పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు: దిల్లీ పోలీసుల లాఠీల నుంచి స్నేహితుడికి రక్షణ కవచంగా మారిన యువతులు

హెల్మెట్లు వేసుకుని, లాఠీలతో కొడుతున్న దిల్లీ పోలీసుల నుంచి కొందరు యువకులు తమ స్నేహితుడిని కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
దిల్లీ పోలీసులు ఒక వ్యక్తిని ఇంట్లో నుంచి లాగి బయటపడేసి, లాఠీలకు పని చెబుతుండగానే కొందరు యువతులు వచ్చి వాళ్లకు అడ్డుపడ్డారు, స్నేహితుడికి ఆ దెబ్బలు తగలకుండా అతడి చుట్టూ నిలిచారు. లాఠీల నుంచి అతడిని కాపాడేందుకు పోలీసులనే ఎదిరించారు.
స్నేహితుడికి మానవ కవచంలా నిలిచిన ఆ యువతులు పోలీసులు అతడిని కొడుతున్నా వదల్లేదు. చివరకు పోలీసులే వెనక్కు తగ్గేలా చేశారు.
"ఆ సమయంలో మేం మా స్నేహితుడిని రక్షించాలని అనుకున్నాం, అంతే" అని లదీదా ఫర్జానా బీబీసీకి చెప్పారు.
నిమిషం కంటే తక్కువే ఉన్న ఈ ఫుటేజ్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, పోలీసుల అణచివేత ఆరోపణల మధ్య దేశంలో చాలామంది దృష్టిని ఆకర్షించింది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్ వచ్చిన ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం అందించే ఈ చట్టం వేలాది మంది నిరనకారులు రోడ్ల మీదకు వచ్చేలా చేసింది.
ఆదివారం రాజధాని దిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనలు, చివరికి వారికి, పోలీసులకు మధ్య ఘర్షణకు కారణమయ్యాయి. ఈ ఘర్షణల్లో ఆందోళనకారులు, పోలీసులు కలిపి మొత్తం 50 మంది గాయపడ్డారు. వీరందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీలో ఆందోళనలు చేసినవారిలో లదీదా, ఆమె స్నేహితులు కూడా ఉన్నారు. వారంతా ఉన్న ఒక ఇంటి నుంచి షహీన్ అబ్దుల్లాను పోలీసులు ఆదివారం బయిటికి లాగినప్పుడు ఈ ఘటన జరిగింది.
సోమవారం, అతడి ముఖమంతా గాయాలు కనిపించాయి. అయితే, అతడు వాటిని పట్టించుకోవడం లేదు. CAA చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించాడు.
"ఈ ఆందోళనలు మా కోసం కాదు, అమలు చేయబోయే చట్టం గురించే. అది నాకు, ఆ అమ్మాయిలకు మాత్రమే కాదు, అలా దేశంలోని ప్రతి ముస్లింకూ జరుగుతుంది" అని షహీన్ బీబీసీతో అన్నాడు.
"అప్రమత్తంగా ఉండండి, బయటికి రండి, కలిసి దీనికి వ్యతిరేకంగా పోరాడండి. ఇది మన కర్తవ్యం. మనమే మాట్లాడకపోతే, ఇంకెవరు దీన్ని ప్రశ్నిస్తారు" అని అతడిని కాపాడిన లదీదా కూడా అంటోంది.

