కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు: బండి నారాయణస్వామి 'శప్తభూమి'కి పురస్కారం

తెలుగు రచయిత బండి నారాయణస్వామి నవల 'శప్తభూమి'కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
చంద్రశేఖర్ కంబర్ అధ్యక్షతన సమావేశమైన అవార్డుల కమిటీ 23 భాషలకు చెందిన రచయితలను ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది.
కవితల విభాగంలో ఏడు రచనలకు, నాలుగు నవలలకు, ఆరు లఘుకథనాలకు, మూడు వ్యాసాలకు, ఒక నాన్-ఫిక్షన్, ఒక ఆత్మకథ, ఒక జీవితచరిత్రలకు 2019 సంవత్సరానికి గాను సాహిత్య అకాడమీ పురస్కారాలను కమిటీ ప్రకటించింది.
23 భారతీయ భాషల రచనలను అవార్డుకు ఎంపిక చేయడానికి ఆయా భాషల జ్యూరీ మెంబర్లు సాహిత్య అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు తమ ప్రతిపాదనలను పంపించారు. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ చంద్రశేఖర్ కంబర్ నేతృత్వంలోని కమిటీ తుది జాబితాను ఎంపిక చేసి ప్రకటించింది.
తెలుగు భాషకు జ్యూరీ సభ్యులుగా కేతు విశ్వనాథరెడ్డి, శీలా వీర్రాజు, వాడ్రేవు చినవీరభద్రుడు వ్యవహరించారు.

'శప్తభూమి' ఏంటి?
రాయలసీమ జీవితాన్ని నేపథ్యంగా తీసుకున్న కొన్ని పాత్రలతో రాసిన చారిత్రక నవల 'శప్తభూమి'. రాయలసీమల ఆనాటి జీవన విధానాన్ని తన రచనలో చూపించారు.
"అనేక మంది చరిత్రకారులు రాసిన రచనలు చదవడం, నోట్స్ రాసుకోవడం.. ఇలా కొంతకాలం గడిపాను. ఆ తర్వాత 'శప్తభూమి' గురించి ఆలోచన రావడం, ఆ పాత్రను సృష్టించడం.. ఇవన్నీ కొద్దిగా శ్రమతోనే జరిగాయి. కానీ ప్రసవవేదన అనంతరం బిడ్డని చూసి తల్లి ఎలా సంతోషపడుతుందో, ఈ రచనను చూసినప్పుడు కూడా అలానే అనిపించింది" అని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు.
బండి నారాయణ స్వామి 1952 జూన్ 3న అనంతపురం పాత ఊరులో జన్మించారు.
చరిత్ర ఉపాధ్యాయుడిగా పనిచేసిన నారాయణస్వామి 1987 నుంచి రచనా వ్యాసంగంలో ఉన్నారు. మొత్తం 35 కథలు రాశారు. గద్దలాడతండాయి, మీ రాజ్యం మీరేలండి, రెండు కలల దేశమ్, నిసర్గమ్ వంటి ఎన్నో రచనలు చేశారు.
తన రచనలకు కథాకోకిల, అప్పాజోస్యుల-విష్ణుభొట్ల, కొలకలూరి, ఎన్టీఆర్ పురస్కారాలు పొందారు.
నారాయణస్వామికి భార్య పరంజ్యోతి, కుమారుడు విహారి, కుమార్తె అరుణాచలం సౌరిస్ ఉన్నారు.

నా కన్నా 'శప్తభూమి' పాఠకులే ఎక్కువ సంతోషిస్తారు
తన నవలకు అవార్డు రావడం పట్ల నారాయణ స్వామి సంతోషం వ్యక్తం చేశారు.
"అవార్డుల పట్ల నాకు పెద్దగా స్పృహ లేదు. కానీ 'శప్తభూమి' నవల విడుదలైన తర్వాత ఎందరో పాఠకులు నాకు అవార్డు రావాలని కోరుకున్నారు. అంతవరకూ నాకు వాటి గురించి ఆలోచనే లేదు. అందువల్ల నాకు ఈ అవార్డు వచ్చినందుకు 'శప్తభూమి' పాఠకులే నాకన్నా ఎక్కువ సంతోషిస్తారనుకుంటున్నా.
దీన్ని రాయడానికి నాకు కొన్ని పరిస్థితులు దోహదం చేశాయి.
ముఖ్యంగా నేను రాయలసీమ రైతు బిడ్డను కావడం.
ఈ ప్రాంతపు మట్టిలో పెరిగి, ఈ గడ్డ నీళ్లు తాగి, ఈ ప్రాంతపు భాష, యాస, సంస్కృతి... వీటిని చిన్నప్పటి నుంచి నా జీవితంలో పెనవేసుకుపోయి పెరిగినవాడిని. రాయలసీమ బిడ్డగా, రచయితగా ఈ గడ్డ రుణం తీర్చుకోవాలని ఓ కోరిక నాలో ఎప్పటి నుంచో ఉండేది.
రాయల సీమను సాంస్కృతికంగా ఇతర ప్రాంతాల వారికి పరిచయం చేసే ఉద్దేశంతో 'శప్తభూమి' నవలను రాయలసీమ సాంస్కృతిక నవలగా రాశాను" అని నారాయణస్వామి బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి.
- సనా మారిన్: పదిహేనేళ్ల వయసులో బేకరీలో ఉద్యోగి... 34 ఏళ్లకు దేశ ప్రధాని
- IND Vs WI విశాఖ వన్డే: ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సెంచరీలు, కోహ్లీ డకౌట్
- పౌరసత్వ సవరణ చట్టం: సీఏఏపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తామన్న సుప్రీం కోర్టు
- పర్వేజ్ ముషరఫ్కు మరణ శిక్ష: 'మాజీ ఆర్మీ చీఫ్ ఎప్పటికీ దేశ ద్రోహి కాలేడు' - పాక్ మేజర్ జనరల్ గఫూర్
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- నిర్భయ కేసు: దోషి అక్షయ్ రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
- "అమ్మను చూడగానే కన్నీళ్లొచ్చాయి"- పన్నెండేళ్ళ తర్వాత కన్నతల్లిని కలుసుకున్న భవానీ
- డోనల్డ్ ట్రంప్: 'నా కనీస హక్కులను కాలరాశారు' - స్పీకర్ నాన్సీ పెలోసీకి అధ్యక్షుడి లేఖ
- శ్రీజ డెయిరీ: ‘పూర్తిగా మహిళలతో నడుస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుల సంస్థ’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








