‘నా మారు తండ్రి ఓ బాలికను రేప్ చేసి చంపడం కళ్లారా చూశా... అది అతనికి కొత్త కాదు‘

ఫొటో సోర్స్, Sherele Moody
హింస... షెరెలే మూడీకి కొత్తేమీ కాదు. ఆస్ట్రేలియాలో మహిళలు, పిల్లల హింసాత్మక మరణాలపై డాక్యుమెంట్ చేసేందుకు ఆమె ఖాళీ సమయాన్ని వినియోగించడంతో పాటు, హింసను స్వయంగా భరించిన అనుభవం కూడా ఆమెకు ఉంది.
చిన్న వయస్సు నుంచే ఆమెను తల్లి చిత్రహింసలకు గురిచేసింది. తల్లి అత్యంత క్రూరంగా దాడి చేసినప్పుడల్లా, మూడీ భయంతో పారిపోతుండేది. ఓసారి అలా పారిపోయి బాలల సంరక్షణ అధికారుల దగ్గరికి చేరింది.
అంతేకాదు, ఆమె మారుతండ్రి బారీ హాడ్లో కూడా అనేక దారుణాలకు ఒడిగట్టాడు. అతని చేతిలో ఓ తొమ్మిదేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవడం మూడీ కళ్లారా చూసింది.
1990లో, బారీ హాడ్లో తొమ్మిదేళ్ల వయసున్న స్టాసే-ఆన్ ట్రేసీ అనే బాలికను అపహరించి, అత్యాచారం చేసి, హత్య చేశాడు. తరువాత ఆమె మృతదేహాన్ని సంచిలో చుట్టేసి ఒక కాలువలో పడేశాడు.

ఫొటో సోర్స్, Courtesy of The Courier-Mail
'ఆ దారుణాలన్నీ గుర్తున్నాయి'
క్వీన్స్‌లాండ్‌లోని గ్రామీణ ప్రాంతంలో స్టాసే-ఆన్‌ను అతడు చంపినప్పుడు మూడీ వయసు 18. ఆ తరువాత జరిగిన సంఘటనలన్నీ ఆమెకు గుర్తున్నాయి.
"ఆ తర్వాత ఆయన (మారుతండ్రి) స్టానే-ఆన్ తప్పిపోయిందని కథలు చెబుతూ ఆందోళపడుతున్నట్లుగా, ఆమె కోసం వెతికేందుకు వెళ్తున్నట్లుగా నటించాడు. తర్వాత పోలీసులు వచ్చి మా ఇంటి తలుపు కొట్టారు. మా ఇంట్లో సోదాలు నిర్వహించేందుకు చాలామంది పోలీసులు వచ్చారు" అని మూడీ వివరించారు.
ఆ కేసులో తన మారుతండ్రికి వ్యతిరేకంగా కోర్టులో ఆమె సాక్ష్యం చెప్పారు. మూడీ తల్లి లియోనీ మాత్రం అతడిని ఆ కేసులో కాపాడుతూ వచ్చారు.
మూడీకి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె తల్లికి బారీ హాడ్లోతో వివాహమైంది.
"మా అమ్మ ఆయనను కోర్టులో రక్షించేందుకు ప్రయత్నించారు. మా అమ్మ తీరును చూస్తుంటే నాకు అసహ్యం వేసింది" అని మూడీ గుర్తు చేసుకున్నారు.
మూడీ తన మారుతండ్రి చేతిలో అసువులుబాసిన బాలిక స్టాసే-ఆన్ అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు.
"నా మారు తండ్రి అంతటి దారుణానికి ఒడిగట్టడం, తర్వాత మా అమ్మ అతన్ని కాపాడేందుకు ప్రయత్నించడం... ఆ భయంకర అనుభవాన్ని నేను ఇప్పటికీ మరచిపోలేదు" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, The Tracy family
మరొక అత్యంత దారుణ ఉదంతం కూడా ఉంది. ఆమె మారుతండ్రి హత్యలు చేయడం అదే మొదటిసారి కాదు.
27 ఏళ్ల క్రితం సాండ్రా బేకన్ అనే ఐదేళ్ల బాలికను అతడు అపహరించి, హత్య చేసినట్లు పోలీసులు మూడీకి చెప్పారు. ఆ మృతదేహాన్ని గోనె బస్తాలో చుట్టి కారు డిక్కీలో ఉంచాడని పోలీసులు తెలిపారు.
