డిజిటల్ విప్లవం: పదేళ్లలో ప్రజల జీవితాలు ఎలా మారిపోయాయంటే..

ఫొటో సోర్స్, iStock
- రచయిత, శ్రీకాంత్ బక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
చప్పట్ల నుంచి చాటింగ్ వరకూ వేల ఏళ్లుగా అభివృద్ధి చెందిన మానవ కమ్యూనికేషన్ విధానాల్ని, గడిచిన దశాబ్ది మేలి మలుపు తిప్పింది. ఈ పదేళ్లూ ఓ కొత్త విప్లవానికి సైన్స్ పునాదులేయడమే కాదు... భావితరాలకు ఓ గొప్ప వేదికను కూడా సృష్టించింది.
ఆ రకంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు నాలుగో తరం విప్లవానికి ఈ పదేళ్లూ వేదికయ్యాయి. 1712లో జేమ్స్ వాట్సన్ వాట్ స్టీమ్ ఇంజిన్ కనుగొన్నాక యాంత్రిక విప్లవం మొదలై సుమారు రెండు వందల ఏళ్లకు పైగానే కొనసాగింది.


ఆపై ఎలక్ట్రసిటీ ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవం వచ్చింది. అది మరో వందేళ్లు ప్రపంచాన్ని నడిపించింది. ఆపై కంప్యూటర్ల ఆవిష్కరణ, ఇంటర్నెట్ తో కంప్యూటర్ విప్లవం వచ్చింది. 50 ఏళ్లుగా ఇది వర్థిల్లుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
కానీ ఈ పదేళ్లలో మరో విప్లవం ప్రపంచ గతిని మార్చింది. అదే డిజిటల్ విప్లవం. అత్యంత తక్కువ కాలంలో, ఎక్కువ మందిని ప్రభావితం చేసి, శరవేగంగా ప్రతి ఒక్కరికీ చేరువైన ఈ డిజిటల్ విప్లవానికి ఈ దశాబ్దే ఆలవాలంగా నిలిచింది.
ఇంటర్నెట్ ఆవిష్కారమై దశాబ్దాలు గడిచినా... అది సామాన్యుడి అరచేతిలో ప్రపంచాన్ని ఇమిడ్చింది మాత్రం ఈ దశాబ్దే. ఈ పదేళ్లో వచ్చిన టెక్నాలజీ మార్పులు, మరే దశాబ్దిలోనూ మానవుని జీవన విధానాన్ని ఇంతలా మార్చలేదు. ఇంతగా టెక్నాలజీని మనుషుల జీవన విధానంలో ఒక భాగంగా చెయ్యలేదు. అలాంటి విప్లవాత్మక మార్పులన్నీ ఈ ఒక్క దశాబ్దిలోనే చోటు చేసుకున్నాయి. ప్రతి ఒక్కరి జీవితాల్ని డిజిటల్ మయంగా మార్చేశాయి. భవిష్యత్ కు బాటలు వేయడమే కాదు.. మానవ ప్రగతి ఆ భవిష్యత్తులోకి అడుగులు వేసేలా చేశాయి.
మార్పు అనేది హఠాత్తుగా వచ్చేది కాదు. కాల క్రమంలో ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే.. మనలో, సమాజంలో వచ్చిన మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అది మన వర్తమానాన్నే కాదు.. భవిష్యత్తును కూడా ప్రభావితం చేసేంతగా మార్పు తెస్తుంది. అలాంటి ఎన్నో మార్పులకు ఈ పదేళ్లు సాక్ష్యంగా నిలిచాయి.

ఫొటో సోర్స్, Getty Images
స్మార్ట్ ఫోన్ల విప్లవం
పాతికేళ్ల కిందట ప్రపంచాన్ని శాసించిన మొబైల్ ఫోన్ రూపు రేఖలు ఈ పదేళ్లలో పూర్తిగా మారిపోయాయి. ఫీచర్ ఫోన్ల నుంచి టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ల శైలిలోకి అడుగు పెట్టిన ఈ దశాబ్దిలో స్మార్ట్ ఫోన్లు మన జీవితంలో భాగమైపోయాయి.
పదేళ్ల కిందట పాతిక వేల రూపాయలకు పైగానే రేట్లున్న స్మార్ట్ ఫోన్లు... ఇప్పుడు నాలుగైదు వేలకూ వచ్చేస్తున్నాయి. అత్యధిక ర్యామ్, అల్ట్రా స్పీడ్ ప్రాసెసర్లు, జీబీల కొద్దీ ఇంటర్నల్ స్టోరేజ్, వందకు పైగా మెగాపిక్సెళ్ల కెమరాలు, ఒకేఫోన్లో నాలుగైదు కెమెరాలతో తన సామర్థ్యాన్నే కాదు.. మడత పెట్టే టచ్ స్క్రీన్ ఫోన్లు సాకారమైపోయాయి.
మొబైల్ వాడే విధానంలో కూడా ఈ పదేళ్లలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నో కొత్త గ్యాడ్జెట్లు అడుగు పెట్టాయి. వైర్‌లెస్ బ్లూటూత్‌హెడ్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్లు, పవర్ బ్యాంక్‌ల వంటివి రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఇక వైర్‌లెస్ ఛార్జింగ్, సెల్ఫీ కెమెరాలు, సెల్ఫీ స్టిక్‌లు కూడా రంగ ప్రవేశం చేసింది ఈ దశాబ్దిలోనే. మొబైళ్లలో ఫింగర్ ప్రింట్ స్కానర్లు, ఫేషియల్ రికగ్నిషన్, ఐరిస్ కెమెరా లాక్‌లు ఈ దశాబ్దిలోనే ఆవిష్కృతమయ్యాయి.
పర్సనల్ కంప్యూటర్ల తీరు మార్చేసిన ట్యాబ్లెట్ ఫోన్లకు కూడా... ఈ దశాబ్దే శ్రీకారం చుట్టింది. యాపిల్ ఐప్యాడ్‌లు, శాంసంగ్ ట్యాబ్‌లే దీనికి ఉదాహరణ.

