"ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని మారుస్తారా?".. సీఎం జగన్ వ్యాఖ్యలపై అమరావతి రైతుల నిరసన

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు రావాల్సిన అవసరముందన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల స్పందన ఏమిటి? వారి డిమాండ్ ఏమిటి? ప్రభుత్వం ఏం చెబుతోంది? అమరావతిలో వివిధ పనులు ఏ దశలో ఉన్నాయి?
సీఎం వ్యాఖ్యలతో రాజధానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చెందుతున్నారు. విపక్ష టీడీపీ, బీజేపీ నాయకులు రైతులకు మద్దతుగా వారి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని జనసేన ప్రకటించింది.
ప్రభుత్వం జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదిక వచ్చాకే రాజధానిపై తుది నిర్ణయం ఉంటుందని చెబుతోంది.
చంద్రబాబు ప్రభుత్వం భూసమీకరణ విధానంలో రైతుల నుంచి భూములు సమీకరించి రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రారంభించింది. 2015 అక్టోబర్ 15న ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నగర నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. తాత్కాలిక ప్రాతిపదికన సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించింది. 2017 నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగుతున్నాయి. తాత్కాలిక హైకోర్ట్ నిర్మాణం కూడా పూర్తయింది. కొన్ని నెలలుగా ఏపీ హైకోర్ట్ ఇందులోనే నడుస్తోంది.

మరోవైపు- అమరావతి ప్రణాళిక ప్రకారం ప్రారంభించిన శాశ్వత భవనాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. సచివాలయం, ఇతర ప్రధాన కార్యాలయాల కోసం చేపట్టిన ఐదు భారీ టవర్ల నిర్మాణం పనులు పునాది దశలను దాటాయి.
ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణం 80 శాతం వరకు పూర్తైంది. అధికారులు, సిబ్బంది నివాస గృహాలు, ఇతర భవనాలు నిర్మాణ దశల్లో ఉన్నాయి.
సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు చేపట్టారు. పలు ఇతర రోడ్ల నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు.
ఏడు నెలలుగా అనిశ్చితి
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో రైతుల నుంచి 34,984 ఎకరాలను టీడీపీ ప్రభుత్వం సేకరించింది. వాటితోపాటు ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్ అన్నీ కలుపుకొని సుమారుగా 50 వేల ఎకరాల్లో అమరావతి నిర్మాణానికి పూనుకుంది.
2019 ఎన్నికల అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి పనులకు బ్రేకులు పడ్డాయి. అమరావతిలో అవినీతి, ఇన్ సైడర్ ట్రేడింగ్ లాంటివి జరిగాయని ఆరోపిస్తూ, వాటిని తేల్చిన తర్వాతే అమరావతి నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు గత ఏడు నెలలుగా రాజధానిలో పనులన్నీ దాదాపు నిలిచిపోయాయి.

ఫొటో సోర్స్, Twitter/CMO Andhra Pradesh
కేంద్ర ప్రభుత్వ మ్యాప్‌లో అమరావతి
జమ్మూకశ్మీర్ విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మ్యాపులో ఏపీ రాజధాని అమరావతిని చూపించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమైంది. ఈ విషయాన్ని ఏపీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించడంతో ప్రభుత్వం అమరావతిని రాజధానిగా పేర్కొంటూ కొత్త మ్యాప్ విడుదల చేసింది.
విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేయొచ్చన్న సీఎం వ్యాఖ్యలతో రాజధానికి భూములిచ్చిన రైతులు తమ ప్రాంతం నుంచి రాజధాని తరలిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు రోజులుగా రాజధాని ప్రాంతంలో ఆందోళనలు సాగుతున్నాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం, ఉద్దండరాయుని పాలెం, రాయపూడి లాంటి గ్రామాల్లో నిరసనలు పెద్ద స్థాయిలో సాగుతున్నాయి.

