హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ సీనియర్: 3 ఒలింపిక్స్‌‌లలో 3 స్వర్ణ పతకాలు అందించిన ఆటగాడు

బల్బీర్‌ సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రేహాన్ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1948. భారత్, ఇంగ్లండ్ మధ్య లండన్‌లోని వెంబ్లీ స్టేడియంలో హాకీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ప్రేక్షకులందరూ గట్టిగా ‘కమాన్ బ్రిటన్.. కమాన్ బ్రిటన్’ అని అరుస్తున్నారు.

సన్నగా చినుకులు పడుతుండడంతో మైదానం తడిగా జారుతోంది. దాంతో కిషన్ లాల్, కేడీ సింగ్ బాబు ఇద్దరూ తమ బూట్లు తీసేసి వట్టి కాళ్లతోనే ఆడడం ప్రారంభించారు.

ఫస్ట్ హాఫ్‌లో వాళ్లిద్దరూ ఇచ్చిన పాస్‌లను బల్బీర్ సింగ్ టాప్ ఆఫ్ డీ నుంచి షాట్ కొట్టారు. భారత్‌ను 2-0 ఆధిక్యంతో నిలిపారు.

బల్బీర్‌ సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, BHARTIYAHOCKEY.ORG

ఫొటో క్యాప్షన్, 1948 లండన్ ఒలింపిక్స్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో గోల్ చేసినపుడు బల్బీర్‌ సింగ్

ఆట ముగుస్తున్న సమయానికి అది 4-0కు పెరిగింది. భారత్ స్వర్ణ పతకానికి చేరువలో ఉంది. విజిల్ మోగగానే బ్రిటన్‌లో అప్పటి భారత హైకమిషనర్ కృష్ణ మీనన్ పరిగెత్తుకుని మైదానంలోకి వెళ్లారు. భారత ఆటగాళ్లను హత్తుకోవడం మొదలెట్టారు.

తర్వాత ఆయన భారత హాకీ టీమ్ కోసం ఇండియా హౌస్‌లో సత్కారం ఏర్పాటు చేశారు. దానికి లండన్ ప్రముఖ క్రీడాభిమానులను ఆహ్వానించారు.

ఆ జట్టు తిరిగి భారత్ వస్తున్నప్పుడు వారి నౌక ముంబయి దగ్గర బలహీనమైన ఆటుపోట్లలో చిక్కుకుపోయింది. ఆ ఒలింపిక్ క్రీడల్లో స్టార్ అయిన బల్బీర్ సింగ్‌ నౌకలోంచే తన మాతృభూమిని చూడాల్సి వస్తోంది. ఆ పరిస్థితుల్లో ఆయన పూర్తిగా రెండు రోజులు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆటుపోట్లు పెరిగిన తర్వాత వారి నౌక ముంబయి రేవుకు చేరుకుంది.

బల్బీర్‌ సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1948లో లండన్‌లో నాటి భారత హైకమిషనర్ కృష్ణ మీనన్‌తో (ఎడమ), 1956లో మెల్బోర్న్‌లో స్వర్ణ పతకం అందుకుంటూ బల్బీర్ సింగ్

నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో

కానీ, ఆలోపే చాలామంది క్రీడాభిమానులు హాకీలో స్వర్ణ పతకం తీసుకువచ్చిన జట్టుకు శుభాకాంక్షలు చెప్పడానికి ఆ నౌకపైకి చేరుకున్నారు.

కొన్ని రోజుల తర్వాత దిల్లీ నేషనల్ స్టేడియంలో ఒలింపిక్ విజేతలకు, మిగతా భారత జట్టుకు మధ్య ఒక ఎగ్జిబిషన్ హాకీ మ్యాచ్ జరిగింది. దాన్ని చూడ్డానికి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ కూడా స్టేడియంలో ఉన్నారు. ఆ మ్యాచ్‌లో విన్నింగ్ గోల్ కొట్టిన బల్బీర్ సింగ్ సీనియర్ ఒలింపిక్ టీంకు 1-0 విజయం అందించారు.

హెల్సింకీలో జరిగిన 1952 ఒలింపిక్ క్రీడల్లో కూడా బల్బీర్ సింగ్ భారత జట్టుకు ఎంపికయ్యారు. అక్కడ ఆయనకు 13వ నంబర్ జెర్సీ ఇచ్చారు.

అశుభంగా భావించే 13వ నంబర్, బల్బీర్‌కు అదృష్టం తీసుకొచ్చింది. మొత్తం టోర్నమెంటులో భారత్ 13 గోల్స్ స్కోర్ చేస్తే, వాటిలో 9 బల్బీర్ సింగే కొట్టారు.