ఆ కేసులో అరెస్టు అయ్యి, జైలుకెళ్లిన అతడు తర్వాత పెరోల్ మీద బయటకు వచ్చాడు. పెరోల్ మీద బయట ఉన్నప్పుడే అతడు స్టాసే-ఆన్‌ను హత్య చేశాడు.
"అతడు అన్ని దారుణాలకు పాల్పడినా మా అమ్మ మాత్రం అతడిని కాపాడుతూ వచ్చింది. మా అమ్మ మాకు ద్రోహం చేసిందని అనిపించింది. నా చెల్లి వయసున్న ఒక అమ్మాయిని అపహరించి, హత్య చేసిన ఒక నరహంతకుడి ఇంటికి మా అమ్మ మమ్మల్ని తీసుకొని వచ్చింది" అని మూడీ అన్నారు.
ఇప్పుడు మూడీ వయసు 48 ఏళ్లు. 21 ఏళ్ళ నుంచి ఆమె తన తల్లిని చూడలేదు. హాడ్లో 2007లో జైలులోనే మరణించాడు.

ఫొటో సోర్స్, The Bacon family
అప్పుడు అపరాధ భావం - ఇప్పుడు కోపం
"మా మారుతండ్రి అరెస్టు తర్వాత నా జీవితం పట్టాలు తప్పింది. చాలా ఇబ్బందులు పడ్డాం" అని మూడీ చెప్పారు. కానీ, తరువాత ఆమె పాఠశాల విద్యను పూర్తి చేసి జర్నలిస్ట్ కావడంతో కొత్త జీవితం లభించినట్లు అయ్యింది.
"నా వయోజన జీవితం అంతా అపరాధభావంతోనే బతికాను. మా మారుతండ్రి చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆ తొమ్మిదేళ్ల బాలిక స్టాసే-ఆన్‌ను నేను గుర్తుచేసుకోని రోజులేదు. ఆమెను నా మారుతండ్రి చంపాడన్న అపరాధభావం ఉండేది" అని ఆమె గుర్తుచేసుకున్నారు.
కొన్నేళ్ల క్రితం, ఆమెలోని అపరాధ భావం కోపంగా మారిపోయింది. ఖాళీ సమయంలో ఏదో ఒక పని చేయాలని ఆమె నిర్ణయించారు. 'ఆస్ట్రేలియన్ ఫెమిసైడ్ అండ్ చైల్డ్ డెత్ మ్యాప్' పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు.
గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి, ఆస్ట్రేలియాలో మహిళలు, పిల్లల హత్యలను ఆమె డాక్యుమెంట్ చేస్తున్నారు. 1800 సంవత్సరం నాటి నుంచి నేటి వరకు జరిగిన దారుణ హత్యల వివరాలను సేకరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Sherele Moody
క్రూరమైన హత్యల వివరాలు తెలుసుకునేందుకు చాలామంది భయపడుతుంటారు. కానీ, జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం వల్ల మూడీకి ఆ భయం లేదు.
"ప్రతి దేశంలోనూ తమ సైనికుల మరణాలను స్మరించుకుంటారు. కానీ, హింస వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని మాత్రం గుర్తుచేసుకోరు. హింస ఎంత స్థాయి దాకా వెళ్లింది? దాని ప్రభావం సమాజం మీద ఎలా ఉంది? పురుషులు, స్త్రీలలో ఎవరు ఎక్కువ హింసకు బలవుతున్నారు? లాంటి విషయాలను డాక్యుమెంట్ చేయాలనుకున్నాను. వాస్తవం ఏమిటంటే, పురుషులు, మహిళలు, చిన్నారులు ఎవరైనా ఎక్కువ శాతం పురుషుల చేతిలోనే హత్యకు గురయ్యే అవకాశం ఉంది" అని ఆమె చెప్పారు.
"దారుణ హత్యలకు గురైన వారి కథనాలతో సమాజంలో, ముఖ్యంగా పురుషుల వైఖరిలో మార్పు తెచ్చేందుకు వీలుంది. మహిళల పట్ల పురుషుల వైఖరిలో మార్పులు తీసుకురావడం ద్వారా ఈ హింసకు అడ్డుకట్ట వేయవచ్చు" అని మూడీ అంటున్నారు.
ఆస్ట్రేలియాలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ గణాంకాల ప్రకారం, ఆస్ట్రేలియాలో సగటున వారానికి ఒక మహిళ తన ప్రస్తుత లేదా మాజీ భాగస్వామి చేతిలో హత్యకు గురవుతున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మహిళల హత్యల్లో 35 శాతం తమ భాగస్వాములు చేసినవేనని అంచనా.
