డోనల్డ్ ట్రంప్: 'నా కనీస హక్కులను కాలరాశారు' - స్పీకర్ నాన్సీ పెలోసీకి అధ్యక్షుడి లేఖ

ఫొటో సోర్స్, AFP
అభిశంసనను ఎదుర్కోబోతున్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఈ విషయంలో డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు నాన్సీ పెలోసీ మీద మండిపడుతూ మంగళవారం ఒక లేఖ రాశారు.
''మీరు అమెరికా ప్రజాస్వామ్యం మీద బహిరంగ యుద్ధం ప్రకటించారు. చాలా అసహ్యకరమైన 'అభిశంసన' అనే పదం ప్రాధాన్యాన్ని చాలా చౌకబారుగా మార్చారు'' అని ఆ లేఖలో పెలోసీని నిందించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఉక్రెయిన్ మీద ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలకు సంబంధించి ట్రంప్ మీద ప్రతినిధుల సభ అభిశంసన విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. దీని మీద బుధవారం ఓటింగ్ జరగనుంది.
ఈ ఓటింగ్‌లో ట్రంప్ అభిశంసనకు గురవుతారని.. అనంతరం సెనేట్‌లో విచారణ మొదలవుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ ఓటింగ్ ఫలితాలు మారతాయనే ఆశ లేకపోవటంతో.. అభిశంసన ప్రక్రియను, స్పీకర్ నాన్సీ పెలోసీని ఆగ్రహంగా విమర్శిస్తూ ఆయన ఆరు పేజీల లేఖ రాశారు.
అభిశంసన ప్రక్రియను అడ్డుకోవటానికి.. తన కీలక సహాయకులు ప్రతినిధుల సభ ముందు వాంగ్మూలం ఇవ్వకుండా నిరోధించటం ద్వారా పోరాడిన అధ్యక్షుడు ఇలా లేఖ ద్వారా స్పందించటం విశేషం.

''ఈ అభిశంసన కుంభకోణం మొదలైనప్పటి నుంచీ నాకున్న కనీస రాజ్యాంగబద్ధ హక్కులను కాలరాశారు. సాక్ష్యం అందించే హక్కు సహా రాజ్యాంగం కల్పించిన అత్యంత ప్రాథమిక హక్కులనూ నాకు నిరాకరించారు'' అని ట్రంప్ ఆరోపించారు.
''నాకన్నా 'సాలెం మంత్రగత్తెల విచారణల్లో' నిందితుల రాజ్యాంగ హక్కులను అధికంగా గౌరవించారు'' అని ఆయన రాశారు.
నిజానికి, అభిశంసన ప్రక్రియలో సాక్ష్యం ఇవ్వటానికి హాజరవ్వాలంటూ అధ్యక్షుడిని సభ జ్యుడీషియరీ కమిటీ చైర్మన్‌గా ఉన్న డెమొక్రటిక్ పార్టీ నేత బహిరంగంగా ఆహ్వానించారు. అలా హాజరైనట్లయితే ఆయన తరఫు న్యాయవాదుల బృందానికి సాక్షులను ప్రశ్నించే అవకాశమూ లభించేది. కానీ, ఆ ఆహ్వానాన్ని ట్రంప్ తిరస్కరించారు.
మరోవైపు, అధ్యక్షుడు ''కాస్త చరిత్ర తెలుసుకోవాలి'' అంటూ సాలెమ్ మేయర్ కిమ్ డ్రిస్కోల్ ట్వీట్ చేశారు. మంత్రగత్తెల విచారణల్లో నిందితులను ఎటువంటి ఆధారాలూ లేకుండానే దోషులుగా నిర్ధారించారని, కానీ అధ్యక్షుడి మీద కేసులో ''సాక్ష్యాలు పుష్కలంగా ఉన్నాయ''ని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
నాన్సీ పెలోసీ విలేకరులతో మాట్లాడుతూ, ఆ లేఖను తాను పూర్తిగా చదవలేదన్నారు. అయితే, దాని సారాంశాన్ని చూశానని, చాలా చికాకుగా అనిపించిందని చెప్పారు.
అభిశంసన ఓటింగ్ బుధవారం జరుగుతుందని ఒక ప్రకటనలో తెలిపిన నాన్సీ, ''రాజ్యాంగం మనకు ప్రసాదించిన అత్యంత పవిత్రమైన ఒక అధికారాన్ని సభ ఉపయోగించుకుంటుంది'' అని చెప్పారు.
''మన దేశ చరిత్రలో అత్యంత కీలకమైన ఈ దశలో మన రాజ్యాంగాన్ని బలపరుస్తామని.. విదేశీ, అంతర్గత శత్రువులు ఇరువురి నుంచీ పరిరక్షిస్తామని.. మనం చేసిన ప్రమాణాన్ని మనం గౌరవించి తీరాలి'' అన్నారు.
ట్రంప్ రెండు అభిశంసన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అభిశంసన దర్యాప్తునకు సహకరించటానికి తిరస్కరించటం ద్వారా, సిబ్బంది సాక్ష్యం చెప్పకుండా నిరోధించటం ద్వారా, పత్రాల ఆధారాలను ఇవ్వకపోవటం ద్వారా కాంగ్రెస్‌ను అడ్డుకోవటం ఒకటైతే.. రాజకీయంగా తన డెమొక్రటిక్ పార్టీ ప్రత్యర్థి జో బిడెన్ మీద దర్యాప్తు చేయాలంటూ ఉక్రెయిన్ మీద ఒత్తిడి తేవటానికి తన అధికారాన్ని ఉపయోగించుకోవటానికి ప్రయత్నించటం రెండోది.

