పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు: మంగుళూరులో ఇద్దరు, లక్నోలో ఒకరు మృతి

ఫొటో సోర్స్, Getty Images
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇద్దరు పౌరులు మరణించారు. అదేవిధంగా.. లక్నోలో జరిగిన ఆందోళనల్లో ఒకరు మృతి చెందారు.
అంతకుముందు, మంగళూరులో జరిగిన ఘర్షణల్లో 20 మంది పోలీసులు గాయపడ్డారని, ఇద్దరు పౌరులకు తీవ్రగాయాలు కాగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారని సిటీ పోలీస్ కమిషనర్ పీఎస్ హర్ష తెలిపారు.
మంగళూరు డివిజన్ డిపో-2 పైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో ఓ ప్రయాణికుడు గాయపడ్డాడు. ఓ వాహనం కూడా ధ్వంసమైంది.
హైదరాబాద్‌లో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో ఉదయం చార్మినార్ నుంచి నాంపల్లి వరకూ తలపెట్టిన ర్యాలీలో పాల్గొనడానికి బయల్దేరిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి బస్సును దారి మళ్లించి నగర శివార్లలోని మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ వారిని అక్కడే ఉంచారు. తరువాత వారిని తిరిగి యూనివర్సిటీ వైపు తీసుకువెళ్లి వదిలి పెట్టారు.

బస్సు దిగి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. బస్సులో విద్యార్థులతో పాటు పోలీసులూ ప్రయాణించారు. దారి పొడవునా, పోలీస్ స్టేషన్‌కి చేరిన తరువాత, విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి, పౌరసత్వ చట్టానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అయితే పోలీసులు విద్యార్థులను విడిచిపెట్టే సమయంలో ఒక గుర్తు తెలియన వ్యక్తి సోషల్ మీడియాలో తెలంగాణ పోలీసులను కించపరుస్తూ ఒక పోస్ట్ పెట్టారు. దాంతో విద్యార్థులందర్నీ ఆపి, ఆ పోస్టు పెట్టిన వారి గురించి విచారించడం మొదలుపెట్టారు. దీనికి విద్యార్థులు అభ్యంతరం చెప్పారు.

అక్కడకు చేరుకున్న కొందరు ప్రజా సంఘాల వారు కూడా విద్యార్థులను వెంటనే వదలాలని ఆందోళన చేయడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. కాసేపాగిన తరువాత విద్యార్థులను వదలిపెట్టారు.

"మేం శాంతియుతంగా నిరసన చేయాలనుకుంటే వారు మమ్మల్ని ఇలా నిర్బంధించారు. అసలు ఈ చట్టమే రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ముస్లింలను ఈ సమాజం నుంచి గెంటేయాలని చూస్తున్నారు" అని ఆరోపించారు హెచ్‌సీయూ విద్యార్థి సంఘ ప్రధాన కార్యదర్శి గోపిస్వామి.

"అమిత్ షా, నరేంద్ర మోదీలు గుజరాత్‌లో ఏం చేశారో, ఇక్కడా అదే చేయాలనుకుంటున్నారు. మేం దీనికి వ్యతిరేకంగా పోరాడతాం" అని హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు అభిషేక్ నందన్ అన్నారు.
గుజరాత్‌లో ఆందోళనలు
గుజరాత్‌లో అహ్మదాబాద్‌లో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ పరిస్థితి కొద్దిగా హింసాత్మకంగా మారింది.
దిల్లీలో మొబైల్ సేవలపై ఆంక్షలు
దిల్లీ నగరంలో కొన్ని ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
దీనిపై పలువురు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మరికొందరు తమతమ సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించారు.
ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం దిల్లీలో కొన్ని ప్రాంతాల్లో వాయిస్, ఎస్ఎంఎస్, డేటా సేవల్ని నిలిపివేసినట్లు ఎయిర్‌టెల్ కొందరు యూజర్ల ట్వీట్లకు సమాధానం ఇచ్చింది. అయితే, వెనువెంటనే ఆ ట్వీట్లను ఎయిర్‌టెల్ తొలగించింది.

ప్రభుత్వం సస్పెన్షన్ ఆదేశాలను ఎత్తేసిన వెంటనే తమ సేవలు పూర్తిస్థాయిలో కొనసాగుతాయని వివరించింది.
ఈ అంతరాయానికి క్షమించాలని కూడా ఎయిర్‌టెల్ పేర్కొంది.