ఈ ఇంటరాక్టివ్ మ్యాప్‌లోని ఒక్కో హృదయం గుర్తు ఒక్కో హింసాత్మక మరణం కథను తెలుపుతుంది. వాటిని క్లిక్ చేస్తే, ఆయా ఉదంతాలకు సంబంధించిన వార్తా కథనాలు, పోస్టుమార్టం నివేదికలు, కోర్టుల తీర్పుల ఆధారంగా మూడీ పరిశోధించిన పూర్తి విషయాలు తెలుస్తాయి.
బాధితులు ఎవరు? వారిది ఏ ప్రాంతం, ఎక్కడ, ఎప్పుడు హత్యకు గురయ్యారు? ఎవరు వారిని చంపారు? కోర్టు ఏమని తీర్పు చెప్పింది? హంతకుడి పరిస్థితి ఏమైంది? లాంటి వివరాలన్నీ అందులో ఉంటాయి.
తన మారు తండ్రి చేతిలో దారుణ హత్యకు గురైన స్టాసే-ఆన్ ట్రేసీ ఉదంతాన్నే మూడీ మొట్టమొదట ఈ మ్యాప్‌లో పెట్టారు. అప్పటి నుంచి ఆమె 1880 ఏడాది నుంచి జరిగిన దారుణ హత్యలను ఇందులో నమోదు చేశారు.
చాలా మంది నేరస్థులు సులువుగా బయటపడుతున్నారని మూడీ అంటున్నారు.
"చాలామంది దోషులకు కఠిన శిక్షలు పడటంలేదు. ఒక వ్యక్తి చేతిలో 40 కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయిన ఒక మహిళ వివరాలను కూడా నేను ఈ మ్యాప్‌లో నమోదు చేశాను. ఆ కేసులో హంతకుడు ఆరు నెలల్లోనే జైలు నుంచి బయటకు వచ్చేశాడు. ఇప్పుడు బయటే తిరుగుతున్నాడు" అని ఆమె వివరించారు.

ఫొటో సోర్స్, Sherele Moody
బెదిరింపులు
పాత కేసుల వివరాలను తవ్వితీస్తూ ప్రపంచానికి తెలియజేస్తున్న మూడీకి తరచూ బెరిరింపులు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ట్రోలింగ్ మాత్రమే కాదు, ఈ సెప్టెంబర్‌లో ఆమె పెంచుకుంటున్న గుర్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. దాని మెడను విరిచేశారు. దానికంటే ముందు, ఆమె పెంపుడు కుక్కకు విషం పెట్టి చంపేశారు.
ఈ రెండు ఘటనలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు సమీపంలోని పురుషులే ఆ పని చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
"నేను ఈ మ్యాప్‌ను తొలగించాలని వాళ్లు అంటున్నారు. అందుకే నన్ను బెదిరించేందుకు అలా చేస్తున్నారు" అని మూడీ చెప్పారు.
గూగుల్ మ్యాప్స్‌లో వినూత్నమైన పనిచేస్తున్న ఆమెకు లభించిన గుర్తింపు ఏమిటంటే... ఈ ఏడాది జూన్‌లో ఆస్ట్రేలియాలో పాత్రికేయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారానికి ఆమె ఎంపికయ్యారు.
అంత గొప్ప పురస్కారానికి ఎంపిక కావడం తనకెంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు.
(భద్రతా కారణాల దృష్ట్యా ఈ కథనంలో పేర్కొన్న కొన్ని పేర్లను మార్చాం)
ఇవి కూడా చదవండి:
- గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇలా డిలీట్ చెయ్యండి!
- అమెరికాలో నెహ్రూ, ఇందిరా గాంధీలను చూసేందుకు అంతమంది వచ్చారా? ఈ ఫొటో వెనుకున్న వాస్తవం ఏంటి?
- #నో బ్రా ఉద్యమం: బ్రా వేసుకోకుండా సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్న దక్షిణ కొరియా మహిళలు
- అబద్ధాలు చెప్పే వారిని ఎలా గుర్తించాలి?
- ఎడమ చేతి అలవాటుకు కారణమేంటి?
- పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కినందుకు దళితుల సామాజిక బహిష్కరణ
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- కార్గిల్ యుద్ధం: జనరల్ ముషారఫ్ ఫోన్ ట్యాప్ చేసి పాక్ ఆర్మీ గుట్టు రట్టు చేసిన 'రా'
- అక్కడ గ్రహాంతర జీవులున్నాయా? అందుకే ఎవరూ రావద్దని అమెరికా హెచ్చరించిందా...
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