ఫొటో సోర్స్, crda.ap.gov.in
"ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని మారుస్తారా"
వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మట్టా సుధాకర్ బీబీసీతో మాట్లాడుతూ- ఒక్క రాజధానినే నిర్మించలేకపోతున్నప్పుడు మూడు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు.
"ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. కక్ష సాధింపుతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు కదా! అమరావతి పట్ల విధానం ఏమిటో స్పష్టం చేయకుండా 28 వేల మంది రైతులను రోడ్డున పడేయడం తగదు. ఒక ఆర్థిక నగరం కట్టండి, తప్పులేదు. కానీ ఇలా చేస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. ఇది ఐదు కోట్ల మంది రాజధాని, మాది కాదు. మాకు పదేళ్ల తర్వాత కౌలు కూడా ఇవ్వరు. దేశంలో ఎక్కడా లేనట్టుగా మూడు రాజధానులనడం సమంజసం కాదు. 13 జిల్లాల అభివృద్ధి జరగాలి. కానీ ఇలాంటి పద్ధతుల్లో రైతులకు అన్యాయం చేయడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ రాజధానిని మారుస్తారా? ఇలాంటి రాజకీయ క్రీడలు పార్టీలు ఆడుకోవాలి. మాతో మాత్రం వద్దు" అని సుధాకర్ చెప్పారు.
భూములు ఇవ్వడానికి నిరాకరించిన ఉండవల్లి, పెనమాక సహా మరికొన్ని గ్రామాల్లో రైతులు వేచి చూసే ధోరణితో ఉన్నట్టు కనిపిస్తోంది.
భూసమీకరణలో భూములివ్వని వెంకటాయపాలెం వాసి వెంకటనర్సింహులు బీబీసీతో మాట్లాడుతూ- "నేను భూములు ఇవ్వలేదు. కాబట్టి మాకు కలిగే నష్టం లేదు" అన్నారు. రాజధాని ప్రాంతం వల్ల తమకు ఒరిగేదేమీ లేదని చెప్పారు. తమ గ్రామంలో కొందరి అసైన్డ్ భూములు కూడా తీసేసుకున్నారని, తగిన పరిహారం చెల్లించలేదని ఆరోపించారు.
అమరావతి వల్ల కొన్ని గ్రామాలకే ఎక్కువ మేలు కలుగుతుందని, అయినా ప్రభుత్వం ఏం చేస్తుందన్న స్పష్టత వచ్చే వరకు చూడాలనుకుంటున్నామని ఆయన తెలిపారు. భూములిచ్చిన వాళ్లకు ఇప్పుడేం చేస్తారో చూడాలని చెప్పారు.

ఫొటో సోర్స్, crda.ap.gov.in
రాజధాని రైతుల ఆందోళనలో టీడీపీ, బీజేపీ నేతలు
రాజధాని రైతులను గందరగోళ పరుస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. 'మూడు రాజధానుల' ప్రతిపాదనను ఇప్పటికే తప్పుబట్టిన టీడీపీ నేతలు రాజధాని రైతులకు మద్దతుగా ఆందోళనలు నిర్వహించారు. గొల్లపాలెం వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమా సహా పలువురు నేతలు నిరసనకు దిగగా, పోలీసులు అరెస్ట్ చేశారు.
బీజేపీ నేతలు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. ఎంపీ జీవీఎల్ నరసింహారావు సహా పలువురు నేతలు ఈ ప్రతిపాదనను స్వాగతించారు. అమరావతి రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిషోర్ బాబు మాత్రం అమరావతిలోనే రాజధాని నిర్మించాలంటూ రైతులు చేపట్టిన దీక్షల్లో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
టీడీపీ హయాంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులను పరిశీలించేందుకు రూర్కీ ఐఐటీ నిపుణుల కమిటీ అమరావతిలో పర్యటించింది. నిర్మాణంలో ఉన్న భవనాలను ఇది పరిశీలిస్తోంది. ప్రస్తుతావసరాల మేరకు వాటిని కుదించడం లేదా ప్రత్యామ్నాయాలను సూచించడమో చేయాలన్న ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు వివిధ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

