టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌పై ఆర్థిక మోసం కేసు

ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Reuters

ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సెక్యూరిటీ మోసాలకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో ఆ కంపెనీ షేరు ధర దారుణంగా పతనమైంది.

ప్రస్తుతం పబ్లిక్ లిమిటెడ్‌ సంస్థగా ఉన్న టెస్లాను పూర్తిగా సొంతం చేసుకునే ఆలోచనలో ఉన్నానని, అందుకు అవసరమైన నిధులు కూడా సమకూర్చుకున్నట్టు ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన ప్రకటన పూర్తిగా "అబద్ధమని, అది అందరినీ పక్కదారి పట్టించేలా" ఉందని ఎస్‌ఈసీ వ్యాఖ్యానించింది.

వాటాదారులతో చర్చించకుండానే మస్క్ ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించారని ఆరోపించింది. దాంతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి డైరెక్టర్‌గా వ్యవహరించకుండా అతనిపై నిషేధం విధించాలని కోరుతూ న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది.

అయితే, మస్క్ మాత్రం తనపై దావా వేయడం "అన్యాయమని", తాను ఏ పొరపాటూ చేయలేదని, "నిబద్ధత, పారదర్శకత"తో వాటాదారుల ప్రయోజనాల మేరకే వ్యవహరించానని అన్నారు.

"నా జీవితంలో నీతి, నిబద్ధతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. నేను ఏనాడూ అవకతవకలకు పాల్పడలేదన్న వాస్తవాలు బయటపడతాయి" అని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

"ఎలాన్ మస్క్‌ మీద, ఆయన నిబద్ధత, నాయకత్వం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది" అని టెస్లా డైరెక్టర్ల బోర్డు వ్యాఖ్యానించింది.

తన గర్ల్ ఫ్రెండ్‌తో ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, తన గర్ల్ ఫ్రెండ్‌తో ఎలాన్ మస్క్

తాను టెస్లా సంస్థను స్టాక్ ఎక్సేంజ్ నుంచి డీ-లిస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు గత నెలలో మస్క్ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. అందుకోసం నిధులు కూడా సమీకరించుకున్నట్లు తెలిపారు.

టెస్లా ఒక్కో షేర్‌ ధర 20 శాతం డీ-లిస్టింగ్ ప్రీమియంతో కలిపి 420 డాలర్లుగా వెలకట్టినట్టు కూడా ఆయన చెప్పారు.

అయితే, వాటాదారులతో ఏమాత్రం చర్చించకుండానే మస్క్ ఏకపక్షంగా ఆ నిర్ణయం తీసుకున్నారని ఎస్‌ఈసీ ఆరోపించింది. అంతేకాదు, మస్క్ చెప్పినట్టుగా ఆ రోజు మార్కెట్లు ముగిసే సమయానికి టెస్లా షేర్ విలువ 420 కాదని, 419 మాత్రమేనని ఎస్‌ఈసీ వెల్లడించింది. అయితే, ఆ విలువను తాను రౌండ్ ఫిగర్ చేశానని మస్క్ అన్నారు.

తాజా పరిణామాలతో టెస్లా షేర్ ధర ఒక్కసారిగా 10 శాతం దాకా పతనమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)