ఫొటో సోర్స్, Getty Images
ఆపరేటింగ్ సిస్టమ్స్
2010కి ముందు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్, మాకింతోష్, లైనక్స్‌లు మాత్రమే. 2008లో అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ అయినా.. అది పెద్దగా పాపులర్ కాలేదు. 2010లో స్మార్ట్ ఫోన్ల వినియోగంతో మొబైళ్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడకం విస్తృతమైంది. ఇప్పుడు ఆండ్రాయిండ్ పదో వెర్షన్ రిలీజ్ కాబోతోంది. దీనికి సమాంతరంగా యాపిల్ కూడా ఐఓఎస్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసి తన ఫోన్లలో వినియోగిస్తోంది.
3జీ నుంచి 5జీ వరకూ
మొబైల్ ఫోన్ల రంగంలో ఈ దశాబ్ది మానవ ప్రగతిపై తిరుగులేని ముద్ర వేసింది. దశాబ్ది తొలినాళ్లలో అడుగుపెట్టి అబ్బురపరిచిన త్రీజీ... ఇప్పుడు 5జీగా స్థాయి పెంచుకుని మన జీవితాల్ని మరింత డిజిటలైజ్ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
సగటున డేటా వినియోగం కూడా పెరిగింది. 2010లో భారత్‌లో సగటున మొబైల్‌లో వాడే డేటా వినినియోగం ఇప్పుడు విపరీతంగా పెరిగింది.
2010 తొలినాళ్లలో కేవలం టాక్ టైం, వ్యాలిటీడీ ప్లాన్లు మాత్రమే అందించే సెల్యూలార్ ఆపరేటర్లు, ఇప్పుడు అన్ లిమిటెడ్ ఔట్ గోయింగ్ ఫ్రీ ఇచ్చేంతలా డేటా వినియోగం పెరిగిపోయింది.
ముఖ్యంగా 4జీ రాక, జియో రాకతో మొబైల్ ఇంటర్నెట్ వాడకం చాలా పెరిగింది. ఇక 5జీ ఆవిర్భావానికి కూడా ఆలవాలంగా నిలిచిన దశాబ్ది ఇదే.
ఈ పెరిగిన స్పీడ్‌తో ప్రపంచంలో కనెక్టవిటీ పెరిగింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పెరిగాయి. రోబోటిక్స్ ద్వారా ఆపరేషన్లు కూడా చేయడం సాధ్యమవుతోంది.
అసోచాం వెల్లడించిన నివేదిక ప్రకారం... 2017లో భారత్‌లో 71 లక్షల మిలియన్ల మెగాబైట్ల డేటా వినియోగించారని, ఇది 2022 నాటికి దాదాపు 11 కోట్ల మిలియన్ల మెగాబైట్లకు చేరే అవకాశం ఉందని వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
2018లో భారత్‌లో మొబైల్ డేటా యూజర్లు సగటున నెలకు 9.8 జీబీల డేటా వినియోగించినట్లు... 2019 జూన్‌లో ఎరిక్సన్ వెల్లడించింది. ఈ రంగంలో వార్షికాభివృద్ధి రేటు. 72.6 శాతానికి పైగానే ఉంది. 5జీ సేవలు ప్రారంభమైతే ఇది మరింత వృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది.
‘‘2001లో దేశంలో ఇంటర్నెట్ యూజర్లు 70 లక్షల మందే ఉండేవారు. కానీ 2010లో వారి సంఖ్య 9 కోట్లకు చేరింది. కానీ 2016లోనే దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ వాడే వాళ్ల సంఖ్య 46 కోట్లకు పెరిగింది. 2019లో 63 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం క్రమంగా విస్తరిస్తోంది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ నిత్యావసరంగా మారిపోతుంది’’ అని టెక్ ఎక్స్‌పర్ట్ నల్లమోతు శ్రీధర్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, EPA
స్మార్ట్ వాచ్‌లు
ఈ పదేళ్లలో మన జీవన శైలే మారిపోయింది. ఆరోగ్య సమాచారం ఇచ్చే ఫిట్‌నెస్ వాచ్‌లతో పాటు.. స్మార్ట్ వాచ్‌లు కూడా మన జీవితంలో భాగమైపోయాయి. రోజువారీ ఆరోగ్యాన్ని మానిటర్ చెయ్యడమే కాదు.. వాటికి అనుసంధానిస్తూ వచ్చే ఫిట్‌నెస్ యాప్‌లు అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో పాటు, డాక్టర్లకు సమాచారం చేరవేస్తున్నాయి.
