ఆంధ్ర, రాయలసీమ: 60 ఏళ్లలో నాలుగు రాజధానులు.. ఇప్పుడు మరో రెండు కలుస్తాయా?

ఫొటో సోర్స్, ap.gov.in
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ ప్రతినిధి
గత 60 ఏళ్లలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు నాలుగు రాజధాని నగరాలను చూశారు.
1953 అక్టోబర్ 1వ తేదీన మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్ర రాజధాని చెన్నై నగరం, ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఏర్పడ్డ కర్నూలు, 1956 నవంబర్ 1వ తేదీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరాలు రాజధానులుగా ఉండేవి.
2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినప్పటికీ పదేళ్లు హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. అయినప్పటికీ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధాని ఏర్పాటుకు నిర్ణయించారు. 2015 అక్టోబర్ 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నగర నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.
ఇటీవల అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అభివృద్ధి వికేంద్రకరణ కోసం మూడు రాజధానులు ఉండాలని అభిప్రాయపడటం, జీఎన్ రావు కమిటీ మూడు రాజధానుల ప్రతిపాదన చేయడంతో ఇప్పుడు మళ్లీ రాజధానిని మారుస్తారనే చర్చ మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
విభజన తర్వాత మళ్లీ మొదటికి..
1956 నవంబర్ 1న తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘకాలం పాటు హైదరాబాద్ రాజధానిగా ఉంది.
అయితే, 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ విభజన అనివార్యమైంది. దీంతో పాటు ఆంధ్ర ప్రాంతం హైదరాబాద్‌ను వదులుకోవాల్సి వచ్చింది.
వాస్తవానికి, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తెలంగాణ, అవశేష ఆంధ్రప్రదేశ్‌లకు హైదరాబాద్ నగరం 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది, ఆ తర్వాత తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది.
కానీ, 10 ఏళ్లు కాకముందే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్ నుంచి రాజధానిని తరలించింది. అమరావతి కేంద్రంగా ఏపీ రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఫొటో సోర్స్, AP CRDA
రాజధానిపై ఏ కమిటీ ఏం చెప్పింది?
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిపై 2014 నుంచి ఇప్పటి వరకు మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. రాజధాని ప్రాంత ఎంపిక, అభివృద్ధి వికేంద్రీకరణపై ఈ కమిటీలు తమ నివేదికలు ఇచ్చాయి.
దీనికంటే ముందు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోనూ కొత్త రాజధాని ఏర్పాటుపై సూచనలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో ఏముంది?
ఈ చట్టంలోని సెక్షన్ 5 అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని గురించి ప్రస్తావించింది.
సెక్షన్ 5: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది.
5(1)- నియమిత తేదీ నుంచి ''10 ఏళ్లకు మించని కాలానికి'' అవశేష ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్.
5(2): గడువు ముగిసిన తరువాత హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు అవుతుంది.
నోట్: ఉమ్మడి రాజధాని ప్రాంతం అంటే ''హైదరాబాద్ పురపాలక చట్టం - 1955'' ప్రకారం నోటిఫై చేసిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)
సెక్షన్ 6: నూతన రాజధాని కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు (ఈ సెక్షన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం శివరామకృషన్ కమిటీని ఏర్పాటు చేసింది.)
నోట్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014ను ఆమోదించిన తేదీ నుంచి 6 నెలలు మించకుండా ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ప్రాంతంపై ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది.
శివరామకృషన్ కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్ 6ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం శివరామకృషన్ కమిటీని ఏర్పాటు చేసింది.
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చి చైర్మన్‌గా పనిచేసిన కె. శివరామకృష్ణన్ అధ్యక్షుడిగా ఐదుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది.
ఈ కమిటీ ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించి జూన్ 2న ఏర్పడిన నూతన ప్రభుత్వ అభిప్రాయాలను కూడా తీసుకొని కేంద్రానికి నివేదిక అందజేసింది. 31 ఆగస్టు 2014న తన నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదికలో బహుళ రాజధానుల ఏర్పాటుపై ప్రతిపాదనలు చేసింది. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు సరికాదని సూచించింది.
రాజధాని కోసం కొన్ని ప్రాంతాలను ప్రతిపాదిస్తూ.. వాటికున్న లోటుపాట్లను ప్రస్తావించింది. అయితే, ఏ ఒక్క ప్రాంతాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. భూముల లభ్యత, ఇతర కారణాలను మాత్రమే ప్రస్తావించింది.
నాటి చంద్రబాబు ప్రభుత్వం ఈ నివేదిక రాకముందే పాలనను విజయవాడ నుంచి మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేసింది. శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ రాజధానిగా ఏర్పాటు చేసే అంశంపై విముఖత వ్యక్తం చేసింది.

