పెద్ద నోట్ల రద్దు‌ సమయంలో బ్యాంకు క్యూలో పుట్టిన బాలుడి కోసం.. రెండు ఊర్లు ఎందుకు ఘర్షణ పడుతున్నాయి?

సర్వేశాదేవి, ఖజాన్చి
ఫొటో క్యాప్షన్, రెండేళ్ల కిందట సర్వేశాదేవి పాత నోట్లను మార్చుకోవటానికి బ్యాంకు క్యూలో ఉండగా ఖజాన్చి పుట్టాడు

రెండేళ్ల కిందట ఆ బాలుడు పుట్టినప్పుడు ఒక సంచలనంగా ప్రపంచ వార్తల్లోకి ఎక్కాడు. అతడి కోసం అతడి తల్లి, తండ్రుల కుటుంబాల మధ్య.. వారి ఊర్ల మధ్య ఘర్షణ సాగుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని కన్పూర్‌ జిల్లాలో రెండేళ్ల కిందట ఆ బాలుడు పుట్టినపుడు సందర్శించిన బీబీసీ ప్రతినిధి గీతా పాండే.. ఇప్పుడు అతడిని చూడటానికి, తాజా ఘర్షణ వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవటానికి ఆ మారుమూల గ్రామాలను సందర్శించారు.

ఆ బాలుడి పేరు ఖజాన్చి.. అంటే ‘‘కోశాధికారి’’ అని అర్థం. ఈ పేరు పెట్టటం వెనుక ఓ కథ ఉంది.

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016 నవంబర్ 8వ తేదీన దేశమంతటా రాత్రికి రాత్రి పెద్ద కరెన్సీ నోట్లు.. రూ. 1,000, రూ. 500 నోట్లను రద్దు చేసింది. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది జనం తమ దగ్గరున్న పాత నోట్లను కొత్త నోట్లతో మార్చుకోవటానికి బ్యాంకుల ముందు క్యూ కట్టారు.

అలా.. డిసెంబర్ 2వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని ఝింఝాక్ పట్టణంలో సర్వేశాదేవి అనే ఒక మహిళ బ్యాంకు ముందు క్యూలో వందలాది మందితో కలిసి నిల్చుంది. ఆమె తన గ్రామం సర్దార్‌పూర్ నుంచి నడిచి వచ్చింది. అత్త శశీదేవి, పెద్ద కూతురు ప్రీతి ఆమెతో ఉన్నారు.

సర్వేశాదేవి నిండు చూలాలు. బ్యాంకు క్యూలో ఉండగానే ఆమెకు నెప్పులు వచ్చాయి. అక్కడే ప్రసవించింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. బ్యాంకు క్యూలో పుట్టిన ఆ బిడ్డ వార్తల్లోకెక్కాడు. కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారానికి ఆ పసి బాలుడు పోస్టర్ బాయ్ అయ్యాడు.

ఆ బాలుడికి మూడు నెలల వయసు ఉన్నపుడు అతడి గ్రామానికి వెళ్లాను.

నెలల వయసులో ఖజాన్చి
ఫొటో క్యాప్షన్, ఖజాన్చి జననం ప్రపంచమంతటా సంచలన వార్త అయింది

అతడు పుట్టటానికి నాలుగు నెలల ముందు.. అతడి తండ్రి క్షయ వ్యాధితో చనిపోయాడు. బ్యాంకు క్యూలో ప్రసవించేటపుడు తన అత్త తన దగ్గర లేకపోయినట్లయితే తాను కూడా చనిపోయేదానని అతడి తల్లి చెప్పింది.

అయితే.. ఖజాన్చిని మళ్లీ చూద్దామని బయల్దేరిన నేను ఇప్పుడు అనంత్‌పూర్ ధాకూల్ అనే మరో గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. అది శర్వేశాదేవి తల్లిదండ్రుల ఊరు. ఆమె తన అత్తతో తీవ్ర ఘర్షణ జరగటంతో గత ఏడాది ఐదుగురు పిల్లలతో సహా తల్లి దగ్గరకు వచ్చేసింది. అక్కడ తల్లి, ముగ్గురు సోదరులతో కలిసి నివసిస్తోంది.

