అమెరికా అధ్యక్ష పదవి నుంచి డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన.. ప్రతినిధుల సభ ఆమోదం.. ఇక సెనేట్‌లో విచారణ

డోనల్డ్ ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

అమెరికా ప్రతినిధుల సభ చేత ఆ దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అభిశంసనకు గరయ్యారు.

అధ్యక్షుడిగా తనకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేశారని, కాంగ్రెస్‌ను అడ్డుకున్నారంటూ ట్రంప్‌పై ఉన్న రెండు అభియోగాలపై ఓటింగ్ జరిగింది.

తమ పార్టీ ఆదేశాలకు అనుగుణంగా.. డెమొక్రాట్లు ఈ అభియోగాలకు మద్దతు ఇస్తూ ట్రంప్‌ అభిశంసనకు అనుకూలంగా ఓట్లేయగా.. రిపబ్లికన్లు మాత్రం ఈ అభియోగాలకు, ట్రంప్ అభిశంసనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు.

అమెరికా చరిత్రలో ప్రతినిధుల సభ చేత అభిశంసనకు గురైన మూడవ అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్ నిలిచారు.

ప్రతినిధుల సభ ఆమోదంతో తర్వాతి విచారణ ప్రక్రియ సెనేట్‌కు చేరుతుంది. అమెరికా అధ్యక్ష పదవిలో ట్రంప్ కొనసాగాలా? లేదా? అన్నది సెనేట్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

ప్రతినిధుల సభలో ఈ ఓటింగ్ జరుగుతున్నప్పుడు డోనల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షడు మైక్ పెన్స్‌తో కలసి మిచిగాన్‌లోని బాట్లె క్రీక్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతున్నారు.

‘‘మేం ఉద్యోగాలను సృష్టించి, మిచిగాన్ కోసం పోరాడుతుంటే.. కాంగ్రెస్‌లోని ప్రతిపక్షం మాత్రం అసూయను, ద్వేషాన్ని, కోపాన్ని ప్రదర్శిస్తోంది. మీరే చూడండి ఏం జరుగుతోందో’’ అని ట్రంప్ అన్నారు.

సెనేట్‌లో జరగబోయే విచారణలో ‘సంపూర్ణ నిర్దోషిగా రుజువవుతాననే నమ్మకంతో’ అధ్యక్షుడు ఉన్నారని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆండ్రూ జాన్సన్, బిల్ క్లింటన్‌ల సరసన ట్రంప్..

అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30 గంటలకు.. సుదీర్ఘ చర్చల తర్వాత ప్రతినిధుల సభలో ఓటింగ్ జరిగింది.

ట్రంప్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న అభియోగానికి అనుకూలంగా 230 ఓట్లు పడగా.. వ్యతిరేకంగా 197 ఓట్లు పడ్డాయి.

కాంగ్రెస్‌ను అడ్డుకున్నారన్న రెండో అభియోగానికి అనుకూలంగా 229 ఓట్లు పడగా.. వ్యతిరేకంగా 198 ఓట్లు పడ్డాయి.

ప్రతినిధుల సభ చేత అభిశంసనకు గురైన ట్రంప్.. గతంలో ఇలాగే అభిశంసనకు గురైన ఆండ్రూ జాన్సన్, బిల్ క్లింటన్‌ల సరసన నిలిచారు.

కాగా, అభిశంసన ప్రక్రియలో తర్వాత జరిగే పరిణామం.. సెనేట్‌లో చర్చ, ఓటింగ్. ఇది ఎప్పుడనేది ఇంకా నిర్దిష్టంగా ఖరారు కానప్పటికీ.. జనవరి రెండో వారంలో జరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు 2020 నవంబర్ 3వ తేదీన జరుగనున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం కూడా మొదలైంది.

అభియోగాలు ఇవీ

తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీదారు అయిన జో బైడెన్‌ మీద అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఉక్రెయిన్‌ను ఒత్తిడి చేసి, ఆ దేశాన్ని తనకు రాజకీయంగా సాయం చేయాలని కోరారని అధికార దుర్వినియోగమనే అభియోగంలో ఉంది.

జో బిడెన్, ఆయన కుమారుడు ఉక్రెయిన్‌కు చెందిన బురిస్మా గ్యాస్ కంపెనీతో కలిసి పనిచేశారు.

ప్రతినిధుల సభ విచారణకు ట్రంప్ సహకరించలేదని, తద్వారా కాంగ్రెస్‌ను ఆయన అడ్డుకున్నారని రెండో అభియోగంలో ఉంది.

ఈ రెండు అభిశంసన ఆర్టికళ్లను తొమ్మిది పేజీల్లో వివరంగా పొందుపరచినట్లు డెమొక్రటిక్ ముఖ్యనేతలు చెప్పారు. నీతిబాహ్యంగా వ్యవహరించి ట్రంప్ దేశానికి ద్రోహం చేశారని వారు ఆరోపిస్తున్నారు.

వైట్ హౌస్

ట్రంప్ పదవి ఊడుతుందా?

అధ్యక్షుడిని తొలగించడానికి అమెరికా చట్టసభ చేపట్టే రెండు దశల ప్రక్రియలో అభిశంసన అనేది మొదటిది.

అయితే, అభిశంసనకు గురైనంత మాత్రాన అధ్యక్ష పదవి పోదు.

అప్పుడే రెండో దశ మొదలవుతుంది. అభిశంసనలో పేర్కొన్న అభియోగాలపై సెనేట్ విచారణ జరుపుతుంది. ఓటింగ్ నిర్వహిస్తుంది.

సభలో మూడింట రెండొంతుల మెజార్టీ సభ్యులు దోషి అని తేల్చితే, అధ్యక్షుడు పదవి కోల్పోతారు.

అయితే, ప్రస్తుతం సెనేట్‌లో ట్రంప్ సొంత పార్టీ (రిపబ్లికన్‌ పార్టీ)దే ఆధిపత్యం. కాబట్టి, ఆయన పదవి కోల్పోయే అవకాశాలు చాలా తక్కువ.

ట్రంప్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)