బల్బీర్‌ సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, FACEBOOK @ BALBIRSINGHSENIOR

ఫొటో క్యాప్షన్, 1952 హెల్సింక్ ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని బల్బీర్ సింగ్ ప్రదర్శించారు

ఎడమ బూటుపై పావురం కొట్టింది

బల్బీర్ సింగ్ బీబీసీతో మాట్లాడుతూఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. “నేను హెల్సింకీ ఒలింపిక్ క్రీడల్లో భారత జట్టు జెండా పట్టుకుని నడవాలి. పెరేడ్ సమయంలో వేల పావురాలను వదిలారు. అవి మా పైనుంచి ఎగురుతూ వెళ్లాయి. వాటిలో ఒకటి నాపైన పెంట వేసింది. అది నా ఎడమ బూటుమీద పడింది. నేను కంగారు పడుతూనే మార్చ్ చేస్తూ వెళ్లాను. ఆ పావురాలు నా భారత బ్లేజర్‌ను ఎక్కడ పాడుచేస్తాయోనని భయం వేసింది. కార్యక్రమం తర్వాత నా బూటుపై పడిన పెంటను తుడిచేయడానికి కాగితం వెతుక్కుంటూ వెళ్లా. అప్పుడే నిర్వాహక కమిటీ సభ్యుడు ఒకరు నా వీపుపైన తట్టి..”

“కాంగ్రాట్స్, ఫిన్‌లాండ్‌లో ఎడమ బూటుపై పావురం పెంట పడితే శుభప్రదంగా భావిస్తారు. నీకు అది చాలా అదృష్టం తెచ్చిపెడుతుంది అన్నారు. ఆయన చెప్పిందే నిజం అయ్యింది. భారత్ ఇంగ్లండ్‌ను పైనల్లో 6-1తో ఓడించి మళ్లీ స్వర్ణ పతకం గెలుచుకుంది” అని చెప్పారు. ఆ ఆరింటిలో ఐదు గోల్స్ బల్బీర్ సింగే చేశారు.

బల్బీర్‌ సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, FACEBOOK @ BALBIRSINGHSENIOR

ఫొటో క్యాప్షన్, 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించినపుడు భారతదేశంలో అపూర్వ స్వాగతం లభించింది

కుడి చేతి వేలు ఫ్రాక్చర్

1956 మెల్‌బోర్న్ ఒలింపిక్ క్రీడల్లో భారత హాకీ టీమ్ పగ్గాలను బల్బీర్ సింగ్‌కు అప్పగించారు.

మొదటి మ్యాచ్‌లో భారత్ అఫ్గానిస్తాన్‌ను 14-0తో ఓడించింది. కానీ ఆ మ్యాచ్‌లో కెప్టెన్ బల్బీర్ సింగ్ కుడిచేతి వేలు విరిగిపోవడంతో అందరూ షాక్ అయ్యారు.

ఆ రోజు గుర్తు చేసుకున్న బల్బీర్ సింగ్ “నేను అఫ్గానిస్తాన్‌తో ఐదు గోల్స్ కొట్టాను. అప్పుడే నాకు వేలికి గాయమైంది. వేలి గోరు మీద సుత్తితో కొడుతున్నట్టు ఉంది. సాయంత్రం ఎక్సరేలో ఫ్రాక్చర్ అయ్యిందని తెలిసింది. గోరు నల్లగా అయిపోతోంది. వేలు బాగా వాచిపోయింది” అన్నారు.

బల్బీర్‌ సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, FACEBOOK @ BALBIRSINGHSENIOR

ఫొటో క్యాప్షన్, ప్రముఖ వ్యాఖ్యాత జస్‌దేవ్ సింగ్‌తో బల్బీర్ సింగ్ (ఎడమ)

గాయపడిన విషయం సీక్రెట్

మా మేనేజర్, గ్రూప్ కెప్టెన్ ఓపీ మెహ్రా, చెఫ్ డే మిషన్ ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్, భారత హాకీ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు అశ్వినీ కుమార్ మధ్య ఒక చర్చ నడిచింది. నన్ను మిగతా లీగ్ మ్యాచుల్లో ఆడించకూడదని, సెమీఫైనల్, ఫైనల్లో మాత్రమే దించాలని, నాకు గాయమైన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలని వారు నిర్ణయించారు.

అలా ఎందుకంటే, మిగతా జట్లన్నీ నా వెనక కనీసం ఇద్దరు ఆటగాళ్లను మోహరించేవి. అలా మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుందని వారు భావించేరు.