2015లో భారత మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ వాచ్‌లు పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ధర ఎక్కువగా ఉండటంతో వీటికి భవిష్యత్తు లేదనుకున్నారు. కానీ 2017 తర్వాత యాపిల్, శాంసంగ్‌తో పాటు చాలా సంస్థలు వాటిని బడ్జెట్ ఫ్రెండ్లీగా మార్కెట్లోకి తెచ్చాయి. స్మార్ట్ కనెక్టవిటీతో పాటు, హెల్త్ మానిటరింగ్ కూడా చేస్తుండటంతో వాటికి గిరాకీ పెరిగింది.
ఇటీవలి కాలంలో కొందరికి హార్ట్ ఎటాక్ రాబోతోందన్న ప్రమాదాన్ని ముందే స్మార్ట్ వాచ్‌లు హెచ్చరించడంతో వారికి తక్షణం చికిత్స అందించి, వారి ప్రాణాలు కాపాడిన సందర్భాలు చోటుచేసుకున్నాయి. భవిష్యత్తులో స్మార్ట్ వాచ్‌లతో పాటు, హెల్త్ మానిటర్ చేసే స్మార్ట్ గ్యాడ్జెట్లు, స్మార్ట్ బెల్ట్‌ల వంటివి మరింత వినియోగంలోకి రాబోతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
డిజిటల్ ఇల్లు
ఇంటర్నెట్ స్పీడ్ పెరగడంతో ఇంటర్నెట్ ఆధారిత వస్తువుల వాడకం బాగా పెరిగిపోయింది. అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి పర్సనల్ అసిస్టెంట్ల వాడకం మొదలైంది. వాయిస్ కమాండ్ల ద్వారా.. ఇంట్లో గృహోపకరణాలను వినియోగించుకోవడం మొదలైంది. వీటి సాయంతో ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇంట్లో ఉన్న వస్తువులను ఆపరేట్ చెయ్యగలుగుతున్నారు.
ప్రస్తుతానికి డిజిటల్ హోమ్స్ మనకు కొత్త కావచ్చు కానీ, అమెరికా వంటి చాలా దేశాల్లో ఇవి వినియోగంలో ఉన్నాయి. గృహోపకరణాలు ఇంటర్నెట్ ద్వారా ఒకదానితో ఒకటి అనుసంధానమై, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తాయి. అంటే మీరు హోం థియేటర్లలో సినిమా ప్లే చెయ్యమని కమాండ్ ఇవ్వగానే... సినిమాతో పాటు.. లైట్లు కూడా డిమ్ అయిపోయి, వాటికి అనుగుణంగా ఏసీ కూడా దానికదే సెట్ అయిపోతుంది. అదే డిన్నర్ చేయాలనుకున్నా, పడుకోవాలనుకున్నా, ఆ ప్రొఫైల్ సెలెక్ట్ చెయ్యగానే మీ అవసరాలకు అనుగుణంగా గృహోపకరణాలు పనిచేస్తాయి. సెన్సర్ బేస్డ్ గ్యాడ్జెట్ల వినియోగం మరింత పెరుగుతుంది.
ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలను బట్టి గ్యాడ్జెట్లు పనిచేస్తాయని, ఇవన్నీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా డిజిటల్ హోంలతో మనం చూడబోతున్నామని శ్రీధర్ చెప్పుకొస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్
ఈ దశాబ్దిలో అతి ముఖ్యంగా చెప్పుకోదగ్గ అభివృద్ధి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT). రాబోయే కాలంలో వీటి విస్తృతి మరింత పెరగబోతోంది.
ఇప్పటికే IOTల వాడకం కోసం ప్రత్యేకంగా సిమ్ కార్డులు కూడా జారీ చేస్తున్నారు. 14 డిజిట్స్ కలిగిన ఈ సిమ్ కార్డుల ద్వారా ఇంటర్నెట్ అనుసంధానిత డివైజ్‌లను కనెక్ట్ చేసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్ వస్తువులను ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ చేయడమే ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్. స్మార్ట్ టీవీలు, స్మార్ట్ ఏసీలు వంటివే దీనికి ఉదాహరణ.

