జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కం పౌడర్లో క్యాన్సర్ కారకాలున్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు తాను తయారు చేసి విక్రయిస్తున్న టాల్కం పౌడర్ ఆస్‌బెస్టాస్‌తో కలుషితమయిందన్న సంగతి దశాబ్దాలుగా తెలుసునని రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రచురించింది.
జాన్సన్ అండ్ జాన్సన్ ఉత్పత్తుల వల్ల తమకు క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలతో వేలాది కేసులు నమోదైన నేపథ్యంలో రాయిటర్స్ తాజాగా పలు పత్రాలను సమీక్షించి ఈ కథనాన్ని రాసింది.
దీంతో, జాన్సన్ అండ్ జాన్సన్ షేర్ల ధరలు శుక్రవారం 10 శాతం పైగా పడిపోయాయి.
టాల్కం పౌడర్‌లో ఆస్‌బెస్టాస్ ఆనవాళ్లు ఉన్నాయన్న విషయం జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు 1971 నుంచీ తెలుసునని రాయటర్స్ పేర్కొంది.
అయితే.. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ సురక్షితమైనదని, ఆస్‌బెస్టాస్ రహితమైనదని ఆ సంస్థ తరఫు న్యాయవాది పీటర్ బిక్స్ పేర్కొన్నారు.
ఆయన రాయిటర్స్ వార్తా సంస్థకు ఒక ఈ-మెయిల్ పంపిస్తూ, ‘‘రాయిటర్స్ కథనం ఏకపక్షం, తప్పు, ఆగ్రహకారకం. అది అసంబద్ధమైన ఓ కుట్ర సిద్దాంతం’’ అని విమర్శించారు.
‘‘టాల్క్ ఆధారిత బాడీ పౌడర్లలో ఉపయోగించే టాల్క్‌లో ఏమున్నప్పటికీ, అది క్యాన్సర్ కారకం కాదన్నది శాస్త్రీయ ఏకాభిప్రాయం’’ అని చెప్పారు.
‘‘జాన్సన్ అండ్ జాన్సన్‌లో అసలు ఆస్‌బెస్టాస్ లేదు. ఒకవేళ గుర్తించలేనంత సూక్ష్మ స్థాయిలో ఉన్నా కూడా అది క్యాన్సర్ కలిగించదు’’ అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతర్గత పరీక్షలు
కేసులపై విచారణ సందర్భంగా జాన్సన్ అండ్ జాన్సన్ సమర్పించిన పత్రాల్లో చాలా వాటిని బహిర్గత పరచకుండా కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ పత్రాలు కొన్నిటిని రాయిటర్స్ సమీక్షించింది.
జాన్సన్ అండ్ జాన్సన్ అంతర్గత పరీక్షల్లో.. ముడి టాల్క్‌లోనూ, ఉత్పత్తి చేసిన టాల్క్‌లోనూ చిన్న మొత్తాల్లో ఆస్‌బెస్టాస్ ఉన్నట్లు 1971 నుంచి 2000 సంవత్సరాల తొలినాళ్ల వరకూ గుర్తించారని ఆ పత్రాలు వెల్లడించాయి.
జాన్సన్ అండ్ జాన్సన్ నిర్వహించిన చాలా పరీక్షల్లో ఆస్‌బెస్టాస్ గుర్తించలేదని, అయితే నియంత్రణ సంస్థలకు అందించిన పరీక్షల వివరాలను జే అండ్ జే బయట పెట్టలేదని కూడా రాయిటర్స్ గమనించింది.
రాయిటర్స్ కథనం ఉటంకించిన పరీక్షల ఫలితాలు చాలా అరుదైనవని సంస్థ న్యాయవాది బిక్స్ అన్నారు. ఉదహరించిన వాటిలో కొన్ని పత్రాలు పారిశ్రామిక టాల్క్ ఉత్పత్తులకు సంబంధించినవని ఆ సంస్థ కోర్టులో చెప్పింది.
రాయిటర్స్ కథనం నేపథ్యంలో షేర్ మార్కెట్‌లో సంస్థ విలువ ఒక దశలో 10 శాతం వరకూ తుడిచిపెట్టుకుపోయింది.
ఇదిలావుంటే, జాన్సన్ అండ్ జాన్సన్ మీద వేసిన కేసుల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి.
జాన్సన్ అండ్ జాన్సన్ టాల్క్ ఉత్పత్తుల వల్ల తమకు అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరపించిన 22 మంది మహిళలకు 4,700 కోట్ల డాలర్లు నష్టపరిహారంగా చెల్లించాలని ఈ ఏడాది జూలైలో కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయంపై సదరు సంస్థ అప్పీలు చేసింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








