సనా మారిన్: ఫిన్‌లాండ్ ప్రధానిపై ఎస్తోనియా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన అధ్యక్షురాలు

సనా మారిన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, సనా మారిన్

ఫిన్‌లాండ్ కొత్త ప్రధాని సనా మారిన్‌ను 'సేల్స్ గర్ల్' అని తమ దేశ మంత్రి అనడంపై ఎస్తోనియా అధ్యక్షురాలు కెర్స్‌తీ కల్యులాయిడ్ క్షమాపణ చెప్పారు.

తమ ప్రభుత్వంలోని మంత్రి మార్ట్ హెల్మ్ వ్యాఖ్యలు చాలా ఇబ్బందిగా అనిపించాయని కల్యులాయిడ్ అన్నారు.

ఇటీవలే ఫిన్‌లాండ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సనా మారిన్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ వయసున్న ప్రధానిగా రికార్డు సృష్టించారు.

ఫిన్‌లాండ్‌లో మహిళల నాయకత్వంలోని మరో నాలుగు పార్టీలతో కలిసి ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి సనా నేతృత్వం వహిస్తున్నారు. కొద్దికాలంగా రాజకీయాల్లో ఎదుగుతున్న నేత ఆమె.

అలాంటి సనాను ఎస్తోనియా మంత్రి హెల్మ్ తన పార్టీకి చెందిన రేడియోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ''ఒక సేల్స్ గర్ల్ ప్రధాని కావడాన్ని చూశాం. వీధుల్లో ఉద్యమాలు చేసే మరికొందరు, చదువులేని వారు ఆమె మంత్రివర్గంలో చేరారు'' అన్నారాయన.

మార్ట్ హెల్మ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎస్తోనియా మంత్రి మార్ట్ హెల్మ్

తాను వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చానని.. అంతేకాదు, యూనివర్సిటీలో చదువుకోవడానికి ముందు సేల్స్ అసిస్టెంట్‌గానూ పనిచేసినట్లు సనా ఇంతకుముందు చెప్పారు.

సనా తన కుటుంబంలో హైస్కూలు విద్య పూర్తిచేసి యూనివర్సిటీలో చదువుకున్న మొట్టమొదటి వ్యక్తి.

''ఫిన్‌లాండ్ వాసిగా అత్యంత గర్వపడుతున్నాను'' అంటూ ''ఈ దేశంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తికి కూడా చదువుకునే అవకాశం ఉంది, జీవితంలో ఎంతో సాధించడానికి అవకాశం ఉంది. ఒక దుకాణంలో క్యాషియర్‌గా పనిచేసే వ్యక్తి కూడా ప్రధాని కావొచ్చు'' అని ట్వీట్ చేశారామె.

ఎస్తోనియా అధ్యక్షురాలు కెర్స్‌తీ కల్యులాయిడ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ఎస్తోనియా అధ్యక్షురాలు కెర్స్‌తీ కల్యులాయిడ్

కాగా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఎస్తోనియా మంత్రి హెల్మ్ అన్నారు. సనా మారిన్‌కు ఆయన క్షమాపణ చెప్పారు.

''సామాజికంగా చిన్న స్థాయి నుంచి కూడా రాజకీయంగా ఎదగడం సాధ్యమే'' అని చెప్పడానికి ఉదాహరణగా సనా నేపథ్యాన్ని ప్రస్తావించానని.. తన మాటలు తప్పుగా అనిపిప్తే ఫిన్‌‌లాండ్ ప్రధానికి క్షమాపణలు చెబుతున్నానని హెల్మ్ అన్నారు.

మరోవైపు దీనిపై ఎస్తోనియా అధ్యక్షురాలు కల్యులాయిడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ఆమె.. ''ఫిన్‌లాండ్ అధ్యక్షులు సౌలీ నినిస్తోకు ఫోన్ చేసి మాట్లాడాను. అక్కడి ప్రధానికి, ఆమె ప్రభుత్వానికి నేను క్షమాపణలు చెబుతున్నట్లు తెలియజేయమని కోరాను'' అని చెప్పారు.

సనా మారిన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సనా మారిన్

మంత్రి హెల్మ్ వ్యాఖ్యలపై ఎస్తోనియాలోని విపక్షాలు మండిపడుతూ ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. లేదంటే ప్రధాని జూరీ రతాస్ ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశాయి.

గల్ఫ్‌ ఆఫ్ ఫిన్‌లాండ్‌కు ఒక వైపు ఫిన్‌లాండ్, రెండో వైపు ఎస్తోనియా ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య భాషాపరమైన బంధముంది.

కాగా సనా మారిన్‌పై ఈ వ్యాఖ్యలు చేసిన హెల్మ్‌కు వివాదాస్పద వ్యక్తి, సంచలన వ్యాఖ్యలు చేసే నేతగా పేరుంది.

ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా చేత్తో 'ఓకే' అన్నట్లుగా సంజ్ఞ చేయడం వివాదాస్పదమైంది. శ్వేత జాతీయవాదులకు ఆయన ఈ సంకేతం పంపారన్న ఆరోపణలున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)