మిస్ వరల్డ్ 2019తో సహా తొలిసారిగా ఐదుగురు అందగత్తెలూ నల్లజాతీయులే

ఎడమ నుంచి కుడికి కలీగ్ గార్రిస్, మిస్ టీన్ యూఎస్‌ఏ; నియా ఫ్రాంక్లిన్, మిస్ అమెరికా; చెస్లీ క్రిస్ట్, మిస్ యూఎస్‌ఏ; జోజిబిని తుంజి, మిస్ యూనివర్స్; టోనీ- ఆన్ సింగ్, మిస్ వరల్డ్

ఫొటో సోర్స్, Getty Images/ Reuters

ఫొటో క్యాప్షన్, ప్రపంచ టాప్ 5 అందాల పోటీల విజేతలు

చరిత్రలో తొలిసారిగా... ప్రపంచంలో టాప్ 5 అందాల పోటీలలో ఒకరి తర్వాత ఒకరు అందరూ నల్లజాతి మహిళలే కిరీటాన్ని గెలుచుకున్నారు.

డిసెంబర్ 14న జరిగిన మిస్ వరల్డ్-2019 అందాల పోటీలో జమైకాకు చెందిన టోనీ- ఆన్ సింగ్ విజేతగా నిలిచారు. చాలాకాలంగా జాతివివక్ష, లింగ వివక్ష లాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ పోటీల నిర్వాహకులకు ఇది ఊరటనిచ్చే విషయం.

లండన్‌లో జరిగిన ఈ పోటీలో వేర్వేరు దేశాలకు చెందిన 111 మందిని వెనక్కి నెట్టి 23 ఏళ్ల విద్యార్థిని టోనీ ఆన్ సింగ్ కిరీటం దక్కించుకున్నారు. మిస్ వరల్డ్ సాధించిన నాలుగో జమైకన్ మహిళ ఈమె.

ప్రస్తుతం మానసిక శాస్త్రం అభ్యసిస్తున్న ఈమె, తర్వాత మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నారు.

"జమైకాలోని బాలిక మొదలుకుని ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మాయికీ చెబుతున్నాను... మిమ్మల్ని మీరు నమ్మండి. మీరూ అన్నీ సాధించగలరు, మీ కలలను సాకారం చేసుకునే సామర్థ్యం మీలో ఉంది. మీకూ ఒక లక్ష్యం ఉందన్న విషయం తెలుసుకోండి" అంటూ టోనీ ఆన్ సింగ్ ట్వీట్ చేశారు.

మిస్ వరల్డ్ 2019 టైటిల్ విజేత టోనీ ఆన్ సింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, "ప్రపంచాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తున్న ఈ తరం మహిళలకు నేను ప్రతినిధిని" అని సింగ్ అన్నారు.

ఇటీవలే దక్షిణాఫ్రికాకు చెందిన జొజిబిని తుంజి మిస్ యూనివర్స్ టైటిల్ సాధించారు. తన సహజమైన జుట్టు, సౌందర్యంతో ఆమె అందరినీ మెప్పించారు.

"నాలాంటి ముఖ కవళికలు, నా లాంటి చర్మం, నా లాంటి జుట్టున్న మహిళలది అసలు అందమే కాదన్నట్లుగా భావించే ప్రపంచంలో నేను పెరిగాను. ఇక ఆ ఆలోచనా ధోరణికి ముగింపు పడుతుందని అనుకుంటున్నాను. ప్రతి అమ్మాయి నన్ను, నా ముఖాన్ని చూడాలి. నాలో ప్రతిబింబించిన వారి ముఖాలను చూసుకోవాలని కోరుకుంటున్నాను" అని జొజిబిని అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

అంతకు ముందు అమెరికాలో మూడు ప్రముఖ అందాల పోటీలలోనూ ఈ ఏడాది నల్లజాతి మహిళలలే విజేతలుగా నిలిచారు. సెప్టెంబర్‌లో మిస్ అమెరికా టైటిల్‌ను నియా ఫ్రాంక్లిన్ గెలుచుకున్నారు. మిస్ టీన్ యూఎస్‌ఏ టైటిల్‌ను కలీగ్ గార్రిస్, మిస్ యూఎస్‌ఏ కిరీటాన్ని చెస్లీ క్రిస్ట్ సాధించారు.

1940 వరకూ మిస్ అమెరికా పోటీలలో తెల్లవారు కాని మహిళలు పాల్గొనకుండా నిషేధం ఉండేది. ఆ తర్వాత నిబంధనలను మార్చినా 1970 వరకూ ఏ ఒక్క నల్లజాతి మహళా ఆ పోటీలలో పాల్గొనలేదు.

మిస్ వరల్డ్- 2019 పోటీలో జమైకా యువతి విజేతగా నిలవడంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున స్పందన లభించింది.

మిస్ యూనివర్స్- 2019 విజేత జోజిబిని

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మిస్ యూనివర్స్- 2019 విజేత జోజిబిని

కేవలం మహిళల అందం మాత్రమే కాకుండా, ఈ సమాజానికి సేవలు అందించేందుకు ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటున్నారన్నది చూసి ఎంపిక చేయాలని అమెరికా పౌరహక్కుల న్యాయవాది క్రిస్టెన్ క్లార్క్ అభిప్రాయపడ్డారు.

"మిస్ వరల్డ్ ఓ డాక్టర్ కావాలనుకుంటున్నారు. మిస్ యూఎస్‌ఏ ఖైదీల కోసం పనిచేస్తున్నారు. మిస్ యూనివర్స్ లింగ వివక్షతో కూడిన హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మిస్ అమెరికా కళల పరిరక్షకురాలు. మిస్ టీన్ యూఎస్‌ఏ దివ్యాంగులకు సాయం అందించే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. వాళ్లందరూ నల్లజాతి మహిళలే" అని క్లార్క్ అన్నారు.

ఇటీవలి కాలంలో అందాల పోటీల నిర్వహణ సంస్థలు తమ నిబంధనలను మార్చాయి. పోటీలో పాల్గొన్నవారు సాధించిన విజయాలు, వారి సహజమైన సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి.

స్విమ్ సూట్ కాంటెస్ట్‌కు స్వస్తి పలుకుతున్నట్లు గత ఏడాది మిస్ అమెరికా సంస్థ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)