చైనా: 'వీగర్ ముస్లింలను కట్టుదిట్టమైన జైళ్ళలో బంధించి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు...' లీకైన అధికారిక పత్రాలతో వెలుగు చూసిన రహస్యాలు

అత్యంత కట్టుదిట్టమైన జైళ్లలో నిర్బంధించిన లక్షలాది వీగర్ ముస్లింలకు చైనా ఒక పద్ధతి ప్రకారం బ్రెయిన్‌వాష్ చేస్తోందని తాజాగా లీకైన పత్రాలతో మొదటిసారి వెలుగులోకి వచ్చింది.
పశ్చిమ ప్రాంతంలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో స్వచ్ఛంద విద్య, శిక్షణ అందిస్తున్నామని చైనా ప్రభుత్వం చెబుతూ వస్తోంది.
కానీ, బీబీసీ పనోరమా పరిశీలించిన అధికారిక పత్రాలు, ఆ శిబిరాల్లోని వారిని ఎలా బంధించారు, వారికి ఎలా హితబోధ చేస్తున్నారు, ఎలా శిక్షిస్తున్నారనేవి చూపుతున్నాయి.
అయితే, ఈ అధికారిక పత్రాలు నకిలీవని బ్రిటన్‌లోని చైనా రాయబారి కొట్టిపారేశారు.
ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే)కు ఈ పత్రాలు లభించాయి. బ్రిటన్‌లో బీబీసీ పనోరమా, ద గార్డియన్ వార్తాపత్రిక సహా మొత్తం 17 మీడియా భాగస్వాములతో కలిసి ఈ సంస్థ పనిచేసింది.

ఫొటో సోర్స్, Reuters
గత మూడేళ్లలో జిన్‌జియాంగ్ వ్యాప్తంగా నిర్మించిన ఈ నిర్బంధ శిబిరాలు.. తీవ్రవాదానికి వ్యతిరేకంగా స్వచ్ఛంద పునఃవిద్య కోసం ఏర్పాటు చేశామంటున్న బీజింగ్ వాదన తప్పనేందుకు ఈ పరిశోధనలో కొత్త సాక్ష్యాలు లభించాయి.
దాదాపు పది లక్షల మంది జనాన్ని - అత్యధికంగా వీగర్ ముస్లింలను - ఈ శిబిరాల్లో ఎటువంటి విచారణా లేకుండా నిర్బంధించినట్లు భావిస్తున్నారు.
'ది చైనా కేబుల్స్' అని ఐసీఐజే వర్ణిస్తున్న తాజా చైనా ప్రభుత్వ పత్రాలలో జిన్‌జియాంగ్ కమ్యూనిస్ట్ పార్టీకి నాటి ఉప కార్యదర్శి, ఈ ప్రాంత అత్యున్నత భద్రతాధికారి ఝు హైలున్ 2017లో ఈ శిబిరాలను నిర్వహిస్తున్న వారికి పంపించిన తొమ్మిది పేజీల ఉత్తర్వు కూడా ఉంది.
ఈ శిబిరాలను అత్యంత భద్రతగల జైళ్లుగా నిర్వహించాలని, కఠోర క్రమశిక్షణ, శిక్షలు అమలు చేయాలని, ఎవరూ తప్పించుకునే వీలు ఉండరాదని ఆ ఉత్తర్వుల్లో సూచనలు స్పష్టంచేస్తున్నాయి.
ఈ ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు:
- పారిపోవటానికి అసలు వీలుండకూడదు
- క్రమశిక్షణ పెంపొందించాలి, ప్రవర్తన ఉల్లంఘనలకు శిక్షలు పెంచాలి
- పశ్చాత్తాపం, నేరాంగీకారాన్ని ప్రోత్సహించాలి
- పరిహారాత్మక మాండరిన్ అధ్యయనానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి
- విద్యార్థులు నిజంగా మారేలా ప్రోత్సహించాలి
- డార్మిటరీలు, తరగతి గదుల్లో అణువణువూ పూర్తిగా వీడియో నిఘాలో ఉండేలా చూడాలి

నిర్బంధంలో ఉన్న వ్యక్తి జీవితంలోని ప్రతి అంశాన్నీ ఎలా పర్యవేక్షిస్తున్నారు, ఎలా నియంత్రిస్తున్నారనేది ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి.
''విద్యార్థుల్లో ఒక్కొక్కరు ఎక్కడ పడుకోవాలనే దానికి ఒక నిర్దిష్ట ప్రాంతం, తరగతి గదిలో కూర్చునేటపుడు ఒక నిర్దిష్ట సీటు, నైపుణ్యాల పని చేసేటపుడు ఒక నిర్దిష్ట ప్రాంతాలను నిర్ణయించాలి. వీటిని మార్చటం పూర్తిగా నిషిద్ధం'' అని ఈ పత్రాలు చెప్తున్నాయి.
''నిద్ర లేవటం, హాజరు, స్నానం, మరుగుదొడ్డికి వెళ్లటం, సర్దుకోవటం, శుభ్రం చేసుకోవటం, తినటం, చదువుకోవటం, నిద్ర పోవటం, తలుపు మూయటం.. ఇలా అన్నిటికీ ప్రవర్తనా నియమావళి, క్రమశిక్షణ విధివిధానాలను అమలుచేయాలి'' అని స్పష్టంచేశారు.

