పౌరసత్వ సవరణ చట్టం: సీఏఏపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తామన్న సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, AFP
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తామని భారత సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. జనవరి నెలలో పిటిషన్లను విచారిస్తామని చెప్పిన సుప్రీం కోర్టు వాటికి సమాధానాలు సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
అయితే, ఈ చట్టం అమలును నిలిపివేసేలా ఎలాంటి స్టే ఉత్తర్వులు ఇవ్వలేదు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విస్తృతంగా వ్యక్తమవుతున్న ఆందోళనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరస్కరించారు. ఆ తరువాతే సుప్రీం కోర్టు ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.
ఈ చట్టం మూడు పొరుగు దేశాలకు చెందిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వజూపుతోంది.
ఈ చట్టం ప్రజలకు మత వివక్ష పీడన నుంచి రక్షణ కల్పిస్తుందని హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం చెప్తోంది. కానీ, భారతదేశంలోని 20 కోట్ల మందికి పైగా ముస్లింలను అణచివేసే 'హిందూ జాతీయవాద' అజెండాలో ఈ చట్టం ఒక భాగమని విమర్శకులు అంటున్నారు.
పొరుగు దేశాల నుంచి ''చొరబాటుదారులను'' ఏరివేయటానికి విస్తృత కార్యక్రమం చేపడతామని ప్రభుత్వం ప్రణాళికలు ప్రకటించటం ఈ భయాలను ఇంకా పెంచుతోంది.

ఫొటో సోర్స్, Reuters
తమ పూర్వీకులు భారతదేశంలో నివసించారని నిరూపించుకోవటానికి విస్తారమైన ధృవపత్రాల మీద ఆ కార్యక్రమం ఆధారపడటంతో.. తమను ఏ దేశానికీ చెందని వారిగా మార్చివేస్తారని చాలా మంది ముస్లిం పౌరులు భయపడుతున్నారు.
అయితే, ఈ చట్టం ''హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా భారత పౌరుల మీద ఎటువంటి ప్రభావం చూపదు'' అని ప్రధానమంత్రి మోదీ చెప్పారు.
ఆయన మంగళవారం ఒక సభలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, "ప్రతిపక్షం అబద్ధాలు, వదంతులను ప్రచారం చేస్తోంది. హింసను ప్రేరేపిస్తోంది. అపోహలు, అబద్ధాల వాతావరణాన్ని సృష్టించటానికి పూర్తి శక్తిని వినియోగిస్తోంది'' అని అన్నారు.
హోం మంత్రి అమిత్ షా కూడా మీడియాతో మాట్లాడుతూ ఇదే విధానాన్ని పునరుద్ఘాటించారు. ''నేను, నా ప్రభుత్వం రాయిలా దృఢంగా ఉన్నాం. పౌరసత్వ నిరసనలకు తలొగ్గటం కానీ, వెనుకడుగు వేయటం కానీ జరగదు'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కొనసాగుతున్న ఆందోళనలు - జామియా కేసులో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్
దిల్లీ సీలంపూర్ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టానికి మంగళవారం వ్యతిరేకంగా ప్రారంభమైన శాంతిపూర్వక ప్రదర్శనలు చూస్తూచూస్తూనే హింసాత్మకంగా మారాయి.
రిపోర్ట్స్ ప్రకారం వెయ్యికి పైగా నిరసనకారులు రోడ్డుపైకి వచ్చినపుడు ఒక స్కూల్ బస్‌ను ధ్వంసం చేశారు. ఒక పోలీస్ పోస్టుకు నిప్పుపెట్టారు. రెండు పోలీస్ బూత్‌లను ధ్వంసం చేశారు.
దీంతో, ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు లాఠీ చార్జి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలో ఉన్నట్లు దిల్లీ పోలీసులు చెబుతున్నారు.
అటు, జామియా మిలియా ఇస్లామియా, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆదివారం జరిగిన హింసాత్మక ప్రదర్శనలకు సంబంధించి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్‌పై దిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
సీలంపూర్‌లో ఏం జరిగింది?
