భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటం తెచ్చిపెట్టిన ప్రశ్నలు - సమాధానాలివే

ఫొటో సోర్స్, Getty Images
కొన్ని ప్రశ్నలకు చెప్పే జవాబు మన జీవితాలనే మార్చేస్తుందంటారు. మిస్ వరల్డ్ పోటీల్లో మానుషి ఛిల్లర్ ఇచ్చిన జవాబు కూడా అలానే అందరి మనసునూ హత్తుకుంది.
భారత్‌కు మిస్ వరల్డ్ కిరీటాన్ని సాధించిపెట్టిన మానుషి ఛిల్లర్ జవాబుకు అందరూ మంత్రముగ్ధులయ్యారు.
విశ్వసుందరి పోటీ చివరలో 'ప్రపంచంలోనే ఏ వృత్తికి అత్యధిక వేతనం ఇవ్వాలి? ఎందుకు?' అనే ప్రశ్నన్యాయనిర్ణేతలు సంధించారు.
దీనికి మానుషి ఛిల్లర్ ఇలా జవాబిచ్చారు: ''అమ్మే నాకు స్ఫూర్తి. అందుకే నా దృష్టిలో తల్లి కావడమే అత్యంత ఉన్నతమైన వృత్తి. అసలు విషయం డబ్బు కాదు. ఒక తల్లికి ప్రేమ, గౌరవం కన్నా గొప్ప వేతనమేముంటుంది!"
ప్రపంచ అందాల పోటీల్లో భారత అమ్మాయిలు చెప్పిన జవాబులు అందరిని కట్టిపడేయడం ఇది మొదటిసారేమీ కాదు.
మానుషి ఛిల్లర్ కన్నా ముందు గతంలో ఐదుగురు భారత సుందరీమణులు ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ పోటీల్లో చాలా ప్రశ్నలడుగుతారు. గతంలో ఈ పోటీల్లో ఈ కిరీటాన్ని గెలుచుకున్న భారత అమ్మాయిలు చెప్పిన జవాబులేమిటో చూద్దాం.

ఫొటో సోర్స్, Instagram/Missworld
రీటా ఫారియా, 1966
భారత్ నుంచే కాదు మొత్తం ఆసియాలోనే విశ్వసుందరి కిరీటం దక్కించుకున్న మొట్టమొదటి అమ్మాయి రీటా ఫారియా.
గత ఏడాది ఆమె ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విశ్వసుందరి పోటీల్లో తనను అడిగిన ప్రశ్నకు సంబంధించి వివరాలందించారు.
మీరు డాక్టర్ ఎందుకు కావాలనుకున్నారు? అని ఆమెను అడగగా...
భారత్‌లో మహిళా వైద్య నిపుణుల అవసరం పెరుగుతోంది. భారత్‌లో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి పిల్లలకు చికిత్స అందించే డాక్టర్లు మరింత పెరగాలని ఆమె సమాధానమిచ్చారు.

ఫొటో సోర్స్, Instagram
ఐశ్వర్యరాయ్, 1994
ఈ రోజే మీరు విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంటే ఏం చేస్తారు? 1994లో ఓ విశ్వసుందరి అంటే ఎలా ఉండాలని మీరు కోరుకుంటారు?
''నేడు నేను విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంటే నా బాధ్యతను నిజాయతీగా, మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తాను. శాంతి, సామరస్యం, దయ వంటి లక్షణాలకు రాయబారిగా పనిచేస్తా. 'బ్యూటీ విత్ పర్పస్' లక్ష్యానికి న్యాయం చేసేందుకు నా వంతు ప్రయత్నిస్తా. మిత్రులారా నేనెప్పుడూ మీతోనే ఉంటా. నా దృష్టిలో మానవత్వమే అసలైన మిస్ వరల్డ్ కిరీటం. ధన్యవాదాలు" అని ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ పోటీల్లో సమాధానం చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
డయానా హేడెన్, 1997
మీరు మిస్ వరల్డ్ కిరీటం గెలిస్తే వచ్చిన డబ్బుతో ఏం చేస్తారు? దీనిని మీరు దానంగా ఇచ్చేస్తారా?
"నేను గెలిచిన డబ్బును ఇతరులకు ఎందుకివ్వాలి? పోటీల్లో గెలిచింది నేను. ఈ డబ్బును నేను నా కుటుంబంతో, మిత్రులపై ఖర్చుపెడతా. ఈ డబ్బును మదుపు చేస్తూ అవసరమైన చోట ఖర్చుపెడతా" అని ఆమె సమాధానమిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
యుక్తాముఖి, 1999
మీకిష్టమైన వంటకం ఏమిటి? అవకాశమొస్తే ఏం కావాలని అనుకుంటారు? మీరు వెళ్లాలని అనుకునే దేశమేమిటి?
"గత 20 ఏళ్లుగా నేను భారతీయ ఆహారాన్ని తింటున్నా. ఇప్పటికీ ఇక్కడి ఆహారమంటే నాకు బోర్ కొట్టలేదు. థాయ్ ఫుడ్ అంటే ఇష్టం. బ్రిటిష్ నటి ఆడ్రి హేప్‌బర్న్ నాకు స్ఫూర్తి. ఆమెలో దయ, శాంతి వంటి లక్షణాలు కనబడతాయి. ప్యారిస్ నాకు ఇష్టమైన ప్రదేశం. నేనెప్పుడూ అక్కడకు వెళ్ళలేదు. ఆ దేశం మోడల్స్‌కు రాజధానిలాంటిది. నేను అక్కడికి వెళ్లాలనుకుంటున్నా" అని ఆమె సమాధానం చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రియాంకా చోప్రా, 2000
గతేడాది కూడా భారత అమ్మాయే విజేతగా నిలిచారు. దీంతో మీరు ఒత్తిడిలో ఉన్నారా? మీ దృష్టిలో అందరికన్నా గొప్ప మహిళ ఎవరు? ఎందుకు?
"ఒత్తిడిలో ఉన్నప్పుడు నా ప్రదర్శన మరింత సమర్థంగా ఉంటుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఓ ఆశ పుడుతుంది. ఆ ఆశ పెరుగుతూ పెరుగుతూ విజయం సాధించేందుకు సహాయపడుతుంది."
నేను ఇష్టపడే, స్ఫూర్తినిచ్చే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారిలోనే మదర్ థెరిసా ఒకరు. ఆమెను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడతాను. ఏదో చేయాలనే తపన, ఉత్సాహం, మానవత్వం అన్నీ ఆమెలో ఉన్నాయి. ఇతరుల ముఖాల్లో ఆనందం చూసేందుకు ఆమె తన జీవితాన్నే త్యాగం చేశారు. మదర్ థెరిసాను నేను మనస్ఫూర్తిగా ఇష్టపడతా" అని ప్రియాంకా చోప్రా మిస్ వరల్డ్ పోటీల్లో సమాధానమిచ్చారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








