CAAకు వ్యతిరేకంగా దిల్లీలో మరోసారి చెలరేగిన హింస

ఫొటో సోర్స్, Reuters
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కి వ్యతిరేకంగా దేశ రాజధాని దిల్లీలో మరోసారి భారీ నిరసనలు చోటుచేసుకున్నాయి.
నగరంలోని సీలంపూర్ ప్రాంతంలో పోలీసులపై రాళ్లురువ్వుతున్న ఘటనలు కనిపించాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. కొందరిని పోలీసులు వేరే ప్రాంతానికి తరలించారు.
చాలామంది నిరసనకారులు, అధికారులు ఈ ఘటనలో గాయపడ్డారని స్థానిక మీడియా కథనాలు తెలిపాయి.

ఫొటో సోర్స్, Reuters
ఘర్షణలు చెలరేగిన జాఫ్రాబాద్ ప్రాంతంలో పరిస్థితిని సమీక్షించేందుకు పోలీసులు డ్రోన్ ఉపయోగించారు.
సీఏఏకు దిల్లీలో ఇంతకు ముందు జరిగిన నిరసనల్లో దాదాపు 50 మంది గాయపడ్డారు.
సీలంపూర్ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది. ఈ చట్టం కారణంగా తాము నష్టపోతామని నిరసనకారులు భావిస్తున్నారు.
రెండు బస్సులను ధ్వంసం చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
సీలంపూర్, జాఫ్రాబాద్, మౌజ్‌పూర్, గోకుల్‌పురి మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ వెల్లడించింది.
మధ్యాహ్నం 2 గంటలకు జాఫ్రాబాద్ ప్రాంతంలో నిరసన ప్రదర్శన జరుగుతుందని సమాచారం ఉంది. 1.15 గంటలకు అక్కడకు చేరుకున్న ప్రజలు సీలంపూర్ వైపు కదిలారు. ప్రారంభంలో శాంతియుతంగానే మొదలైన ఈ ప్రదర్శన, ఉన్నట్లుండి హింసాత్మకంగా మారింది అని దిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.

ఫొటో సోర్స్, Getty Images
అంతకుముందు, జామియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీల్లో పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్ల విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్‌దారులు ముందుగా హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.
హింసాత్మక ప్రదర్శనలు ఆగితేనే తాము ఈ అంశంపై విచారణ చేపడతామని సోమవారం నాడు సీజేఐ ఎస్ఏ బాబ్డే స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టును ట్రయల్ కోర్టులా మార్చవద్దని, పిటిషనర్లు ముందుగా హైకోర్టుకు వెళ్లాలని ఆయన సూచించారు.
ఆదివారం నాడు జామియాలో జరిగిన హింసాత్మక ఘటనలతో సంబంధముందని భావిస్తున్న 10 మందిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టైన కొందరికి నేరచరిత్ర ఉందని, వారే హింసకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
అయితే అరెస్టైన వారిలో విద్యార్థులు ఎవరూ లేరని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారని పీటీఐ పేర్కొంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వీరిని సోమవారం రాత్రి, మంగళవారం నాడు జామియా, ఓక్లా ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, EPA
మరోవైపు, ఆదివారం జరిగిన ఘటనల్లో బులెట్లు తగిలి ముగ్గురు గాయపడ్డారని ఆరోపణలున్నాయి.
వీరిలో ఒకరి వైద్యపరీక్షల నివేదికను బీబీసీ సేకరించింది. దానిప్రకారం, ఆమె ఓ 'బయటి వస్తువు' కారణంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఇది బులెట్టా కాదా అనేది ఫోరెన్సిక్ పరీక్షల తర్వాత తెలుస్తుందని ఆమె తెలిపారు.
కానీ, దిల్లీ పోలీసులు ఈ వార్తలను ఖండించారు. ఆదివారం నిరసనల సమయంలో ఎలాంటి కాల్పులూ జరగలేదని అన్నారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మంగళవారం నాడు కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.
చెన్నైలో డీఎంకే పార్టీ ఓ ర్యాలీ నిర్వహించింది. దీనికి ఆ పార్టీ నేతలు స్టాలిన్, కణిమోళి, దయానిధి మారన్‌లు నేతృత్వం వహించారు.
ఇవి కూడా చదవండి.
- పౌరసత్వ సవరణ బిల్లు: హైదరాబాద్‌లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు
- ఈ చట్టంతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు: అమిత్ షా
- పౌరసత్వ సవరణ చట్టం: బీజేపీ తొందరపడిందా.. ఈ స్థాయి వ్యతిరేకతను ఊహించలేదా
- అయోధ్య కేసులో అన్ని రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం కోర్టు
- పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్‌కు మరణశిక్ష
- నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి
- ఉరి తాడు ఒక్క బక్సర్ జైల్లోనే ఎందుకు తయారవుతోంది?
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- ఓ గుహలో దొరికిన 44 వేల ఏళ్ళ నాటి అతి పురాతన పెయింటింగ్ ఏం చెబుతోంది...
- అస్సాం: పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరిగే ఈ ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరుగుతోంది?
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండానే, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- ఆల్ఫాబెట్ సీఈవోగా సుందర్ పిచాయ్: ఫోన్ కూడా లేని ఇంటి నుంచి గూగుల్ బాస్‌గా ఎదిగిన చెన్నై కుర్రాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









