ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది.. విలీనంతో వాళ్లు ఆశించింది నెరవేరిందా

ఏపీఎస్‌ఆర్టీసీ
    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) సుదీర్ఘ ప్ర‌స్థానంలో మ‌రో అడుగు ప‌డింది. చాలాకాలంగా కార్మికులు చేస్తున్న డిమాండ్ మేరకు వారిని ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వైఎస్ జ‌గ‌న్మోహన్ రెడ్డి ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌చ్చింది.

ఆర్టీసీ సిబ్బందిని ఇకపై ప్ర‌భుత్వ ఉద్యోగులుగా ప‌రిగ‌ణిస్తారు. బ‌స్సులు మాత్రం ఏపీఎస్‌ఆర్టీసీ ప‌రిధిలో ఉంటాయి.

అయితే సిబ్బంది ఆశించిన రీతిలో ఈ విలీనం జ‌ర‌గ‌లేద‌నే అభిప్రాయం ప‌లు సంఘాల నుంచి వినిపిస్తోంది. వైఎస్ జగన్ హామీ ఇచ్చిన‌ట్టుగా, నిపుణుల క‌మిటీ సిఫార్సుల మేర‌కు చ‌ర్య‌లు తీసుకున్న‌ట్టు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

వైఎస్ జగన్

ఫొటో సోర్స్, ANDHRAPRADESHCM/FB

ప్ర‌జా జీవితాల‌తో ముడిప‌డిన సంస్థ‌

ప్ర‌జా రవాణా విభాగంలో ఏపీఎస్‌ఆర్టీసీని 1958, జనవరి 11న ఏర్పాటు చేశారు. అంత‌కుముందు ఇది 1932లో ప్రారంభమైన నిజాం రాష్ట్ర రైల్, రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ విభాగం కింద ఉండేది. రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ యాక్ట్ 1950ని అనుస‌రించి ఏపీఎస్‌ఆర్టీసీ ఆవిర్భావం జ‌రిగింది. ప్రారంభంలో 166 మంది సిబ్బంది, 27 బ‌స్సుల‌తో ఆర్టీసీ జీవం పోసుకుంది. అప్పటి నుంచి సంస్థ ప‌లు ర‌కాలుగా విస్త‌రించింది.

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభ‌జ‌న జరగడంతో ఆర్టీసీ కూడా 2015, జూన్ 3న రెండు సంస్థలుగా విడిపోయింది. తెలంగాణలో టీఎస్ఆర్టీసీ ఏర్పడగా, ఏపీలో ఏపీఎస్‌ఆర్టీసీ కొన‌సాగుతోంది.

ఏపీఎస్‌ఆర్టీసీని నాలుగు జోన్లుగా విభ‌జించారు. మొత్తం 14,163 స‌ర్వీసుల‌ను సంస్థ న‌డుపుతోంది. రాష్ట్ర‌వ్యాప్తంగా 128 బ‌స్సు డిపోలు, 423 బ‌స్సు స్టేష‌న్లు, 692 బ‌స్సు షెల్ట‌ర్ల‌ను సంస్థ నిర్వ‌హిస్తోంది. అధికారిక లెక్క‌ల ప్ర‌కారం రోజూ 42.58 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల మేర బ‌స్సులు తిరుగుతున్నాయి.

ఏపీలోని 14,123 గ్రామీణ ప్రాంతాల‌తో పాటుగా ప‌ట్ట‌ణ ప్రాంతాల‌న్నింటా ఆర్టీసీ సేవ‌లు అందిస్తోంది. స‌మీప రాష్ట్రాలైన తెలంగాణ, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఒడిశాల‌కు కూడా స‌ర్వీసులు న‌డుస్తున్నాయి.

ప‌ల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీల‌క్స్, అల్ట్రా డీల‌క్స్ స‌ర్వీసుల‌తో పాటు గ‌రుడ‌, అమ‌రావ‌తి, ఇంద్రా, వెన్నెల పేర్ల‌తో ఏసీ బ‌స్సు స‌ర్వీసుల‌ను కూడా నడుపుతోంది.

ఏపీఎస్‌ఆర్టీసీ

ప్ర‌స్తుతం ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్న 51,488 మంది ఉద్యోగులు జ‌న‌వ‌రి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోయారు. ఇకపై వారికి వేతనాలను ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేయాల‌ని కార్మికులు చాలాకాలంగా కోరుతున్నారు. ఈ కోరికను నెరవేర్చుతామని గ‌త ఎన్నిక‌ల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది.

అందుకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణ‌యం తీసుకుంది. రిటైర్డ్ అధికారి ఆంజ‌నేయ రెడ్డి అధ్య‌క్ష‌త‌న నిపుణుల క‌మిటీని నియ‌మించింది.

ఆ క‌మిటీ ప‌లు రాష్ట్రాల ఆర్టీసీల‌ను, విధానప‌ర‌మైన విష‌యాల‌ను ప‌రిశీలించి అక్టోబ‌ర్‌లో ప్ర‌భుత్వానికి నివేదిక అందించింది. దానికి అనుగుణంగా నిర్ణ‌యం తీసుకుని ఆర్టీసీ సిబ్బందిని ప్ర‌భుత్వ ఉద్యోగులుగా నియ‌మించారు. ఇందుకోసం ప్ర‌జా ర‌వాణా శాఖ‌ను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం, ఇత‌ర వ్య‌వ‌హారాల‌ను ఆ శాఖ ప‌ర్య‌వేక్షిస్తుంద‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

పేర్ని నాని

చిత్త‌శుద్ధిని చాటుకున్నాం: మంత్రి పేర్ని నాని

ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తామ‌ని ఇచ్చిన హామీకి అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుని చిత్త‌శుద్ధిని చాటుకున్నామ‌ని ఏపీ ర‌వాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు.

''ఆర్టీసీ విలీనం గురించి కంక‌ణం క‌ట్టుకుని ప్ర‌య‌త్నం చేశాం. అడ్డంకులు ఎదురైనా, సంస్థ రూ.6,400 కోట్ల న‌ష్టాల్లో ఉన్నా ఆర్టీసీ సిబ్బందిని ప్ర‌భుత్వ ఉద్యోగులుగా మార్చాం. ఏటా రూ.3,600 కోట్ల జీత‌భ‌త్యాల బాధ్య‌త‌ను భుజాన‌కెత్తుకున్నాం. ఇది సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యం. ఆర్టీసీ సిబ్బంది కుటుంబాల్లో ఇది వెలుగులు నింపే ప్ర‌క్రియ‌'' అని బీబీసీతో ఆయన అన్నారు.

''చంద్ర‌బాబు పాల‌న‌లో మాట ఇచ్చి విస్మ‌రించినప్ప‌టికీ జ‌గ‌న్ ప్ర‌భుత్వం చరిత్రలో నిలిచిపోయేలా నిర్ణ‌యం తీసుకుంది. అనుభ‌వ‌జ్ఞులు కూడా సాధ్యం కాద‌ని చెప్పిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం ప‌ట్టుద‌ల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంతో ఇది సాధ్యమైంది. 54వేల మంది ఆర్టీసీ సిబ్బంది కుటుంబాల‌కు దీని వల్ల మేలు కలుగుతుంది. సంక్షేమానికి సంబంధించిన కొన్ని అంశాల్లో త్వ‌ర‌లోనే పూర్తి స్ప‌ష్ట‌త వ‌స్తుంది'' అని పేర్ని నాని చెప్పారు.

ఏపీఎస్‌ఆర్టీసీ

ఫొటో సోర్స్, YSRCPOFFICIAL/FACEBOOK

ఇంకా అస్ప‌ష్ట‌త‌గానే ఉందంటున్న కార్మిక సంఘాలు

ఏపీఎస్‌ఆర్టీసీ సిబ్బందిని ప్ర‌భుత్వంలో విలీనం చేయ‌డం ద్వారా కార్మికుల‌కు మెరుగైన ఫ‌లితాలు ద‌క్కుతాయ‌ని అంతా ఆశించామ‌ని ఆర్టీసీఎస్‌డ‌బ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి సీహెచ్ సుంద‌ర‌య్య బీబీసీతో అన్నారు. కానీ ప్ర‌స్తుతం ఇంకా అస్ప‌ష్ట‌త కొన‌సాగుతోంద‌ని చెప్పారు.

