మైకేల్ వోల్ఫ్: ఇరుకైన అపార్ట్‌మెంట్ జీవితాల్లో అందాన్ని వెతికిన ఫొటోగ్రాఫర్

ఆర్కిటెక్ట్చర్ ఆఫ్ డెన్సిటీ

ఫొటో సోర్స్, MICHAEL WOLF

ఫొటో క్యాప్షన్, ఆర్కిటెక్ట్చర్ ఆఫ్ డెన్సిటీ #75 (2006)

హాంకాంగ్ ఎదుర్కొంటున్న గృహ సంక్షోభానికి అక్కడి జన సమ్మర్థ ఆకాశ హర్మ్యాలు ఎంతో కాలంగా చిహ్నాలుగా నిలుస్తున్నాయి. ఇరుకైన అపార్ట్‌మెంట్ జీవితానికి అలవాటుపడి వీటిలో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి.

అయితే, ఈ భవనాల్లోనే ఎన్నో అందమైన విషయాలను చూశారు మైకేల్ వోల్ఫ్ అనే ఫొటోగ్రాఫర్‌. వాస్తవ జీవితాలకు దూరం పోకుండానే వాటిని తన కెమెరా కళ్లతో మిగతావారికీ చూపించారు.

గత ఏప్రిల్ 24న వోల్ఫ్ తుదిశ్వాస విడిచారు. అప్పటికి ఆయనకు 64 ఏళ్లు.

మైకేల్ వోల్ఫ్

ఫొటో సోర్స్, GERRIT SCHREURS

ఫొటో క్యాప్షన్, మైకేల్ వోల్ఫ్

'ఆర్కిటెక్ట్చర్ ఆఫ్ డెన్సిటీ' ప్రాజెక్ట్ పేరుతో 11 ఏళ్లపాటు హాంకాంగ్ జనావాస భవనాలను వోల్ఫ్ ఫొటోలు తీశారు. వీటికి ఎంతో ప్రాచుర్యం లభించింది. వోల్ఫ్ ఫొటోలను క్రాపింగ్ చేసే పద్ధతి ఆ భవనాలు మరింత ఇరుకుగా కనిపించేట్లు చేసేది.

కెనడా, జర్మనీ, అమెరికాల్లో వోల్ఫ్ బాల్యం, యవ్వనం గడిచింది. స్టెర్న్ అనే మ్యాగజైన్‌లో పనిచేసేందుకు 1994లో ఆయన హాంకాంగ్‌కు వచ్చారు.

2002లో ఆయన ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. మరుసటి ఏడాది నుంచి హాంకాంగ్‌లోని జనావాస భవనాల ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అదే 'ఆర్కిటెక్ట్చర్ ఆఫ్ డెన్సిటీ' ప్రాజెక్ట్‌గా మారింది.

ఆర్కిటెక్ట్చర్ ఆఫ్ డెన్సిటీ

ఫొటో సోర్స్, MICHAEL WOLF

ఫొటో క్యాప్షన్, ఆర్కిటెక్ట్చర్ ఆఫ్ డెన్సిటీ #39 (2005)

వోల్ఫ్ తీసిన ఫొటోల్లోని లోతైన అర్థాన్ని తెలుసుకునేందుకు వీక్షకుడికి కాస్త సమయం పడుతుంది. నిశితంగా పరిశీలిస్తే జనాల జీవితాలు వాటిలో కనిపిస్తాయి. బాల్కనీలో వేలాడే టవల్, కాస్త తెరిచి ఉన్న కిటికీ, ఆరేసిన టీషర్ట్ వీక్షకుడికి ఏదో చెబుతుంటాయి.

