వరంగల్ హత్యల దోషికి ఉరిశిక్ష: ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపాడు

వరంగల్ హత్యలు
ఫొటో క్యాప్షన్, మూడేళ్ల బాలుడి సహా తొమ్మిది మంది దారుణంగా హత్యకు గురయ్యారు

ఒక హత్యను కప్పిపుచ్చుకునేందుకు మరో తొమ్మిది మందిని హతమార్చిన వ్యక్తికి కోర్టు ఉరిశిక్ష విధించింది.

బిహార్‌కు చెందిన 26ఏళ్ల సంజయ్‌కుమార్‌ యాదవ్‌కు మరణశిక్ష విధిస్తూ బుధవారం వరంగల్‌ జిల్లా అదనపు న్యాయమూర్తి కె.జయకుమార్‌ తీర్పునిచ్చారు.

67 మందిని విచారించిన కోర్టు అయిదు నెలల్లోనే తీర్పు వెలువడించింది.

కేసు విచారణ వేగంగా పూర్తి కావడంలో సహకరించిన అందరికీ తెలంగాణ డీజీపీ ధన్యవాదాలు తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

దోషి సంజయ్ కుమార్ యాదవ్ ఎవరు? ఈ నేరం ఎందుకు చేశాడు? ఎలా చేశాడు? తాము కేసు ఎలా ఛేదించామన్నది వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ దర్యాప్తు సమయంలో వివరించారు. ఆయన కథనం ప్రకారం...

అసలు ఏం జరిగింది?

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో గోనె సంచులు తయారుచేసే మిల్లులో మక్సూద్ పనిచేసేవారు.

మక్సూద్ 20 ఏళ్ల కిందట పశ్చిమబెంగాల్ నుంచి కుటుంబం సహా వచ్చి ఇక్కడ పనిచేసుకుంటున్నారు.

మక్సూద్ భార్య కూడా అక్కడే పనిచేస్తుండేవారు. అక్కడే పనిచేసే బిహార్‌కు చెందిన సంజీవ్ కుమార్ యాదవ్‌కు వీరి కుటుంబంతో పరిచయం ఏర్పడింది.

మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా కూడా మక్సూద్ ఇంట్లోనే ఉండేవారు.

భర్తతో విడిపోయిన ఆమెకు ముగ్గురు పిల్లలు. ఆమెతో సంజీవ్‌కు పరిచయం ఏర్పడింది.

ఆ పరిచయం సహజీవనానికి దారితీసింది. గీసుకొండ మండలంలోనే జాన్‌పాక ప్రాంతంలో ఆమెతో కలిసి సంజీవ్ నివసించేవాడు.

అయితే, యుక్త వయసుకు వచ్చిన తన కుమార్తెతోనూ సంజీవ్ చనువుగా ఉంటుండడంతో రఫీకా అతడితో గొడవ పడింది.

వరంగల్ హత్యలు
ఫొటో క్యాప్షన్, వరంగల్ సమీపంలోని ఈ బావిలోనే తొమ్మిది మంది శవాలు వెలుగు చూశాయి

దీంతో రఫీకాను చంపేయాలని నిర్ణయించుకున్న సంజీవ్ అందుకు పథకం రచించాడు.

బిహార్ వెళ్లి తమ కుటుంబ పెద్దల అనుమతి తీసుకుని పెళ్లి చేసుకుందామంటూ రఫీకాను తనతో మార్చి 6న తీసుకెళ్లాడు.

ఆమెతో పాటు విశాఖపట్నం వెళ్లే రైలు ఎక్కి దారిలో మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి, ఆమె మత్తులోకి జారుకున్నాక రైల్లోంచి బయటకు తోసేశాడు.

అనంతరం తిరిగి వరంగల్ చేరుకున్న సంజీవ్‌ను రఫీకా ఏమైందని నిషా నిలదీశారు.

పదేపదే అడుగుతున్నా పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఆమె హెచ్చరించడంతో సంజీవ్ ఈ హత్యా పథకానికి తెర తీశాడు.

మక్సూద్ కుటుంబం మొత్తాన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆ క్రమంలోనే మే 20న మక్సూద్ కుమారుడు పుట్టిన రోజని తెలుసుకుని తన పథకం అమలు చేయడానికి ఆ రోజుని ఎంచుకున్నాడు.

మృతుల ఇంటివద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు
ఫొటో క్యాప్షన్, మృతుల ఇంటివద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు

మత్తులో జారుకున్నాక బావిలో తోసేశాడు

మక్సూద్ కుటుంబాన్నీ మత్తులోకి దించి చంపేయాలని ప్లాన్ చేసి అందుకోసం వరంగల్‌లోని ఒక మందుల దుకాణంలో 60 నిద్ర మాత్రలు కొన్నాడు.

20వ తేదీ రాత్రి మక్సూద్ ఇంటికి వెళ్లి వారు వండుకున్న భోజనంలో ఈ నిద్రమాత్రలు కలిపేశాడు.

అయితే, ఆ పొరుగునే నివసించే బిహారీ కార్మికులు శ్రీరాం, శ్యాంలు తాను వచ్చిన విషయాన్ని ఎక్కడైనా చెబుతారేమోనని వారి గదికి వెళ్లి వారి భోజనంలోనూ నిద్ర మాత్రలు కలిపాడు.

దీంతో మక్సూద్ కుటుంబం, శ్రీరాం, శ్యామ్ అందరూ మత్తులోకి జారుకున్నారు.అందరూ మత్తులోకి వెళ్లాక సంజీవ్ ఒక్కొక్కరినీ ఈడ్చుకుంటూ సమీపంలోని బావిలో పడేశాడు.

అర్ధరాత్రి 12.30 నుంచి వేకున 5 గంటల మధ్య సంజీవ్ ఈ హత్యాకాండ సాగించాడని పోలీసులు తెలిపారు.

హత్యలు జరిగింది ఈ గోడౌన్ దగ్గరే
ఫొటో క్యాప్షన్, హత్యలు జరిగింది ఈ గోడౌన్ దగ్గరే

ఎలా దొరికిపోయాడంటే..

సంజీవ్ ఈ హత్యలు చేయడానికి ముందే అక్కడ రెక్కీ నిర్వహించాడు.

హత్య చేయడానికి ముందు నాలుగైదు రోజులు వరుసగా మక్సూద్ ఇంటివైపు వచ్చి పరిసరాలన్నీ పరిశీలించాడు.

గొర్రెకుంట, గోదాం ప్రాంతాల్లోని సీసీ కెమేరాల్లో సంజీవ్ రాకపోకలన్నీ రికార్డయ్యాయి.

దీంతో సంజీవ్‌ని అనుమానించి విచారించగా నేరాన్ని అంగీకరించాడని కమిషనర్ రవీందర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)