వోడాఫోన్ సైతం ఇదే తరహాలో ట్వీట్ చేసింది. ప్రభుత్వం నుంచి అందిన మార్గదర్శకాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో డేటా సేవలు ఆపేశామని, దీనివల్ల డేటా సేవలు ఉపయోగించుకోలేరని నసీర్ బిన్ మైరాజ్ అనే యూజర్‌కు సమాధానంగా ట్వీట్ చేసింది.
దిల్లీలో మెట్రో స్టేషన్లు బంద్..
సెంట్రల్ దిల్లీలోని పలు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసేసినట్లు దిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ ప్రకటించింది.
దిల్లీలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో 17 మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఎర్రకోట, బారాఖంబా, మండీ హౌస్ వంటి కీలకమైన స్టేషన్లను పూర్తిగా మూసేసినట్లు దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ట్విట్టర్‌లో వివరణ ఇచ్చింది.
ఈ రోజు ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 1 గంటవరకు కాల్స్, ఇంటర్నెట్, మెసేజులు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఆపేయాలని దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ విభాగం అన్ని మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లకు బుధవారం ఆదేశాలు జారీ చేసిందని ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.
జేఎన్‌యూ విద్యార్థి ఉమర్ ఖాలిద్‌ను ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పదమైన పౌరసత్వ చట్ట సవరణపై నిరసన తెలుపుతున్న సమయంలో ఖాలీద్‌ను పోలీసులు తీసుకెళ్లారు.

ఫొటో సోర్స్, BBC/Naven Kumar K
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఏమైనా నిరసన కార్యక్రమాలు జరుగుతాయేమోనన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ చార్మినార్, పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మొహరించారు.

ఫొటో సోర్స్, UGC
హైదరాబాద్ విశ్వవిద్యాలయం వద్ద నిరసన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో వామపక్ష పార్టీలు, ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిపారు. వైజాగ్‌లో చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్న నిరసనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూరులో రామచంద్ర గుహ అరెస్ట్
బెంగళూరు నగరం మొత్తానికీ సెక్షన్ 144 విధిస్తున్నామని, మూడు రోజుల పాటు ఈ నిర్బంధం కొనసాగుతుందని పోలీసులు ప్రకటించారు.
గురువారం ఉదయం 6 గంటల నుంచి మూడు రోజుల పాటు.. అంటే శనివారం అర్థరాత్రి వరకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావు బుధవారం రాత్రి విలేకరులతో చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం, శుక్రవారం నిరసన ప్రదర్శనలు జరుగుతాయన్న కారణంగా నగర వ్యాప్తంగా సెక్షన్ 144 విధించినట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం టౌన్ హాల్ వద్ద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వచ్చిన చరిత్రకారుడు రామచంద్ర గుహ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా బీబీసీతో రామచంద్ర గుహ మాట్లాడుతూ "నేను ఒక రిపోర్టర్‌తో ప్రస్తుత పరిస్థితుల్లో గాంధీవాదం ఎంత అవసరమో వివరిస్తుండగా నన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు" అని అన్నారు. "నన్ను ఎక్కడికో తీసుకుని వెళ్తున్నారు"అని ఆయన బీబీసీకి మెసేజ్ ద్వారా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- పౌరసత్వ సవరణ చట్టం: బీజేపీ తొందరపడిందా.. ఈ స్థాయి వ్యతిరేకతను ఊహించలేదా
- పౌరసత్వ సవరణ చట్టాన్ని తిరస్కరించే అధికారం రాష్ట్రాలకు ఉందా?
- పౌరసత్వ సవరణ బిల్లు: హైదరాబాద్‌లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు
- దిల్లీ జామియా యూనివర్సిటీ ఆందోళనల్లో పోలీసులే బస్సుకు నిప్పంటించారా...
- సనా గంగూలీ ‘The End of India’పై చర్చ.. ‘ఆ పోస్ట్ వాస్తవం కాదు’ - సౌరవ్ గంగూలీ
- అమెరికా అధ్యక్ష పదవి నుంచి డోనల్డ్ ట్రంప్‌కు అభిశంసన.. ప్రతినిధుల సభ ఆమోదం
- ఓ పదేళ్ల వయసు చిన్నారి నరహంతకుడు కాగలడా?
- దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులు ఎందుకున్నాయి?
- తొలిసారి నల్లజాతీయులకే టాప్ 5 అందాల కిరీటాలు
- "అమ్మను చూడగానే కన్నీళ్లొచ్చాయి"- పన్నెండేళ్ళ తర్వాత కన్నతల్లిని కలుసుకున్న భవానీ
- ఉల్లి మన ఆహారంలో ఎలా భాగమైంది? దాని చరిత్ర ఏంటి...
- ఉరి తాడు ఒక్క బక్సర్ జైల్లోనే ఎందుకు తయారవుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









