ఆసియా కప్: విజేత భారత్, కానీ చాంపియన్ మెరుపులు ఎక్కడ?

ఆసియా కప్

ఫొటో సోర్స్, Getty Images

శుక్రవారం దుబయ్‌లో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా బంగ్లాదేశ్‌పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

బంగ్లాదేశ్ నిర్దేశించిన 223 పరుగుల లక్ష్యం చేరుకోడానికి భారత్ చివరి ఓవర్ ఆఖరి బంతి వరకూ పోరాడాల్సి వచ్చింది. చివరకు ఏడు వికెట్లు కోల్పోయి భారత్ విజయం దక్కించుకోగలిగింది. ఒక వన్డే క్రికెట్‌ టోర్నమెంట్ ఫైనల్లో చివరి బంతి వరకూ మ్యాచ్ కొనసాగడం కేవలం ఇది రెండో సారి.

ఏడోసారి ఆసియా కప్ చాంపియన్‌గా నిలిచిన భారత్ రికార్డు సృష్టించింది.

ఫైనల్లో సెంచరీ చేసిన బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌'గా నిలిచాడు. భారత్ తరఫున 5 మ్యాచ్‌ల్లో 342 పరుగులు చేసిన శిఖర్ ధవన్ 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌'గా ఎంపికయ్యాడు.

ఫైనల్లో భారత్ జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో చివరకు విజయం కూడా సాధించింది. కానీ బంగ్లాదేశ్‌ ఇచ్చిన లక్ష్యాన్ని అందుకోడానికి భారత బ్యాట్స్‌మెన్లు చాలా చెమటోడ్చాల్సి వచ్చింది.

కట్టుదిట్టంగా బంతులేసిన బంగ్లాదేశ్ బౌలర్లు తక్కువ స్కోరు ఛేదించడానికి కూడా భారత స్టార్ బ్యాట్స్‌మెన్లు తడబడేలా చేశారు.

సూపర్-4 ఆఖరి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో టై చేసుకున్న భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా చాంపియన్ జోరు చూపించలేకపోయింది.

ఆసియాకప్ విజేత భారత్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

ఆఖరి ఓవర్ ఉత్కంఠ

భారత్‌కు గెలుపు కోసం ఆఖరి ఓవర్లో ఆరు పరుగులు చేయాల్సి వచ్చింది. ఇంకా మూడు వికెట్లు మిగిలున్నాయి. బంగ్లాదేశ్ కెప్టెన్ ఆఖరి ఓవర్ వేసే బాధ్యతను మహ్మదుల్లాకు అప్పగించాడు.

క్రీజ్‌లో కులదీప్ యాదవ్, గాయపడ్డ కేదార్ జాదవ్ ఉన్నారు. ఈ ఓవర్‌కు ముందు కులదీప్ ఒక్క బంతి మాత్రమే ఆడాడు.

చివరి ఓవర్ మొదటి బంతికి కులదీప్ ఒక పరుగు తీశాడు. రెండో బంతికి జాదవ్ ఒక పరుగు తీశాడు. మూడో బంతికి కులదీప్ రెండు పరుగులు చేయగలిగాడు.

ఇప్పుడు మూడు బంతుల్లో భారత్‌ రెండు పరుగులు చేయాలి. నాలుగో బంతికి పరుగు రాలేదు. భారత్ చివరి రెండు బంతులకు రెండు పరుగులు చేయాల్సి వచ్చింది. ఐదో బంతికి భారత్‌కు ఒక రన్ లభించింది.

ఆసియాకప్ విజేత భారత్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

చివరి బంతికి ఒక పరుగు చేయాలి. జాదవ్ స్ట్రైక్‌లో ఉన్నాడు. ఆ బంతి జాదవ్ ప్యాడ్‌కు తగిలి షార్ట్ ఫైన్ లెగ్ వైపు వెళ్లింది. భారత్‌కు లెగ్ బై ద్వారా ఒక పరుగు లభించింది. విజయం కూడా దక్కింది.

జాదవ్ 23 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. నాటౌట్‌గా నిలిచిన కులదీప్ యాదవ్ 5 పరుగులు చేశాడు.

