గ్రెటా థన్‌బర్గ్ తండ్రి: "ఆమె సంతోషంగానే ఉంది.. నేనే ఆందోళన చెందుతున్నా"

ఫొటో సోర్స్, REUTERS/GUGLIELMO MANGIAPANE
వాతావరణ మార్పు మీద పోరాటంలో ముందు వరుసలో నిలుచుని పోరాడటం తన కుమార్తె గ్రెటా థన్‌బర్గ్‌కు 'మంచిది కాదు' అని ఆమె తండ్రి అభిప్రాయపడ్డారు.
పర్యావరణ సమస్యల మీద అవగాహన పెంపొందించటంలో పదహారేళ్ల గ్రెటా థన్‌బర్గ్ లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది.
కానీ ఆమె పర్యావరణం కోసం పోరాడటానికి బడి మానేస్తుండటాన్ని తాను సమర్థించనని ఆమె తండ్రి స్వేన్ట్ థన్‌బర్గ్ బీబీసీతో చెప్పారు.
గ్రెటా ఉద్యమకారిణిగా మారినప్పటి నుంచీ చాలా సంతోషంగా ఉందని.. కానీ ఆమె ఎదుర్కొంటున్న ''ద్వేషం'' విషయంలో తాను చాలా ఆందోళనగా ఉన్నానని ఆయన తెలిపారు.
రేడియో 4లోని టుడే కార్యక్రమంలో గ్రెటా అతిథిగా సంపాదకత్వం వహించిన ప్రసారంలో.. వాతావరణ మార్పు గురించి ప్రపంచాన్ని గ్రెటా మేల్కొలిపిందని సర్ డేవిడ్ అటెన్‌బరో ఆమెతో చెప్పారు.
గ్రెటా తన స్వస్థలమైన స్వీడన్‌లోని స్టాక్‌హోం నుంచి స్కైప్ ద్వారా సర్ డేవిడ్‌కు కాల్ చేసింది. తన ఉద్యమానికి ఆయన ఎలా స్ఫూర్తినిచ్చారో ఆయనకు చెప్పింది.
పర్యావరణవేత్త కూడా అయిన సర్ డేవిడ్.. ''ఈ అంశం మీద 20 ఏళ్లుగా పనిచేస్తున్న మా వంటి చాలా మంది సాధించలేకపోయిన విజయాలను నువ్వు సాధించావు'' అని గ్రెటాతో పేర్కొన్నారు.

ఇటీవలి బ్రిటన్ ఎన్నికల్లో వాతావరణ మార్పు అనేది ఒక కీలక అంశంగా మారటానికి ఈ 16 ఏళ్ల బాలిక ఏకైక కారణమని కూడా ఆయన చెప్పారు.
వాతావరణ మార్పు విషయంలో ప్రపంచ నాయకులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సాగిన ప్రపంచ ఉద్యమానికి సారథ్యం వహించినందుకు గాను.. గ్రెటాను ఈ సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ఆమె స్ఫూర్తితో అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలల విద్యార్థులు సమన్వయంతో సమ్మె చేశారు.
ఈ పండుగ సమయంలో టుడే ప్రోగ్రామ్ గెస్ట్ ఎడిటర్లుగా వ్యవహరిస్తున్న ఐదుగురు ఉన్నతస్థాయి ప్రముఖుల్లో గ్రెటా ఒకరు.
టీనేజర్ గ్రెటాను, ఆమె తండ్రిని ఇంటర్వ్యూ చేయటానికి బీబీసీ తన ప్రెజెంటర్ మిషల్ హుసేన్‌ను విమాన ప్రయాణం ద్వారా స్వీడన్‌కు పంపించింది.
మిషల్ హుసేన్‌ను విమానంలో పంపించాలన్న నిర్ణయంపై టుడే ఎడిటర్ సారా శాండ్స్ వివరణ ఇస్తూ.. ''ఇతర రవాణా మార్గాల్లో పయనించటానికి తగినంత సమయం లేదు. కానీ మేం అక్కడ మా కెమెరామెన్‌ను కలిశాం. గ్రెటా, డేవిడ్ అటెన్‌బరోల మధ్య ఇంటర్వ్యూను స్కైప్ ద్వారా నిర్వహించాం. సంభాషించుకోవటానికి అది సరైన విధానమని వారిద్దరూ భావించారు'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, KENA BETANCUR/GETTY IMAGES
నాలుగేళ్ల దిగులు...
