IND Vs WI విశాఖ వన్డేలో భారత్ విజయం: రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్

ఫొటో సోర్స్, Getty Images
తొలి వన్డేలో ఓడి, సిరీస్ గెలుపుపై ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే గెలవక తప్పని పరిస్థితుల్లో బరిలోకి దిగిన భారత్... విశాఖలో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్‌పై 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
తన విధ్వంసక బ్యాటింగ్‌తో భారీ స్కోరుకు పునాది వేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డే 22వ తేదీన కటక్‌లో జరుగుతుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 పరుగులు చేసింది.
388 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ మొదట్లో నిలకడగా ఆడుతున్నట్లే కనిపించింది. కానీ 15 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు.
దీంతో 43.3 ఓవర్లలో 280 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్ అయ్యింది.
ఓపెనర్ లూయీస్ 35 బంతుల్లో 5 బౌండరీలతో 30 పరుగులు చేసి ఠాకూర్ బౌలింగ్‌లో అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చాడు.
అనతరం క్రీజులోకి వచ్చిన హెట్‌మెయర్ 4 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు.
చేజ్ కూడా 4 పరుగులకే జడేజా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
ధాటిగా ఆడిన పూరన్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 75 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన విండీస్ కెప్టెన్ పొలార్డ్ పరుగులేమీ చేయకుండానే తొలి బంతికే షమీ వేసిన బంతికి ఔటయ్యాడు.
కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్
33వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చాడు కుల్దీప్ యాదవ్.
తొలి బంతిని హోల్డర్ సిక్స్‌గా మలిచాడు. కానీ, తర్వాత బంతిని గూగ్లీ వెయ్యడంతో పరుగులేమీ రాలేదు. మూడో బంతికి హోల్డర్ సింగిల్ తీశాడు. ఇక ఆ తర్వాత మూడు బంతుల్లో కుల్దీప్ మాయ చేశాడు.
నిలకడగా ఆడిన రెండో ఓపెనర్ హోప్ (78 - 7 ఫోర్లు, 3 సిక్సులు) కూడా కుల్దీప్ బౌలింగులో కోహ్లీ బౌండరీ దగ్గర అద్భుతమైన క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు.
తర్వాత బంతికి జాసన్ హోల్డర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పంత్ చేతికి చిక్కాడు. జాసన్ 13 బంతుల్లో ఓ సిక్స్ సాయంతో 11 పరుగులు చేశాడు.
వెంటనే జోసెఫ్ కూడా కుల్దీప్ బౌలింగ్ లోనే తొలిబంతికే డకౌట్ అయ్యాడు.
దీంతో వన్డేల్లో కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ సాధించాడు. దీంతో అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రెండుసార్లు హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా కుల్దీప్ గుర్తింపు పొందాడు. అంతకుముందు, అండర్-19 స్థాయిలో కుల్దీప్ ఓ హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆ తర్వాత జడేజా బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్ పట్టడంతో పియరీ(21 - 3 ఫోర్లు) కూడా పెవిలియన్ చేరాడు.
చివర్లో పాల్ (46- 4 ఫోర్లు, 3 సిక్సులు) కాసేపు ప్రతిఘటించినా షమీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది.
కాట్రెల్ (0) నాటౌట్‌గా మిగిలాడు.
భారత్ ఇన్నింగ్స్
అంతకు ముందు, భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. సెంచరీలతో కదం తొక్కారు.
రోహిత్ 107 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సులతో 100 పరుగులు పూర్తిచేయగా, కేఎల్ రాహుల్ 102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 101 పరుగులు చేసి సెంచరీ సాధించాడు.
సెంచరీ పూర్తైన కాసేపటికే రాహుల్ (102) జోసెఫ్ బౌలింగ్‌లో చేజ్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఔట్‌సైడ్ ఎడ్జ్‌కు తగిలిన బాల్ థర్డ్ మ్యాన్ దిశగా వెళ్లగా చేజ్ దాన్న ఒడిసి పట్టాడు.