ఖజాన్చి నన్ను ఆసక్తిగా చూస్తున్నాడు. అతడి తల్లి సూచనతో నాతో చేయికలిపాడు. అతడి గోళ్లకు రంగు వేసిందెవరని అడిగాను. అతడు నవ్వుతూ తన అక్క ప్రీతి వైపు చూపాడు. నేను అతడి ఫొటో తీసుకోవటానికి దగ్గరగా వెళ్లినపుడు నా ఫోన్ తీసుకోవాలని ప్రయత్నించాడు.

శర్వేశాదేవి పొరుగింటి నుంచి రెండు ప్లాస్టిక్ కుర్చీలు తెప్పించింది. ఇద్దరం ఎదురెదురుగా కూర్చున్నాం. అంతలోనే ఖజాన్చి గొడవ మొదలుపెట్టాడు. ‘‘వాడికి ఆకలిగా ఉంది’’ అంటూ ఆమె అతడికి పాలివ్వటం మొదలుపెట్టింది. అప్పటికే నేను వచ్చిన విషయం చుట్టుపక్కల వారికి తెలిసింది. ఆమె తల్లి, సోదరులు, కొంతమంది ఇరుగుపొరుగు వారు వచ్చి మా దగ్గర చేరారు.

ఖజాన్చి శాంతించిన తర్వాత.. శర్వేశాదేవిని ఆమె అత్తతో బంధం గురించి అడిగాను. ఇప్పుడు ఆమె తన అత్త శశీదేవిని ప్రశంసించలేదు. రెండేళ్ల కిందట.. తన ప్రాణాలు, తన బిడ్డ ప్రాణాలు తన అత్త వల్లే నిలబడ్డాయని చెప్పిన ఆమె.. ఇప్పుడు అదే అత్త నుంచి తనకు, తన బిడ్డకు ప్రాణ హాని ఉందని చెప్తోంది. అంతగా వారి సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఐదుగురు పిల్లలతో సర్వేశాదేవి
ఫొటో క్యాప్షన్, ఇప్పుడు సర్వేశాదేవి తన ఐదుగురు పిల్లలతో కలిసి తన తల్లి దగ్గర నివసిస్తోంది

ఆనాడు బ్యాంకు క్యూలో బిడ్డకు జన్మనిచ్చిన శర్వేశాదేవికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం కింద రూ. 2,00,000 ఇచ్చింది. నికర ఆదాయ వనరంటూ ఏమీ లేని ఓ నిరుపేద కుటుంబానికి ఆ మొత్తం చాలా పెద్దదే. ఆ డబ్బు రాకతో ఆమె కుటుంబ సంబంధాలు దెబ్బతినటం మొదలైంది.

ఆ పరిహారం డబ్బుల్లో తనకు సగం ఇవ్వాలని తన అత్త డిమాండ్ చేస్తోందని.. అందుకోసం తనను కొడుతోందని శర్వేశాదేవి ఆరోపించింది.

ఖజాన్చిది బైగా తెగకు చెందిన కుటుంబం. దేశంలో అత్యంత పేద, అణగారిన వర్గాల్లో ఒకటి. వారికి విద్య లేదు. సొంత భూమి లేదు. అత్యధికులకు భిక్షాటనే జీవనాధారం.

అయితే.. సంప్రదాయంగా వీరు పాములు ఆడించేవాళ్లు. పాములు పట్టుకోవటం చాలా కాలం కిందటే నిషేధించినా.. నేను వీరి గ్రామాలకు వెళ్లిన ప్రతి సారీ వాళ్లు చాలా గర్వంగా తమ దగ్గరున్న పాములను చూపించారు.