గ్రెటా పర్యావరణ పరిరక్షణ కోసం స్కూలు సమ్మెను ప్రారంభించటానికి ముందు మూడు, నాలుగు సంవత్సరాల పాటు దిగులు చెందిందని ఆమె తండ్రి స్వేన్ట్ థన్‌బర్గ్ బీబీసీ ప్రెజెంటర్ హుసేన్‌తో పేర్కొన్నారు.
''ఆమె మాట్లాడటం ఆపేసింది. స్కూలుకు వెళ్లటం మానేసింది'' అని చెప్పారు. చివరికి భోజనం చేయటానికి కూడా నిరాకరించటంతో అది తల్లిదండ్రులుగా తమకు పీడకలగా మారిందని వ్యాఖ్యానించారు.
ఆమె కోలుకోవటానికి సాయం చేయటం కోసం స్వేన్ట్ థన్‌బర్గ్ గ్రెటాతోను, ఆమె చెల్లెలు బీటాతోనూ స్వీడన్‌లోని తమ ఇంట్లో ఎక్కువ సమయం గడిపారు.
గ్రెటా తల్లి మాలెనా ఎర్న్‌మాన్ ఒపెరా గాయని. యూరోవిజన్ సాంగ్ కంటెస్ట్‌లో కూడా పాల్గొన్నారు. తన కుటుంబం మొత్తం కలిసి ఉండటం కోసం ఆమె తన సంగీత కచేరీ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
వైద్యుల సాయం కూడా తీసుకున్నామని స్వేన్ట్ థన్‌బర్గ్ చెప్పారు. గ్రెటాకు 'ఆస్పెర్జర్స్' అనే ఒక తరహా ఆటిజం ఉన్నట్లు నాలుగేళ్ల కిందట వైద్యులు గుర్తించారు. ఈ ఆటిజం వల్ల పరిస్థితులను మూసలో కాకుండా వెలుపలి నుంచి సంపూర్ణంగా చూడగలుగుతున్నానని గ్రెటా చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ తర్వాత కొన్నేళ్ల పాటు వీరు వాతావరణ మార్పు గురించి చర్చించటం, పరిశోధించటం మొదలుపెట్టారు. ఈ సమస్యను పరిష్కరించాలన్న తపన గ్రెటాలో అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.
మానవ హక్కుల కోసం 'చాలా క్రియాశీలం'గా కృషిచేసే తన తల్లిదండ్రులను 'పెద్ద వంచకులు' అని గ్రెటా ఆరోపించినట్లు స్వేన్ట్ పేర్కొన్నారు.
''మనం ఈ వాతావరణ సమస్యని సీరియస్‌గా పట్టించుకోవటం లేదు.. మరి మీరు ఎవరి మానవ హక్కుల కోసం నిలబడుతున్నారు?'' అని గ్రెటా తమని ప్రశ్నించినట్లు ఆయన తెలిపారు.
తన తల్లిదండ్రులు మరింత పర్యావరణహితంగా మారటానికి తమ ప్రవర్తనలో మార్పులు చేసుకోవటం.. ఆమె తల్లి విమానంలో ప్రయాణించకూడదని నిర్ణయించుకోవటం, తండ్రి వేగన్‌గా మారటం వంటి చర్యలు గ్రెటాకు ''శక్తి''ని అందించాయని ఆయన చెప్పారు.
న్యూయార్క్, మాడ్రిడ్‌లలో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సుల్లో పాల్గొనటానికి గ్రెటా సముద్రయానం చేసినపుడు ఆమెతో పాటు స్వేన్ట్ థన్‌బర్గ్ కూడా తోడుగా వెళ్లారు.
పర్యావరణం మీద విమానయానం చూపే ప్రభావం కారణంగా విమానాల్లో ప్రయాణించటానికి గ్రెటా నిరాకరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
''ఈ పనులన్నీ నేను చేశాను. అవన్నీ సరైన పనులని నాకు తెలుసు. కానీ నేను వాతావరణాన్ని రక్షించటానికి ఇవన్నీ చేయలేదు. నా కూతురిని కాపాడుకోవటానికి చేశాను'' అని స్వేన్ట్ పేర్కొన్నారు.
