సాధారణ జీవితం గడపొచ్చు అని అర్థమవుతోంది" అని ఆయన వివరించారు.

డామియెన్‌‌కి హెచ్ఐవీ ఉందని 1999లో బయటపడింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు, ముగ్గురు మనుమలు కూడా ఉన్నారు.

హెచ్‌ఐవీ ఎయిడ్స్ మందులు

ఫొటో సోర్స్, Getty Images

గత కొన్నేళ్లలో హెచ్ఐవీ చికిత్సలో వైద్య నిపుణులు ఎంతో పురోగతి సాధించారు. 2019 మార్చిలో ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా వైద్యులు ఒక హెచ్‌ఐవీ పాజిటివ్ రోగి మూత్రపిండాన్ని మరో రోగికి విజయవంతంగా అమర్చారు.

యాంటీ రిట్రోవైరల్ థెరపీ ద్వారా కొన్ని రకాల మందులను క్రమం తప్పకుండా రోజూ వాడితే శరీరంలో హెచ్‌ఐవీ పెరగకుండా నిరోధిస్తుంది. అలా చేస్తే రక్తంలో వైరస్ స్థాయి చాలావరకు తగ్గిపోతుంది.

అయితే, హెచ్‌ఐవీ ఇప్పటికీ ప్రపంచానికి అత్యంత తీవ్రమైన సవాల్‌గా ఉన్న ఆరోగ్య సమస్యగానే ఉంది. 2018 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 3.8 కోట్ల మంది హెచ్‌ఐవీ లేదా ఎయిడ్స్ బాధితులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)