క్రిస్టమస్: ఆన్‌లైన్ మార్కెట్లలో అమ్మే అలంకరణ లైట్లు ప్రమాదకరం

ఫొటో సోర్స్, Getty Images
'ఆన్‌లైన్ మార్కెట్ల నుంచి క్రిస్టమస్ ట్రీ లైట్లు కొనుగోలు చేసేటపుడు జాగ్రత్తగా ఉండండి.. ఎందుకంటే మీరు కొనే వాటివల్ల అగ్నిప్రమాదాలు జరగొచ్చు' అని చెప్తోంది వినియోగదారుల బృందం 'విచ్?'.
ఆన్‌లైన్ మార్కెట్ విక్రేతల నుంచి 'విచ్?' 13 సెట్ల లైట్లు కొనుగోలు చేయగా.. వాటిలో ఆరు సెట్లు భద్రత పరీక్షలో విఫలమయ్యాయి.
రెండు సెట్లయితే పరీక్షించే సమయంలో విపరీతంగా వేడెక్కి కరిగిపోవటం కూడా మొదలైందని.. మిగతా వాటి వల్ల విద్యుత్ షాక్‌ల ప్రమాదం ఉండొచ్చునని 'విచ్?' వివరించింది.
వినియోగదారులు ఈ లైట్లను గుర్తింపు ఉన్న రిటైలర్ల నుంచి కొనుగోలు చేయాలని ఆ బృందం సూచిస్తోంది.
హై స్ట్రీట్ దుకాణాల నుంచి కూడా రెండు సెట్ల లైట్లు కొనుగోలు చేసింది. అవి భద్రతా పరీక్షల్లో సఫలమయ్యాయి.
''ఆన్‌లైన్ మార్కెట్లలో చౌకగా, అందంగా ఉన్నట్లుగా కనిపిస్తున్న పలు క్రిస్టమస్ లైట్లను మేం పరీక్షించాం. వాటిలో చాలా వరకూ సురక్షితమైనవి కావని మేం గుర్తించాం. కొన్నిటి వల్ల క్రిస్టమస్ ట్రీ కూడా కాలిపోవచ్చు'' అని 'విచ్?' సంస్థలో గృహోపకరణాలు, సేవల విభాగం అధిపతి నటాలీ హిచిన్స్ చెప్పారు.
సురక్షితం కాని ఉత్పత్తులను తమ వెబ్‌సైట్లలో విక్రయించకుండా నిరోధించటానికి.. భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆన్‌లైన్ మార్కెట్ల మీద చట్టపరమైన బాధ్యత మోపాలని కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది 'విచ్?'.
విద్యుత్ ఉపకరణాలను ఎక్కడ కొనుగోలు చేస్తారనే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నేషనల్ ట్రేడింగ్ స్టాండర్డ్స్ కూడా వినియోగదారులకు సూచించింది.
''సురక్షితం కానివి, అగ్నిప్రమాదం లేదా విద్యుత్ షాక్‌కు దారితీయగల వస్తువులను కొనటం కన్నా.. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి.. పేరున్న వ్యాపారి నుంచి కొనుక్కోవటం ఉత్తమం'' అని ఆ సంస్థ పేర్కొంది.
ప్రస్తుతం బ్రిటన్‌లో ఒక వినియోగదారుడికి సరఫరా చేయటం కోసం ఒక వస్తువును దిగుమతి చేసుకునే వారి మీద.. ఆ వస్తువు భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉంది. అందులో విఫలమైతే కోర్టు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని నేషనల్ ట్రేడింగ్ స్టాండర్డ్స్ చెప్పింది.

ఫొటో సోర్స్, WHICH?
కాలిపోయి, కరిగిపోయి...
ఆన్‌లైన్ విక్రేతల నుంచి 'విచ్?' 13 సెట్ల లైట్లు కొనుగోలు చేసింది. అందులో 12 సెట్లు లోపభూయిష్టంగా ఉన్నాయనో, బ్రిటన్ ప్రమాణాలకు అనుగుణంగా లేవనో తేలింది.
'విచ్?' పరీక్షలో విఫలమైన ఉత్పత్తుల్లో రెండిటిని 'ఈబే' వెబ్‌సైట్‌లో విక్రయించారు. మరో రెండు ఉత్పత్తులను 'విష్' అనే వెబ్‌సైట్‌లో, ఇంకో రెండు ఉత్పత్తులను చైనాకు చెందిన అలీబాబా గ్రూపు నిర్వహించే 'అలీఎక్స్‌ప్రెస్' వెబ్‌సైట్‌లో విక్రయించారు.
''అలీఎక్స్‌ప్రెస్, ఈబే వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేసిన లైట్లకు షార్ట్ సర్క్యూట్ పరీక్ష చేస్తుండగా.. రెండు ఉదంతాల్లో వాటి కంట్రోల్ బాక్సుల నుంచి పొగ రావటం, కరిగిపోవటం ప్రారంభమైంది'' అని 'విచ్?' వివరించింది.
ఈ రెండు సెట్ల ఖరీదు 5 పౌండ్ల (సుమారు రూ. 475) కన్నా తక్కువే ఉందని చెప్పింది.
