World Sparrow Day: పిచ్చుకకూ ఓ స్మారక స్థూపం ఉంది.. ఎక్కడో తెలుసా?

ఫొటో సోర్స్, kalpit bhachech
'నవనిర్మాణ్ ఆందోళన్' పేరుతో 1974లో గుజరాత్ రాష్ట్రంలో ఓ పెద్ద ఉద్యమం జరిగింది.
ఆర్థిక సంక్షోభం, అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు, మధ్యతరగతి ప్రజలు చేపట్టిన సామాజిక రాజకీయ ఉద్యమం అది.
ఆ ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు కాల్పులు జరిపారు. ఆ ఘర్షణల్లో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
అయితే, ఆనాటి పరిస్థితులను అహ్మదాబాద్ ప్రజలు ఓ వినూత్న పద్ధతిలో గుర్తు చేసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, KALPIT BHACHECH
అప్పుడు అహ్మదాబాద్ పాత బస్తీలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ ఊరపిచ్చుక చనిపోయిందట.
అది చూసి స్థానికులు చలించిపోయారు. దానికి జ్ఞాపకార్థంగా ఆ ఘటన జరిగిన చోటే ఓ స్మారక స్థూపాన్ని నిర్మించారు.
ఇప్పటికీ ఆ స్థూపం వద్ద ఆ పిచ్చుకను స్మరించుకుంటూ నివాళులర్పిస్తారు.
ఈ రోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం.

ఫొటో సోర్స్, kalpit bhachech
1974 మార్చి 2 సాయంత్రం 5.25 గంటలకు మేత కోసం వెతుకుతున్న ఆ పిచ్చుక పోలీసుల కాల్పుల్లో ప్రాణం కోల్పోయిందని ఆ స్థూపం మీద రాసి ఉంది.

ఫొటో సోర్స్, kalpit bhachech
పిచ్చుకలు అడవుల్లో కంటే జనావాసాల మధ్యన జీవించేందుకే ఇష్టపడతాయి.
అయితే, రెండు దశాబ్దాలుగా నగరాల్లో వీటి సంఖ్య భారీగా పడిపోయింది. కాంక్రీటు భవనాలు పెరిగిపోతున్నాయి. దాంతో ఈ పక్షులు గూళ్లు కట్టుకునేందుకు కూడా స్థలం దొరకట్లేదు.

ఫొటో సోర్స్, kalpit bhachech
అహ్మదాబాద్‌లో పిచ్చుకల సంరక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డబ్బాలలో గింజలు నింపి అక్కడక్కడా ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం స్థానికుల్లో స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నాయి.
ఫొటోలు: కల్పిత్ భచెచ్
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