మాపై కోపంతో రైతులను క్షోభ పెట్టొద్దు: నారాయణ
రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వారిని క్షోభ పెడుతున్నారని మాజీ మంత్రి పి.నారాయణ వ్యాఖ్యానించారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ- "రాజధానిలో తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అయినా కక్ష సాధింపు సరికాదు. మా మీద కోపంతో రైతులను క్షోభ పెడుతున్నారు. 13 జిల్లాలకు సమదూరంలో ఉంటుందనే మేం రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేశాం. రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని నాడు జగన్ కూడా అన్నారు. మూడు రాజధానుల విషయంలో ఆయన పునరాలోచన చేయాలి" అని సూచించారు.
కొంపలు మునిగే వ్యవహారం కాదు: మంత్రి కొడాలి నాని
రాజధాని రైతుల ఆందోళన, ప్రతిపక్షాల తీరుపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"రాజధాని కోసం నిపుణుల కమిటీ వేశాం. నివేదిక రావాల్సి ఉంది. సీఎం కూడా సభలో అదే చెప్పారు. కమిటీ నివేదిక ఆధారంగానే నిర్ణయం ఉంటుంది. అయినా అప్పుడే టీడీపీ నేతలు ధర్నాలకు దిగడం విడ్డూరంగా ఉంది. ఏమీ మొదలవ్వకుండానే చంద్రబాబు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు. ఇదేమీ కొంపలు మునిగే వ్యవహారం కాదు కదా. ఉత్తరాంధ్ర, రాయలసీమ సహా అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. రాజధాని మధ్యలో పెట్టండి అంటే దేశ రాజధానిని దేశం మధ్యలోకి మారుస్తారా" అని ఆయన బీబీసీతో వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, crda.ap.gov.in
హైకోర్టులో వ్యాజ్యం
రాజధాని తరలింపు వద్దని, ప్రణాళిక ప్రకారం అభివృద్ధి కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్‌డీఏను ఆదేశించాలని కోరుతూ అమరావతి రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం, సీఆర్‌డీఏ కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. జీ.ఎన్.రావు కమిటీ చట్టబద్ధత, హైకోర్టు తరలింపుపై గతంలో పిటిషన్ దాఖలైంది.
శాసనసభ, సచివాలయం, హైకోర్టు ఒకే చోట ఉండాలని రాజధాని రైతులు అంటున్నారు. ఇవన్నీ వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
"ప్రభుత్వ విధానాలు చూసి పెట్టుబడిదారులు ఎవరు వస్తారు? అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండేంది అమరావతి మాత్రమే. ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే రోడ్ల మీదకు వచ్చాం. ఒక రాజధానికే డబ్బుల్లేవు. మూడింటిని ఎలా కడతారో చెప్పాలి? ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు రాజధాని మార్చడం సరికాదు. రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ అద్భుతంగా జరిగింది. ఐదు కోట్ల మంది ఆంధ్రుల రాజధాని కోసం భూములిచ్చాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అమరావతి మధ్యలో ఉంది. వేర్వేరు ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. పరిపాలన వికేంద్రీకరణ చర్యలు సరికాదు" అని రైతులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారతదేశం ఆర్థిక మాంద్యానికి అడుగుల దూరంలోనే ఉందా?
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండానే, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- 'హైదరాబాద్ ఎన్కౌంటర్' బూటకం, పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. సుప్రీం కోర్టులో నిందితుల కుటుంబ సభ్యుల పిటిషన్
- ర్యాలీలో పాల్గొనకుండా హెచ్‌సీయూ విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు
- నుదిటిపై గాటు సీరియల్ కిల్లర్‌ను పట్టిచ్చింది
- సనా గంగూలీ ‘The End of India’పై చర్చ.. ‘ఆ పోస్ట్ వాస్తవం కాదు’ - సౌరవ్ గంగూలీ
- అమెరికా అధ్యక్ష పదవి నుంచి డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన.. ప్రతినిధుల సభ ఆమోదం
- ఆంధ్రప్రదేశ్‌లో క్రిమినల్ కేసులున్న మంత్రులెందరు.. వారిలో అత్యంత సంపన్నులెవరు
- ఆన్లైన్ మార్కెట్లలో కొనుగోలు చేసే క్రిస్టమస్ లైట్లతో 'ప్రమాదం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