ఫొటో సోర్స్, Getty Images
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు
ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. ఈ దశాబ్దిలో రోడ్లపైనా పరుగులు పెడుతున్నాయి.
టెస్లా వంటి సంస్థలు తయారు చేసిన ఈ కార్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఇంటర్నెట్‌తో అనుసంధానమై.. గూగుల్ మ్యాప్ ఆధారంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ కార్లు వ్యక్తుల్ని తమ గమ్యానికి చేరుస్తున్నాయి.
విదేశాల్లోని పరిస్థితులకు ఈ కార్లు తగినట్లుగా ఉన్నా.. భారత్ వంటి దేశాలకు ఇవి సరిపడవని అంటున్నారు శ్రీధర్.
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లతో ప్రయోజనాలతో పాటు డేటా సెక్యూరిటీ సమస్యలు కూడా చాలానే ఉన్నాయి. వాటన్నింటినీ అధిగమించాల్సి ఉంది.

ఫొటో సోర్స్, PA Media
దశాబ్దిని మార్చిన డ్రోన్లు
ఒకప్పుడు గాల్లో ఎగరడం అంటే... హెలికాప్టర్ వంటి వాటి సాయంతోనే. కానీ ఈ దశాబ్దిలో వచ్చిన డ్రోన్లు.. టెక్నాలజీలో గొప్ప ఆవిష్కరణగా మారాయి. డ్రోన్ కెమెరాలు మునుపెన్నడూ చూడని ఏరియల్ విజువల్స్ కళ్లముందుంచుతున్నాయి.
ఇప్పటికే డ్రోన్ల ద్వారా పిజ్జాలు, పార్సిళ్లు డెలివరీ వంటివి కొన్ని దేశాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇక ఉబర్ డ్రోన్ ట్యాక్సీలను కూడా ప్రవేశ పెట్టబోతున్నట్లు ప్రకటించింది.
డ్రోన్లతో పాటు ఈ దశాబ్దిలోనే జెట్‌ప్యాక్‌లు వాస్తవ రూపంలోకి వచ్చాయి. వ్యక్తుల్ని అత్యంత వేగంగా, గమ్యం చేర్చే జెట్ ప్యాక్‌లు సమీప భవిష్యత్తులో సామాన్యులకూ అందుబాటులోకి రాబోతున్నాయి.

ఫొటో సోర్స్, uber
పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలను ఎయిర్ ట్యాక్సీలు తప్పించబోతున్నాయి. త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఉబెర్ ప్రకటించింది. ఈ సేవల కోసం లాస్ ఏంజెల్స్, డల్లాస్, మెల్ బోర్న్ నగరాలను ఎంపిక చేసినా... ముందుగా ఆస్ట్రేలియాలో తమ సేవలను లాంఛ్ చేస్తామని ఉబెర్ ప్రకటించింది. 2020లో టెస్ట్ ఫ్లైట్ లాంఛ్ చేస్తామని, 2023నుంచి కమర్షియల్ సర్వీసులు నడిపిస్తామని ప్రకటించింది.
దేశంలో డ్రోన్ల వినియోగాన్ని ఊహించే భారత ప్రభుత్వం డ్రోన్ పాలసీని కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో ఇక్కడ కూడా డ్రోన్ ట్యాక్సీ సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, TENCENT
మొబైల్ గేమ్స్ ప్రపంచం
ఒకప్పుడు టీవీలు, కంప్యూటర్లలో ఆడుకునే వారు. ఆన్‌లైన్ గేమ్ ఆడాలన్నా హై కాన్ఫిగరేషన్ కంప్యూటర్లు ఉండాల్సిందే. కానీ ఈ దశాబ్దిలో మొబైల్ గేమింగ్ మేలి మలుపు తిరిగింది.
మొబైల్ టచ్ స్క్రీన్ల మీద యాంగ్రీ బర్డ్స్‌తో మొదలైన వీడియో గేమ్‌లు ఈ దశాబ్దంలో ఊహించని స్థాయికి ఎదిగిపోయాయి. హై ఎండ్ వీడియో గేమ్‌లను మొబైల్‌లో ఇమిడ్చిన వీడియో గేమ్‌లు ఈ దశాబ్దిలో విపరీతంగా పెరిగాయి.
పోకీ మ్యాన్ గో, పబ్ జీ వంటి గేమ్‌లతో హై ఎండ్ గ్రాఫికల్ వీడియో గేమ్స్... ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లతో రియల్ టైంలో ఆడుకోవడం సాధ్యమైంది. వర్చ్యువల్ రియాలిటీలో కూడా ఈ గేమ్‌లు లభ్యమవుతున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటికే వీడియో గేమ్‌లు శరవేగంగా విస్తరిస్తున్నాయి. గూగూల్ కూడా... గేమింగ్ కన్సోల్ అవసరం లేకుండానే హై ఎండ్ గేమ్స్ ఆడగలిగే విధంగా స్డాడియా అనే డివైజ్‌ను తయారు చేసింది. ఇది భవిష్యత్తులో వీడియో గేమ్స్ తీరునే మార్చేయబోతోందని... కాగ్నిజెంట్ సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ సాయి అశోక్ అభిప్రాయపడ్డారు.
‘‘మొబైల్ కంపెనీలు కూడా గేమింగ్ కంపెనీలతో టై అప్ అయ్యి.. మొబైల్స్ తయారు చేస్తున్నాయి. ఫోన్లలో ఏమాత్రం ల్యాగ్ లేకుండా... రియల్ టైం గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ రాబోతోంది. భవిష్యత్తులో కేవలం గేమింగ్ స్పెసిఫైడ్ మొబైళ్లు కూడా రాబోతున్నాయి’’ అని సాయి అశోక్ అన్నారు.