ఫొటో సోర్స్, Ministernarayana/fb
నారాయణ కమిటీ
రాజధాని ప్రాంత ఎంపికపై కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం మంత్రి నారాయణ నేతృత్వంలో మరో కమిటీని ఏర్పాటు చేసింది.
2014 జులై 21న నాటి పురపాలక మంత్రి నారాయణ ఆధ్వర్యంలో 9 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది.
రాజధాని నిర్మాణంలో భాగంగా అసెంబ్లీ, సచివాలయం, ఇతర నిర్మాణాలను ఎక్కడెక్కడ, ఏ రీతిన నిర్మించాలన్న అంశాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వానికి ఈ కమిటీ సలహాలు ఇస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ కమిటీ దేశంలోని చంఢీగడ్, నయా రాయపూర్, నవీ ముంబయితో సహా పుత్రజయ, ఆస్టిన్, దుబాయి, సింగపూర్ తదితర ప్రాంతాలలో పర్యటించి అక్కడి రాజధాని ప్రాంతాలను అధ్యయం చేసింది.

రాజధానిగా అమరావతి
శివరామకృష్ణన్ కమిటీ సూచనలను తోసిపుచ్చిన నాటి చంద్రబాబు ప్రభుత్వం 2014 డిసెంబర్లో అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మించబోతున్నట్టు ప్రకటించింది.
ఆ వెంటనే ఆరు నెలలకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ని వీడి పాలనను అమరావతి ప్రాంతానికి తరలించారు. దానికి తగ్గట్టుగా సచివాలయం, అసెంబ్లీ వంటివి తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించారు. అదే సమయంలో రాజధాని కోసం ల్యాండ్ ఫూలింగ్ విధానంలో 30వేల ఎకరాలను రైతుల నుంచి సేకరించారు.
అమరావతికి శంకుస్థాపన
22 అక్టోబర్ 2015న రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాన మంత్రి మోదీ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలసి కృష్ణా జిల్లాలోని ఉద్దండరాయునిపాలెంలో ఆయన భూమి పూజ చేశారు.
ఒకవైపు రాజధాని నిర్మాణ పనులు జరుగుతుండగా, తాజాగా అధికారంలోకి వచ్చిన వైసీపీ... రాజధాని మార్పుపై చర్చలేవనెత్తింది.

ఫొటో సోర్స్, ANDHRA PRADESH I & PR DEPT.
జీఎన్ రావు కమిటీ
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై అధ్యయనం చేయడానికి 2019 సెప్టెంబర్ 13న వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదుగురు నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.
రిటైర్డ్ ఐఏఎస్ జి.నాగేశ్వరరావు (జీఎన్ రావు) కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో విజయమోహన్, ఆర్.అంజలీ మోహన్, డాక్టర్ మహావీర్, డాక్టర్ సుబ్బారావు, కేటీ రవీంద్రన్, అరుణాచలం సభ్యులుగా ఉన్నారు.
ఈ కమిటీ రాష్ట్రంలో 10,600 కిలోమీటర్లు పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది. డిసెంబర్ 20న కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందించింది.
125 పేజీలతో కూడిన ఈ నివేదికలో అమరావతిలో శాసన రాజధాని (లెజిస్లేటివ్ క్యాపిటల్), విశాఖలో పరిపాలన రాజధాని (ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్), కర్నూలులో న్యాయ రాజధాని (జ్యుడీషియల్ క్యాపిటల్) ఏర్పాటు చేయాలని సూచించింది. నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.