''నాకు ఇద్దరు కూతుళ్లున్నారు. నిజాయతీగా చెప్పాలంటే అన్నిటికన్నా వారే నాకు ముఖ్యం. వారు సంతోషంగా ఉండాలని మాత్రమే నేను కోరుకుంటున్నా'' అని చెప్పారు.
గ్రెటా తన ఉద్యమం కారణంగా మారిందని.. చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
''ఆమె సాధారణ బాలిక కాదని ఇప్పుడు మీరు భావిస్తారు. ఎందుకంటే.. ఆమె విశిష్టమైనది. చాలా ప్రముఖమైనది. ఇవన్నీ మీరు ఆలోచిస్తారు. కానీ.. నాకు మాత్రం ఆమె ఒక సాధారణ చిన్నారి. ఇతరుల్లాగా ఆమె అన్ని పనులూ చేయగలదు'' అని పేర్కొన్నారు.
''ఆమె గెంతుతూ తిరుగుతుంది. నవ్వుతూ తుళ్లుతూ ఉంటుంది. మేం చాలా సంతోషకరమైన పనులు చేస్తుంటాం. ఆమె చాలా మంచి స్థానంలో ఉంది'' అని ఆయన చెప్పారు.
అయితే.. గ్రెటా స్కూలు సమ్మె వైరల్‌గా మారినప్పటి నుంచీ.. పర్యావరణాన్ని కాపాడటానికి తమ జీవనశైలిని మార్చుకోవటానికి ఇష్టపడని జనం నుంచి ఆమెకు అవమానాలు ఎదురయ్యాయని స్వేన్ట్ థన్‌బర్గ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
జనం నన్ను ''నా రూపాన్ని బట్టి, నా దుస్తులను బట్టి, నా ప్రవర్తనను బట్టి, నేను భిన్నంగా ఉండటం వల్ల'' అవమానిస్తారు అని గ్రెటా ఇంతకుముందు చెప్పింది.
ఆమె గురించి వచ్చే ''ఫేక్ న్యూస్.. ఆమె చుట్టూ అల్లే కట్టుకథనాలు, అబద్ధాలు, అవి సృష్టించే విద్వేషం'' గురించి తాను చాలా ఆందోళన చెందుతున్నానని ఆమె తండ్రి పేర్కొన్నారు.
కానీ.. తన కుమార్తె ఈ విమర్శలను అద్భుతంగా ఎదుర్కొంటోందని చెప్పారు.
''నిజంగా.. ఆమె ఇదెలా చేస్తోందో నాకు తెలీదు. కానీ ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అవన్నీ ఆమెకు హాస్యపూరితంగా కనిపిస్తాయి'' అని తెలిపారు.
భవిష్యత్తులో తమ కుటుంబం విషయంలో పరిస్థితుల తీవ్రత తగ్గుతుందని, గ్రెటా తిరిగి స్కూలుకు వెళ్లాలని కోరుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
గ్రెటా త్వరలో 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది కాబట్టి ఆమె ప్రయాణాల కోసం ఇప్పుడు తోడు ఉండాల్సిన అవసరం లేదు.
''ఆమెకు నేను ఉండాల్సిన అవసరం ఉంటే.. అది నెరవేర్చటానికి ప్రయత్నిస్తా'' అన్నారు.
''కానీ.. ఆమె మరింత ఎక్కువగా తన సొంతంగానే ముందుకు సాగుతుందని నేను అనుకుంటున్నా.. అది చాలా గొప్ప విషయం'' అని స్వేన్ట్ థన్‌బర్గ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- విశాఖపట్నం: దంగల్ సినిమా స్ఫూర్తితో రెజ్లింగ్‌లో దూసుకెళ్తున్న గిరిజన బాలికలు
- ఈ 23 ఏళ్ల ఎంపీ సగం జీతం చాలంటున్నారెందుకు?
- సనా మారిన్: పదిహేనేళ్ల వయసులో బేకరీలో ఉద్యోగి... 34 ఏళ్లకు దేశ ప్రధాని
- శ్రీజ డెయిరీ: ‘పూర్తిగా మహిళలతో నడుస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుల సంస్థ’
- రాళ్లలో దొరికే సిలికాన్.. మన జీవితాలను ఎలా మార్చేసింది
- ‘హమ్మయ్య.. తమ్ముడిని కౌగిలించుకోగలిగా’.. హైడ్రాలిక్ చేతిని అమర్చుకున్నాక అయిదేళ్ల బాలుడి ఆనందం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








