ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ: ఆధిపత్యం కోసం పాలక, ప్రతిపక్షాల హోరాహోరీ పోరు

ఫొటో సోర్స్, FB/AndhraPradeshCM/tdp.ncbn.official
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు ముగిశాయి. బడ్జెట్ సమావేశాల్లో 19 బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఈసారి 16 బిల్లులను ప్రతిపాదించింది. బిల్లులకు విపక్షం ఉంచి పెద్దగా అభ్యంతరాలు రాకపోవడం ఈ సమావేశాల్లో ఒక విశేషం. అదే సమయంలో ప్రజా సమస్యలపై చర్చల్లో మాత్రం ఇరు పార్టీలు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేశాయి. సమావేశాల ముగింపు దశలో రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమంటూ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
సన్నబియ్యం పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాట మార్చారనే ఆరోపణలను ప్రతిపక్షం చేసింది. ఇరుపక్షాలు పోటాపోటీగా ప్రివిలైజ్ నోటీసులు ఇచ్చాయి.
అసెంబ్లీ గేట్ ముందు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడికి, మార్షల్స్‌కు మధ్య వివాదం తర్వాత సభలో గందరగోళానికి దారితీసింది. సభలో మూడో పక్షమైన జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ వాదనను బలపరుస్తున్నట్టు కనిపించారు.
ఈసారి సమావేశాలు మొత్తం ఏడు రోజుల పాటు సాగాయి. రైతు సమస్యలు, రాజధాని, అనేక ఇతర అంశాలు చర్చకు వచ్చాయి. సంఖ్యా బలం అధికంగాగల పాలకపక్షం తరపు సభ్యులు దూకుడు ప్రదర్శించారు. ప్రతిపక్షంలో కొందరు సభ్యులు క్రియాశీలంగా వ్యవహరించారు.
నిత్యం ప్రతిపక్ష సభ్యుల నిరసనలు
సమావేశాల సందర్భంగా ఏడు రోజులూ టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనలు చేపట్టారు. సభ ప్రారంభానికి ముందుగానే అసెంబ్లీ వెలుపల ధర్నాలు నిర్వహించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించిన తర్వాత వాటిని తీసుకుని వెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో పలుమార్లు ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, చీఫ్ మార్షల్ మధ్య వాగ్వాదానికి, అదే సమయంలో తోపులాటకు దారితీసింది.
మార్షల్స్‌ను ఉద్దేశించి చంద్రబాబు అభ్యంతరకరంగా మాట్లాడారని ఆరోపించిన వైసీపీ, క్షమాపణలు చెప్పాలని సభలో డిమాండ్ చేసింది.
విపక్ష ఎమ్మెల్యేల వెంట కొందరు సభ్యులు కానివారు కూడా అసెంబ్లీ పరిధిలోకి వచ్చారన్న వైసీపీ ఆరోపణలపై స్పీకర్ స్పందించి, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆది నుంచి అదే తీరు
తొలి రోజు ప్రశ్నోత్తరాల సమయంలో పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధంతో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ప్రతీ అంశంలోనూ సభ అదే తీరులో సాగింది. చివరి రోజు కరెంట్ కోతల విషయం వరకూ వాగ్వాదం కొనసాగింది.
జీరో అవర్, స్వల్పకాలిక చర్చలు, బిల్లులు ప్రవేశ పెట్టిన సమయంలో జరిగిన చర్చలతో పాటు రాజధాని నిర్మాణం వంటి అంశాలపై జరిగిన చర్చల సందర్భంగానూ వాదప్రతివాదాలతో సభ సాగింది.
అసెంబ్లీ గేటు బయట ఆందోళనలు నిర్వహించిన అనంతరం సభలో అడుగుపెట్టిన టీడీపీ సభ్యులు నిత్యం నినాదాలతో హోరెత్తించారు. పలు సందర్భాల్లో వాకౌట్లు చేశారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు పాలనను ఎత్తి చూపేందుకు ప్రయత్నించారు. గత ప్రభుత్వ వైఫల్యాలంటూ పలు అంశాలను సభలో ప్రస్తావించారు.
కీలక బిల్లులకు ఆమోదం
ఈసారి సభలో పలు అంశాల్లో సమూల మార్పులు చేస్తూ బిల్లులు ఆమోదించారు. సోమవారం ఒక్క రోజే అసెంబ్లీలో 16 బిల్లులకు ఆమోదం లభించడం విశేషం.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ విభజన, ఎస్సీ కార్పోరేషన్ విభజన, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, నూతన మద్యం విధానంలో భాగంగా మద్యం నియంత్రణ చర్యలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలు, చిరు ధాన్యాల బోర్డు ఏర్పాటు, ఏపీ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, సహకార సంఘాల చట్ట సవరణ వంటి అనేక బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.