ఫొటో సోర్స్, I AND PR, AP
రాజధాని నిర్మాణంపై హైలెవల్ కమిటీ ఏర్పాటు
అయితే, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని నిర్మాణం అంశాలపై జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసేందుకు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
జీఎన్ రావు కమిటీ నివేదికను ప్రభుత్వం మంత్రి మండలి ముందు పెట్టిందని, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు నివేదిక ఇంకా తమకు అందవలసి ఉందని మంత్రి పేర్ని నాని ఇటీవల చెప్పారు.
వీటిపై మంత్రి మండలిలో సుదీర్ఘ చర్చ జరిగిందని ఆయన తెలిపారు.
ఈ రెండు నివేదికలపై రాష్ట్ర ప్రభుత్వ హై లెవల్ కమిటీ సమగ్రంగా అధ్యయనం చేస్తుందని, అనంతరం నివేదిక ఇస్తుందని వెల్లడించారు.
2014-15 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ నివేదికను పక్కనపెట్టి.. మంత్రి నారాయణ, ఆయన బృందం ఇచ్చిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని, ఊహాజనిత, కలల రాజధానిని నిర్మించాలని నిర్ణయించిందని పేర్ని నాని చెప్పారు.

ఫొటో సోర్స్, Andhrapradeshcm/fb
మూడు రాజధానులపై జగన్ ప్రకటన
రాజధానిపై జీఎన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వకముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకు ఉండకూడదని శాసన సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ, జ్యుడీషియల్ క్యాపిటల్‌గా కర్నూలు పేరుని సీఎం ప్రతిపాదించారు. అమరావతిలో మాత్రం లెజిస్లేటివ్ క్యాపిటల్ కొనసాగిస్తామని అసెంబ్లీ వేదికగా ఆయన అభిప్రాయపడ్డారు.
తర్వాత కొన్నిరోజులకు జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ కూడా ఇదే విధమైన రిపోర్ట్ ఇచ్చింది.