ఇప్పుడు కూడా.. ఒక గ్రామస్తుడు ‘కొత్తగా ఒక పామును పట్టుకున్నా చూస్తారా’ అంటూ.. నేను సమాధానం ఇచ్చేలోగానే బుట్టలో నుంచి ఒక పిల్ల తాచు పామును బయటకు తీశాడు. అది కోపంగా ఉంది. నాకు కేవలం ఒక మీటరు దూరంలోనే నేల మీద పాకుతోంది. దాని కోరలు పీకేశామని అతడు నాకు భరోసా ఇచ్చాడు.

తాచు పాము
ఫొటో క్యాప్షన్, ఖజాన్చిది సంప్రదాయంగా పాములను ఆడించే బైగా తెగకు చెందిన కుటుంబం

అది ఇప్పుడున్నదానికన్నా మూడు రెట్లు పొడవు పెరుగుతుందని చెప్పాడు. పామును తీసి బుట్టలో పెట్టాడు. నేను మాట్లాడుతున్నా.. కాస్త భయంతో ఓ కన్ను ఆ బుట్టలో ఉన్న పాము మీదే ఉంది.

ఉత్తరప్రదేశ్ దేశంలో జనాభా రీత్యా అతి పెద్ద రాష్ట్రం. ఇక్కడ 20 కోట్ల మంది కన్నా ఎక్కువ జనం ఉన్నారు. రోజూ 15,000 మందికన్నా ఎక్కువే పిల్లలు పుడుతుంటారు. అన్ని వేల మందిలో ఒక పిల్లవాడి పుట్టుక ఎందుకింత కలకలం ఎందుకు రేపిందనేది ఊహించటం కష్టం.

ఖజాన్చి పుట్టిన పరిస్థితులే అతడికి అమిత ఖ్యాతిని తీసుకువచ్చాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అతడిని ఒక స్టార్‌ని చేశాయి. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్.. నోట్ల రద్దు ప్రజలను ఎన్ని కష్టాలకు గురిచేసిందో చెప్పటానికి.. ‘బ్యాంకు క్యూలో పుట్టిన బిడ్డ’’ను ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్నారు.

ఆయన ప్రతి ఎన్నికల సభలోనూ ఈ పసివాడి గురించి ప్రస్తావించారు. ప్రధాని మోదీ నోట్ల రద్దు చర్య.. పేదలను తీవ్రంగా దెబ్బతీసిందని విమర్శించారు.

ఆ బిడ్డ పుట్టిన కొద్ది నెలల తర్వాత.. అతడి తల్లికి అఖిలేశ్‌యాదవ్ రూ. 2,00,000 పరిహారం అందించారు.

శశీదేవి, సర్వేశాదేవి, ఖజాన్చి
ఫొటో క్యాప్షన్, బ్యాంకు క్యూలో ఖజాన్చికి జన్మనిచ్చినపుడు తన అత్త శశీదేవి దగ్గర లేకుంటే తాను, బిడ్డ బతికివుండేవారిమి కాదని శర్వేశాదేవి గతంలో చెప్పింది

ఆ డబ్బులో కొంత మొత్తాన్ని తన భర్త మిగిల్చి వెళ్లిన అప్పులు తీర్చటానికి ఖర్చు పెట్టానని సర్వేశాదేవి చెప్పింది. క్షయతోనే బాధపడుతున్న తన పెద్ద కొడుకుకు చికిత్స కోసం మరికొంత వెచ్చించానని.. మిగతా సొమ్మును బ్యాంకు డిపాజిట్‌లో దాచానని తెలిపింది.

అయితే.. ఆ పరిహారంలో తనకు సగం కావాలని తన అత్త డిమాండ్ చేసిందని.. తాను నిరాకరించినపుడు వారు తనను కింద పడేసి కొట్టారని పేర్కొంది. దీంతో ఆ ఇల్లు వదిలేసి తన తల్లి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

ఈ 37 ఏళ్ల.. ఐదుగురు పిల్లల తల్లి.. కుంటుతూ నడుస్తోంది. ‘‘నేను వికలాంగురాలిని. నా భర్త పోయాడు. నా పిల్లలను చూసుకోవటానికి ఎవరూ లేరు. వారి భవిష్యత్తు కోసం నేను జాగ్రత్తగా ఉండాలి’’ అని పేర్కొంది.

