ఆఖరు బంతికి సిక్సర్: మియాందాద్ నుంచి దినేశ్ కార్తీక్ దాకా

మియాందాద్

ఫొటో సోర్స్, Mike Hewitt

    • రచయిత, బీబీసీ
    • హోదా, తెలుగు డెస్క్

ఉత్కంఠభరితంగా సాగుతున్న క్రికెట్ మ్యాచ్. ఒకే ఒక్క బంతి మిగిలి వుంది. విజయానికి 6 పరుగులు కావాలి. ఆ చివరి బంతిని సిక్స్ కొడితే..! అది అదిరిపోయే ముగింపు కదూ!

మరి అలాంటి అరుదైన ఫినిషింగ్ టచ్‌లు అన్నీ మీకు గుర్తున్నాయా? ఇదిగోండి.. అలాంటి పది అసాధారణ సందర్భాలు...

1. జావెద్ మియాందాద్

జట్లు : భారత్ వర్సెస్ పాకిస్తాన్ (1986)

1986లో షార్జాలో ఆస్ట్రేలియా-ఆసియా కప్ సిరీస్ జరిగింది. సిరీస్‌లో ఆ రోజే ఫైనల్స్. అదీ - భారత్, పాకిస్తాన్ మధ్య. దాయాదుల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతోంది.

పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ జావెద్ మియందాద్ క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్ చేతన్ శర్మ బౌలింగ్.

మ్యాచ్‌లో అదే చివరి బంతి. కానీ ఇంకా 4 పరుగులు చేయాలి. దాదాపు మ్యాచ్ భారత్ ఖాతాలోకి చేరినట్టే కనిపించింది. కానీ క్రికెట్‌లో ఏమైనా జరగొచ్చు.

చివరికి అదే జరిగింది.

కావాల్సింది 4 పరుగులైతే... చివరి బంతిని జావెద్ మియాందాద్ సిక్స్ కొట్టాడు.

ఓ అద్భుతం కళ్లముందు ఆవిష్కారమైనట్లు స్టేడియంలో కేరింతలు..

పాకిస్తాన్ అభిమానులు ఒక్కసారిగా ప్రవాహంలా మైదానంలోకి దూసుకొచ్చారు. వారి ఆనందం ఆకాశాన్నంటింది.

బ్రెండన్ టేలర్

ఫొటో సోర్స్, Getty Images

2. బ్రెండన్ టేలర్

జట్లు : జింబాంబ్వే వర్సెస్ బంగ్లాదేశ్ (2006)

బంగ్లాదేశ్ నిర్దేశించిన లక్ష్యాన్ని జింబాంబ్వే ఛేదిస్తోంది. బ్రెండన్ టేలర్, తవాంద ముపారివా క్రీజ్‌లో ఉన్నారు. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉంది. చివరి ఓవర్‌ ముష్రఫ్ మోర్తాజా వేస్తున్నాడు.

ఓవర్లో రెండో బంతిని టేలర్ సిక్స్ కొట్టాడు. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో ఐదో బంతికి ముపారివా రనౌట్ అయ్యాడు. ఒక్క బంతి మిగిలుంది.

విజయానికి ఇంకా 5 పరుగులు చేయాలి. సిక్స్ కొట్టడం తప్ప జింబాంబ్వేకు మరో అవకాశం లేదు. టేలర్ సిక్స్ కొట్టి జట్టును గెలిపించాడు.

శివ్‌నారాయణ్ చంద్రపాల్

ఫొటో సోర్స్, Getty Images

3. శివ్‌నారాయణ్ చందర్‌పాల్

జట్లు : వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక (2008)

వేదిక : క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానం

వెస్టిండీస్, శ్రీలంక మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే దిశగా వెస్టిండీస్ వెళుతోంది. మ్యాచ్ చివర్లో ఒక బంతికి 6 పరుగులు చేయాల్సి వుంది.

శివ్‌నారాయణ్ చందర్‌పాల్ బ్యాటింగ్ చేస్తున్నాడు. శ్రీలంక పేసర్ చమిందావాస్ చివరి బాల్‌ను వేస్తున్నాడు. అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

వెస్టిండీస్ జట్టు ఆశలన్నీ చందర్‌పాల్ మీదనే..

