స్పీడ్ రీడింగ్ కోర్సు: 5 నిమిషాల్లో లక్ష పదాలు చదవడం సాధ్యమేనా?

పుష్కిన్ లైబ్రరీలో పుస్తకం చదువుతున్న యువతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఐదు నిమిషాల్లో లక్ష పదాలను ఎలా చదవాలో 'క్వాంటమ్ స్పీడ్ రీడింగ్' విధానం నేర్పుతుందని కొన్ని విద్యాసంస్థలు చెబుతున్నాయి

యూరప్‌లో అత్యంత వేగంగా చదివే వ్యక్తిగా బ్రిటన్‌కు చెందిన డాన్ హొలోవేకు పేరుంది. 2018లో నిమిషానికి 1,700 పదాలను చదివి ఆయన ఆ రికార్డు సృష్టించారు.

ఇక, చైనాలోని ట్యూషన్ కేంద్రాలు మాత్రం తమ విద్యార్థులు నిమిషానికి 1,700 పదాలు కాదు, ఐదు నిమిషాల్లో లక్ష పదాలు చదివేస్తారని చెబుతున్నాయి. "క్వాంటమ్ స్పీడ్- రీడింగ్" పేరుతో కొన్ని సంస్థలు ప్రత్యేక కోర్సులు కూడా ప్రారంభించాయి.

అయితే, బీజింగ్‌లో జరిగిన స్పీడ్ రీడింగ్ పోటీలలో విద్యార్థులు వేగంగా పుస్తకాల పేజీలను తిప్పేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కోర్సుల వ్యవహారం విమర్శలకు దారితీసింది.

ఈ స్పీడ్ రీడింగ్ పోటీలో విద్యార్థులు పుస్తకాలను.. పత్తాలను తిప్పేసినట్లుగా చకచకా "చదివేస్తుంటారు".

పేజీలను తిప్పేస్తుంటే ఒక్కో పేజీ విద్యార్థుల మెదళ్లలో రికార్డవుతుందని, అందులోని విషయాలన్నీ వారికి అర్థమవుతాయని ఈ కోర్సు రూపకర్తలు చెబుతున్నారు.

అయితే, ఇలాంటి కోర్సుల పేరుతో కొన్ని సంస్థలు విద్యార్థులను 'మోసం' చేస్తున్నాయని, ఇదొక 'బూటకపు సైన్స్' అని విమర్శకులు అంటున్నారు.

ఇలాంటి కోర్సులను కట్టడి చేసేందుకు స్థానిక విద్యాశాఖ అధికారులు కొన్ని చర్యలు చేపట్టారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులు "క్వాంటమ్ స్పీడ్ రీడింగ్" కోర్సులకు వెళ్లకుండా నిషేధిస్తూ షెంజెన్ ఎడ్యుకేషన్ బ్యూరో ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ కోర్సులు అందిస్తున్న వ్యక్తుల మీద కూడా విచారణ జరపాలని ఆదేశించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఇలాంటి అసంబద్ధమైన శిక్షణల పేరుతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని చేస్తున్నారని కొంతమంది శిక్షణా నిపుణులు అంటున్నారు. అయితే, ఈ కోర్సులకు ప్రజాదరణ పొందడానికి అనేక కారణాలు ఉన్నాయి.

పిల్లలు వెనుకబడిపోతారన్న భయం, సరైన నిబంధనలు లేకపోవడం లాంటి కారణాలతో చైనాలోని తల్లిదండ్రులు విద్యార్థులను ఇలాంటి కోర్సుల్లో చేర్పిస్తున్నారు.

'క్వాంటమ్ స్పీడ్-రీడింగ్‌'ను మొదట జపాన్ ఉపాధ్యాయుడు యుమికో తోబిటాని అభివృద్ధి చేశారు. దీని గురించి 2006లో ఆయన ఒక పుస్తకాన్ని ప్రచురించారు.

చైనా విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి కోర్సులకు ఆదరణ పెరుగుతోందని నిపుణులు అంటున్నారు

బీజింగ్, షెంజెన్, గ్వాంజౌ, హాంగ్‌జౌ లాంటి నగరాల్లో ఉన్న కొన్ని ట్యూషన్ సంస్థలు ఇలాంటి కోర్సులను అందిస్తున్నాయని చైనీస్ మీడియా కథనాలు చెబుతున్నాయి.