ఫొటో సోర్స్, BLIPPAR
మారిన గూగుల్ మ్యాప్స్ వినియోగం
ఈ దశాబ్దిలో ఆన్‌లైన్ మ్యాప్స్ వినియోగం మన జీవితాల్లో భాగమైపోయింది. మొబైల్లో మ్యాప్స్ వాడకం విపరీతంగా పెరిగింది. మ్యాప్స్ ఆధారంగా పనిచేసే ఓలా, ఉబెర్ వంటి యాప్‌లు దేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. ఇక ఈ మ్యాప్స్ ఆధారంగానే పనిచేసే చాలా యాప్స్ పుట్టుకొచ్చాయి. ఆన్‌లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే విధానం విపరీతంగా పెరిగింది. స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పండా, ఉబెర్ ఈట్స్ వంటివి నగరాలను దాటి టైర్ 2 సిటీలకూ విస్తరించాయి.
ఓలా, ఉబెర్ క్యాబ్‌లు, స్విగ్గీ వచ్చాక తన బిజినెస్ లైఫ్ మరింత సాఫీగా సాగుతోందన్నారు హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ కన్సల్టెంట్ ఎం. సతీశ్ కుమార్.
''పదేళ్ల కిందట క్లయింట్ల కోసం వెళ్లాలంటే ఆటోల కోసం వెయిట్ చేయడానికే టైం వేస్టయ్యేది. కానీ ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకోడానికి, ఫుడ్ ఆర్డరివ్వడానికి యాప్స్ రావడంతో.. టైం మిగలడంతో పాటు, లైఫ్ మరింత సులభం అయిపోయింది'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Google
పెరిగిన మొబైల్ లావాదేవీలు
పదేళ్ల కిందట మొబైల్ బ్యాంకింగ్ వినియోగం అంతంత మాత్రంగానే ఉండేది. కానీ ఇప్పుడు గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి పేమెంట్ యాప్స్‌తో మొబైల్ లావాదేవీలు సర్వసాధారణమైపోయాయి.
అసంఘటిత రంగంలో కూడా పేమెంట్ యాప్స్ రంగ ప్రవేశం చేశాయి. భారత దేశంలో వీటి వాడకం పెరగడానికి నోట్ల రద్దు ఒక కారణమైతే, మరోపక్క పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం, వాటితో వచ్చే సౌలభ్యం మరో కారణం.
2016లో భారత్‌లో మొబైల్ లావాదేవీల సంఖ్య 60 లక్షలు ఉండగా... 2019 నాటికి వాటి సంఖ్య 1700 కోట్లకు చేరింది. ఈ రంగం మరింతగా విస్తృతం కాబోతోందని, 2022 నాటికి ఏడాదికి 26 వేల కోట్ల మొబైల్ లావాదేవీలు జరిగే అవకాశం ఉందని స్టాటిస్టా అంచనా వేస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
విండో షాపింగ్ ప్రపంచం
ఆన్‌లైన్లో కొనుగోళ్లు చెయ్యడం ప్రతి ఒక్కరికీ అలవాటుగా మారింది. ఒకప్పుడు పుస్తకాల వంటి వాటినే ఆన్‌లైన్లో కొనుగోలు చేసుకునే భారతీయులు.. ఇప్పుడు నిత్యావసరాల నుంచి ఖరీదైన గృహోపకరణాలు, సెల్ ఫోన్లు, బంగారం వంటివి కూడా ఆన్ లైన్లో కొంటున్నారు.
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, మింత్రా ఇలా చెప్పుకుంటూ పోతే... ఆన్‌లైన్ షాపింగ్ వల్ల రిటైల్ మార్కెట్ల మీద ప్రభావం పడేంత విస్తృతి పెరిగింది. బిజీ జీవితాల్లో ఆన్‌లైన్ షాపింగ్‌కే చాలా మంది మొగ్గు చూపుతున్నారు.
2014లో భారత మార్కెట్లోకి అడుగు పెట్టిన అమెజాన్... ఐదేళ్లలోనే కోట్లాది వినియోగదారులను చేరుకుంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్, మింత్రా, స్నాప్‌డీల్ వంటి సంస్థలు కూడా పెద్ద ఎత్తున షాపింగ్ విధానాన్ని మార్చేశాయి.
ఈకామర్స్‌లోకి విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతులివ్వడంతో ఈ రంగం మరింత దూసుకెళ్లింది. ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2017లో 39 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసిన ఈ రంగం...ఏటా 51 శాతం వృద్ధిరేటుతో 2020 నాటికి 120 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

ఫొటో సోర్స్, DESIGN MUSEUM
మమేకమైపోయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల్లోనే వినిపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న మాట ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో భాగమైపోయింది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా AI బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి.
AI సాయంతో మన రోజువారీ పనుల్లో రోబోటిక్స్ సాయం తీసుకోవడం పెరిగింది. పిల్లలు ఆడుకునే బొమ్మల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతోంది.
మనకు తెలియకుండానే మన జీవితాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెజెన్స్ భాగమైపోయింది. రిజర్వేషన్లు బుక్ చేసుకునేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ ప్రిడిక్షన్లు, మన శరీరాన్ని మానిటర్ చేసే ఫిట్‌నెస్ గ్యాడ్జెట్లు అన్నీ.. దీని ఆధారంగా పనిచేసేవే.