ఫొటో సోర్స్, Getty Images
దిశ చట్టం
తెలంగాణలో దిశ సామూహిక అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ దిశ చట్టాన్ని తీసుకొచ్చింది.
దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు, తెలంగాణ పోలీసులకు హ్యాట్సాఫ్ అంటూ మాట్లాడిన సీఎం జగన్, అదే సమయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
దిశ పేరుతో ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్ట్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ వుమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019కి ఉభయ సభల్లోనూ ఆమోద ముద్ర లభించింది.
ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. విచారణ ప్రక్రియను 21 రోజుల్లోనే పూర్తి చేయాలని ఈ చట్టంలో పేర్కొన్నారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది విలీనం
51,488 మంది ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడానికి తగ్గట్టుగా ప్రభుత్వం రూపొందించిన బిల్లును శాసనసభ, మండలి ఆమోదించాయి. వచ్చే జనవరి నుంచి ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఈ నిర్ణయం చేశారు.

ఫొటో సోర్స్, YSRCPOFFICIAL/FACEBOOK
ఏపీ అబ్కారీ చట్టం -1968కి సవరణలు
మద్యం షాపులు, బార్లు భారీగా తగ్గిస్తూ, అక్రమ మద్యం అమ్మకాలు, రవాణా విషయంలో శిక్షలను మరింత కఠినతరం చేస్తూ చట్టంలో మార్పులు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లులకు సభ ఆమోదం లభించింది.
సహకార సంఘాల పాలకవర్గాలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుష్టు రోగులతోపాటు చెవిటివారు, మూగవారికి కూడా అవకాశం కల్పిస్తూ చట్టం సవరించారు.
ఎస్సీ, ఎస్టీలకు విడివిడిగా కమిషన్లు
ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ని విభజిస్తూ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు ఆమోదం లభించింది. 20 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లో అమల్లోకి వచ్చిన కమిషన్ ఇకపై ఎస్సీ, ఎస్టీలకు విడివిడిగా మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతూ ప్రభుత్వం ఈ మార్పులు తీసుకొచ్చింది.
ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ -1982కి సవరణలు
విద్యారంగానికి సంబంధించిన చట్టాన్ని సవరిస్తూ ప్రతిపాదించిన బిల్లుకు కూడా ఆమోదం దక్కింది.
ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయబోతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ చట్టానికి చేసిన సవరణలను ఆమోదించారు.

ఫొటో సోర్స్, iStock
చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల కోసం ప్రత్యేక బోర్డులు
చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సహించడం, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే లక్ష్యంతో విడివిడిగా రెండు బోర్డులు ఏర్పాటు చేసేందుకు రూపొందించిన బిల్లులకు కూడా ఆమోదం లభించింది.
కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణల బిల్లు తదితర బిల్లులు ఆమోదం పొందాయి.
సన్నబియ్యం కాదు..నాణ్యమైన బియ్యమే
సన్నబియ్యం అంశం పెద్ద చర్చకు దారితీసింది. సాక్షి పత్రికలో కథనాలను విపక్షం ప్రస్తావించడం, జగన్ హామీ ఇచ్చినట్టుగా ఉన్న విషయాన్ని సభ దృష్టికి తీసుకురావడంపై జగన్ స్పందిస్తూ- "మేం మ్యానిఫెస్టోకి కట్టుబడి ఉన్నాం. దాని ఆధారంగానే ప్రజలకు మంచి చేయాలనే తపన, తాపత్రయంతో ఉన్నాం. చంద్రబాబు హయంలో ఇస్తున్న బియ్యం తినలేని పరిస్థితుల్లో ఉండడంతోనే నాణ్యమైన బియ్యం అందించాలని శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాం. దానికి గర్వపడుతున్నాం. ప్రజలు ఆనందంగా స్వీకరిస్తున్నారు. కానీ సాక్షి పత్రికలో తప్పు రాశారు. పొరపాటున సన్నబియ్యం అని రాశారు. సన్నబియ్యానికి, నాణ్యమైన బియ్యానికి తేడా తెలియక కన్ఫ్యూజ్ అయ్యారు. అదే సమయంలో మిగిలిన పత్రికల్లో ఏమి రాశారో చూస్తూ జ్ఞానోదయం అవుతుంది" అని పేర్కొన్నారు.
ప్రివిలైజ్ నోటీసులు
టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహార శైలిపై అధికార పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరుగా సీఎం సభలోనే హెచ్చరించారు. ప్రివిలైజ్ నోటీసు ఇస్తామంటూ ప్రకటించారు. దానికి అనుగుణంగానే చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రతిపాదనతో స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులను ప్రివిలైజ్ కమిటీకి సిఫార్సు చేశారు. టీడీపీ నేతలు కూడా చంద్రబాబుకు సంబంధం లేని మాటలను సభలో ప్రస్తావించారంటూ సీఎంపై స్పీకర్‌కు ప్రివిలైజ్ నోటీసు అందించారు.

