పెథాయ్: ‘20 తుపాన్లు చూశా.. ఈ తుపాను సాధారణంగానే కనిపిస్తోంది’

భాగ్యరాజ్
ఫొటో క్యాప్షన్, భాగ్యరాజ్

బంగాళాఖాతంలో పెథాయ్ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. సోమవారం ఉదయం 8.30 గంటల సరికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుపాను ఈ రోజు మధ్యాహ్నం 11.30 నుంచి 2.30 గంటల మధ్య యానాం, తుని పట్టణాల మధ్య తీరం దాటొచ్చని ఆంధ్రప్రదేశ్ రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఏపీ ఆర్టీజీఎస్) వెల్లడించింది.

తుపాను తీరం దాటేటప్పుడు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తుపాను ప్రభావంతో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు.. కృష్ణా, గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ ఐఎండీ హై అలర్ట్‌ ప్రకటించింది.

సముద్రం అల్లకల్లోలంగా ఉందని, సాధారణం కంటే మీటరు అంతకంటే ఎక్కువ ఎత్తులో అలలు వస్తాయని, తీర ప్రాంత జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది.

కాకినాడ సమీపంలోని తాళ్ళరేవు మండలం హాప్ ఐలాండ్ వాసులను పునరావాస శిబిరంలోకి తరలించిన అధికారులు
ఫొటో క్యాప్షన్, కాకినాడ సమీపంలోని తాళ్ళరేవు మండలం హోప్ ఐలాండ్ వాసులను పునరావాస శిబిరానికి తరలించిన అధికారులు

సురక్షిత ప్రాంతాలకు లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు

తుపాను ముప్పు దృష్ట్యా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలను అధికార యంత్రాంగం ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది.

తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం హోప్ ఐలండ్ గ్రామంలోని ప్రజలను స్థానిక అధికారులు పునరావాస శిబిరానికి తరలించారు.

హోప్ ఐలండ్ గ్రామ జనాభా 360. సముద్రంలో చేపలవేట సరిగా లేక కాకినాడ, యానాం లాంటి ప్రాంతాల్లో వివిధ పనులకు 240 మంది వలస పోయారు. మిగిలిన వారిని అధికారులు పునరావాస శిబిరానికి తరలించారు.

పునరావాస శిబిరానికి తరలిన స్థానికుల్లో ఒకరైన 60 ఏళ్ల భాగ్యరాజ్ మాట్లాడుతూ- తాను సుమారు 20 తుపాన్లు చూశానని, సునామీ వచ్చినప్పుడు కూడా తమ ఐలాండ్‌‌లోనే ఉన్నామని పేర్కొన్నారు. ''ఎన్నడూ ప్రాణ నష్టం లేదు. ఈసారి తుపాను సాధారణంగానే కనిపిస్తోంది. అధికారులు ఒత్తిడి చేయడంతోనే ఐలాండ్ నుంచి తీరానికి వచ్చా'' అని ఆయన చెప్పారు.

హోప్ ఐలండ్ నుంచి మండల కేంద్రం తాళ్లరేవుకు వెళ్లాలంటే గంట పాటు సముద్రంలో ప్రయాణించాలి. నాటు పడవలు, ఇంజిన్ బోట్లే స్థానికులకు ఆధారం.

హాప్ ఐలాండ్ గ్రామస్థులను పునరావాస శిబిరానికి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మత్స్యశాఖ అధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. ''ఇలాంటి తుఫాన్లు చాలా చూశామంటూ వాళ్లంతా రావడానికి నిరాకరించారు. నాలుగు రోజులుగా ఒప్పించి ముందస్తు చర్యల్లో భాగంగా తరలించాం'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)