బల్బీర్‌ సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, FACEBOOK @ BALBIRSINGHSENIOR

హర్‌బెల్ సింగ్ తిట్లు

బల్బీర్ సింగ్ తన జీవితచరిత్ర ‘ద గోల్డెన్ హ్యాట్రిక్‌’లో హర్‌బెల్ సింగ్‌ను కాలేజీ రోజుల నుంచీ తన గురువుగా భావించేవాడినని చెప్పారు.

“ఒలింపిక్ విలేజ్‌లో మేమిద్దరం ఒకే గదిని షేర్ చేసుకునేవాళ్లం. ఆయన వీలైనంత వరకూ నా సమస్యలన్నీ దూరం చేయడానికి ప్రయత్నించారు. ఒక్కోసారి కోప్పడితే, ఒక్కోసారి బుజ్జగించేవారు. ఇంకోసారి తిట్టేవారు. కానీ నాపైన అది ఎలాంటి ప్రభావం చూపించలేదు. వేలు విరగడంతో నాకు పడవ మునిగిపోతున్నప్పుడు వదిలేసిన కెప్టెన్‌లా అనిపించింది” అన్నారు.

నాకు అప్పుడప్పుడూ ఒక కలొచ్చేది. నేను ఒక గోల్ కీపర్ ముందు ఉంటాను. తను నన్ను చూసి నవ్వుతుంటాడు. “నీకు ధైర్యముంటే గోల్ చెయ్” అని నన్ను సవాలు చేస్తూ ఉంటాడు.

బల్బీర్‌ సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, FACEBOOK @ BALBIRSINGHSENIOR

ఫొటో క్యాప్షన్, బల్బీర్ సింగ్ సెంటర్ ఫార్వర్డ్ పొజిషన్‌లో ఆడేవారు

పాకిస్తాన్‌తో ఫైనల్

చివరికి భారత జట్టు జర్మనీని ఓడించి ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో బారత్, పాకిస్తాన్‌ను ఎదుర్కోవాలి.

అది పాకిస్తాన్‌తో భారత్ ఆడిన మొదటి హాకీ మ్యాచ్. కానీ ఆ క్షణం కోసం రెండు జట్లూ 1948 నుంచి ఎదురుచూస్తున్నాయి.

భారత్ జట్టుపై చాలా ఒత్తిడి ఉంది. ఎందుకంటే అది పాకిస్తాన్‌కు రజత పతకం వచ్చినా వాళ్లకు సంతోషంగానే ఉంటుంది.

కానీ, భారత్ స్వర్ణ పతకం తప్ప వేరే ఏది గెలుచుకున్నా నిరాశే అవుతుంది. మ్యాచ్‌కు ఒక రోజు ముందు బల్బీర్ సింగ్ చాలా ఒత్తిడిలో ఉన్నారు.

బల్బీర్‌ సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, FACEBOOK @ BALBIRSINGHSENIOR

ఫొటో క్యాప్షన్, బల్బీర్‌ సింగ్ సీనియర్ పంజాబ్ పోలీసు శాఖలో కూడా పనిచేశారు

ఫైనల్ ముందు నిద్రలేదు

ఆయన తన జీవితచరిత్రలో “మా కోచ్ హర్‌బెల్ సింగ్ ప్రతి ఆటగాడూ సమయానికి నిద్రపోయేలా చూసుకునేవారు. ఆయన నా గది లైట్ ఆఫ్ చేస్తూ, దేవుడి దయ ఉంటే, మనమే గెలుస్తాం అన్నారు. నాకు ఆ రాత్రి నిద్రపట్టలేదు. కాసేపు తిరిగొద్దామని బయటికొచ్చాను. చాలా రాత్రైంది. అప్పుడే వెనక ఎవరో నన్ను పిలిచారు. తిరిగి చూస్తే అశ్వినీ కుమార్ కంగారు పడుతూ నిలబడి ఉన్నారు”.

“ఆయన నన్ను గదిలోకి తీసుకొచ్చారు. నాతో మాట్లాడుతూనే ఉన్నారు. తర్వాత ఒక టాబ్లెట్ ఇచ్చారు.

నాకు పడుకోమని చెప్పి, నా తల దగ్గర కూర్చున్నారు. నాకు ఎప్పుడు నిద్రపట్టిందో, ఆయన ఎప్పుడు వెళ్లిపోయారో తెలీనే లేదు.