వన్ డౌన్‌లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండా తొలిబంతికే వెనుదిరిగాడు. పొలార్డ్ వేసిన షార్ట్ బాల్‌ను సరిగా ఆడలేక మిడ్‌వికెట్‌లో ఉన్న చేజ్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చాడు.
సెంచరీ పూర్తయ్యాక జోరు పెంచిన రోహిత్ 138 బంతుల్లో 159 పరుగులు చేసి కాట్రెల్ బౌలింగ్‌లో చేజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఆపైన శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 53 పరుగులు), రిషబ్ పంత్ (16 బంతుల్లో 39) కూడా హిట్టింగ్ చేయడంతో భారత్ 387 పరుగుల భారీ స్కోర్‌ను సాధించగలిగింది.

ఫొటో సోర్స్, TWITTER/RISHABH PANT
అయ్యర్, పంత్ అరుదైన రికార్డు
ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డు నెలకొల్పారు అయ్యర్, పంత్.
47వ ఓవర్లో వీరిద్దరూ కలిసి 31 పరుగులు పిండుకున్నారు. భారత్ తరపున వన్డేల్లో ఓ ఓవర్‌లో సాధించిన అత్యధిక పరుగులు ఇవే.
చేజ్ వేసిన తొలిబంతి నోబాల్. ఈ బంతికి అయ్యర్ ఓ పరుగు చేశాడు. నోబాల్ కారణంగా మరో పరుగు వచ్చింది. తర్వాత బంతికి పంత్ మరో పరుగు తీశాడు. రెండో బంతికి అయ్యర్ సిక్స్ బాదాడు. మూడో బంతిని కూడా అయ్యర్ స్టాండ్స్‌లోకి పంపించాడు. నాలుగో బంతిని ఫోర్‌గా మలిచి, చివరి రెండు బంతులకూ సిక్సులు బాదాడు అయ్యర్.
ఇంతకుముందు ఈ రికార్డు సచిన్ తెందూల్కర్, అజయ్ జడేజాల పేరు మీద ఉండేది. 1999లో వీరిద్దరూ కలిసి న్యూజీలాండ్‌పై ఓ ఓవర్లో 28 పరుగులు బాదారు. ఇప్పటివరకూ అదే రికార్డు.
ప్రస్తుత మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు తొలిబంతికే డకౌటయ్యారు.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
గత మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో టీమ్ ఇండియాను ఇబ్బంది పెట్టిన వెస్టిండీస్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో తేలిపోయినట్లు కనిపించారు.
హోల్డర్, చేజ్‌లు తప్ప మిగిలిన వారందరినీ భారత బ్యాట్స్‌మెన్ సమర్థంగా ఎదుర్కొన్నారు. భారత ఓపెనర్ల ధాటికి వారు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
వెస్టిండీస్ తన జట్టులో రెండు మార్పులు చేసింది. ఎవిన్ లూయీస్ తిరిగి జట్టులో చేరాడు. హేడెన్ వాల్ష్ స్థానంలో వచ్చిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఖారీ పియెరీకి ఇదే తొలి వన్డే.
ఇవి కూడా చదవండి.
- నిర్భయ కేసు: దోషి అక్షయ్ రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
- పౌరసత్వ సవరణ చట్టం: సీఏఏపై దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తామన్న సుప్రీం కోర్టు
- "అమ్మను చూడగానే కన్నీళ్లొచ్చాయి"- పన్నెండేళ్ళ తర్వాత కన్నతల్లిని కలుసుకున్న భవానీ
- పర్వేజ్ ముషరఫ్‌కు మరణ శిక్ష: 'మాజీ ఆర్మీ చీఫ్ ఎప్పటికీ దేశ ద్రోహి కాలేడు' - పాక్ మేజర్ జనరల్ గఫూర్
- డోనల్డ్ ట్రంప్: 'నా కనీస హక్కులను కాలరాశారు' - స్పీకర్ నాన్సీ పెలోసీకి అధ్యక్షుడి లేఖ
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ: ఆధిపత్యం కోసం పాలక, ప్రతిపక్షాల హోరాహోరీ పోరు
- పేద దేశాల్లో ప్రజలకు ఊబకాయం ఎందుకు వస్తోంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