ఈ నిర్బంధాలు ఎంత తీవ్రస్థాయిలో ఉన్నాయనేది ఇతర పత్రాలు ధ్రువీకరిస్తున్నాయి. ఒక పత్రం 2017లో కేవలం వారం రోజుల వ్యవధిలోనే దక్షిణ షిన్‌జియాంగ్‌కు చెందిన 15,000 మందిని ఈ శిబిరాలకు పంపిన విషయాన్ని వెల్లడిస్తోంది.
లీకైన ఈ మెమోను విచారణ న్యాయవాదులు ఉపయోగించుకోవాలని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థలో చైనా డైరెక్టర్‌గా పనిచేస్తున్న సోఫీ రిచర్డ్సన్ అన్నారు.
''ఇది చర్య చేపట్టటానికి తగిన సాక్ష్యం. మానవ హక్కులను దారుణంగా ఉల్లంఘిస్తున్న విషయాన్ని ఇది నమోదు చేసింది. అక్కడ నిర్బంధిస్తున్న ప్రతి ఒక్కరినీ కనీసం మానసిక హింసకు గురి చేస్తున్నారని వర్ణించటం సరైనదేనని నేను భావిస్తున్నా. ఎందుకంటే, వాళ్లు అక్కడ ఎంత కాలం ఉండబోతున్నారనే విషయం వారికి అసలు తెలియనే తెలియదు'' అని ఆమె వ్యాఖ్యానించారు.
నిర్బంధితులు తమ ప్రవర్తనను, విశ్వాసాలను, భాషను మార్చుకున్నామని ప్రదర్శించి చూపినపుడు మాత్రమే వారిని విడుదల చేయాలని కూడా ఆ ఉత్తర్వు సవివరంగా నిర్దేశిస్తోంది.
''విద్యార్థులు తమ గత కార్యకలాపాల చట్టవ్యతిరేక, నేరపూరిత, ప్రమాదకర స్వభావాన్ని లోతుగా అర్థం చేసుకునేలా వారిలో పశ్చత్తాపం, నేరాంగీకారాన్ని పెంపొందించాలి'' అని ఆ మెమో చెప్తోంది.
''అస్పష్టమైన అవగాహనలు, ప్రతికూల వైఖరులు, ప్రతిఘటన ఆలోచనలు ఉన్నవారికి ఫలితాలు సాధించేలా విద్యా పరివర్తనను కొనసాగించాలి'' అని స్పష్టం చేస్తోంది.

ఈ శిబిరాలు ప్రజల గుర్తింపును మార్చటానికి ప్రయత్నిస్తున్నాయని ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది, వరల్డ్ వీగర్ కాంగ్రెస్ సలహాదారు బెన్ ఎమర్సన్ క్యు.సి. చెప్పారు.
''దీనిని ఒక జాతి ప్రజలు మొత్తాన్నీ లక్ష్యంగా చేసుకుని, వారికి సామూహికంగా బ్రెయిన్‌వాష్ (ఆలోచనలను మార్చుకునేలా నిర్బంధ ఒత్తిడి) చేయటానికి రూపొందించిన కార్యక్రమంగా కాకుండా మరోలా చూడటం కష్టం'' అని ఆయన వ్యాఖ్యానించారు.
''షిన్‌జియాంగ్‌లోని వీగర్ ముస్లింలను ఒక ప్రత్యేక సాంస్కృతిక బృందంగా భూమి మీద నుంచి చెరిపివేయటానికి ప్రత్యేకంగా రూపొందించిన సంపూర్ణ పరివర్తన కార్యక్రమం ఇది'' అని ఆందోళన వ్యక్తంచేశారు.
నిర్బంధితుల ''సైద్ధాంతిక పరివర్తన, అధ్యయనం, శిక్షణకు, క్రమశిక్షణను పాటించటానికి పాయింట్లు ఇవ్వాలి'' అని అధికారిక మెమో నిర్దేశిస్తోంది.
నిర్భంధంలో ఉన్నవారు ఎప్పుడు విడుదలవుతారు, తమ కుటుంబాన్ని కలవవచ్చా వంటి అంశాలను నిర్ణయించటానికి ఈ 'శిక్ష - పారితోషికం' వ్యవస్థ దోహదపడుతుంది.
వీరు పరివర్తన చెందారనే సాక్ష్యాలను నాలుగు కమ్యూనిస్టు పార్టీ కమిటీలు పరిశీలిస్తాయి. ఆ తర్వాత మాత్రమే వీరిని విడుదల చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
సామూహిక నిఘా, వ్యక్తిగత సమాచారాన్ని విశ్లేషించి ముందుగా అంచనా వేసే పోలీసింగ్ కార్యక్రమాలను చైనా ప్రభుత్వం ఎలా ఉపయోగిస్తోందో కూడా ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి.
ఈ వ్యవస్థ కేవలం వారి ఫోన్‌లలో జాప్యా అనే డేటా షేరింగ్ యాప్ ఉన్న కారణంతో 18 లక్షల మంది జనం గురించి ఎలా అప్రమత్తం చేసిందనేది ఒక పత్రం వెల్లడించింది.
దీంతో వారిలో 40,557 మందిని 'ఒక్కొక్కరుగా' దర్యాప్తు చేయాలని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ''అనుమానాన్ని నివృత్తి చేసుకోవటం సాధ్యం కాకపోతే, వారిని సామూహిక శిక్షణకు పంపించాలి'' అని ఆ పత్రం నిర్దేశిస్తోంది.
విదేశీ పౌరసత్వం గల వీగర్లను అరెస్ట్ చేయాలని, విదేశాల్లో నివసిస్తున్న వీగర్ల ఆచూకీ వెతికి పట్టుకోవాలని ఈ పత్రాల్లో విస్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ జల్లెడ అంతర్జాతీయంగా వేయటంలో చైనా రాయబార కార్యాలయాలు, దౌత్యకార్యాలయాలు కూడా పాలుపంచుకుంటున్నాయని ఈ పత్రాలు సూచిస్తున్నాయి.

