డస్టర్ క్లాత్ పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?

ఫొటో సోర్స్, Getty Images
మనకు ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర, బిజీ ప్రాంతాల్లో మెత్తగా ఉండే పసుపు గుడ్డ అమ్ముతుంటారు. వాటిని మన కార్లు, బైకులు తుడుచుకోడానికి కొంటుంటాం కూడా. కానీ భారత్ నుంచి బ్రిటన్ వరకూ ఆ డస్టర్ అన్ని చోట్లా పసుపు రంగులోనే ఉంటుంది.
దీనిపై ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు. కొందరు ఇది గులాబీ, నీలం రంగుల్లో ఎందుకు ఉండదని అడిగితే, శతాబ్దాలుగా దానికి సమాధానం వెతుకుతున్నామని మరికొందరు చెప్పారు. వీటన్నిటికీ బీబీసీ సమాధానం వెతికే ప్రయత్నం చేసింది. కొంతమంది నిపుణులతో మాట్లాడింది.
దాంతో ఈ గుడ్డ పసుపు రంగులో ఉండడానికి చాలా రకాల కారణాలు ఉన్నట్టు తెలిసింది.
సాధారణంగా నాసిరకం కాటన్‌ను అందరూ శుభ్రం చేసే గుడ్డగా, డస్టర్లుగా ఉపయోగిస్తుంటారు.
కెనెడాలోని ఆల్బెర్టాలో మెటీరియల్ కల్చర్ లెక్చరర్ ప్రొఫెసర్ బెవెర్లీ లెమీర్, " ఈ పసుపు రంగు కాటన్ గుడ్డ చైనా నుంచి వచ్చింది" అని చెప్పారు.
"ఒకప్పుడు ఈ కాటన్‌తో తయారు చేసిన ప్యాంట్లు వేసుకునేవారు. వాటిని నన్‌కీన్ ట్రౌజర్స్ అనేవారు".
"ఆ ప్యాంట్లు బాగా పాతవైపోయినప్పుడు వాటిని ముక్కలుగా కత్తిరించి శుభ్రం చేసే గుడ్డగా మళ్లీ వాడుకునేవారు" అని లెమీర్ తెలిపారు.

ఫొటో సోర్స్, JEN MEIERHANS
వస్త్ర ప్రపంచంలో నన్‌కీన్
గ్లోబల్ హిస్టరీ ఆఫ్ కాటన్ టెక్స్‌టైల్స్ (2009) వివరాల ప్రకారం 1700 తర్వాత లాంకషైర్ నన్‌కీన్ కాటన్ దుస్తుల తయారీ ప్రారంభించింది.
"అది చాలా ఉపయోగాలు ఉన్న వస్త్రంగా పాపులర్ అయ్యింది. వాటిని కొనేవారు దాన్ని వేరే వస్త్రాలతో జత చేసి ఉపయోగించడం ప్రారంభించారు" అని లెమీర్ చెప్పారు.
మెల్లగా దానిపై జనంలో ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. వాడిన తర్వాత అవి పాతబడగానే వాటిని కత్తిరించి వేరే పనులకు ఉపయోగించేవారు.

