ఏపీ ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌.. హైకోర్టు తీర్పుతో బాధ్యతలు చేపట్టిన ఎస్ఈసీ

నిమ్మగడ్డ రమేశ్ కుమార్
ఫొటో క్యాప్షన్, నిమ్మగడ్డ రమేశ్ కుమార్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌(ఎస్ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది.

నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌నే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

కాగా హైకోర్టు తనను తిరిగి నియమిస్తూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తాను తిరిగి బాధ్యతలు చేపట్టానంటూ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పత్రికా ప్రకటన ఒకటి విడుదల చేశారు.

గతంలో మాదిరిగానే నిష్పాక్షికంగా తన విధులు తాను నిర్వర్తిస్తానని రమేశ్ కుమార్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే రాజకీయ పార్టీలు, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ముఖ్యులతో సంప్రదించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పునరుద్ధరిస్తానని చెప్పారు.

వ్యక్తులు శాశ్వతం కాదని, రాజ్యాంగ సంస్థలు, విలువలే శాశ్వతమని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

ఏపీ హైకోర్టు

ఫొటో సోర్స్, Andhrapradesh highcourt

ఫొటో క్యాప్షన్, ఏపీ హైకోర్టు

ఏమిటీ వివాదం?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ విష‌యంలో ఈ వివాదం మొద‌లైంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో హైకోర్టు తీర్పు కార‌ణంగా రిజ‌ర్వేష‌న్ల అంశంలో మార్పుల‌తో స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ చేప‌ట్టారు. వేగంగా పూర్తి చేసే ఉద్దేశంతో మార్చి నెల‌లో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌తో పాటుగా మునిసిప‌ల్, పంచాయితీ ఎన్నిక‌ల‌కు కూడా రంగం సిద్ధం చేశారు.

జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్ల ప్ర‌క్రియ పూర్తికాగా, మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు నామినేష‌న్లు దాఖ‌లు చేయ‌డం పూర్తి అయ్యింది.

జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGANMOHANREDDY

పంచాయితీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తార‌ని అంతా భావించిన స‌మావేశంలో అనూహ్యంగా మొత్తం ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను తాత్కాలికంగా నిలుపివేస్తున్న‌ట్టు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ప్ర‌క‌టించారు.

ఎస్ఈసీ నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వం తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ నేరుగా, వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ కులాన్ని కూడా ప్ర‌స్తావించారు. విచ‌క్ష‌ణాధికారం అంద‌రికీ అల‌వాటుగా మారిందంటూ మండిప‌డ్డారు.

ప్ర‌తిప‌క్ష నేత ఆదేశాల‌కు అనుగుణంగా, రాసి ఇచ్చిన ఉత్త‌ర్వులు చ‌దివారంటూ విమ‌ర్శ‌లు కూడా గుప్పించారు. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా ఎన్నిక‌లు వాయిదా వేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లారు.

క‌రోనా మహమ్మారి విజ‌ృంభిస్తున్న నేప‌థ్యంలో నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఎస్ఈసీ ప్ర‌క‌టించ‌గా, వైద్య ఆరోగ్య శాఖ‌తో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితో గానీ క‌నీసం సంప్ర‌దించ‌కుండా నిర్ణ‌యం తీసుకోవ‌డాన్ని ప్ర‌భుత్వం త‌రుపున స‌వాల్ చేశారు.

సుప్రీంకోర్టు మాత్రం రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం అధికారాల్లో జోక్యం చేసుకోలేమని చెబుతూనే వాయిదా వేసేముందు సంబంధిత అధికారుల‌తో సంప్ర‌దించి ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించింది.

జస్టిస్ కనగరాజ్ బాధ్యతల స్వీకరణ
ఫొటో క్యాప్షన్, జస్టిస్ కనగరాజ్ బాధ్యతల స్వీకరణ

రాష్ట్రాల స్థాయిలో ఎన్నిక‌ల సంఘాల‌ను 1994లో నియ‌మించారు. ఆర్టిక‌ల్ 243కే ప్ర‌కారం ఎస్ఈసీ ఆవిర్భ‌వించింది.

దానికి అనుగుణంగా ప్ర‌స్తుతం బాధ్య‌త‌ల్లో ఉన్న ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ని 2016 జ‌న‌వ‌రి 30న నాటి ప్ర‌భుత్వం నియ‌మించింది.

నాటి చ‌ట్టం ప్ర‌కారం ఎస్ఈసీ ప‌ద‌వికి రాష్ట్ర స్థాయిలో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో ఉన్న ఐఏఎస్ అధికారికి అర్హ‌త ఉండేది. ఐదేళ్ల ప‌ద‌వీకాలం ఉంటుంది.