ఆర్కిటెక్ట్చర్ ఆఫ్ డెన్సిటీ

ఫొటో సోర్స్, MICHAEL WOLF

ఫొటో క్యాప్షన్, ఆర్కిటెక్ట్చర్ ఆఫ్ డెన్సిటీ #119 (2009)

ఓ ఫొటోజర్నలిస్ట్‌గా కంపొజిషన్‌పై ఎప్పుడూ దృష్టి పెట్టేవాడినని వోల్ఫ్ 2014లో బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

''వీక్షకుడిని ఫొటోతో కట్టిపడేయటం నాకు ఇష్టం. చిత్రంలో ఆకాశం కనిపించిందంటే మనం దృష్టి మరల్చే అవకాశం ఇచ్చినట్లే. ఫొటోలో ఆకాశం ఉంటే భవనాలు ఎంతో పెద్దవో మీకు తెలిసిపోతుంది. ఇంకా మాయ చేయడానికి ఏమీ లేదు. ఏవీ లేకుండా చిత్రాన్ని క్రాప్ చేసి భవనం గురించి చెప్పకుండా నేను వదిలేస్తున్నా. ఓ ప్రతీకను సృష్టిస్తున్నా'' అని ఆయన అన్నారు.

కొన్ని సార్లు నగర జీవనంలోని అంశాలను వోల్ఫ్ అతి దగ్గరిగా చూపించే ప్రయత్నం చేశారు. ఆయన తీసిన 'మై ఫేవరెట్ థింగ్' ఫొటోల సిరీస్‌ అలాంటిదే.

మైకేల్ వోల్ఫ్

ఫొటో సోర్స్, MICHAEL WOLF

ఫొటో క్యాప్షన్, 'మై ఫేవరెట్ థింగ్' నుంచి..

మరికొన్ని సార్లు 'హాంకాంగ్: ఫ్రంట్ డోర్/బ్యాక్ డోర్' లాంటి సిరీస్‌తో దూరం నుంచి మొత్తం నగరాన్ని చూపించారు.

మైకేల్ వోల్ఫ్

ఫొటో సోర్స్, MICHAEL WOLF

ఫొటో క్యాప్షన్, 'హాంకాంగ్: ఫ్రంట్ డోర్/బ్యాక్ డోర్' (2005) నుంచి..

వూల్ఫ్‌కు స్ఫూర్తినిచ్చిన నగరం ఒక్క హాంకాంగ్ మాత్రమే కాదు.

2014లో పారిస్‌లోని భవనాల పైకప్పుల ఫొటోలతో నగర జీవితాన్ని ఆయన వర్ణించారు.

మైకేల్ వోల్ఫ్

ఫొటో సోర్స్, MICHAEL WOLF

'టోక్యో కంప్రెషన్' పేరుతో జన సమ్మర్థ నగరంలోని జీవితాలను వోల్ఫ్ మరింత దగ్గరగా చూపించారు. టోక్యో సబ్‌వే రైళ్లలో జనాల మొహాలు కిటికీలకు అతుక్కుపోయేలా ఉన్న రద్దీని కళ్లకు కట్టారు.

మైకేల్ వోల్ఫ్

ఫొటో సోర్స్, MICHAEL WOLF

ఫొటో క్యాప్షన్, 'టోక్యో కంప్రెషన్' #18 (2010)

''పట్టణీకరణ పరిణామాలు జనాల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయన్నది చూపించాలన్న తాపత్రయంతోనే వోల్ఫ్ ఈ పొటోలు తీశారు. ఫొటోగ్రాఫర్‌గా, కళాకారుడిగా ఆయన ఎప్పుడూ నిబద్ధతతో ఉన్నారు'' అంటూ వోల్ఫ్ మరణం గురించి ప్రకటిస్తూ ఆయన కుటుంబం పేర్కొంది.

''జపాన్‌లో మిగతా ఫొటోగ్రాఫర్లు చేస్తున్న ప్రాజెక్టుల గురించి నాకు తెలుసు. అర్ధరాత్రి పూట ఆఖరి రైలులో ఇంటికి వెళ్తున్న ఉద్యోగులు, తప్పతాగి స్పృహ లేకుండా పడిపోయిన వ్యక్తుల ఫొటోలను వాళ్లు తీస్తుంటారు. దాన్లో అర్థం లేదు. అదో రకం దిగజారుడుతనం. నేనెన్నటికీ ఆ పని చేయను'' అని గతంలో బీబీసీతో మాట్లాడినప్పుడు వోల్ఫ్ చెప్పారు.

మైకేల్ వోల్ఫ్

ఫొటో సోర్స్, MICHAEL WOLF

ఫొటో క్యాప్షన్, 'టోక్యో కంప్రెషన్' #75 (2011)

గమనిక: అన్ని ఫొటోలూ కాపీరైట్‌కు లోబడి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)