సర్వేశాదేవి అత్త ఇంటి నుంచి వచ్చేశాక సంబంధాలు ఇంకా దిగజారాయి. ఆమెను తిరిగి పంపించి వేయాలని తమ కుల పెద్దలు ఒత్తిడి తెచ్చారని ఆమె పెద్దన్న మల్ఖన్‌నాథ్ చెప్తాడు.

‘‘నీ కుటుంబం, నీ ఇల్లు అది.. అక్కడికే వెళ్లు’ అని మేం ఆమెకు చెప్తూనే ఉన్నాం. కానీ ఆమె నిరాకరిస్తోంది. వాళ్లు తనను కొడతారని, దారుణంగా చూస్తారని చెప్తోంది. ఏం చేయాలో మాకు తెలియదు. ఆమె నా చెల్లెలు. ఆమెకు ఇష్టం లేదంటే వెళ్లిపొమ్మని ఎలా చెప్తాను?’’ అంటాడాయన.

ఈ కుటుంబ వివాదం ఇప్పుడు కుల పెద్దల పంచాయతీకి చేరింది. అదే తమ ‘హై కోర్టు’ అంటాడు మల్ఖన్‌నాథ్. కుల పెద్దల తీర్పులకు చట్టబద్ధంగా కట్టుబడాల్సిన అవసరం లేదు. కానీ వారి ఆదేశాలను విస్మరించటం చాలా అరుదు. ఎందుకంటే.. ధిక్కరించిన వారు సామాజిక బహష్కరణకు గురవటంతో పాటు.. డబ్బు రూపంలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.

గత ఏడాదిగా తాను మూడుసార్లు పెద్దల ‘కోర్టు’కు హాజరు కావలసి వచ్చిందని.. ఒకసారి తన చెల్లెలు తనతో పాటు ఖజాన్చిని తీసుకురానందుకు రూ. 650 జరిమానా కట్టాల్సి వచ్చిందని మల్ఖన్‌నాథ్ చెప్పాడు.

మల్కన్‌నాథ్
ఫొటో క్యాప్షన్, తన చెల్లెలు సర్వేశాదేవిని ఆమె ఊరికి తిప్పి పంపించాలని కుల పెద్దలు తనపై ఒత్తిడి తెచ్చారని మల్కన్‌నాథ్ చెప్తున్నాడు

ఈ నెల మొదట్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. డిసెంబర్ ఒకటో తేదీన.. అంటే ఖజాన్చి పుట్టిన రోజుకు ఒక రోజు ముందు రాత్రి వేళ.. రెండు కార్లలో అధికారులు తమ ఇంటికి వచ్చారని సర్వేశాదేవి చెప్తోంది.

‘‘ఖజాన్చి నిద్రపోయాడు. నేను అన్నం తిందామని కూర్చుంటున్నా. మరుసటి రోజు సర్దార్‌పూర్‌లో ఖజాన్చి పుట్టిన రోజు వేడుకలు జరుపుతున్నారని.. వారితోపాటు మమ్మల్ని అక్కడికి రమ్మని పట్టుపట్టారు. నేను రానన్నాను. వాళ్లు ఖజాన్చిని తీసుకుని కారు దగ్గరకు వెళ్లారు. అబ్బాయి నిద్ర లేచి ఏడవటం మొదలుపెట్టాడు. మేం కేకలు వేశాం. వారి వెంటపడ్డాం. మా ఇరుగుపొరుగు వాళ్లు కూడా వచ్చి ఖజాన్చిని కాపాడటంలో సాయం చేశారు. ఖజాన్చిని అపహరించుకెళ్లటానికి వాళ్లు ప్రయత్నించారు’’ అని ఆమె వివరించింది.

