అమెజాన్: దొంగలను పట్టుకొనేందుకు డమ్మీ పార్సిళ్లు

అమెజాన్

ఫొటో సోర్స్, Getty Images

అమెరికాలో వినియోగదారులకు చేరాల్సిన పార్సిళ్లను వారి ఇళ్ల వద్ద కొట్టేస్తున్న దొంగలను పట్టుకొనేందుకు అమెజాన్ ఒక వినూత్న ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం పోలీసు విభాగంతో జట్టు కట్టింది.

న్యూజెర్సీలో పోలీసు అధికారులు జీపీఎస్ ట్రాకర్లు అమర్చిన డమ్మీ బాక్సులను ఇళ్ల వద్ద పెడుతున్నారు. దొంగలను గుర్తించేందుకు హిడెన్ డోర్‌బెల్ కెమెరాలను వారు ఉపయోగిస్తున్నారు.

న్యూజెర్సీ నేర గణాంకాలు, దొంగతనాలు జరుగుతున్న ప్రదేశాలపై అమెజాన్ అందించిన మ్యాపులను వాడుతూ ఈ ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు.

ఒక ఇంటి వద్ద ఉంచిన డమ్మీ బాక్సు మూడు నిమిషాల్లో చోరీ అయ్యింది.

క్రిస్మస్ పండగ సీజన్‌లో తాము బట్వాడా చేసే పార్సళ్ల సంఖ్య సుమారు 90 కోట్లు ఉంటుందని అమెరికా పోస్టల్ సర్వీస్ అంచనా వేస్తోంది.

అమెజాన్

ఫొటో సోర్స్, Getty Images

గత ఏడాది అమెజాన్ సంస్థ 'అమెజాన్ కీ' అనే సర్వీస్‌ను తీసుకొచ్చింది.

ఈ సర్వీసు కింద ఇంటి యజమానులకు స్మార్ట్ లాక్ సదుపాయం లభిస్తుంది.

కొరియర్ సిబ్బంది ఒక యాప్ సాయంతో ఇంటి తలుపును తీసి, పార్సల్‌ను లోపల పెట్టి తిరిగి తాళం వేసి వెళ్లొచ్చు.

'అమెజాన్ కీ' పని చేయాలంటే స్మార్ట్ లాక్, క్లౌడ్ కామ్ కెమేరా ఉండాలి.

యాలీ స్మార్ట్ లాక్

ఫొటో సోర్స్, Amazon

ఫొటో క్యాప్షన్, స్మార్ట్ లాక్ ఉంటేనే అమెజాన్ కీ పనిచేస్తుంది.

అమెజాన్ కీ ఎలా పనిచేస్తుందంటే

  • కొరియర్ బాయ్ డెలివరీ కావాల్సిన ప్యాకేజీ బార్‌కోడ్‌ను మొదట స్కాన్ చేస్తారు.
  • బార్‌కోడ్ సాయంతో దాన్ని ఆన్‌లైన్‌లో వెరిఫై చేసుకుంటారు.
  • ఈ రెండు అయిపోగానే క్లౌడ్‌ కెమేరా డెలివరీ బాయ్ కదలికలను రికార్డు చేయడం ప్రారంభిస్తుంది.
  • యాప్ సాయంతో కొరియర్ బాయ్ డోర్ లాక్ తీసి, వస్తువులు ఇంట్లో పెడతారు. తిరిగి డోర్ లాక్ చేస్తారు.
  • డోర్ లాక్ తీయడం దగ్గరి నుంచి వస్తువులు ఇంట్లో పెట్టడం, తిరిగి డోర్ లాక్ చేయడం వరకు అంతా కెమెరాలో రికార్డవుతుంది.
  • హోమ్ డెలివరీ చేస్తున్నప్పుడు ఆ దృశ్యాలు మీరు లైవ్‌లో చూడొచ్చు. లేదంటే ఆ వీడియోను అమెజాన్ మీకు మెయిల్‌ చేస్తుంది.

సురక్షితమని భావిస్తేనే వినియోగదారులు ఈ సర్వీసును ఎంచుకుంటారని నిపుణులు చెబుతున్నారు. బంధువులకు, ఇంట్లో పనివారికి కూడా దీనిని ఉపయోగించొచ్చు.

అమెజాన్ కీ సర్వీసు అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో, పార్సల్‌ను పనిచేసే చోటకు తెప్పించుకోవడం, లేదా అది డెలివరీ చేసే సమయానికి ఇంట్లో ఉండే స్నేహితుడికి ఇవ్వడం చేయొచ్చు. లేదా డెలివరీ చేసిన తర్వాత పార్సల్ తీసుకొన్న వ్యక్తితో సంతకం చేయించుకోవాలని చెప్పడం, పోలీసులకు వీడియో సాక్ష్యం అందించేందుకు అవసరమైన కెమెరాలు ఇంటి వద్ద అమర్చుకోవడం చేయాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)