''పరీక్ష పూర్తయ్యేటప్పటికి లోపలి భాగాలు కాలిపోయాయి. ప్రింటెండ్ సర్క్యూట్ బోర్డు కరిగిపోయి ప్లాస్టిక్ ముద్దగా మారింది'' అని తెలిపింది.
''కొన్ని ఉత్పత్తుల వల్ల విద్యుత్ షాక్ ప్రమాదం కూడా కనిపించింది. విద్యుత్ సామర్థ్యం పరీక్షలో.. 'విష్' నుంచి కొనుగోలు చేసిన ఒక లైట్ల సైట్‌లోని కంట్రోల్ బాక్స్‌లో ఇన్సులేషన్ విరిగిపోయింది. దీంతో ఆ యూనిట్ మొత్తం విద్యుత్ సరఫరా అవుతోంది. అంటే.. దానిని తాకితే విద్యుత్ షాక్ వస్తుంది'' అని వివరించింది.
కొన్ని లైట్లను కేవలం ప్లాస్టిక్ కాగితాల్లో చుట్టి ప్యాకేజీ చేశారని.. వాటికి సంబంధించిన బ్రాండింగ్ కానీ, సూచనలు కానీ ఏవీ లేవని 'విచ్?' పేర్కొంది.
విధానాల ఉల్లంఘన...
అమెజాన్ ఆన్‌లైన్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన ఐదు ఉత్పత్తులతో పాటు.. జాన్ లూయీస్, ఆర్గోస్ మార్కెట్లలో కొనుగోలు చేసిన ఉత్పత్తులు కూడా విద్యుత్ భద్రత పరీక్షల్లో పాసయ్యాయని 'విచ్?' చెప్పింది.
అయితే.. అమెజాన్ ఆన్‌లైన్ మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన లైట్ల సెట్లలో కేవలం ఒక్కటి మాత్రమే.. ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో పాటు అన్ని పరీక్షల్లో గట్టెక్కింది.
సురక్షితం కాని ఉత్పత్తులను తమ వెబ్‌సైట్‌లో విక్రయానికి ఉంచటానికి తాము అనుమతించబోమని 'ఈబే' పేర్కొంది. ''ఆ ఉత్పత్తులను తొలగించాం. వాటిని కొనుగోలు చేసిన వారిని అప్రమత్తం చేయాలని, వాటిని తిరిగి ఇచ్చివేయటానికి తాము అనుసరించే విధానం గురించి తెలియజేయాలని వాటి విక్రేతలకు సూచించాం'' అని తెలిపింది.
ప్రమాణాలకు అనుగుణంగా లేని ఉత్పత్తులను తొలగించామని.. భద్రతా ప్రమాణాలను నిర్ధారించాల్సిందిగా విక్రేతలకు నిర్దేశించామని 'అలీఎక్స్‌ప్రెస్' చెప్పింది. ''మా విధానాలను ఉల్లంఘించే ఉత్పత్తుల జాబితాలను గుర్తించటానికి విధివిధానాలు ఉన్నాయి. మేం నిరంతరం పర్యవేక్షిస్తుంటాం. మా వినియోగ నిబంధనలను ఉల్లంఘించినపుడు విక్రేతల మీద చర్యలు తీసుకుంటుంటాం'' అని పేర్కొంది.
అమెజాన్ స్పందిస్తూ.. ''విక్రేతలు అందరూ మా విక్రయ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. అలా పాటించని వారి మీద చర్యలు చేపడతాం. వారి ఖాతాలు కూడా తొలగించే అవకాశం ఉంది. ఆ ప్రశ్నార్థక ఉత్పత్తులు ఇప్పుడు అందుబాటులో లేవు'' అని చెప్పింది.
'విచ్?' గుర్తించిన అంశాలపై 'విష్' ఇంకా స్పందించాల్సి ఉంది.
ఓడరేవులు, విమానాశ్రయాలు, పోస్టల్ కూడళ్ల దగ్గర తాము 2015 నుంచి నిర్వహించిన తనిఖీల్లో.. బ్రిటన్ భద్రతా నిబంధనలకు అనుగుణంగా లేని ఉత్పత్తులను 60 లక్షలకు పైగా గుర్తించామని.. అందులో విద్యుత్ ఉపకరణాలు, సౌందర్య సాధనాలు, ఆటబొమ్మలు కూడా ఉన్నాయని నేషనల్ ట్రేడింగ్ స్టాండర్డ్స్ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- భూమి మీద అత్యంత లోతైన ప్రదేశం... ఈ లోయ లోతు 11,500 అడుగులు
- అభిప్రాయం: భారతదేశం ఆర్థిక మాంద్యానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉందా?
- మోదీ నీడ నుంచి బయటపడి అమిత్ షా తనదైన ఇమేజ్ సృష్టించుకున్నారా?
- 'గోల్డెన్ పాస్‌పోర్టుల' కోసం సంపన్నులంతా ఎందుకు ఎగబడుతున్నారు?
- రజినీకాంత్ జీవితంలో అరుదైన కోణాలు
- వెంకీమామ సినిమా రివ్యూ: వెంకటేశ్, నాగచైతన్య కలిసి హిట్టు కొట్టారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