బల్బీర్‌ సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, FACEBOOK @ BALBIRSINGHSENIOR

ఫొటో క్యాప్షన్, 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత హాకీ జట్టు

మ్యాచ్ ముందు అన్సారీ తుమ్మారు

మ్యాచ్ రోజు ఉదయం భారత జట్టు బస్సులో బయల్దేరింది.

డ్రైవర్ బస్సు స్టార్ట్ చేయగానే, అప్పుడే ఎంటీ అన్సారీ తుమ్మారు. ఆయన బోపాల్ హాకీ అసోసియేషన్ సెక్రటరీ.

బల్బీర్ సింగ్ తన జీవితచరిత్ర ‘ద గోల్డెన్ హ్యాట్రిక్‌’లో అప్పుడు జరిగింది రాశారు.

“అన్సారీని అశ్విని కుమార్ తిట్టారు. డ్రైవర్‌తో బస్సు ఇంజన్ ఆఫ్ చేయమన్నారు. నన్ను మళ్లీ నా గదికి తీసుకెళ్లి, నీకు నావి మూఢనమ్మకాలుగా అనిపించచ్చు. కానీ నువ్వు నీ ట్రాక్ సూట్, బూట్లు తీసి, ఐదు నిమిషాలు పడుకో అన్నారు. నేను అలాగే చేశాను. కాసేపటి తర్వాత మేం అదే బస్సులో బయల్దేరాం” అన్నారు.

బల్బీర్‌ సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, FACEBOOK @ BALBIRSINGHSENIOR

ఫొటో క్యాప్షన్, లండన్, హెల్సింక్, మెల్‌బోర్న్ ఒలింపిక్స్ క్రీడల్లో బల్బీర్ మూడు స్వర్ణ పతకాలు గెలిచారు

కుడిచేతి వేలికి ప్లాస్టర్

అది చాలా గట్టి పోటీ. భారత్ అటాక్ సరిగా లేదు. బల్బీర్ కుడిచేతి వేలికి ప్లాస్టర్ ఉంది. ఆయన మూడు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు వేసుకుని మైదానంలోకి దిగారు.

తర్వాత రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో బల్బీర్ పూర్తిగా ఫిట్‌గా లేరు. ఆయన ఫ్రీగా ఆడనివ్వకుండా పాకిస్తాన్ సెంటర్ హాఫ్ అడ్డుకుంటున్నారని రాశారు.

కానీ భారత్ తన డిఫెన్స్ సత్తాను చూపిస్తోంది. పాకిస్తాన్ దాన్ని ఛేదించేందుకు ప్రయత్నించింది. కానీ జెంటిల్, పెరుమాళ్, క్లాడియస్ ఇనుప గోడలా నిలబడ్డారు.

సెకండ్ హాఫ్‌లో బల్బీర్ పాకిస్తాన్ రక్షణను ఛేదించారు. ఆయన గురుదేవ్‌కు బంతి పాస్ చేశారు. కానీ ఆయన దానిని క్రాస్ బార్ పైనుంచి కొట్టారు.

బల్బీర్‌ సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, FACEBOOK @ BALBIRSINGHSENIOR

ఫొటో క్యాప్షన్, 1956 మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం అందుకుంటున్న బల్బీర్ సింగ్

పెనాల్టీ కార్నర్ దొరికింది

సెకండ్ హాఫ్ మొదలవగానే భారత్‌కు పెనాల్టీ కార్నర్ వచ్చింది. రణధీర్ సింగ్ జెంటిల్ కళ్లు చెదిరేలా కొట్టిన షాట్‌తో బంతి పాకిస్తాన్ గోల్లోకి దూసుకుపోయింది.

చివరి టైంలో పాకిస్తాన్ గోల్ కొట్టడానికి శాయశక్తులా ప్రయత్నించింది. అది ఒక పెనాల్టీ బుల్లీ కూడా దొరికింది. కానీ భారత్ సెంటర్ హాఫ్ అమీర్ కుమార్, పాకిస్తాన్ హమీద్‌ను గోల్ చేయనివ్వలేదు. బల్బీర్ సింగ్‌కు అది ఒక అపూరప క్షణం. ఆయన మూడోసారి భారత్‌కు స్వర్ణ పతకం తీసుకొచ్చారు.

స్వర్ణ పతకం గెలిచిన తర్వాత ఎంటీ అన్సారీని హత్తుకున్న బల్బీర్, ఆయన చెవిలో చిన్నగా “అన్సారీ గారూ, మీ తుమ్ము మనకు అదృష్టం తీసుకొచ్చింది” అన్నారు.