ఆ చ‌ట్టంలో మార్పులు చేస్తూ ఎస్ఈసీ ప‌ద‌వీకాలం మూడేళ్ల‌కు ఏప్రిల్ 2020లో కుదించారు.

అలాగే, హైకోర్టు జడ్జిగా పనిచేసిన వాళ్లే ఈ పదవికి అర్హులని, ఒకవేళ హైకోర్టు జడ్జి కానివాళ్లు ఎవరైనా ఈ పదవిలో నియమించబడి ఉంటే.. శుక్రవారం నుంచి వారు ఆ పదవిలో కొనసాగేందుకు అనర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఈ బాధ్య‌త‌లు స్వీక‌రించి నాలుగేళ్లు దాటింది. ఆయన ఇప్పటి వరకూ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేయలేదు.

ఈ నేపథ్యంలో జీఓ 618ను ప్రభుత్వం విడుదల చేసింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది.

ఎస్ఈసీ ప‌ద‌వీకాలం కుదించి, అర్హతలు మార్చి, రమేశ్ కుమార్ స్థానంలో మరొకరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో వివాదం రాజుకుంది.

గ‌వ‌ర్న‌ర్ ఆమోదంతో ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు అప్పట్టో ప్రభుత్వం పేర్కొంది. దీని ప్ర‌కారం ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను ప‌ద‌వి నుంచి తొల‌గించేందుకు త‌గ్గ‌ట్టుగా చ‌ట్టంలో మార్పులు చేసింది.

మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజును ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

దీనికి సంబంధించి జీవో 619ని ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసింది.

జస్టిస్ కనగరాజు తొమ్మిదేళ్ల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ నియామకాన్ని, ఆయన బాధ్యతలు స్వీకరించే విషయాన్ని చివరి నిమిషం వరకూ ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.

అయితే, ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చెల్ల‌ద‌ని విప‌క్షాలు వాదించాయి.

గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను గెజిట్‌లో పొందుపరుస్తున్నట్లుగా న్యాయ శాఖ విడుదల చేసిన జీఓ 31

ఫొటో సోర్స్, AP govt

ఫొటో క్యాప్షన్, గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను గెజిట్‌లో పొందుపరుస్తున్నట్లుగా న్యాయ శాఖ విడుదల చేసిన జీఓ 31

జీవోలు, ఆర్డినెన్సులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

దీంతో ఆర్డినెన్స్ నంబర్ 5/2020 విడుదల అయ్యింది. ఈ ఆర్డినెన్స్‌ను రాష్ట్ర గెజిట్‌లో పొందుపరుస్తున్నట్లుగా న్యాయ శాఖ జీఓ 31 జారీ చేసింది.

ఈ మేరకు న్యాయ శాఖ జీఓ31, పంచాయితీరాజ్ శాఖ జీఓ 617, 618లను విడుదల చేశాయి.

ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 617

ఫొటో సోర్స్, AP govt

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 617

జీఓ 617లో ఏముంది?

రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల్ కృష్ణ ద్వివేదీ శుక్రవారం జీఓ 617ను విడుదల చేశారు. వాస్తవానికి శుక్రవారం రాత్రి 9.25 గంటల వరకూ ఈ జీఓను కాన్ఫిడెన్షియల్ అని ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత వీటిని బహిర్గతం చేశారు.

ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ చట్టం 1994 సెక్షన్ 200 ప్రకారం గతంలో జారీ చేసిన అన్ని ఆదేశాలను, నియమాలను రద్దు చేస్తూ.. కొత్త నియమాలను పొందుపరుస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నియమాల ప్రకారం.. హైకోర్టు జడ్జిగా పనిచేసిన వ్యక్తి మాత్రమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియామకానికి అర్హులు. ఈ అర్హత లేనివాళ్లు ఎవరైనా ఆ పదవిలో నియమించబడినట్లైతే వారు ఈ ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి ఆ పదవిలో కొనసాగేందుకు అనర్హులు.

స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ పదవిలో మూడేళ్లు మాత్రమే కొనసాగుతారు. అయితే, కమిషనర్‌ను మరో మూడేళ్ల కాలానికి పునఃనియమించొచ్చు.

అయితే, ఏ ఒక్కరూ ఆరేళ్లకు మించి ఈ పదవిలో కొనసాగేందుకు ఆస్కారం లేదు.

బొత్స సత్యనారాయణ(కుడివైపు)

ఫొటో సోర్స్, facebook/botcasayanarayana

ఫొటో క్యాప్షన్, బొత్స సత్యనారాయణ(కుడివైపు)

హైకోర్టు తీర్పుపై ఎవరేమన్నారు?