ఫొటో సోర్స్, aplegislature.org
చంద్రబాబుపై వల్లభనేని వంశీ విమర్శలు
గన్నవరం నుంచి టీడీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశాలకు ముందుగానే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. సభలో టీడీపీ సభ్యుల వెనుక కూర్చున్న ఆయన, స్వరం వినిపించే అవకాశం రాగానే చంద్రబాబు మీద విమర్శలకు పూనుకొన్నారు.
జగన్‌కు జైకొట్టిన జనసేన ఎమ్మెల్యే
జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సభలో ముఖ్యమంత్రి జగన్‌కు జైకొట్టారు. ప్రభుత్వ నిర్ణయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నట్టు ప్రకటించారు. కొన్ని సందర్భాల్లో టీడీపీని తప్పుబట్టిన ఆయన, తన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైఖరికి కూడా భిన్నంగా సభలో మాట్లాడారు. ఇంగ్లిష్ మీడియం నిర్ణయాన్ని సంపూర్ణంగా బలపరిచారు.
సమావేశాల చివరి రోజు ముగింపు దశలో రాజధాని అంశంపై చర్చ సందర్భంగా సభను అడ్డుకుంటున్నారంటూ తొమ్మిది మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.
ఒకరోజుపాటు వారి సస్పెన్షన్‌కు సభావ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించడంతో వారిని మార్షల్స్ సహాయంతో సభ నుంచి బయటకు పంపించారు.

ఫొటో సోర్స్, JANASENA PARTY
ఆది నుంచి ఎదురుదాడికే యత్నం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
అసెంబ్లీలో విపక్షాలకు కావాల్సినంత సమయం ఇస్తామని గత సమావేశాల్లో చెప్పిన దానికి విరుద్ధంగా ఈసారి వైసీపీ తీరు ఉందని టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీబీసీతో అన్నారు.
"ఆరంభం నుంచి ఎదురుదాడి చేయడానికే చూస్తున్నారు. ప్రతిపక్షం నుంచి ఎలాంటి సూచనలు, సలహాలు కూడా స్వీకరించే స్థితిలో లేరు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తోసిపుచ్చారు. చర్చల్లో పాలకపక్ష సభ్యుల తీరు సరిగా లేదు" అని ఆయన విమర్శించారు.
కొత్త చరిత్ర సృష్టించబోతున్నాం: వైసీపీ
జగన్ నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్ర పాలనా విధానంలో సమూల మార్పులు తెస్తూ చట్టాలు రూపొందించిందని, వీటితో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
"ఆరు నెలల్లోనే జగన్ ప్రభుత్వం రూపొందించిన చట్టాలకు దేశమంతా అభినందనలు వస్తున్నాయి. దిశ చట్టం అమలు చేయాలని దిల్లీ, కేరళ ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నాయి. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ తీసుకుంటున్న నిర్ణయాలతో సమగ్ర అభివృద్ధి ఖాయం. ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఎలాంటి అంశాలు లేకపోవడంతో ప్రతిపక్షం బురదజల్లేందుకు యత్నించింది. వాస్తవదూరమైన విషయాలను ప్రస్తావించడం ద్వారా ప్రివిలైజ్ నోటీసుల వరకు తెచ్చుకుంది. ప్రభుత్వం జవాబుదారీగా, నిబద్ధతతో వ్యవహరించింది" అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- బాగ్దాద్ గోడలపై ప్రతిబింబిస్తున్న మహిళల చైతన్యం
- ఆన్లైన్ మార్కెట్లలో కొనుగోలు చేసే క్రిస్టమస్ లైట్లతో 'ప్రమాదం'
- భారత్‌లో అత్యాచారాలను రాజకీయ అంశంగా మార్చిన రాహుల్, మోదీ
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్‌కు మరణశిక్ష
- పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు: దిల్లీ పోలీసుల లాఠీల నుంచి స్నేహితుడికి రక్షణ కవచంగా మారిన యువతులు
- బోయింగ్: 737 మాక్స్ విమానాల ఉత్పత్తి జనవరిలో తాత్కాలికంగా నిలిపివేత
- ఈ చట్టంతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు: అమిత్ షా
- దిల్లీ జామియా యూనివర్సిటీ ఆందోళనల్లో పోలీసులే బస్సుకు నిప్పంటించారా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








