పెథాయ్ తుపాను: ఆంధ్రప్రదేశ్, యానాంలకు ఆరెంజ్ మెసేజ్ హెచ్చరిక

ఫొటో సోర్స్, Imd
- రచయిత, శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఇటీవలే తిత్లీ తుపాను మిగిల్చిన విషాదం నుంచి పూర్తిగా కోలుకోక ముందే మరో తుపాను పెథాయ్ రావడంతో తూర్పు తీరం కలవరపడుతోంది. తిత్లీ తుపాను మూలంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాతోపాటు ఒడిశాలోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో తుపాన్లు ఎక్కువగా సంభవించే అక్టోబరు, నవంబరు మాసాలు గడిచినప్పటికీ ఇప్పుడు డిసెంబరులో పెను తుపాను హెచ్చరికలు వెలువడుతున్నాయి. పెథాయ్ తుపాను ముప్పుపై ఆందోళన నెలకొంది.
కాసేపటి కిందట శనివారం (డిసెంబరు 15) తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది.
వాయుగుండం వేగంగా తన దిశను మార్చుకుందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
ఇది శనివారం సాయంత్రం తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు.
తుపానుగా మారిన తర్వాత గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్లు దాటుతుంది.
ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 770 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
పెథాయ్ తుపాను ఉత్తర వాయువ్య దిశలో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, యానాంలకు ఆరెంజ్ మెసేజ్ హెచ్చరిక జారీ చేసింది.
భారీ విపత్తు సంభవించే అవకాశం ఉన్నపుడు ఆరెంజ్ మెసేజ్ అలెర్ట్ జారీ చేస్తారు. ఈ అలెర్ట్ జారీ చేస్తే విపత్తుకు అన్ని విధాలుగా ముందుగానే సన్నద్ధంగా ఉండాలి.
దీని తదుపరి దశ రెడ్ అలెర్ట్. ఇది జారీ చేస్తే భద్రత, పునరావాస చర్యలు మొదలవుతాయి.

ఫొటో సోర్స్, IMD
ప్రకాశం జిల్లాకు చెందిన 50 మంది మత్స్యకారులు వేటకు వెళ్లి ఐదు రోజులుగా సముద్రంలో చిక్కుకుపోయారు. వీరు పది బోట్లతో వేటకు వెళ్లారు. పెథాయ్ తుపానుపై మెరైన్ పోలీసులతోపాటు అధికారులు హెచ్చరికలు జారీచేసినా వీరు ఇంకా ఒడ్డుకు చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ జాలర్ల మొబైల్ ఫోన్లు పనిచేయడం లేదు. వీరు చీరాల తీరానికి 60 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఉండొచ్చని తోటి మత్స్యకారులు చెబుతున్నారు.
జాడ తెలియని మత్స్యకారులు వేరే ప్రాంతంలో ఎక్కడైనా తీరానికి చేరుకొని ఉంటారని అంచనా వేస్తున్నామని, వీరి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నామని ప్రకాశం జిల్లాకు చెందిన మత్స్యశాఖ అధికారి వీవీఆర్ బాబు తెలిపారు.

ఫొటో సోర్స్, APSDRF
17న తీరం దాటనున్న తుపాను
ఈ తుపాను 17వ తేదీ సోమవారం రాత్రికి తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇది కాకినాడ, విశాఖపట్నం మధ్య తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. తొలుత ఒంగోలు నుంచి కాకినాడ మధ్యలో తీరం దాటుతుందని భావించినప్పటికీ, ప్రస్తుతం ఉత్తరాంధ్ర వైపు పయనిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన 'రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్‌టీజీఎస్)' చెబుతోంది.
భారత వాతావరణ విభాగం(ఐఎండీ) నివేదిక ప్రకారం ఒంగోలు, కాకినాడ మధ్యలోనే తీరం దాటే అవకాశాలున్నట్టు తాజా అంచనాలు చెబుతున్నాయని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ ఆఫీసర్ తారకా స్వరూప తెలిపారు. మరోవైపు 'సముద్ర సమాచార సేవల భారత జాతీయ కేంద్రం(ఇన్‌కాయిస్)' మాత్రం అమలాపురం, కాకినాడ మధ్యలో తీరం దాటవచ్చనే అంచనాలు విడుదల చేసింది.
పోటెత్తుతున్న అలల తాకిడి కారణంగా పలు చోట్ల సముద్రతీరం కోతకు గురవుతోంది. కాకినాడ-ఉప్పాడ మధ్య బీచ్ రోడ్‌లో కోత కారణంగా రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది.

తుపానుగా తీరం దాటే సమయంలో ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 16, 17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో 20 సెంటిమీటర్ల వరకు వర్షం పడొచ్చని చెబుతున్నారు. పెథాయ్ తుపాను ప్రభావంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ వానలు పడతాయన్నారు.
15వ తేదీ నుంచే కోస్తాంధ్రతోపాటు తమిళనాడు, పుదుచ్చేరిల్లోని వివిధ ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం చెబుతోంది. పెథాన్ తీరం దాటే సమయంలో, 17వ తేదీ సాయంత్రానికి కోస్తాంధ్రలో ఈదురుగాలుల వేగం 100 కిలోమీటర్లకు చేరవచ్చని అంచనా వేస్తోంది.
మూడు రోజులుగా సముద్రంలో చేపలవేటను అధికారులు నిషేధించారు. వేటకు వెళ్లిన వారిని జీపీఆర్ఎస్ సహకారంతో ఒడ్డుకు చేర్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. మత్స్సకారుల పడవలన్నీ తీరంలోనే నిలిచిపోయాయి. తీర ప్రాంత గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు, సహాయక సామగ్రిని, సిబ్బందిని ఆయా గ్రామాలకు తరలిస్తున్నారు.

తీర ప్రాంత జిల్లాల అధికారులకు సెలవులు రద్దు
ఏపీలోని 9 తీర ప్రాంత జిల్లాల అధికారులకు సెలవులు రద్దు చేశారు. అన్ని జిల్లాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఆర్‌టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
1100 కాల్ సెంటర్ నుంచి తుపాను జాగ్రత్తల సందేశాలు జారీ చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా తీర ప్రాంతవాసులకు సూచనలు చేస్తున్నారు.
తుపాను సహాయ చర్యల్లో ఆటంకాలు రాకుండా చూసేందుకు సిబ్బందిని సన్నద్ధం చేశామని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, వాతావరణ శాఖ అధికారుల నుంచి నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్న అంచనాలకు తగ్గట్టుగా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.
(ఫొటోలు: శంకర్)
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రలో మొన్న తిత్లీ, నేడు పెథాయ్ తుపాను
- ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా, ఉండదా
- 'గాంధీ జాత్యహంకారి'
- హిందుత్వ అజెండా గురి తప్పిందా? అందుకే బీజేపీ ఓడిందా?
- తెలంగాణలో కొత్త ఎమ్మెల్యేలు వీరే
- పెద్ద నోట్ల రద్దు సమయంలో బ్యాంకు క్యూలో పుట్టిన బాలుడి కోసం.. రెండు ఊర్లు ఎందుకు ఘర్షణ పడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