ఫొటో సోర్స్, Getty Images
సోషల్ నెట్‌వర్క్‌ల వాడకం
దేశ వ్యాప్తంగా సోషల్ నెట్‌వర్క్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. ఎస్ఎంఎస్‌లు, ఎంఎంఎస్‌ల కన్నా మెరుగైన మెసేజింగ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాట్సాప్, వైబర్ వంటి వాటితో పాటు ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, హలో, షేర్‌చాట్ ఇలా యాప్‌ల వాడకం పెరిగిపోయింది.
పదేళ్ల కిందటితో పోలిస్తే యాప్‌లలో గడుపుతున్న కాలం క్రమంగా పెరుగుతూ వస్తోంది. టిక్‌టాక్ వంటి యాప్‌లు సంచలనంగా నిలిచాయి.

ఫొటో సోర్స్, Getty Images
వుయ్ ఆర్ సోషల్ 2017లో ఇచ్చిన నివేదిక ప్రకారం... ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య ఏడాదికి 13 శాతం చొప్పున పెరుగుతుంటే, భారత్‌లో మాత్రం ఈ సంఖ్య 31 శాతంగా ఉంది. ఇక ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ ఈ విషయంలో రెండో స్థానంలో నిలిచింది.
జనవరి 2018 నాటికి భారత్‌లో సోషల్ మీడియాలో ప్రతీ యూజర్ గడిపే సమయం రోజుకు రెండు గంటల 26 నిముషాలుగా ఉంది. ఈ విషయంలో ఫిలిప్ఫీన్స్ 3 గంటల 57 నిముషాలతో అగ్ర స్థానంలో ఉండగా.. కేవలం 48 నిముషాల ఎంగేజ్‌మెంట్ టైంతో జపాన్ చివరి స్థానంలో ఉంది.
స్మార్ట్ టీవీలు... వెబ్ సీరిస్‌లు
1928లో ఆవిష్కృతమైన టీవీలు... ఈ పదేళ్లలో తమ రూపు రేఖలు పూర్తిగా మార్చేసుకున్నాయి. ఎల్‌సీడీ, ఎల్ఈడీలు మరింత స్మార్ట్ టీవీలుగా అవతరించాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ వంటి వెబ్ స్ట్రీమింగ్ సర్వీస్‌ల రాకతో టీవీ రంగమే మారిపోయింది. వెబ్ సీరీస్‌లు రూపొందుతున్నాయి. దీనికి తోడు అమెజాన్ ఫైర్ స్టిక్, క్రోమ్ కాస్ట్ వంటి పరికరాలు సాధారణ ఎల్ఈడీ టీవీలను కూడా.. స్మార్ట్ టీవీలుగా మార్చేశాయి.

ఫొటో సోర్స్, Thinkstock
క్లౌడ్ స్టోరేజ్... బిగ్ డేటా వాడకం
గత పదేళ్లలో క్లౌడ్ స్టోరేజ్ వాడకం సర్వసాధారణమైపోయింది. వన్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, గూగుల్ ఫోటోస్ వంటివి ప్రతిస్మార్ట్ ఫోన్లోనూ కనిపిస్తున్నాయి. మనం తీసుకునే ఫోటోలు ఆటోమాటిగ్గా గూగుల్ ఫోటోస్‌లో సేవ్ అయిపోతున్నాయి.
పరిశ్రమలు కూడా... తమ డేటాను భద్రంగా ఉంచడానికి క్లౌడ్ కంప్యూటింగ్ వినియోగిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ క్లౌడ్ కంప్యూటింగ్ వాడకం మరింత విస్తృతమవ్వడానికి ఈ దశాబ్ది పునాదులేసింది.
విజువల్ టెక్నాలజీ
తెరపై అద్భుతమైన గ్రాఫిక్స్ దృశ్యాల్ని ఆవిష్కరించే కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు గత శతాబ్ది వేదికైతే.. ఈ శతాబ్ది మాత్రం కళ్ల ముందే ఆ అద్భుతాల్ని ఆవిష్కరింపజేస్తోంది. 360 డిగ్రీల్లో చూసే వర్చ్యువల్ రియాల్టీ, మన ముందున్న ప్రపంచాన్ని కొత్తగా మార్చేసే ఆగ్యుమెంటెడ్ రియాల్టీ వంటివాటి వాడకం.. ఈ దశాబ్ది కాలంలో సినిమాతో పాటు వినోద రంగాల్లోనూ విస్తరించింది.