చమిందా వాస్ చివరి బంతిని వేయగానే చందర్‌పాల్.. ఆ బాల్‌ను గాల్లోకి కొట్టాడు. అది బౌండరీ వద్ద ఉన్న జయవర్ధనే వైపు వెళ్లింది.

ఆ బాల్‌ను క్యాచ్ పడితే వెస్టిండీస్‌కు ఓటమే... కానీ ఆ బాల్.. జయవర్ధనేను, బౌండరీని దాటేసింది.

అలా చివరి బంతిని సిక్సర్‌ కొట్టి తన జట్టుకు విజయం సాధించిపెట్టాడు చందర్‌పాల్.

మెక్‌కలమ్

ఫొటో సోర్స్, Getty Images

4. మెక్‌కలమ్

జట్లు : శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ (2013)

ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా ఓవర్లను కుదించారు. 23 ఓవర్లలో 198 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ ముందుంచారు.

న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మెక్‌కలమ్ స్ట్రైకర్‌గా ఉన్నాడు. చివరి 4 బంతులకు 17 పరుగులు చేయాల్సివుండగా, వరుసగా ఒక సిక్స్, ఒక ఫోర్, మళ్లీ సిక్స్ కొట్టాడు.

ఇక చివరి బంతికి ఒక పరుగు మాత్రమే సాధించాల్సి ఉండగా.. ఆ చివరి బంతిని కూడా సిక్స్ కొట్టి, తన జట్టును గెలిపించాడు.

మెక్‌లారెన్

ఫొటో సోర్స్, Getty Images

5. మెక్లారెన్

జట్లు : సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ (2013)

ఇరు జట్ల మధ్య వన్‌ డే సిరీస్‌లో అది చివరి మ్యాచ్. న్యూజిలాండ్ లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా ఛేదిస్తోంది.

చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే సౌత్ ఆఫ్రికా 8 వికెట్లు కోల్పోయింది. మెక్‌లారెన్, డేల్ స్టేయిన్ క్రీజ్‌లో ఉన్నారు.

ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలన్నది సౌత్ ఆఫ్రికా ప్రయత్నం.

చివరి ఓవర్‌లో డేల్ స్టేయిన్ మొదటి మూడు బంతులను ఆడి, ఐదో బంతికి ఔట్ అయ్యాడు.

ఒక్క బంతి మాత్రమే మిగిలుంది. 3 పరుగులు చేయాల్సి ఉంది. మెక్‌లారెన్ సిక్స్ కొట్టి, విజయాన్ని అందించాడు.

దినేష్ కార్తీక్

ఫొటో సోర్స్, Getty Images

మరి టీ20లలో చివరి బంతిని సిక్స్ కొట్టినవారి సంగతి..!

01. 2010లో శ్రీలంక, భారత్ మధ్య 20-20 మ్యాచ్ జరిగింది. అందులో చమార కపుగెదర మ్యాచ్ చివరి బాల్‌ను సిక్స్ కొట్టడంతో.. భారత్‌పై శ్రీలంక విజయం సాధించింది.

02. 2012లో ఇండియా, ఇంగ్లండ్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. అందులో ఇయాన్ మోర్గన్ చివరి బంతిని సిక్స్ కొట్టాడు.

03. 2013లో పాకిస్తాన్, వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ చివరి ఓవర్లో 6 పరుగులు చేయాల్సి ఉంది. ఆ ఓవర్లోని మొదటి బంతిని జుల్ఫికర్ బాబర్ ఫోర్ కొట్టాడు.

ఆ తర్వాత 2,3, బంతుల్లో ఒక పరుగు కూడా రాలేదు. 4వ బంతిలో ఒక పరుగు మాత్రమే చేయగలిగారు. ఇక ఐదవ బంతిలో సయీద్ అజ్మల్ రనౌట్ అయ్యాడు. ఇక ఒకే బంతి మిగిలివుంది. ఒక పరుగు చేయాల్సివుంది.

చివరి బంతిని జుల్ఫికర్ బాబర్ అనూహ్యంగా సిక్స్ కొట్టి పాకిస్తాన్‌ను గెలిపించాడు.

04. 2014లో జింబాంబ్వే, నెదర్లాండ్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో వి.సిబాండ చివరి బంతిని సిక్స్ కొట్టి తన జట్టును గెలిపించాడు.

05. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ చివరి బంతిని సిక్స్ కొట్టి విజయాన్ని సాధించిపెట్టాడు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)