''ప్ర‌స్తుతం ఆర్టీసీలో ఉన్న సౌక‌ర్యాల‌న్నీ సిబ్బందికి కొన‌సాగించాలి. ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేసే పెన్షన్‌పై ఇంకా స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. రివైజ్డ్‌ పెన్షన్‌ పథకం-1989ని అమలు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి. సిబ్బంది రిటైర్మెంట్ ప్రయోజనాల విష‌యం కూడా ఏమీ తేల్చ‌లేదు. ఇలాంటి విష‌యాల‌న్నింటిపైనా ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇచ్చి కార్మికుల ప్ర‌యోజ‌నాలు కాపాడాలి" అని ఆయన అన్నారు.

ఏపీఎస్‌ఆర్టీసీ

ఆర్టీసీ స్టాఫ్ క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌) ఏమ‌వుతుంది?

సిబ్బంది వేత‌నాల నుంచి ఏడు శాతం వాటా తీసుకుని సీసీఎస్ ఏర్పాటు చేశారు. సొసైటీ నిధుల‌ను సభ్యుల సంక్షేమానికి ఖ‌ర్చు చేస్తున్నారు.

పిల్లల విద్య, పెళ్లిళ్లు, ఇళ్లు, స్థలాల కొనుగోలు కోసం సీసీఎస్ నుంచి రుణాలు అందిస్తారు. ప్రస్తుతం రూ.1200 కోట్ల టర్నోవర్‌తో ఈ సొసైటీ నడుస్తోంది.

ప్రభుత్వంలో ఉద్యోగులు విలీనం అయిన తరువాత సీసీఎస్‌ కొనసాగుతుందా? లేదా? ఈ విషయంపై ఇంకా స్పష్టత లేదు.

సీసీఎస్‌ని కొన‌సాగించాల‌ని ఎంప్లాయిస్ యూనియ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పి.దామోద‌ర్ రావు డిమాండ్ చేస్తున్నారు.

''సీసీఎస్‌తో పాటుగా సిబ్బంది వేతనాలతోనే స్టాఫ్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ స్కీం (ఎస్‌ఆర్‌బీఎస్‌) ట్రస్టును ఏర్పాటు చేశారు. ఒక్కొక్క‌రి నుంచి రూ.250కి చొప్పున తీసుకుంటారు. యాజమాన్యం కూడా కొంత సొమ్మును జమ చేసేది. రిటైర్మెంట్ త‌ర్వాత జ‌మ చేసిన మొత్తం నుంచి పెన్షన్‌ రూపంలో ఇప్ప‌టి వ‌ర‌కూ అందించారు. రిటైరైన ఉద్యోగి మరణిస్తే ఉద్యోగి భార్యకు ఈ పథకం నుంచి అందే మొత్తంలో సగం ఇస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తార‌న్న‌ది ఇంకా చెప్ప‌లేదు. ఆర్టీసీలో పరిమితిలేని వైద్య పథకం అమల్లో ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల వైద్య పథకానికి పరిమితి ఉంది. పరిమితి లేని వైద్య సౌకర్యాన్ని కొనసాగించాలి. ఈ విష‌యంలోనూ ప్ర‌భుత్వం ఇంకా వైఖ‌రి తేల్చ‌లేదు'' అని ఆయన బీబీసీతో అన్నారు.

విజయవాడ బస్టాండు
ఫొటో క్యాప్షన్, విజయవాడ బస్టాండు

రిటైర్డ్ ఉద్యోగుల సంగతేంటి?

ప్ర‌స్తుతం విధులు నిర్వ‌ర్తిస్తున్న సిబ్బంది అంద‌రినీ ప్ర‌భుత్వంలో విలీనం చేసిన త‌రుణంలో ఇప్ప‌టి వ‌ర‌కూ సంస్థ‌కు సేవ‌లందించి రిటైర్ అయినవారి భ‌విత‌వ్యం గురించి సందేహాలు తలెత్తుతున్నాయి.

రిటైర్డ్ సిబ్బంది విష‌యంలో వారిని కూడా ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగులుగా పరిగణిస్తారా? లేదా? అన్న‌ది ఇంకా తేల్చ‌లేదని రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియ‌న్ నాయ‌కుడు గ‌ద్దె ర‌వీంద్ర‌రావు తెలిపారు.

తమకు విలీనం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయనే విష‌యంలో అయోమయం నెలకొంద‌ని, ప్ర‌స్తుతం అందిస్తున్న నామ‌మాత్ర‌పు పెన్ష‌న్ స్థానంలో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు అందించే పెన్ష‌న్ ద‌క్కుతుంద‌ని ఆశిస్తున్నామ‌ని ఆయ‌న చెప్పారు.

వి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)