ఫొటో సోర్స్, EPA
అంతరిక్ష రంగంలో అద్భుత విజయాలు
భారత అంతరిక్ష ప్రయోగ సంస్థ.. ఇస్రో ఈ పదేళ్లలో ఎన్నో విజయాలు సాధించింది. తొలి ప్రయత్నంలోనే మంగళయాన్ సక్సెస్ చేసింది. చంద్రయాన్ 2 ప్రయోగానికి వేదిక అయ్యింది. అత్యధిక సంఖ్యలో శాటిలైట్లను అంతరిక్షంలో పంపింది. ఇస్రో వందో ప్రయోగంతో పాటు, PSLV 50వ ప్రయోగం, ఒకే ప్రయోగంలో 104 శాటిలైట్లను పంపిన ఘనత కూడా ఇస్రో సొంతం చేసుకుంది ఈ దశాబ్దిలోనే.
వీటితో పాటు ఇస్రో దేశీయ నావిగేషన్ సిస్టమ్ నావిక్‌ను ప్రయోగించింది. మానవ సహిత అంతరిక్ష పరిశోధనలకు ఇస్రో శ్రీకారం చుట్టింది. గగన్‌యాన్‌గా పేరు పెట్టిన ఈ ప్రోగ్రాం కోసం అస్ట్రోనాట్ల కోసం టెస్ట్ పైలెట్ల ఎంపిక కూడా జరిగిందని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు రఘునందన్ తెలియచేశారు.
జనవరి మూడో వారం నుంచి గగనయాన్ ప్రయోగాల కోసం నలుగురు భారతీయ అస్ట్రోనాట్స్ రష్యాలో ప్రత్యేక శిక్షణ తీసుకోబోతున్నారు. ఈ గగనయాన్ ప్రయోగం కోసం అవసరమైన రీయూజ్ లాంచ్ వెహికల్ ప్రయోగాలతో పాటు, అస్ట్రోనాట్ల అబార్ట్ టెస్ట్ లను కూడా ఈ దశాబ్దిలోనే పూర్తి చేసింది.
ఇక నాలుగు టన్నుల బరువైన పేలోడ్ వెహికిల్స్ తీసుకెళ్లగల మ్యాక్ త్రీ రాకెట్లతో పాటు, అత్యాధునిక క్రయోజనిక్స్ ను కూడా ఇస్రో ఈ పదేళ్లలో సుసాధ్యం చేసింది. ఇక సూర్యుడిపై ప్రయోగాలకు ఆదిత్య ఎల్1 కి ఇస్రో శ్రీకారం చుట్టింది. చంద్రయాన్-3 ప్రయోగానికి కూడా సిద్ధం అవుతోంది. ఇక కిలోకన్నా తక్కువ బరువున్న పికో శాటిలైట్లను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది కూడా ఈ దశాబ్దిలోనే. 2010లో తమ విద్యార్థులు తయారు చేసిన స్డడ్ శాట్ వన్ అనే పికో శాటిలైట్‌ను ఇస్రో అంతరిక్షంలోకి పంపిందని రఘునందన్ తెలియచేశారు.

రోబోటిక్స్
పదేళ్ల కిందటా రోబోటిక్స్ ఉన్నా.. ఈ పదేళ్లలో వాటి వినియోగం, విస్తృతి మరింత పెరిగింది. పారిశ్రామిక రంగంలో మానవులకు బదులుగా రోబోల వినియోగం పెరిగింది.
అడ్వాన్స్‌డ్ రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో... మనుషులు చేసే చాలా పనులను రోబోలు ఆక్రమించేశాయి. భద్రత, తయారీ వంటి చాలా స్థానాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే రోబోల వాడకం పెరిగింది.
ఈ దశాబ్ది సంచలన రోబోగా సోఫియా ఆవిర్భావం.. భవిష్యత్తులో రోబోటిక్స్ ప్రగతికి అద్దం పడుతోంది. పర్సనల్ అసిస్టెంట్‌గా డేటా ప్రాసెసింగ్ మాత్రమే కాదు.. హావభావాలు కూడా పలికించడం, మనుషుల ముఖకవళికలను బట్టి వారి మనోభావాల్ని అర్థం చేసుకోగలగడం సోఫియా ప్రత్యేకత.
ఒకప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమలకే పరిమితమైన రోబోటిక్స్‌ను.. ప్రతి ఒక్కరి ఇంట్లో వ్యక్తిగత అవసరాలు తీర్చగలిగేలా పర్సనల్ గా మార్చిన దశాబ్ది కూడా ఇదే. రోబోలను ప్రేమించడం, వాటినే పెళ్లాడటం వంటి పరిణామాలు కూడా ఇదే దశాబ్దిలో జరిగాయి. రోబోటిక్స్‌ను సామాన్యుడికి చేర్చిన దశాబ్దిగా ఈ పదేళ్లూ నిలిచిపోతాయి.

