యాపిల్ ఉద్యోగి కాల్చివేత: యూపీలో విచ్చలవిడి 'ఎన్‌కౌంటర్ల'కు ఇదొక ఉదాహరణ

యూపీ పోలీసు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శరత్ ప్రధాన్
    • హోదా, బీబీసీ కోసం, లఖ్‌నవూ నుంచి

జనాభా రీత్యా దేశంలోనే అదిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్‌కౌంటర్లు నిత్యకృత్యమయ్యాయి. నేరాలను అదుపు చేసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనుసరిస్తున్న ఈ ఎన్‌కౌంటర్ల విధానం వల్ల, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన కొందరు పోలీసులే ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా జరిగిన యాపిల్ ఉద్యోగి హత్యే అందుకు నిదర్శనం.

నేరాలను అదుపు చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ ఎన్‌కౌంటర్లనే మార్గంగా ఎంచుకున్నారు. అది పోలీసులు కౌబాయ్స్‌గా మారి, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేలా చేస్తోంది.

38 ఏళ్ల వివేక్ తివారీ లఖ్‌నవూలో యాపిల్ సంస్థ సేల్స్, మార్కెటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సెప్టెంబర్ 28న కొత్త ఐఫోన్ విడుదల కావడంతో షాపులో అర్ధరాత్రి దాకా ఉండాల్సి వచ్చింది.

ఆ తర్వాత ఇంటికి వెళ్తుండగా కారు ఆపాలంటూ ఓ పోలీసు సైగ చేశారు. అయితే, అర్థరాత్రి కాబట్టి మార్గం మధ్యలో ఆపడం మంచిది కాదన్న సూచనలను పాటిస్తూ, ముఖ్యంగా తనతోపాటు కారులో సహచర మహిళా ఉద్యోగి కూడా ఉండటంతో అతడు కారును అలాగే ముందుకు పోనిచ్చాడు. దాంతో ఆగ్రహించిన ఆ పోలీసు వెంటనే తన గన్‌తో వివేక్‌ను కారు అద్దంలోంచి కాల్చాడు.

ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన తివారీ సహచర ఉద్యోగిని సనా ఖాన్, ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. కానీ, అప్పుడు ఏం జరిగిందన్నది మాత్రం ఆమెకు గుర్తుంది. "రోడ్డుకు మధ్యలో అడ్డంగా నిలిపిన పోలీసు బైకును ఢీ కొట్టకుండా తివారీ తన కారును పక్కకు తప్పించబోతుండగానే ఆ పోలీసు కోపంతో కాల్పులు జరిపాడు. దాంతో తివారీ రక్తపు మడుగులో పడిపోయాడు" అని ఆమె చెప్పారు.

ఈ ఘటన సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.

ఒకవేళ వివేక్ తన కారును అక్కడే ఆపినా అతనిపై పోలీసులు భౌతికదాడి చేయడంతో పాటు, కారులో ఉన్న యువతిని వేధించే ప్రమాదమూ ఉండేది. అందుకే అర్థరాత్రి సమయాల్లో కొందరు మార్గం మధ్యలో ఆపకుండా ముందుకు వెళుతుంటారు.

ఆ పోలీసు మాత్రం తాను "ఆత్మ రక్షణ" కోసమే కాల్చాల్సి వచ్చిందని అంటున్నారు. "అతడు కారును నా బైకు మీద నుంచి నడిపి నన్ను చంపాలని చూశాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది" అని ఆరోపించాడు.

ఉత్తరప్రదేశ్‌ పోలీసుల ప్రవర్తన మారాలంటూ కొన్ని దశాబ్దాలుగా కోర్టులు చెబుతూనే ఉన్నాయి. మారడం మాట పక్కనపెట్టి, ఇక్కడి పోలీసు వ్యవస్థ మరింత దారుణంగా తయారైంది.

కొన్ని నెలల క్రితం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి సుల్ఖన్ సింగ్ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ... " ప్రవర్తన, నిజాయితీలో ఇప్పటి యూపీ పోలీసుల కంటే బ్రిటిష్ పోలీసులే ఎంతో మెరుగ్గా ఉండేవారు. బ్రిటిష్ పాలనా కాలంలో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించేవారు, కానీ బూటకపు ఎన్‌కౌంటర్లు, బూటకపు దర్యాప్తులు మాత్రం ఉండేవి కాదు" అని ఆయన అన్నారు.

యూపీ కాల్పులు

ఫొటో సోర్స్, VIVEK TIWARI/FACEBOOK

ఇక్కడ నివ్వెరపరిచే విషయం ఏంటంటే.. మొదట ఆ పోలీసుది తప్పేమీ లేదన్నట్టుగా పై అధికారులు వ్యవహరించారు.

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకుని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో, డీజీపీ ఓపీ సింగ్‌తో మాట్లాడిన తర్వాత మాత్రమే 302 సెక్షన్ కింద ఆ పోలీసు ప్రశాంత్ చౌధరీ మీద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనను ఖండించిన ముఖ్యమంత్రి, డీజీపీ బాధ్యుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితుడి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు, అతడి భార్యకు ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

బాధిత కుటుంబం కోరితే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమేనని సీఎం ఆదిత్యనాథ్ తెలిపారు.

అయితే, ఈ హత్యతోనైనా ఎన్‌కౌంటర్ల విషయంలో పునరాలోచిస్తారా? లేదా అన్నది మాత్రం ఆయన చెప్పలేదు. ఆయన పాలనలో కేవలం 12 నెలల వ్యవధిలోనే 1600 ఎన్‌కౌంటర్లు జరగగా, 67 మంది మరణించారు.

రాష్ట్రంలో నేరాలను అరికట్టాలంటే ఎన్‌కౌంటర్లను నిలిపివేసే ప్రసక్తి లేదని గతంలో ఆయన హెచ్చరించారు కూడా.

యూపీ పోలీసు

ఫొటో సోర్స్, Getty Images

ఎన్‌కౌంటర్లలో నిర్దోషులు ప్రాణాలు కోల్పోతున్నారనీ, ప్రతీకారం తీర్చుకోవడం కోసమే ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ప్రకాశ్ సింగ్ పోలీస్ రిఫామ్స్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా శాంతిభద్రతల పరిరక్షణకు, కేసుల దర్యాప్తునకు వేరువేరు పోలీసు విభాగాలు ఉండాలని గతంలో సుప్రీంకోర్టు మర్గదర్శకాలు జారీ చేసింది.

ఆ మార్గదర్శకాలను ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.

యాపిల్ ఉద్యోగి వివేక్ తివారీ కాల్చివేత కేసును కాల్పులు జరిపిన ఆ పోలీసు సహచరులే దర్యాప్తు చేయనున్నారు. దాంతో ఈ కేసులో తమ సహచరుడిని కాపాడేందుకు వాళ్లు ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)