అయితే, చైనా ప్రభుత్వం చేపట్టిన చర్యలు స్థానిక ప్రజలకు భద్రత కల్పించాయని, షిన్‌జియాంగ్‌లో గత మూడేళ్లుగా ఒక్క ఉగ్రవాద దాడి కూడా జరగలేదని బ్రిటన్‌లో చైనా రాయబారి లూ షియామింగ్ పేర్కొన్నారు.
''ఆ ప్రాంతంలో ఇప్పుడు సామాజిక సుస్థిరత, జాతుల బృందాల మధ్య సమైక్యత నెలకొంది. అక్కడి జనం సంతోషంగా మరింత భద్రంగా ఉన్నామన్న బలమైన భావనతో జీవిస్తున్నారు'' అని ఆయన చెప్పారు.
''ఈ వాస్తవాలను పూర్తిగా విస్మరిస్తూ పశ్చిమాన కొంత మంది జిన్‌జియాంగ్ విషయంలో చైనా మీద తీవ్రస్థాయిలో దుష్ప్రచారం, విషం కక్కటం చేస్తున్నారు. తద్వారా చైనా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటానికి ఒక సాకును తయారుచేయటానికి ప్రయత్నిస్తున్నారు. షిన్‌జియాంగ్‌లో తీవ్రవాద వ్యతిరేక ప్రయత్నాలకు ఆటంకం కలిగించటానికి.. చైనా స్థిరమైన అభివృద్ధిని దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్నారు'' అని ఆయన ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- పది లక్షల మంది ముస్లింలను నిర్బంధించిన చైనా.. ఎలాంటి నేరం చేయలేదు.. ఎలాంటి విచారణ లేదు
- ఇస్లాంను మార్చేస్తున్న చైనా.. ఇందుకోసం పంచవర్ష ప్రణాళిక
- World Toilet Day: కడుక్కోవడమా? తుడుచుకోవడమా? ప్రపంచాన్ని విభజించే ప్రశ్న
- ఊరు దాటాలంటే వాగు దాటాలి.. వాగు దాటాలంటే చెట్టు ఎక్కాలి
- ప్రభుత్వానికి రూ.92000 కోట్లు బకాయి పడ్డ ఎయిర్టెల్, వొడాఫోన్: ఇది 5జీ ఆశలకు విఘాతమా
- మా అమ్మకు వరుడు కావలెను
- ఇవి చైనా సృష్టించిన కృత్రిమ దీవులు
- చైనాలోని ఈ ఒక్క గ్రామం ఎకానమీ సింగపూర్‌తో సమానం
- జియో వినియోగదారుల మీద ఎందుకీ ఐయూసీ చార్జీల భారం?
- పరీక్షల్లో కాపీ కొట్టకుండా విద్యార్థుల తలలకు అట్టపెట్టెలు
- తొలి రాత్రే అనుమానం... మహిళలను మానసికంగా చంపేస్తున్న ‘రక్త పరీక్షలు’
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- చైనాలో ఇస్లాం వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్ మదరసా విద్యార్థులు
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