గత ఏడాది జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ గెలవకపోయినప్పటికీ.. ఖజాన్చితో సంబంధం కొనసాగించారు. రాబోయే వేసవిలో జరుగబోయే సాధారణ ఎన్నికల్లో ఈ పసివాడిని ఒక చిహ్నంగా వాడుకోవాలన్నది అఖిలేశ్ ఆలోచనగా స్థానిక జర్నలిస్టులు చెప్తున్నారు. అందుకోసం ఖజాన్చి పుట్టినరోజు సందర్భంగా అతడికి రెండు ఇళ్లు.. సర్దార్‌పూర్‌లో ఒకటి, అనంత్‌పూర్‌ ధాకాల్‌లో ఒకటి... కానుకగా ఇస్తానని ప్రకటించారని వివరించారు.

మాజీ ముఖ్యమంత్రి అయిన అఖిలేశ్.. ఖజాన్చి పుట్టిన రోజు నాడు సర్దార్ ‌పూర్ సందర్శించి అతడికి ఇంటి తాళాలు అందివ్వాలన్నది ప్రణాళిక. ఆ వేడుకను కవర్ చేయటానికి స్థానిక పాత్రికేయులను కూడా ఆహ్వానించారు.

కానీ.. అఖిలేశ్ సర్దార్‌పూర్ వచ్చేటపపటికి అక్కడ ఖజాన్చి లేడు. దీంతో ఇంటి తాళాలను శశిదేవికి అందించారు.

పసివాడు లేకపోవటం వల్ల అసంతృప్తికి లోనైన అఖిలేశ్.. తనకు ఆ పిల్లవాడి ‘నానమ్మ - అమ్మమ్మల మధ్య గొడవ గురించి తెలియద’ని చెప్పాడు. తనను ‘‘ఇబ్బందికర పరిస్థితి’’లోకి నెట్టినందుకు గాను ఇద్దరు సీనియర్ పార్టీ నాయకులను తొలగించారు.

శశీదేవి
ఫొటో క్యాప్షన్, శశిదేవికి తన కోడలితో సంబంధాలు గత సంవత్సరంలో దెబ్బతిన్నాయి

అఖిలేశ్ వచ్చి వెళ్లిన కొన్ని రోజుల తర్వాత నేను సర్దార్‌‌పూర్ వెళ్లాను. రోడ్డు పక్కన కళకళలాడుతున్న కొత్త ఇల్లు కనిపించింది. శశిదేవి మార్కెట్‌కు వెళ్లింది. ఆమె కోసం ఎదురు చూస్తూ.. ఆమె బంధువులు, ఇరుగుపొరుగు వారితో ముచ్చటించాను.

‘‘ఖజాన్చిని చూడటానికి చాలా మంది వచ్చారు. కానీ అతడి తల్లి ఇక్కడికి రాకూడదని నిర్ణయించకుంది’’ అని ఆ పిల్లవాడికి పెద్ద తాత అష్రాఫ్ నాత్ చెప్పాడు. ‘‘అఖిలేశ్ యాదవ్ చాలా కానుకలు తీసుకొచ్చారు. వాటన్నిటినీ వెనక్కు తీసుకెళ్లిపోయాడు. సర్వేశాదేవి కనీసం ఒక గంట సేపు వచ్చి వెళ్లి ఉండొచ్చు. ఆ ఉత్సవాలకు హాజరవటానికి నిరాకరించటం ద్వారా ఆమె అఖిలేశ్ యాదవ్‌ను అవమానించింది’’ అంటాడాయన.

ఖజాన్చి పుట్టే వరకూ అంతా బాగానే ఉందని.. ‘‘అతడి తల్లి కుటుంబం, వారి గ్రామం దురాశ, అసూయ’’ అంతా పాడు చేసిందని వారు తప్పుపట్టారు. ఆమె దగ్గరున్న డబ్బు కావాలని ఆమె కుటుంబం కోరుకుంటోందని.. ఆ పిల్లవాడు తమ ఊర్లో ఉంటే తమ ఊరు అభివృద్ధి చెందుతుందని ఆ గ్రామస్తులు భావిస్తున్నారని వీరు అంటున్నారు.

