పింజ్రా తోడ్: దేవాంగన కలిటాకు బెయిల్ మంజూరు చేసిన దిల్లీ హైకోర్టు

దేవాంగన కలిటా

ఫొటో సోర్స్, Pinjra tod

సీఏఏ వ్యతిరేక అల్లర్ల కేసులో అరెస్టై జైలులో ఉన్న పింజ్రా తోడ్ సంస్థ సభ్యురాలు దేవాంగన కలిటాకు దిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

దేవాంగన తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. దేవాంగన సీఏఏ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నారే కానీ హింసలో ఆమె పాత్ర లేదని ట్రయల్ కోర్టు చెప్పిందని సిబల్ హైకోర్టుకు తెలిపారు.

సీసీ టీవీ ఫుటేజీల్లో కూడా ఆమె కనిపించలేదని, ఆమె ప్రసంగ కాపీ కూడా లేదని దిల్లీ పోలీసులు చెప్పారని సిబల్ కోర్టు దృష్టికి తెచ్చారు.

దేవాంగన అరెస్టుకు ప్రాతిపదికగా తీసుకున్న షారూక్ వాంగ్మూలంలోనూ ఆమె పేరును ప్రస్తావించలేదని సిబల్ చెప్పారు.

కాగా నిరసనలు, హింసలో పాల్గొన్న అందరి వీడియో ఫుటేజ్ సంపాదించడం సాధ్యం కాదని అదనపు సొలిసిటర్ జనరల్ వాదించారు.

రెండు వైపుల వాదనలు విన్న జస్టిస్ సురేశ్ కుమార్ ఏకసభ్య ధర్మాసనం ఆమెకు బెయిలు మంజూరు చేసింది.

నటాషా, దేవాంగన

ఫొటో సోర్స్, TWITTER@PINJRATOD

ఇంతకీ దేవాంగన ఎవరు?

బాలికలు, యువతుల స్వేచ్ఛ కోసం ఉద్యమిస్తున్న 'పింజ్రా తోడ్' వ్యవస్థాపక సభ్యురాలు దేవాంగన. మరో సభ్యురాలు నటాషా నార్వాల్, దేవాంగనలను ఈశాన్య దిల్లీలో మత హింసకు సంబంధించిన కేసులో మే నెలలో అరెస్టు చేశారు. అప్పుడే కోర్టు వారికి బెయిల్ మంజూరు చేయగా.. పోలీసులు వెంటనే మరో కేసులో వారిద్దరినీ అరెస్ట్ చేశారు.

ఆ వెంటనే మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరచగా.. మెజిస్ట్రేట్ అజిత్ నారాయణ్ బెయిల్ ఇవ్వాలని నిర్ణయించారు.

వెంటనే దిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఒక పోలీసు అధికారి.. కోర్టుకు మరో దరఖాస్తు సమర్పించారు. మరో అల్లర్లు, హత్య కేసులో వారిని అరెస్ట్ చేసి, ఇంటరాగేట్ చేయటానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

దీంతో పింజ్రా తోడ్ (పంజరాన్ని బద్దలు కొట్టు) ఉద్యమానికి చెందిన ఈ ఇద్దరు యువతులను పోలీసు కస్టడీకి పంపించారు.

పింజ్రా తోడ్

ఫొటో సోర్స్, AMAL KS/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

అప్పట్లో కోర్టులో ఏం జరిగింది?

ఈ ఇద్దరు యువతులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ.. వారిని పోలీసు కస్టడీకి అప్పగించటం అవసరమని పోలీసులు విచారణ సందర్భంగా కోరారు. నిందితుల తరఫున హాజరైన న్యాయవాదులు.. ఈ ఆరోపణలను దురుద్దేశంతో చేశారని, అందులో బలం లేదని వాదించారు.

ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ను ఫిబ్రవరి 24న నమోదు చేశారని.. నటాషా, దేవాంగనలు పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఈ కేసులో వారికి బెయిల్ ఇవ్వాలని కోరారు.

ఈ కేసులో బెయిల్ ఇస్తూ జడ్డి అజిత్ నారాయణ్ ఆదేశాలు ఇచ్చిన వెంటనే.. ఇద్దరు నిందితులూ మరో కేసులో కూడా నిందితులని, వారిని అరెస్ట్ చేసి, విచారించటానికి తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు మరో దరఖాస్తును సమర్పించారు.

ఇద్దరు యువతులను 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరారు. ఈ కేసు హత్యకు సంబంధించిన కేసు అని.. తదుపరి దర్యాప్తు కోసం పోలీస్ కస్టడీ అవసరమని పేర్కొన్నారు.

ఈసారి.. యువతుల తరఫు న్యాయవాదులు దీనికి వ్యతిరేకించినప్పటికీ.. నటాషా నార్వాల్, దేవాంగన కలిటాలను రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోర్టు నిర్ణయించింది.

ఈ ఇద్దరు యువతుల మీద.. హత్యతో పాటు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం, ఆయుధాల చట్టం ఉల్లంఘన ఆరోపణలు కూడా చేశారు.