ఫొటో సోర్స్, CELLINK
త్రీడి ప్రింటింగ్
ఈ దశాబ్ది గొప్ప ఆవిష్కరణల్లో త్రీడి ప్రింటింగ్ ఒకటి. వస్తువుల్ని ప్రింట్ చేసుకునే విధానం ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో మనకు నచ్చిన ఆహారాన్ని కూడా ప్రింట్ చేసుకుని తినే అవకాశం కూడా ఈ త్రీడి ప్రింటర్లు కల్పిస్తున్నాయి.
పరిసరాలకు, వాతావరణానికి అనుగుణంగా స్పందించేలా త్రీడీ దుస్తుల్ని తయారు చేశారు. సౌల్ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన బెహ్నాజ్ ఫరాహీ అనే మహిళా డిజైనర్... ప్రమాదాలను పసిగట్టడంతో పాటు, వాతావరణానికి అనుగుణంగా ప్రతిస్పందించే త్రీడీ దుస్తుల్ని తయారు చేశారు.
జెనోమిక్స్
మానవ జన్యుపటం ఆవిష్కరించడం ఓ గొప్ప శాస్త్రవిజయంగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు జెనోమిక్స్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చాయి. తమ జన్యు పటాన్ని ఆవిష్కరించుకోవడం, తమ పూర్వికుల కుల వివరాలు తెలుసుకోవడంతో పాటు, భవిష్యత్తులో రాబోయే రోగాల సమచారాన్ని కూడా జన్యు పరీక్షలతో ముందే తెలుసుకోగలుగుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
క్రిప్టో కరెన్సీ
బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల వాడకం ఈ దశాబ్దిలో విపరీతంగా పెరిగింది. ప్రముఖ టెక్ సంస్థలు కూడా... భవిష్యత్తులో క్రిప్టో కరెన్సీ వాడకం పెంచడంతో పాటు.. తమకంటూ ప్రత్యేక క్రిప్టో కరెన్సీలను తయారు చేసుకునే ప్రయోగాలు చేస్తున్నాయి.
బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే డిజిటల్ ఎన్‌క్రిప్టెడ్ కరెన్సీని క్రిప్టో కరెన్సీ అంటారు. బిట్ కాయిన్ ఇందులో ఒకటి. అయితే ఇవి పరిమిత సంఖ్యలోనే ఉంటాయి కాబట్టి, వీటికి డిమాండ్ పెరుగుతోంది. భారత్ లో వీటి వాడకానికి అనుమతి లేదు.
స్పేస్ ఫ్లైట్స్
అంతరిక్ష యాత్రలను టీవీల్లో చూసే రోజుల నుంచి... ఏకంగా డబ్బులుంటే అంతరిక్ష యాత్రలు చేసే పరిణామాలకు ఈ దశాబ్ది వేదికగా నిలిచింది. వర్జిన్ అట్లాంటిక్, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు.. అంతరిక్షయానాన్ని ప్రైవేటు వ్యక్తులకూ అందుబాటులోకి తెచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
రోజువారీ జీవితాల్ని మార్చేసిన గ్యాడ్జెట్లు.
ఈ పదేళ్లలో సామాన్యుడి జీవితాల్లో ఎల్ఈడీల వాడకం విపరీతంగా పెరిగింది. ఇక సెగ్వేల రంగ ప్రవేశంతో పర్సనల్ మొబిలిటీ ప్రయాణ సాధనాలు కొత్త పుంతలు తొక్కాయి.
సీసీ కెమెరాల వాడకం ఈ పదేళ్లలో తప్పనిసరి అన్నంతగా మారిపోయింది. నగరాల్లో ప్రతీ అంగుళాన్ని సీసీకెమెరాలు పర్యవేక్షిస్తూనే ఉన్నాయి. పర్సనల్ కంప్యూటింగ్ మరింత వేగవంతమైంది.
కిండల్, ఈ బుక్స్ రాకతో పుస్తకాలు చదివే విధానమే మారిపోయింది. ఇక ఆడియో బుక్స్, పాడ్‌కాస్ట్‌లు నేటి నగర జీవులు జీవన విధానంలో భాగమైపోయాయి.
‘‘మానవ ప్రగతిలో ఈ పదేళ్లు అత్యంత కీలకమైన దశాబ్ది.. భవిష్యత్తు అంతా డిజిటల్‌గానే సాగబోతోంది. కానీ అది సవ్యంగా సాగాలంటే సైబర్ సెక్యూరిటీ కూడా అత్యంత పటిష్ట పర్చాల్సిన అవసరం ఉంది. లేకపోతే... అదే స్థాయిలో ఇబ్బందులూ ఎదురయ్యే అవకాశం లేకపోలేదు’’ అని నల్లమోతు శ్రీధర్ అభిప్రాయపడ్డారు
ఇలా 2010 నుంచి 2020 వరకూ గడిచిన దశాబ్ద కాలంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితాలు ఎంతలా డిజిటల్ మయం అయిపోయాయో అవగతమవుతుంది.
ఇవి కూడా చదవండి:
- 'మరణం తర్వాత మెదడులో మళ్లీ చలనం.. మనసును చదివే చిప్స్': 2019లో వైద్య రంగం సాధించిన అద్భుత విజయాలు
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
- కృత్రిమ మేథస్సు ప్రమాదవశాత్తూ మనల్నే అంతం చేసేస్తుందా, ఎలా?
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- రూ. 3,208 కోట్ల విలువైన బిట్కాయిన్లు మాయం.. క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే స్టోరీ
- 2019లో దేశ రాజకీయాలు, సమాజంపై లోతైన ప్రభావం చూపిన ప్రధాన ఘటనలు
- 'జన్యు-సవరణ శిశువులు' సృష్టించిన శాస్త్రవేత్తకు జైలు శిక్ష
- ‘దేశంలో ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితి.. విధానపరమైన నిర్ణయాలు అవసరం’
- సొంత ఇంటర్నెట్ను సృష్టించుకుంటున్న రష్యా.. దేశీయ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుంది?
- నర మానవుల్లేని ‘దెయ్యాల’ టౌన్: ఈ పట్టణంలోకి అడుగుపెట్టొద్దు - అధికారుల హెచ్చరిక
- రాళ్లలో దొరికే సిలికాన్.. మన జీవితాలను ఎలా మార్చేసింది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