కోర్టు తీర్పు పరిశీలిస్తున్నాం: మంత్రి బొత్స సత్యనారాయణ

గవర్నర్ ఆమోదంతో అమలులోకి వచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చిందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తీర్పుని పరిశీలిస్తున్నామని.. పూర్తి సారాంశం వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని బీబీసీతో ఆయన అన్నారు.

కోర్టు తీర్పుపై సీనియర్ న్యాయవాదులతో చర్చిస్తున్నామని.. కోర్టు తీర్పు పూర్తి పాఠం వచ్చిన తరువాత పరిశీలించి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే అంశాన్ని నిర్ణయిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

కామినేని శ్రీనివాస్

ఫొటో సోర్స్, Dr. Kamineni Srinivas

ఫొటో క్యాప్షన్, జేపీ నడ్డాతో కామినేని శ్రీనివాస్

ఇకనైనా మారాలి: పిటిషనర్ కామినేని శ్రీనివాస్

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను పునర్నియమించాలన్న హైకోర్టు తీర్పుపై పిటిషనర్, మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసింది రాజ్యాంగ ఉల్లంఘనేనన్నారు.

తాను తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అనుమతితోనే పిటిషన్ వేశానని తెలిపారు.

కరోనా విజృంభణ జరుగుతోన్న సమయంలో ఆ విషయాన్ని తీసిపారేస్తూ ఏపీ ప్రభుత్వం మొదట్లో వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరంగా ఉందని కామినేని అన్నారు.

కరోనా నేపథ్యంలో ఎస్ఈసీ ఎన్నికలు వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు. ఎవరైనా ఏదైనా చేసినప్పుడు ఇకనైనా పాజిటివ్‌ గా తీసుకోవాలని ఆయన సీఎం జగన్‌కు సూచించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిన తీర్పు: పవన్ కల్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమిషనర్ ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.

‘‘ఈ తీర్పు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఊపిరిపోసింది. ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు విశ్వాసాన్ని ఇనుమడింపచేసింది.

రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన వ్యవస్థలను ప్రభుత్వాలు తమకు నచ్చిన విధంగా మార్చుకోవాలని చూస్తే న్యాయ విభాగాలు రక్షిస్తాయి అనే విషయాన్ని రాష్ట్ర హైకోర్టు తీర్పు ద్వారా మరోమారు అవగతమైంది.

రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి కొనసాగించాలనే తీర్పును తక్షణమే అంగీకరించి- రాజ్యాంగాన్ని, చట్టాన్ని గౌరవించాలి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభీష్టానికి భిన్నంగా వెళ్లారనే కారణంతోనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను లక్ష్యంగా చేసుకున్నారు.

ఆ రోజు ఆయన ఎన్నికల కమిషనర్ హోదాలో కరోనా విపత్తు ఎంత ప్రమాదకరమైనదో గ్రహించి ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేశారు.

అప్పుడు ముఖ్యమంత్రి స్పందించిన తీరుని ప్రజాస్వామ్యవాదులెవరూ హర్షించలేదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అధికారిపై ముఖ్యమంత్రితోపాటు, అధికార పక్షంవాళ్లు చేసిన వ్యాఖ్యలు వారి ధోరణిని వెల్లడించాయి.

కరోనాతో అందరూ ఆందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం ఎన్నికల కమిషనర్ ను తప్పించే ప్రక్రియపై దృష్టిపెట్టి రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్స్‌ను కూడా పరిగణనలోకి తీసుకోలేదు.

రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పని చేయడం, నిర్ణయాలు తీసుకోవడం అవసరం అని ప్రభుత్వం ఈ తీర్పు ద్వారా తెలుసుకోవాలి.

ఏకస్వామ్య ప్రభుత్వంగానో, నియంతృత్వ ధోరణితోనో పాలన సాగిస్తే న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యానికి రక్షణ లభిస్తుందని గ్రహించాలి. అధికార యంత్రాంగం కూడా పాలకులకు రాజ్యాంగం గురించీ, చట్టం గురించీ అవగాహన కల్పించాలి. లేదంటే న్యాయ స్థానాల ముందు జవాబు చెప్పుకోవాల్సింది అధికార యంత్రాంగమే’’నని పవన్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

హైకోర్టు తీర్పు నియంతపాలనకి చెంపపెట్టు: బుద్ధా వెంకన్న

‘‘కరోనా నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోరి ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గారికి న్యాయం జరిగింది.ఇప్పటికైనా ప్రభుత్వ ఆలోచనా ధోరణిలో మార్పువస్తుంది అని ఆశిస్తున్నా.మీకు అధికారం కట్టబెట్టింది అభివృద్ధి చేస్తారని,అరాచకం సృష్టిస్తారని కాదు.మేమింతే అంటే మరోసారి జగన్ గారు,విజయసాయి రెడ్డి గారు జైలుకి వెళ్లడం ఖాయం’’ అంటూ తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)