అంతేకాదు.. ఇంకా విస్తృతమైన రాజకీయ కుట్ర కూడా ఉన్నట్లు ఈ గ్రామస్తులు పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. సర్దార్‌పూర్ గ్రామం అఖిలేశ్‌యాదవ్‌కు చెందిన సమాజ్‌వది పార్టీకి మద్దతు ఇస్తుంటే.. అగ్రకులమైన ఠాకూర్ల ఆధిపత్యం గల అనంత్‌పూర్ ధాకాల్ మోదీకి చెందిన బీజేపీకి మద్దతిస్తోంది.

సర్వేశాదేవికి ఇష్టం లేకపోతే ఆమె రాకపోయినా.. ఆ పిల్లవాడిని ఇక్కడికి పంపించాలని ములాయంనాథ్ అనే గ్రామస్తుడొకరు పేర్కొన్నారు. ‘‘అతడు మా పిల్లాడు. ఈ గ్రామానికి చెందిన వాడు. అధికారులు హామీ ఇచ్చిన అభివృద్ధి, ప్రయోజనాలు మాకే దక్కాలి’’ అంటాడాయన.

శశీదేవి వచ్చేటప్పటికి చీకటి పడటం మొదలైంది. కొత్త ఇంటి ముందు నేల మీద కూర్చుంది. ఆమెపై కోడలు చేసిన ఆరోపణల గురించి నేను అడిగాను.

ఖజాన్చి, సర్వేసాదేవి చేతులు

‘‘అవన్నీ అబద్ధాలు...’’ అందామె. ‘‘నా కోడలిని డబ్బు కావాలని నేను ఎప్పుడూ అడగలేదు. ఆమె చెప్తున్న మాటలన్నీ ఎవరో నేర్పించిన మాటలు’’ అని పేర్కొంది.

తన కొడుకు తీవ్ర అనారోగ్యం పాలై పని చేయలేని పరిస్థితుల్లో ఉన్నపుడు.. సర్వేశాదేవిని, ఆమె ఐదుగురు పిల్లలను తమ కుటుంబం ఎలా పోషించిందో ఆమె చెప్పుకొచ్చింది. తన కొడుకు చనిపోయిన తర్వాత కొన్ని నెలల పాటు.. తన భర్త, మిగతా కొడుకులు తీసుకొచ్చిన కొద్దిపాటి డబ్బులనే కోడలికి ఎలా పంచిందో వివరించుకొచ్చింది.

సర్వేశాదేవిని తాము కొట్టామన్న ఆరోపణలను ఆమె తిరస్కరించింది. ‘‘నాకు ఇంకా నలుగురు కోడళ్లు, 16 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. వీళ్లెవరూ తమను కొట్టినట్లు ఎందుకు అనరు?’’ అంటుందామె.

తన మీద దాడి గురించి, తిట్ల గురించి శశీదేవి తనవైపు కథనం చెప్పింది. ‘‘నా కోడలిని, పిల్లలను వెనక్కు తీసుకురావటానికి నేను రెండు సార్లు ఆమె ఊరికి వెళ్లాను. ప్రతిసారీ వాళ్లు ఖజాన్చిని దాచేశారు. అక్కడి మహిళలు నాపై దాడిచేసి కొట్టారు’’ అని పేర్కొంది.

సర్వేశాదేవి, ఖజాన్చిలను.. తాను కానీ, తన కుటుంబ సభ్యులెవరైనా కానీ గాయపరుస్తారన్న ఆరోపణను కూడా శశీదేవి కొట్టివేసింది. ‘‘మా సొంత కోడలు, మనవడిని మేమెలా చంపుకుంటాం?’’ అంటుంది.

నేను బయలుదేరే ముందు.. ఈ గొడవలు సమసిపోయే అవకాశముందా అని అడిగాను. ఆమెలో అంతగా ఆశ లేదు.

‘‘నేను ఈ మధ్య మూడుసార్లు ఆమెను కలిశాను. తిరిగి రమ్మని.. కొత్త ఇంట్లో ఉండమని అడిగాను. కానీ ఆమె తిరస్కరించింది. ఇంతకుముందు నా కొడుకును కోల్పోయాను. ఇప్పుడు నా మనవళ్లు, మనవరాళ్లను కూడా కోల్పోయాను’’ అంటూ కన్నీళ్లు తుడుచుకుంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)