ఈసారీ ఆసియా కప్‌లో భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్‌ చేరింది. కానీ ఫైనల్ మ్యాచ్‌లో చిన్న లక్ష్యాన్ని ఛేదించడంలో కూడా చాలాసార్లు తడబడుతూ కనిపించింది.

భారత జట్టుకు మంచి ప్రారంభం లభించలేదు. టోర్నమెంట్‌ అంతా అద్భుత ఫాంలో ఉన్న ఓపెనర్ శిఖర్ ధవన్ కేవలం 15 పరుగులకే అవుట్ అయ్యాడు. అంబటి రాయుడు(2) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.

ఆసియాకప్ విజేత భారత్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

డీలాపడ్డ స్టార్స్

కెప్టెన్ రోహిత్ శర్మ మంచి జోరులో కనిపించినా, దానిని పెద్ద ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. 55 బంతుల్లో 48 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. స్కోరుబోర్డుపై 83 పరుగులు ఉన్నప్పుడు భారత్ మూడో వికెట్ కోల్పోయింది.

మహేంద్ర సింగ్ ధోనీ, దినేష్ కార్తీక్ నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. ఈ జోడీ కుదురుకుందని అనిపించినప్పుడు 37 పరుగులు చేసిన కార్తీక్ మహమ్మదుల్లా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత ధోనీ ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. 36 పరుగులు చేశాక ముస్తాఫిజుర్ రహ్మాన్ బంతికి పెవిలియన్ చేరాడు.

ఆసియాకప్ విజేత భారత్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

జడేజా-భువనేశ్వర్ భాగస్వామ్యం

జాదవ్ కుడికాలి కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడినప్పుడు భారత్ కష్టాలు మరింత పెరిగాయి.

అంతకు ముందు జాదవ్ 20 బంతుల్లో 19 పరుగులు చేశాడు. అతడు గాయపడి వెళ్లిపోయినపుడు భారత్ విజయానికి 56 పరుగుల దూరంలో ఉంది.

ఆ తర్వాత రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ మ్యాచ్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ 45 పరుగులు జోడించారు. రవీంద్ర జడేజా 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జడేజా అవుట్ అయిన తర్వాత జాదవ్ మళ్లీ మైదానంలోకి వచ్చాడు. తర్వాత భువనేశ్వర్ కుమార్ 21 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఆసియాకప్ విజేత భారత్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

దమ్ము చూపిన దాస్

అంతకు ముందు లిటన్ దాస్ సెంచరీ(121) చేయడంతో బంగ్లాదేశ్ 222 పరుగులు చేయగలిగింది. దాస్ అవుటైన తర్వాత ఆ జట్టు 48.3 ఓవర్లలో ఆలౌట్ అయ్యింది.

బంగ్లాదేశ్ తరఫున సౌమ్య సర్కార్ 33, మెహదీ హసన్ మిర్జా 32 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్‌మెన్స్ ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు.

భారత బౌలర్లలో కులదీప్ యాదవ్ 3, కేదార్ జాదవ్ రెండు వికెట్లు తీశారు. జస్‌ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చాహల్‌కు చెరో వికెట్ లభించింది.

సోషల్ మీడియాలో జోష్

ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో ఆసియా కప్ టీమిండియా సొంతం కావడంతో సోషల్ మీడియాలో అభిమానుల ఉత్సాహంగా పోస్టులు చేశారు.

చివరి బంతి వరకూ పోరాడిన భారత్, బంగ్లాదేశ్ టీమ్ స్పిరిట్ మెచ్చుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విటర్‌లో టీమిండియాను అభినందిస్తూ పోస్ట్ పెట్టాడు.

కీలక ఆటగాళ్లు లేకపోయినా పోరాట పటిమ చూపిన బంగ్లాదేశ్‌ను కూడా ప్రశంసించాడు.

సెహ్వాగ్ ట్వీట్‌కు "రాత్రి 1 గంట వరకూ చాలా ఒత్తిడికి గురయ్యా, బోర్డ్ పరీక్షల్లో కూడా అంత టెన్షన్ పడలేదని" వైభవ్ సింగ్ అనే యూజర్ కామెంట్ పెట్టాడు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)