ఈ కోర్సు ఫీజు రూ. 3 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా ఉంటుందని చెంగ్డూ నగరంలోని ఒక శిక్షణా కేంద్రం ప్రతినిధి కవర్ న్యూస్ అనే వెబ్‌సైట్‌తో చెప్పారు. కొన్ని చోట్ల పది లక్షల రూపాయల దాకా కూడా వసూలు చేస్తారు.

కానీ, ఇలాంటి కోర్సుల్లో పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులపై కొందరు చైనీయులు సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.

ఈ స్పీడ్ రీడింగ్ విధానానికి ఎలాంటి శాస్త్రీయత ప్రాతిపదిక లేదని, ఇలాంటి కోర్సులతో ఎలాంటి ప్రయోజనం లేదని బీజింగ్‌లోని 21st సెంచరీ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ జియాంగ్ బింగ్‌కి బీబీసీతో చెప్పారు.

చైనా విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

"తమ పిల్లలు చదువులో బాగా రాణించాలనే ఆత్రుత చైనాలోని తల్లిదండ్రుల్లో ఎక్కువగా ఉంది. దగ్గరి మార్గాల్లో పిల్లలు ఉన్నత విజయాలు సాధించాలని వారు కోరుకుంటున్నారు. ఒక్క అవకాశాన్ని కోల్పోయినా పోటీ ప్రపంచంలో తమ పిల్లలు వెనుకపడతారని ఆందోళన చెందుతున్నారు. రాత్రికి రాత్రే పిల్లలకు సూపర్‌పవర్ వచ్చేస్తుందని ఎవరైనా చెబితే, లక్షలు పెట్టి కోర్సుల్లో చేర్పించేందుకు కూడా కొందరు తల్లిదండ్రులు వెనకాడట్లేదు. అందుకే శాస్త్రీయత లేని ఇలాంటి కోర్సులకు స్పందన కనిపిస్తోంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

"క్వాంటమ్ స్పీడ్-రీడింగ్ కోర్సుల మీద కొందరు తల్లిదండ్రులకు పెద్దగా నమ్మకం లేకపోవచ్చు. అయినా, అందరూ చేరుతున్నారు కదా, మన పిల్లలు చేరకపోతే ఎలా? ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం పిల్లల భవిష్యత్తుపై పడుతుందేమో, ఇతరుల ముందు మా పిల్లలు వెనుకబడతారేమో అన్న ఆలోచనతో వాళ్లు భయపడుతున్నారు" అని జియాంగ్ బింగ్‌కి చెప్పారు.

సైన్స్ పట్ల అవగాహనా లోపం

కానీ, ఈ కోర్సులకు ప్రజాదరణ వెనుక ఇతర అంశాలు ఉన్నాయి.

ఇలాంటి కోర్సులపై మోజు పెరగడానికి ప్రధాన కారణం సైన్స్ మీద ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడమే అని చైనా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేసన్ సైన్సెస్‌లో పరిశోధకుడు చూ ఝాహూయి బీబీసీతో చెప్పారు.

2018లో నిర్వహించిన పబ్లిక్ సైంటిఫిక్ లిటరసీ సర్వే ప్రకారం, చైనా జనాభాలో కేవలం 8.5 శాతం మందికి మాత్రమే సైన్స్ పట్ల అవగాహన ఉంది. అయితే, 2005లో అది 1.6 శాతంగా ఉండేది.

చైనా విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

"క్వాంటమ్ విధానంతో పుస్తకంలోని పేజీలలో ప్రింట్ చేసి ఉన్న సమాచారం అంతా పిల్లల మెదళ్లలోకి వెళ్లిపోతుందని శిక్షణా సంస్థలు చెప్పే మాటలను కొందరు తల్లిదండ్రులు నమ్ముతున్నారు. కానీ, పేపర్ మీది సమాచారం మెదడులోకి వచ్చి చేరడం అసాధ్యం" అని చూ ఝాహూయి అన్నారు.

క్వాంటమ్ స్పీడ్ రీడింగ్ కోర్సులను అందిస్తున్న సంస్థలన్నీ కన్సల్టెన్సీ కంపెనీలుగా రిజిస్టర్ చేసుకుని ఉన్నాయి. కాబట్టి, చైనా విద్యా విధానంలో మార్పులు తెచ్చి ఇలాంటి సంస్థలను కట్టడి చేయాల్సి అవసరం ఉందని జియాంగ్ బింగ్‌కి అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)