సీఏఏ - ఎన్‌ఆర్‌సీ నిరసనలు: కర్ణాటకలో పోలీసు కాల్పుల మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున తృణమూల్ కాంగ్రెస్ సాయం

ఫొటో సోర్స్, ANNU PAI
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ ప్రతినిధి
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించిన 48 గంటల లోపే.. ఆమె పార్టీ ప్రతినిధి బృందం.. కర్ణాటకలోని మంగళూరు నగరంలో పోలీసు కాల్పుల్లో చనిపోయిన ఇద్దరు బాధితుల కుటుంబాలకు రూ. 5 లక్షలు చొప్పున చెక్కులు అందజేసింది.
పోలీసు కాల్పుల మృతులు మొహమ్మద్ జలీల్, నౌషీన్‌ల కుటుంబాలను తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధులు, పార్లమెంటు సభ్యులు దినేష్ త్రివేది, నదీముల్లా హక్‌లు పరామర్శించారు. గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు.
పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరుల జాబితాలను వ్యతిరేకిస్తూ మంగళూరులో ఆందోళనలు జరిగినపుడు పోలీసు కాల్పుల్లో జలీల్, నౌషీన్‌లు చనిపోయారు. ఆందోళనకారులు బందర్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయటంతో తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు.
''ఇది మానవతా సాయం. రాజకీయాలేమీ లేవు. ఇక్కడి (బీజేపీ) ప్రభుత్వం పరిహారం ప్రకటించింది కానీ ఇంతవరకూ ఇవ్వలేదు. అది పుండు మీద కారం చల్లటం లాంటిది. మమతా బెనర్జీ ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తారు'' అని దినేష్ త్రివేది బీబీసీ హిందీతో అన్నారు.

ఫొటో సోర్స్, ANNU PAI
తృణమూల్ ప్రతినిధి బృందం తమకు ''సంతాపం తెలియజేయటానికి వచ్చింది... మా ఆవేదనను ఓపికగా విన్నారు'' అని బాధితుల కుటుంబ సభ్యులు బీబీసీకి చెప్పారు.
''నా సోదరుడు సమీపంలోని చేపల మార్కెట్‌లో రోజు వారీ కార్మికుడుగా పనిచేసేవాడు. ఆ రోజు మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. పిల్లలను ఇంట్లో వదిలిపెట్టి మధ్యాహ్నం ప్రార్థనలు చేయటానికి మసీదుకు వెళ్లాడు. అప్పుడు సాయంత్రం 4:30 - 5 గంటలు అవుతోంది. ఆ మసీదు 50 - 100 మీటర్ల దూరం కూడా లేదు. అతడి మీద ఎందుకు కాల్పులు జరిపారో మాకు తెలియదు'' అని జలీల్ సోదరుడు మొహమ్మద్ యాహ్యా బీబీసీ హిందీతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తంచేశారు.
''నౌషీన్ వెల్డింగ్ షాపులో పనిచేస్తున్నాడు. దగ్గర్లో పరిస్థితి సమస్యాత్మకంగా ఉంది కాబట్టి మసీదుకు వెళ్లి అటునుంచి ఇంటికి వెళ్లిపోవాలని అతడి యజమాని చెప్పాడు. మసీదుకు వెళ్లే దారిలో అతడు పోలీసు కాల్పుల్లో చనిపోయాడు'' అని నౌషీన్ సోదరుడు నౌఫాల్ చెప్పారు.

ఫొటో సోర్స్, ANNU PAI
''మాకు డబ్బులు అందాయి. కానీ మాకు న్యాయం కావాలి. డబ్బులు అంత ముఖ్యం కాదు. మేం మా ముఖ్యమంత్రి (బి.ఎస్.యడ్యూరప్ప)ను కలిసినపుడు కూడా మాకు న్యాయం కావాలని ఆయనకు స్పష్టంగా చెప్పాం. పరిహారం ఇస్తామని చెప్పింది ఆయనే'' అని నౌఫాల్ పేర్కొన్నారు.
తన సోదరుడు ఇద్దరు పిల్లలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని యాహ్యా తెలిపారు. ''అవును.. పరిహారం ఇస్తామని మా ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో మాకు తెలీదు'' అని చెప్పారు.
పోలీసు కాల్పుల్లో మరణించిన ఇద్దరి కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటించారు. అయితే.. ఇద్దరు మృతులు నిరసనల్లో పాలుపంచుకున్నారని చూపే వీడియోలు ఉన్నాయని పోలీసులు చెప్పటంతో మరుసటి రోజు ఆయన మనసు మార్చుకున్నారు.

ఫొటో సోర్స్, ANNU PAI
మృతులు ఇద్దరూ నిరసనల్లో కానీ, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటంలో కానీ పాలుపంచుకోలేదని సీఐడీ, మెజిస్టీరియల్ విచారణల్లో తేలిన తర్వాత.. వారిద్దరి కుటుంబాలకు పరిహారం అందిస్తామని యడ్యూరప్ప హామీ ఇచ్చారు.
ఆ ఇద్దరు మృతులకు పరిహారం చెల్లిస్తామని మమతా బెనర్జీ ప్రకటించిన వెంటనే.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ''రాజకీయాలు చేస్తున్నారు'' అంటూ కర్ణాటక బీజేపీ నాయకులు మండిపడ్డారు.
''వాళ్లను ఏమైనా అనుకోనివ్వండి. గాయపడిన వారిని కలవటానికి మేం ఆస్పత్రికి వెళ్లాం. పోలీసులు.. ఆందోళనకారులను చెదరగొట్టటానికి కాకుండా చంపటానికి కాల్పులు జరిపినట్లు కనిపిస్తోంది. ఆస్పత్రిలో విద్యార్థులు ఉన్నారు. సాధారణ కార్మికులు ఉన్నారు. విద్యార్థుల చదువులు దెబ్బతినకూడదు. మేం ఏమీ ప్రకటించలేదు. అవసరమైన సాయం మేం అందిస్తాం. కానీ వారికి సాయం చేసేటపుడు మేం మతం గురించి ఆలోచించం. వారు ధరించిన దుస్తుల గురించీ పట్టించుకోం'' అని దినేష్ త్రివేది పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'పర్యటకులు మమ్మల్ని అసభ్యంగా తాకారు': థీమ్ పార్కు డిస్నీ పాత్రల ఫిర్యాదు
- హరికేన్‌తో కకావికలమై భవిష్యత్తు కోసం పోరాడుతున్న ఓ ద్వీపం కథ
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్‌లో ఎందుకు కొనసాగుతోంది
- ఐయూడీ: ఈ పరికరంతో గర్భం రాదు... ఎక్కువ మంది మహిళలు వాడట్లేదు
- ఫోల్డింగ్ ఫోన్ల మీద శాపం 2020లో తొలగిపోతుందా?
- శాండా బల్లి: మనుషుల 'మగతనం' కోసం ప్రాణాలు అర్పిస్తున్న ఎడారి జీవి
- ఫేస్‌బుక్‌కు ఒక కోడ్ పంపించారు.. భారీ మొత్తంలో నగదు బహుమతి కొట్టేశారు..
- ఏడాదిలో జార్ఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి నరేంద్ర మోదీ, అమిత్ షా వైఫల్యమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









