ఆంధ్రలో మొన్న తిత్లీ, నేడు పెథాయ్... ప్రపంచాన్ని వెంటాడుతున్న ప్రకృతి విపత్తులు

విపత్తు

ప్రస్తుతం కోస్తాంధ్ర, తమిళనాడు తీరాలను పెథాయ్ తుపాను వణికిస్తోంది. ఇంతకు ముందు గజ, దానికి ముందు తిత్లీ... ఇలా భారత్‌తో పాటు ఇతర దేశాలనూ నిత్యం ఏదో ఒక ప్రకృతి విపత్తు భయపెడుతూనే ఉంది.

ఇటీవలి కాలంలో సంభవిస్తున్న అనేక ప్రకృతి విపత్తులకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అలా ప్రకృతి విపత్తుల ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్న 15 దేశాల జాబితాను 2018 వరల్డ్ రిస్క్ రిపోర్ట్ ప్రచురించింది. ఆ జాబితాలో భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా ఉంది.

భూకంపాలు, సునామీ, తుపాన్లు, వరదల లాంటి విపత్తుల బారిన పడే ప్రమాదం ఉన్న 172 దేశాలను ఈ రిపోర్ట్ అధ్యయనం చేసింది. దాంతో పాటు ఆ విపత్తులకు ఆయా దేశాలు స్పందించే శక్తిని కూడా అంచనా వేసింది.

జర్మనీకి చెందిన వివిధ సంస్థలు సంయుక్తంగా చేసిన ఈ అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగురు పిల్లల్లో ఒకరు ప్రకృతి విపత్తులు పొంచి ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు.

గత ఏడాది ప్రకృతి విపత్తుల కారణంగా ఇళ్లను కోల్పోయి వలస వెళ్లిన వారిలో సగం మంది 18 ఏళ్ల లోపు వాళ్లేనని ఐరాస చెబుతోంది.

ఈ జాబితాలో ఎక్కువగా దీవులే ఉన్నాయి. వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్టం క్రమంగా పెరుగుతుండటంతో, వాటికి పొంచి ఉన్న ప్రమాదం కూడా అంతకంతకూ పెరుగుతోంది.

అన్నిటికంటే దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉన్న వనువాటు దీవి పరిస్థితే మరింత ప్రమాదకరంగా ఉంది. ప్రకృతి విపత్తుల ప్రమాదంతో పాటు వాటిని ఎదుర్కొనే సన్నద్ధతను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ జాబితాను రూపొందించారు.

అందుకే నిత్యం భూకంపాల బారిన పడే జపాన్, చిలీ లాంటి దేశాలు ఈ జాబితాలో కనిపించలేదు. అలాగే వందల ఏళ్ల పాటు పెరుగుతున్న సముద్ర మట్టం సమస్యతో పోరాడిన హోలాండ్‌ కూడా జాబితాలో 65వ స్థానంలో ఉంది.

ఈ దేశాలు విపత్తుల ప్రమాదాన్ని తగ్గించలేకపోవచ్చు, కానీ వాటిని సమర్థంగా ఎదుర్కోగలవని ఆ నివేదిక చెబుతోంది.

ఈ అధ్యయనం ప్రకారం అత్యంత తక్కువ ప్రమాదం పొంచి ఉన్న దేశం ఖతార్.

ఖతార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఖతార్‌కు ప్రకృతి విపత్తుల ప్రమాదం తక్కువ

2030 నాటికి 32కోట్ల మంది ప్రజలు విపత్తులు ఎక్కువగా పొంచి ఉన్న ప్రాంతాల్లో జీవిస్తారని అంచనా. ఈ విపత్తులు ప్రజల జీవితాలను నాశనం చేయడంతో పాటు దేశాలను మరింత పేదరికంలోకి నెట్టేస్తాయి.

ఇథియోపియాతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అనారోగ్యం, వరకట్నాలతో పాటు కరవు లాంటి విపత్తులు కూడా ప్రజలను పేదరికంలోకి నెట్టేస్తున్నాయని ఓవర్సీస్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక చెబుతోంది.