ఫొటో సోర్స్, FB/TDP.OFFICIAL
అమరావతి రైతులు ఏమంటున్నారు
మూడు రాజధానులు ఉంటే తప్పేంటని సీఎం చేసిన వ్యాఖ్యలతో రాజధానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. విపక్ష టీడీపీ, బీజేపీ నాయకులు రైతులకు మద్దతుగా వారి ఆందోళనల్లో పాల్గొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని ప్రాంతంగా ప్రకటించి, భూములు సేకరించిన తర్వాత ఇప్పుడు పునరాలోచన చేస్తోందని, దీనిని సహించబోమంటూ అమరావతి రైతులు పేర్కొంటున్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలని, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ వారు తమ ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలని, పాలన వికేంద్రీకరణ వల్ల ఫలితం ఉండదని వారు చెబుతున్నారు.
జీఎన్ రావు కమిటీ నివేదిక బూటకమని రాజధాని ప్రాంత రైతు ప్రతినిధి సుధాకర్ బీబీసీతో వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంతంలో కనీసం పర్యటించకుండా, అందరి అభిప్రాయాన్ని తీసుకుని నివేదిక ఇచ్చామని చెప్పడం సమంజసం కాదన్నారు. సీఎం మాటలనే కమిటీ మళ్లీ చెప్పింది తప్ప, అందులో ప్రజాభిప్రాయం ప్రతిధ్వనించలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మట్టా సుధాకర్ బీబీసీతో మాట్లాడుతూ- ఒక్క రాజధానినే నిర్మించలేకపోతున్నప్పుడు మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు.
"ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. కక్ష సాధింపుతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు కదా! అమరావతి పట్ల విధానం ఏమిటో స్పష్టం చేయకుండా 28 వేల మంది రైతులను రోడ్డున పడేయడం తగదు. ఒక ఆర్థిక నగరం కట్టండి, తప్పులేదు. కానీ ఇలా చేస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. ఇది ఐదు కోట్ల మంది రాజధాని, మాది కాదు. మాకు పదేళ్ల తర్వాత కౌలు కూడా ఇవ్వరు. దేశంలో ఎక్కడా లేనట్టుగా మూడు రాజధానులనడం సమంజసం కాదు. 13 జిల్లాల అభివృద్ధి జరగాలి. కానీ ఇలాంటి పద్ధతుల్లో రైతులకు అన్యాయం చేయడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ రాజధానిని మారుస్తారా? ఇలాంటి రాజకీయ క్రీడలు పార్టీలు ఆడుకోవాలి. మాతో మాత్రం వద్దు" అని సుధాకర్ చెప్పారు.
భూములు ఇవ్వడానికి నిరాకరించిన ఉండవల్లి, పెనమాక సహా మరికొన్ని గ్రామాల్లో రైతులు వేచి చూసే ధోరణితో ఉన్నట్టు కనిపిస్తోంది.
భూసమీకరణలో భూములివ్వని వెంకటాయపాలెం వాసి వెంకటనర్సింహులు బీబీసీతో మాట్లాడుతూ- "నేను భూములు ఇవ్వలేదు. కాబట్టి మాకు కలిగే నష్టం లేదు" అన్నారు. రాజధాని ప్రాంతం వల్ల తమకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. తమ గ్రామంలో కొందరి అసైన్డ్ భూములు కూడా తీసేసుకున్నారని, తగిన పరిహారం చెల్లించలేదని ఆరోపించారు.
అమరావతి వల్ల కొన్ని గ్రామాలకే ఎక్కువ మేలు కలుగుతుందని, అయినా ప్రభుత్వం ఏం చేస్తుందో స్పష్టత వచ్చే వరకు వేచిచూడాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. భూములిచ్చిన వాళ్లకు ఇప్పుడేం చేస్తారో చూడాలని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘వికేంద్రీకరణ అవసరమే’
రాజధాని మార్పు జరిగితే విశాఖపట్నంపై భారం పడకుండా ఉండాలంటే, కొన్ని శాఖలు మిగతా రాజధానుల్లోనూ ఉండాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. పరిపాలన వికేంద్రీకరణ కూడా అవసరమని ఆయన అన్నారు.
''పోలవరం నుంచి నీళ్లు రాకపోతే వచ్చే ఐదేళ్లలో విశాఖకు తీవ్ర ఇబ్బంది తప్పదు. వచ్చే ఐదేళ్లలో విశాఖలో ఏం చేయబోతున్నారన్న దానిపై ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. పోర్టుకు, ఏయూకు సంబంధించిన అనేక భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఆర్భాటాలకు పోకుండా వాటిని వినియోగించుకోవాలి'' అని శర్మ వ్యాఖ్యానించారు.
‘అధికార విస్తరణ కాదు, వికేంద్రీకరణ కావాలి’
రాజధాని అవసరమే లేకుండా జిల్లాలు, గ్రామాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ సూచించారు.
ఆయన రాజధాని మార్పు అంశంపై బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ, ‘‘రాజధానిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా కీలకమైన సంస్థలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వంలోని ఉపశాఖలన్నీ ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు. వాటిని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే అవీ అభివృద్ధి చెందుతాయి. అధికార విస్తరణ కాదు, వికేంద్రీకరణ కావాలి. జిల్లాకు, పట్టణాలకు పూర్తి అధికారం వచ్చేలా ఏర్పాటు చేయడమే వికేంద్రీకరణ’’ అని పేర్కొన్నారు.
ఒక ప్రాంతాన్ని రాజధానిగా అనుకున్న తర్వాత దాన్ని మార్చడం సరికాదని అభిప్రాయపడ్డారు. అయితే, కొన్ని శాఖలను వేరే ప్రాంతాలకు తరలించడం మంచిదని సూచించారు.
ఇవి కూడా చదవండి.
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- డబ్బు ప్రమేయం లేకుండా వేల మందికి కొత్త మూత్రపిండాలు దక్కేలా చేసిన ఆర్థికవేత్త
- తెలంగాణ, ఏపీ కార్మికుల 'గల్ఫ్' బాటకు కారణాలేంటి.. అక్కడ వారి కష్టాలేంటి
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- జస్టిస్ సుదర్శన రెడ్డి: ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా రేప్ కేసులున్నాయి, వారిని ఎన్కౌంటర్ చేయడం సాధ్యమేనా?
- ఇంత స్పష్టమైన సూర్య గ్రహణాన్ని 2031 వరకూ చూడలేరు
- నిర్భయ కేసు: మరణశిక్ష ఎదుర్కొంటున్న ఆ నలుగురు దోషులకు చట్టపరంగా ఉన్న చివరి అవకాశాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










