ఆసియా కప్: వన్డే క్రికెట్‌లో పాకిస్తాన్‌పై భారత్ అతిపెద్ద విజయం

భారత్ విజయం

ఫొటో సోర్స్, TWITTER.COM/BCC

ఆసియా కప్ 2018 సూపర్ ఫోర్ మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. వన్డే క్రికెట్‌లో వికెట్ల పరంగా చూస్తే పాకిస్తాన్‌పై ఇది భారత్ అతిపెద్ద విజయం అవుతుంది.

ఈ మ్యాచ్‌ విజయంతో భారత్ ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌కు ముందు మంగళవారం భారత్ అఫ్గానిస్తాన్‌తో తలపడుతుంది.

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారత్‌ ముందు 238 పరుగులు లక్ష్యం ఉంచింది. దాన్ని భారత్ 39.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి సాధించింది.

భారత్ ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలు చేశారు, మొదటి వికెట్‌కు 210 పరుగులు భాగస్వామ్యం అందించారు.

భారత్ విజయం

ఫొటో సోర్స్, AFP

శిఖర్ ధవన్ 114, కెప్టెన్ రోహిత్ శర్మ 111 పరుగులు(నాటౌట్) చేశారు. శిఖర్ ధవన్‌ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌'గా నిలిచాడు.

రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో 7 వేల పరుగులు పూర్తి చేశాడు. అత్యంత వేగంగా 7 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లలో ఐదో స్థానంలో నిలిచాడు. రోహిత్ 181 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

ఒక సమయంలో భారత్ పది వికెట్ల తేడాతో ఈ మ్యాచ్ గెలుస్తుందని అనిపించింది. కానీ శిఖర్ అంతలోనే రనౌట్ అయ్యాడు.

శిఖర్ ధావన్ సెంచరీ

ఫొటో సోర్స్, AFP

తిరుగులేని భారత్

బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన భారత్ ఈ మ్యాచ్‌లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్‌ను భారత బౌలర్లు 237 పరుగులకే కట్టడి చేశారు.

పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్లలో షోయబ్ మాలిక్ అత్యధికంగా 78 పరుగులు చేశాడు.

పాకిస్తాన్ ఓపెనర్లు ఆచితూచి ఆడడం ప్రారంభించారు. కానీ 8వ ఓవర్లో యజువేంద్ర చహల్ ఇమామ్-ఉల్-హక్(10)ని ఎల్‌బీడబ్ల్యు చేశాడు. ఆ సమయంలో పాకిస్తాన్ 21 పరుగులు దగ్గర ఉంది.

ఆ తర్వాత 15వ ఓవర్లో రెండో ఓపెనర్ ఫకర్ జమాన్(31) వికెట్ పడింది. అతడిని కుల్‌దీప్ యాదవ్ ఎల్‌బీడబ్ల్యు చేశాడు. తర్వాత ఓవర్లోనే పాకిస్తాన్‌కు మరో షాక్ తగిలింది. 9 పరుగులు చేసిన ఆజం రనౌట్ అయ్యాడు.

షోయబ్ పోరాటం

ఫొటో సోర్స్, TWITTER.COM/THEREALPCB

షోయబ్ మాలిక్ అర్ధశతకం

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షోయబ్ మాలిక్, కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌తో కలిసి మెల్ల మెల్లగా స్కోర్ బోర్డ్ ముందుకు కదిలించారు.

కొన్ని మంచి షాట్స్ కూడా కొట్టిన ఇద్దరూ, నాలుగో వికెట్‌కు 107 పరుగులు భాగస్వామ్యం అందించారు. కానీ 39వ ఓవర్లో 44 పరుగులు చేసిన సర్ఫ్‌రాజ్ అహ్మద్ కుల్‌దీప్ యాదవ్ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చాడు.

మరో ఎండ్‌లో కుదురుకున్న షోయబ్ మాలిక్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించి, పాకిస్తాన్ స్కోరును 200 దాటించాడు. కానీ 44 ఓవర్లో 78 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర అతడు కూడా బుమ్రా బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

మెరిసిన భారత బౌలర్లు

ఫొటో సోర్స్, TWITTER.COM/BCCI

ఓవర్లు పూర్తయ్యేసరికి పాకిస్తాన్ 7 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. మహమ్మద్ నవాజ్(15), హసన్ అలీ(2) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్లు ధాటిగా ఆడలేకపోయారు. యజువేంద్ర చహల్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్‌లో భారత్ తన జట్టులో ఎలాంటి మార్పులూ చేయకుండానే బరిలోకి దిగింది. పాకిస్తాన్ మాత్రం ఫాస్ట్ బౌలర్ షాదాబ్ ఖాన్, మహమ్మద్ అమిర్‌ను జట్టులోకి తీసుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)