మీ గళం వినిపించండి
పార్లమెంటులో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు గురించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం గత వారం ఆందోళన వ్యక్తం చేసింది.
బీజేపీ ప్రభుత్వం మాత్రం ఈ చట్టం మతప్రాతిపదికన చేయలేదని అంటోంది. మతపరమైన హింసను తట్టుకోలేక దేశానికి వచ్చినవారికి ఆశ్రయం కల్పించడమే దాని లక్ష్యం అంటోంది.
ఈ చట్టంలో ముస్లింలు చేర్చడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. వారు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో మైనారిటీలు కాదని, వారికి భారత్ రక్షణ అవసరం లేదని అంటోంది.
లదీదా ఆమె స్నేహితులు మాత్రం "పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం" అని అందరికీ తెలుసని అంటున్నారు.
ఈ చట్టం భారత లౌకిక సంప్రదాయాలకు విరుద్ధం అని భావిస్తున్న సహ విద్యార్థులతో కలిసి, వీరు ఆందోళనలు చేయాలని నిర్ణయించారు. ఆ విద్యార్థుల్లో ముస్లిమేతరులు కూడా ఉన్నారు.
పోలీసులు ఈ ఆందోళనలను అణచివేయడానికి కాంపస్‌ను చుట్టుముట్టారు. దాని గేట్లు విరగ్గొట్టి యూనివర్సిటీ లైబ్రరీ లోపలికి టియర్ గ్యాస్ ప్రయోగించారు.

అహింసాయుతంగా పోలీసులను ఎదుర్కొని తమ స్నేహితుడిని కాపాడుతున్న యువతుల వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోల్లో ఒకటిగా నిలిచింది.
ఈ వీడియో చివర్లో పోలీసులు లదీదా, ఆమె స్నేహితుల కాళ్ల మధ్యలోంచి షహీన్‌ను కొట్టడం కొనసాగిస్తారు. దాంతో యువతులందరూ అతడిని చుట్టూ రక్షణగా నిల్చున్నారు. చివరికి వెనక్కి తగ్గిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
అయితే, పోలీసులు తాము అంత గట్టిగా కొట్టలేదని చెబుతున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన దిల్లీ పోలీసు ప్రతినిధి ఎంఎస్ రంధావా, "పోలీసులు చాలా సంయమనం పాటిస్తున్నారు" అన్నారు.
ఆయన మాటలు, జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఆగ్రహావేశాలను చల్లార్చలేకపోయాయి.

ఫొటో సోర్స్, EPA
"ఇలాంటి ఆందోళనలు దేశవ్యాప్తంగా జరగడం చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్లంతా పౌరసత్వ సవరణ చట్టాన్ని అడ్డుకోవాలని అనుకుంటున్నారు. తమ గళం వినిపిస్తున్నారు" అని లదీదా జర్నలిస్ట్ బర్ఖా దత్‌తో అన్నారు.
"మిగతా మహిళలు ఈ వీడియో చూసి తమ అడుగుజాడల్లో నడుస్తారని భావిస్తున్నట్లు ఆ యువకుడికి మానవ కవచంలా నిలిచిన యువతుల్లో ఒకరైన ఆయేషా రెన్నా కూడా ఆశిస్తున్నారు.
"బయటికి రండి, పురుషులు మీరు గొంతు వినిపించకుండా మిమ్మల్ని లోపల కూర్చోపెట్టారు. మీరు కోరుకున్నప్పుడు మీ గళం వినిపించండి. అది మీ హక్కు" అంటారు ఆయేషా.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ జామియా యూనివర్సిటీ ఆందోళనల్లో పోలీసులే బస్సుకు నిప్పంటించారా...
- పౌరసత్వ సవరణ బిల్లు: హైదరాబాద్‌లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు
- హ్యూమన్ రైట్స్ డే: మానవుడిగా మీ హక్కులు మీకు తెలుసా...
- భారతదేశ కొత్త 'ముస్లిం వ్యతిరేక' చట్టం మీద ఆందోళనలు ఎందుకు?
- రోహింజ్యాల మారణహోమం ఆరోపణలపై అంతర్జాతీయ కోర్టుకు ఆంగ్ సాన్ సూచీ
- కశ్మీర్ వేర్పాటువాది మక్బూల్ భట్: ఒక వ్యక్తిని ఉరి తీసి, జైలులోనే ఖననం చేయడం తీహార్ జైలు చరిత్రలో అదే తొలిసారి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