బుధవారం జరిగే ఓటింగ్ పార్టీలు ఆశించిన తీరులో ఉంటే, అమెరికా చరిత్రలో ప్రతినిధుల సభలో అభిశంసనకు గురైన మూడో దేశాధ్యక్షుడు ట్రంప్ అవుతారు. అప్పుడిక ఆయన మీద సెనేట్‌లో విచారణ జరుగుతుంది. అక్కడ రెండు పార్టీలకు చెందిన సెనెటర్లు స్వతంత్ర న్యాయనిర్ణేతలుగా వ్యవహరించాల్సి ఉంటుంది.
అధ్యక్షుడు ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్ పార్టీ సెనేట్‌లో ఆధిక్యంలో ఉంది. విచారణ సమయంలో రిపబ్లికన్ సెనెటర్లు అధ్యక్షుడి బృందంతో ''పూర్తి సమన్వయం''తో వ్యవహరిస్తారని.. ఆ ప్రక్రియకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని రిపబ్లికన్ సెనేట్ నాయకుడు మిచ్ మెక్‌కొనెల్ గత వారంలో పేర్కొన్నారు. ఇది డెమొక్రటిక్ సభ్యులకు ఆగ్రహం తెప్పించింది.
''అభిశంసన విధివిధానాలను సెనేట్‌కు పంపించినట్లయితే.. సెనేట్ నిష్పాక్షికంగా, నిజాయితీగా విచారణ నిర్వహించేందుకు వీలుగా, ప్రతి ఒక్క సనేటర్ 'నిష్పాక్షిక న్యాయం' అందిస్తామని ప్రమాణం చేస్తారు'' అని.. సెనేట్‌లో మైనారిటీగా ఉన్న డెమొక్రటిక్ పక్ష నాయకుడు చక్ షూమర్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, DREW ANGERER/GETTY IMAGES
ఇదిలావుంటే, ట్రంప్‌కు రాజకీయంగా ఉపయోగపడగల దర్యాప్తులకు అడ్డంకులు లేకుండా చేయటానికి, ఉక్రెయిన్‌లో అమెరికా రాయబారి మేరీ యొవనోవిచ్‌ను తొలగించటానికి తాను పని చేశానని ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రూడీ గ్విలియానీ అంగీకరించినట్లు కనిపించింది.
యొవనోవిచ్ అటువంటి దర్యాప్తులకు ఎలా అడ్డుపడ్డారనే సమాచారాన్ని తాను ''రెండు సార్లు'' ట్రంప్‌కు చేరవేశానని గ్విలియానీ న్యూయార్క్ టైమ్స్ పత్రికకు చెప్పారు.
''యొవనోవిచ్ అడ్డంకిని తొలగించాల్సి వచ్చింది'' అని ఆయన న్యూయార్కర్ మేగజీన్‌తో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్‌కు మరణశిక్ష
- దిల్లీ జామియా యూనివర్సిటీ ఆందోళనల్లో పోలీసులే బస్సుకు నిప్పంటించారా...
- ఉల్లి మన ఆహారంలో ఎలా భాగమైంది? దాని చరిత్ర ఏంటి...
- భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం... ఈ లోయ లోతు 11,500 అడుగులు
- యూఎస్బీ కండోమ్ అంటే ఏమిటో తెలుసా?
- సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే తేయాకు కథ: చైనా నుంచి టీ రహస్యాన్ని ఆంగ్లేయులు ఎలా దొంగిలించారు?
- నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి
- ఉరి తాడు ఒక్క బక్సర్ జైల్లోనే ఎందుకు తయారవుతోంది?
- భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం... ఈ లోయ లోతు 11,500 అడుగులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