ఈశాన్య దిల్లీలో ఫిబ్రవరి 24వ తేదీన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించే వారు, సమర్థించే వారి మధ్య హింస చెలరేగింది. ఆ హింసలో 53 మంది చనిపోగా 200 మంది గాయపడ్డారు.

సీఏఏ వ్యతిరేక నిరసన

ఫొటో సోర్స్, ADIL ABASS/BARCROFT MEDIA VIA GETTY IMAGES

ఇప్పటివరకూ అరెస్టులు...

ఏప్రిల్ ఆరంభంలో పోలీసులు ఆ అల్లర్లకు కుట్ర పన్నారంటూ పలువురు విద్యార్థి ఉద్యమకారులను అరెస్ట్ చేశారు. వీరు.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనల్లో ముందున్న వారు కావటం విశేషం. వీరి మీద అత్యంత కఠినమైన 'చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం' (యూఏపీఏ)ను పోలీసులు ప్రయోగించారు.

అరెస్టులన్నీ చట్టం పరిధిలోనే చేశామని, వీరు అల్లర్లను రెచ్చగొట్టారనటానికి ఆధారాలు ఉన్నాయని దిల్లీ పోలీసులు చెప్తున్నారు.

జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులు 10 మందిని దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఎంఫిల్ విద్యార్థిని, జామియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యురాలు సఫురా జార్గార్, పీహెచ్‌డీ విద్యార్థి మీరాన్ హైదర్, జామియా అల్యూమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు షిపా-ఉర్-రెహ్మాన్ తదితరులు ఉన్నారు. ఎఫ్ఐఆర్‌లో యూఏపీఏ సెక్షన్లను కూడా చేర్చారు. కాబట్టి ఈ కేసులో అరెస్ట్ అయిన వారిని ఇదే చట్టం కింద విచారిస్తారు.

సఫూరా జార్గార్

ఫొటో సోర్స్, SAFOORA ZARGAR FB

దక్షిణ దిల్లీలోని జామియా క్యాంపస్‌కు దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాఫ్రాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కింద.. ఫిబ్రవరి 24న సఫురా (27)ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమెకు ఏప్రిల్ 13న మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.

అయితే.. ఆ కేసులో బెయిల్ మీద విడుదల చేయటానికి బదులు.. పోలీసులు ఆమెను మార్చి 6వ తేదీన నమోదైన రెండో ఎఫ్ఐఆర్ కింద అరెస్ట్ చేశారు. అది కూడా యూఏపీఏ కింద నమోదైన కేసే.

జామియాలో పీహెచ్‌డీ విద్యార్థి మిరాన్ హైదర్‌ను కూడా మార్చి 6వ తేదీ నాటి ఇదే ఎఫ్ఐఆర్ కింద అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపించారు. దిల్లీ అల్లర్ల కేసులో ప్రశ్నించటానికి ఏప్రిల్ 1వ తేదీన మిరాన్‌ను పిలిపించిన పోలీసులు.. అదే రోజు రాత్రి అతడిని అరెస్ట్ చేశారు.

ఇదే ఎఫ్ఐఆర్‌లో జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు ఒమర్ ఖాలిద్‌ పేరు కూడా చేర్చారు. అయితే ఆయనను ఇంకా అరెస్ట్ చేయలేదు. కానీ ఇదే ఎఫ్ఐఆర్ కింద జామియా అల్యూమ్నీ అసోసియేషన్ అధ్యక్షుడు షిపా-ఉర్-రెహ్మాన్‌ను దిల్లీ పోలీసులు ఏప్రిల్ 26న అరెస్ట్ చేశారు.

కపిల్ మిశ్రా

ఫొటో సోర్స్, RAVI CHOUDHARY/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఈశాన్య దిల్లీ హింసకు సంబంధించి బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా మీద కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. హింసను రెచ్చగొట్టారంటూ ఆయన మీద కూడా ఫిర్యాదు నమోదైంది. కానీ పోలీసులు ఇప్పటివరకూ ఆయన మీద ఎటువంటి చర్యలూ చేపట్టలేదు.

సీఏఏ, ఎన్ఆర్‌సీ (పౌరుల జాతీయ జాబితా)లను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 22న జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ కింద జనం నిరసన చేపట్టారు. ఆ పక్కనే ఉన్న బాబర్‌పూర్ మెట్రో స్టేషన్ కింద బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా.. సీఏఏకు మద్దతుగా ప్రదర్శన ప్రారంభించారు. కొద్దిసేపటికే.. సీఏఏ మద్దతుదారులు - వ్యతిరేకుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ మరుసటి రోజు హింస చెలరేగి అల్లర్ల రూపం తీసుకుంది.

హింసను ప్రేరేపించారంటూ కపిల్ మిశ్రా మీద ఒక ఫిర్యాదు నమోదైంది. కానీ ఆయన మీద చట్టపరంగా ఎటువంటి చర్యా తీసుకోలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)