రొమేనియా: ఆపరేషన్ చేస్తుండగా నిప్పంటుకుని పేషెంట్‌ మృతి

రొమేనియాలో చికిత్స

ఫొటో సోర్స్, Getty Images

ఆపరేషన్ చేస్తుండగా నిప్పంటుకుని క్యాన్సర్ పేషెంట్‌ మృతి చెందారు. రొమేనియాలోని బుచారెస్ట్‌లో ఫ్లోరెస్కే ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

66 ఏళ్ల మహిళ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతోంది. ఆమెకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు నిర్ణయించారు.

డిసెంబర్ 22న ఆపరేషన్ చేయడానికి ముందు బాక్టీరియా పోవడానికి డాక్టర్లు ఆమెకు ఒక డిసిన్ఫెక్టన్ట్ ఇచ్చారు.

అందులో ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉండడంతో ఒక విద్యుత్ పరికరం తగిలి ఆవిడ శరీరానికి నిప్పు అంటుకుంది. ఆమె శరీరం 40% వరకు కాలిపోయింది. చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత ఆమె మరణించారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం మహిళ మృతిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

"ఆపరేషన్ థియేటర్‌లో ఏం జరిగిందో, దాని తీవ్రత ఏమిటో తమకు చెప్పలేదని, అది కేవలం ఒక ప్రమాదం మాత్రమేనని చెప్పారు" అని మృతురాలి కుటుంబ సభ్యులు స్థానిక మీడియాకు చెప్పారు.

"మీడియా ద్వారానే మాకు కొన్ని వివరాలు తెలిశాయి. మేము ఎవరి మీద తప్పు మోపడం లేదు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాం" అని వారు అన్నారు.

ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని రొమేనియా వైద్యశాఖ మంత్రి విక్టర్ కోస్టాచే చెప్పారు.

"విద్యుత్ పరికరాలతో ఆపరేషన్ చేసేటప్పుడు ఆల్కహాల్ ఉన్న డిసిన్ఫెక్టన్ట్ వాడకూడదు అనే విషయం డాక్టర్లకు ముందే తెలిసి ఉండాలి" అని డిప్యూటీ మంత్రి హోరాతియు మొల్డోవన్ అన్నారు.

యురోపియన్ యూనియన్ దేశాలతో పోలిస్తే వైద్య వ్యవస్థకు రొమేనియా అన్ని దేశాలకంటే తక్కువ డబ్బు ఖర్చు చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)