ఫొటో సోర్స్, Getty Images
వెన్న, జున్ను తయారీ
వెన్న, జున్ను తయారీకి కూడా ఈ గుడ్డతో సంబంధం ఉందని తమకు తెలిసిందని గ్రీన్‌విచ్ రాయల్ మ్యూజియమ్స్ చెప్పింది.
నన్‌కీన్‌ను భారీగా ఉత్పత్తి చేయడానికి ముందు, ఇంట్లో ఉన్న పనికిరాని వస్త్రాలను శుభ్రం చేసే గుడ్డగా వాడేవారని మ్యూజియం ప్రతినిధి చెప్పారు.
వెన్న, జున్ను తయారు చేయడానికి మస్లిన్ వస్త్రాన్ని ఉపయోగించేవారు, వాటిపై ఆ మరకలు కనిపించకుండా దానికి పసుపు రంగు డై చేసేవారు.
అలా పసుపు రంగు బాగా పాపులర్ కావడంతో, నేతపనివారు తమ వస్త్రాలకు పసుపు రంగు వేసి వాటిని భారీగా ఉత్పత్తి చేయడం ప్రారంభించారు అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పసుపు రంగు జెండాగా...
కానీ ఈ వస్త్రానికి జెండాలతో కూడా సంబంధం ఉందని కొందరు చెబుతున్నారు. పడవ ప్రయాణికుల్లో వ్యాధిగ్రస్తులు లేరని చెప్పడానికి నౌకలపై పసుపు జెండాలను ఉపయోగించేవారని తెలిపారు.
"పడవలు రేవుల్లోకి వచ్చినపుడు, పెద్ద పసుపు జెండాతో కనిపించేవి. దాన్ని ఎగరేయడం ద్వారా పడవలో ఉన్న వారికి ఎవరికీ ఎలాంటి వ్యాధులు లేవని వారు బయటివారికి చెప్పేవారు అని వోకింగ్‌హాంలో క్లీనింగ్ విభాగం హెడ్ లీ చెప్పారు.
"పసుపు అనేది శుభ్రతకు సంబంధించిన రంగు. అందుకే దానిని జెండాకు ఉపయోగించారు" అని అన్నారు.
ఫ్లాగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన చార్లెస్ యాష్ బర్నర్ కూడా "నౌకలపై ఎగరేసే 'క్యూ ఫ్లాగ్' అనేది లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ, అది పడవలో జబ్బు పడ్డవారు ఉన్నారని, వారికి చికిత్స అవసరం అని సూచిస్తుంది" అన్నారు.
"నౌకలో వ్యాధులు ఉన్న వారు ఉండడం వల్ల దానిని రేవుకు, మిగతా పడవలకు దూరంగా ఉంచేవారు. కానీ, ఆధునిక కాలంలో ఈ జెండాను దానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు" అని లీ తెలిపారు.
"అంటే, పడవలో వ్యాధిగ్రస్తులు ఎవరూ లేరు, తనిఖీ చేయవచ్చని చెప్పడానికి నౌకలపై పసుపు జెండా ఎగరేస్తున్నారు. కానీ చాలా అరుదుగా అలా జరుగుతోంది" అన్నారు.
పసుపు జెండాకు, డస్టర్లకు మధ్య ఎలాంటి లింక్ ఉందనేది మాత్రం ఆయన ఎప్పుడూ వినలేదు. బహుశా శుభ్రతకు అది చిహ్నం అయ్యుంటుందని భావిస్తున్నారు.
"మనం ఒక జెండాను ఒక తుడిచే గుడ్డగా ఉపయోగించాలని అనుకోం. అందుకే ఆ రంగును కాలక్రమేణా జెండాగా ఉపయోగించడం కూడా ఆపేశారు".
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
- మనిషికి ఎలుక కామెర్లు... హాంగ్ కాంగ్లో మొట్టమొదటి కేసు
- బిగ్ బాస్: పోటీదారులను హౌజ్‌లోకి ఎలా తీసుకెళ్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు
- 64 ఏళ్ల మిస్టరీని సోషల్ మీడియా సాయంతో ఛేదించిన ఇటలీ అధికారులు
- ఆసియా కప్: విజేత భారత్, కానీ చాంపియన్ మెరుపులు ఎక్కడ?
- ‘సుప్రీంకోర్టు చెప్పినా సరే... 50 ఏళ్లు దాటాకే శబరిమలలో అడుగుపెడతాం’
- #HisChoice: నేను లేడీస్ బ్యూటీపార్లర్ నడుపుతున్నా.. తప్పేంటి?
- అభిప్రాయం: 'వివాహేతర లైంగిక సంబంధాల చట్టంలోని వివక్ష తొలగిపోయింది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