‘గతంలో ఆంధ్ర ప్రదేశ్‌లో సంభవించిన ఫైలిన్ తుపానునే తీసుకుంటే ఆ తుపాను ధాటికి ఆస్తి నష్టం ఎక్కువగా ఉన్నా ప్రాణ నష్టం తక్కువే. కాబట్టి ఆ ప్రాంతానికి ఆర్థిక సాయం భారీగా అందలేదు. అది ప్రజల జీవన స్థితిగతుల మీద ప్రభావం చూపింది. చనిపోయే వారి సంఖ్యకూ, ఆర్థిక సాయానికీ ప్రత్యక్ష సంబంధం ఉంటుంది’ అని ఓవర్సీస్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌(ఓడీఐ)కు చెందిన డాక్టర్ మిషెల్ వివరిస్తారు.

ప్రకృతి విపత్తుల కారణంగా మరింత పేదరికంలో జారిపోయే దేశాల జాబితానూ ఓడీఐ తయారు చేసింది. అందులో బంగ్లాదేశ్ తొలి స్థానంలో ఉంది.

తిత్లీ మిగిల్చిన విషాదం ఇది
ఫొటో క్యాప్షన్, తిత్లీ మిగిల్చిన విషాదం ఇది

2012 నాటి ‘మ్యాపిల్ క్రాఫ్ట్’ నివేదిక ప్రకారం... ఆసియాకు చెందిన బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, భారత్, వియత్నాం లాంటి దేశాలకే ఎక్కువగా ప్రకృతి విపత్తుల ప్రమాదం పొంచి ఉంది.

విపత్తులను నివారించలేకపోయినా, వాటిని సమర్థంగా ఎదుర్కోగలిగితే నష్టాన్ని చాలా వరకు తగ్గించొచ్చు. ఆ విషయంలో ఒడిశాను స్ఫూర్తిగా తీసుకోవచ్చని పర్యావరణ నిపుణులు చెబుతారు.

1999లో ఒడిశాలో సంభవించిన తుపాను ధాటికి పదివేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తుపాను నుంచి ఒడిశా చాలా పాఠాలు నేర్చుకుంది. గత 20 ఏళ్లలో తుపాన్లను ఎదుర్కోవడానికి పక్కాగా సన్నద్ధమైంది.

దానికోసం ప్రపంచ బ్యాంకు సహాయాన్ని సైతం తీసుకుంది. ఈ క్రమంలో ఖరగ్‌పూర్ ఐఐటీ సహకారంతో దాదాపు 900 తుపాను సహాయక శిబిరాలను నిర్మించింది.

'1999 పెను తుఫాను తరువాత మేం పాఠం నేర్చుకున్నాం. ఆ పైన ఎలాంటి విపత్తు ఎదురైనా సమర్థంగా ఎదుర్కోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాం. వీలైనంత తక్కువగా ఆస్తి, ప్రాణ నష్టం ఉండాలని భావించాం' అని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్ బిష్ణుపాద సేథి అన్నారు.

తిత్లీ

1999 తరువాత ఒడిశా ఏమేం చర్యలు తీసుకుంది?

  • ఐఐటీ-ఖరగ్‌పూర్ సహాయంతో 879 తుపాను, వరద సహాయక శిబిరాలను నిర్మించారు.
  • లక్షమందికి పైగా బాధితులకు ఆవాసం కల్పించేందుకు 17వేలకు పైగా ప్రత్యేక కేంద్రాలను నిర్మించారు.
  • తీర ప్రాంతాల్లో 122 సైరన్ టవర్లతో పాటు, తుపాను హెచ్చరికలకు సంబంధించిన పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
  • 17 జిల్లాల్లో 'లొకేషన్ బేస్డ్ అలారం వ్యవస్థ'ను ఏర్పాటు చేశారు. వీటి సాయంతో ప్రజలకు తుపాను ప్రభావానికి సంబంధించిన సమాచారంతో పాటు రక్షణ చర్యలకు సంబంధించిన వివరాలను అందిస్తారు.
  • బలమైన గాలులను తట్టుకునేలా తీరప్రాంతంలో ఇళ్ల గోడలు, పైకప్పులను పటిష్ఠ పరిచారు.
  • మత్స్యకారుల కోసం ప్రత్యక వార్నింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
  • సామాజిక మాధ్యమాల సాయంతో ఎప్పటికప్పుడు వాతావరణంపై హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)