"సీలంపూర్ టీ పాయింట్ దగ్గర ఒక గంటపాటు శాంతిపూర్వక వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. కానీ, తర్వాత ఆందోళనకారుల్లోంచే కొందరు జనాలపై రాళ్లు విసరడం మొదలుపెట్టారు" అని దిల్లీ పోలీస్ జాయింట్ కమిషనర్ ఆలోక్ కుమార్ చెప్పారు.
"సీలంపూర్ ఘటనలో 21 మంది గాయపడ్డారు. వారిలో 12 మంది దిల్లీ పోలీసులు, ముగ్గురు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నాం" అన్నారు.
పోలీసులు లాఠీచార్జి గానీ, కాల్పులుగానీ జరపలేదని ఆయన చెబుతున్నారు. టియర్ గ్యాస్ మాత్రం ప్రయోగించామన్నారు.
"మదరసాలు, మసీదుల్లో శాంతి నెలకొనాలని అపీల్ చేశాం, ఇప్పుడు పరిస్థితి నియంత్రణలో ఉంది" అని ఆలోక్ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సీలంపూర్‌లో ప్రదర్శనలు హింసాత్మకం కావడంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శాంతియుతంగా ఉండాలని అపీల్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్
జామియా ప్రాంతంలో హింసాత్మక ఘటనల కేసులో దిల్లీ పోలీసులు మంగళవారం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆసిఫ్ ఖాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మరోవైపు, జామియా మిలియాలో జరిగిన హింస కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితులను దిల్లీ సాకేత్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో విపక్షాలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశాయి.
మోదీ ప్రభుత్వంపై సోనియా గాంధీ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. "శాంతిపూర్వక ప్రదర్శనలను ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని" ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతును అణచివేయకూడదని సోనియా కోరారు.

ఫొటో సోర్స్, PTI
విపక్షాలు ఎంతైనా వ్యతిరేకించనీ: అమిత్ షా
విపక్షాలు ఎంత వ్యతిరేకించినా, కొత్త పౌరసత్వ చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
అంతకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "ఈ వ్యతిరేక ప్రదర్శనలకు కాంగ్రెస్ పార్టీయే కారణం" అన్నారు.
CAA వ్యతిరేక ప్రదర్శనలపై కేంద్ర సహాయ మంత్రి సురేష్ అంగడి షాకింగ్ కామెంట్స్ చేశారు.
జిల్లా అధికారులు, రైల్వే అధికారులను హెచ్చరించిన ఆయన "ఎవరైనా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తుంటే 'కనిపించగానే కాల్చివేయాలని' ఒక మంత్రిగా ఆదేశిస్తున్నానని" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పౌరసత్వ సవరణ చట్టం: బీజేపీ తొందరపడిందా.. ఈ స్థాయి వ్యతిరేకతను ఊహించలేదా
- మహిళలు మద్యం తాగితే సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బ తింటుందా...
- రష్యా: ‘ఐదేళ్లలో 80 శాతం తగ్గిన ఆల్కహాల్ విక్రయాలు’.. నిజమెంత?
- ‘దేశంలో ఎక్కువగా తాగేది తెలుగువాళ్లే’
- మద్యం అతిగా తాగితే... డీఎన్ఏ డామేజ్ అవుతుందా...
- పది నిమిషాల్లో ఆనందాన్ని పెంచుకోవడం ఎలా?
- అభిప్రాయం: ఇది విలీనం కాదు టోకు ఫిరాయింపు
- మహేంద్ర సింగ్ ధోని ఆ కీపింగ్ గ్లవ్స్ వాడకూడదన్న ఐసీసీ.. అవే కొనసాగిస్తాడన్న బీసీసీఐ
- ఎడిటర్స్ కామెంట్: ఇంటర్మీడియట్ పిల్లల చావులకు బాధ్యులెవరు?
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