బల్బీర్‌ సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, FACEBOOK @ BALBIRSINGHSENIOR

ఫొటో క్యాప్షన్, 1975లో కౌలాలంపూర్ హాకీ ప్రపంచ కప్ గెలిచిన భారత హాకీ జట్టుతో బల్బీర్‌సింగ్

1975లో కౌలాలంపూర్‌లో భారత జట్టు మేనేజర్

1975లో కౌలాలంపూర్‌లో జరిగిన ప్రపంచకప్‌ టోర్నీకి బల్బీర్ సింగ్‌ను భారత జట్టు మేనేజర్‌గా చేశారు. ఆ జట్టుకు చండీగఢ్‌లో ట్రైనింగ్ ఇచ్చారు.

భారత జట్టు మలేషియాను ఓడించి ఫైనల్ చేరింది. అక్కడది తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడబోతోంది. భారత ఆటగాడు అస్లం షేర్ ఖాన్ నమాజు చేయడానికి మసీదు వెళ్లాలని అడిగారు.

బల్బీర్‌ సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, FACEBOOK @ BALBIRSINGHSENIOR

ఫొటో క్యాప్షన్, 1975 హాకీ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీతో భారత జట్టు

షాహీ మసీదులో నమాజు

కోచ్ బోధీ, మేనేర్ బల్బీర్ సింగ్, డాక్టర్ రాజేంద్ర కాల్రా ఆయన్ను తీసుకుని కౌలాలంపూర్ షాహీ మసీదు చేరుకున్నారు. అక్కడ అప్పటికే పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు కూడా ఉన్నారు.

పాకిస్తాన్ ఆటగాడు రషీద్ తమాషాగా అస్లంతో “మీరు మలేషియాతో సమానంగా గోల్ కొట్టారు. ఇప్పుడు బల్బీర్‌ను నమాజు చదవడానికి తీసుకెళ్తున్నారా, తర్వాత ప్లానేంటి?” అన్నారు.

అక్కడ మౌలానా వారికి స్వాగతం పలికారు. అందరూ నమాజు చదవడానికి రావడం తనకు ఆశ్చర్యం కలిగించని ఆయన చెప్పారు.

బల్బీర్‌కు నమాజు చదవడం తెలీదు. అందుకే ఆయన నమాజు పూర్తయ్యేవరకూ తన తలను నేలపైనుంచి పైకెత్తలేదు.

బల్బీర్‌సింగ్ సీనియర్

ఫొటో సోర్స్, BHARTIYAHOCKEY.ORG

ఫొటో క్యాప్షన్, ప్రపంచకప్ గెలిచిన తర్వాత బల్బీర్‌సింగ్, అజిత్‌పాల్ సింగ్‌లను నాటి పంజాబ్ ముఖ్యమంత్రి జ్ఞానీ జైల్‌సింగ్ ఆహ్వానించారు

ప్రపంచకప్ విజయం

తిరిగి వస్తున్నప్పుడు తన సహచర ఆటగాడు షాహనాజ్ షేక్‌తో రషీద్ వ్యంగ్యంగా “రేపు మీపైన భారత్ గెలుస్తోంది” అన్నారు. షహనాజ్ “అందుకే మీరు టీంలో ఆడడం లేదా?” అన్నారు.

రషీద్ వెంటనే “ఎందుకంటే అల్లా మొదట చేసిన ప్రార్థనలనే వింటారు. అస్లం, బల్బీర్ గెలుపు కోసం మొదటే ప్రార్థించారు” అన్నారు.

రషీద్ చెప్పింది అక్షరాలా నిజమైంది. భారత్ ఫైనల్లో పాకిస్తాన్‌ను 2-1తో ఓడించింది. ఆ తర్వాత భారత్ మళ్లీ ప్రపంచకప్‌ గెలుచుకోలేకపోయింది.

భారత హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ దోసాంజ్ (95) సోమవారం ఉదయం కన్నుమూశారు. మూడు సార్లు ఒలింపిక్ స్వర్ణ పతకాలు గెలిచిన బల్బీర్ సింగ్ సీనియర్.. పంజాబ్‌లోని మొహాలీలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.

1948, 1952, 1956 ఒలింపిక్స్ క్రీడల్లో మూడు స్వర్ణ పతకాలు గెలిచిన ఘనత బల్బీర్‌ది. ఒలింపిక్స్ పురుషుల హాకీ ఫైనల్స్‌లో అత్యధిక గోల్స్ చేసిన బల్బీర్ రికార్డును ఇంతవరకూ ఎవరూ ఛేదించలేదు. 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో బల్బీర్ 5 గోల్స్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)