ఫేస్‌బుక్ చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్ ఎక్కడ?

ఫొటో సోర్స్, David Ramos/Getty
- రచయిత, అమోల్ రాజన్
- హోదా, మీడియా ఎడిటర్
యూజర్ల సమాచారాన్ని దుర్వినియోగం చేసినట్టు వెల్లువెత్తుతున్న ఆరోపణల నేపథ్యంలో ఫేస్‌బుక్ బహుశా ముందెన్నడూ లేనంత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఫేస్‌బుక్ డాటా సెక్యూరిటీ చీఫ్ అలెక్స్ స్టామోస్ పదవికి రాజీనామా చేస్తారన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ సంస్థ ఉద్యోగుల్లో కలవరం రేపుతున్నాయి. కంపెనీ పారదర్శకతపై ఉద్యోగుల్లో ఇప్పటి వరకు ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యానికి రష్యా ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుందేమో అన్న సందేహాలు వ్యక్తమైనపుడు, జుకర్‌బర్గ్ దానిని 'క్రేజీ ఐడియా' (పిచ్చి ఆలోచన) అని తోసిపుచ్చారు.
అయితే కొన్ని నెలల తర్వాత వెనక్కి తగ్గి, సమాచార దుర్వినియోగంపై పలు భద్రతా చర్యలు చేపడతామని అన్నారు.
అయితే ఈసారి ఛానెల్ 4 న్యూస్, ది అబ్జర్వర్, ద న్యూయార్క్ టైమ్స్ చేసిన అండర్ కవర్ రిపోర్టింగ్‌పై స్పందిస్తూ ఫేస్‌బుక్, 'లక్షలాది మందికి చెందిన సమాచారాన్ని థర్డ్ పార్టీలకు ఇవ్వడం నిబంధనలను అతిక్రమించడం కిందకు రాదు' అని చాలా ధైర్యంగా చెప్పింది.
ఈ విషయంలో ఫేస్‌బుక్, కేంబ్రిడ్జి అనలిటికా రెండూ కూడా తాము ఎలాంటి తప్పు చేయలేదని, చట్టాలను ఉల్లంఘించలేదని అంటున్నాయి.

ఫొటో సోర్స్, Stephen Lam
అనతికాలంలోనే అత్యంత సంపన్న సంస్థగా ఎదిగిన ఫేస్‌బుక్.. నిజానికి ఒక సామూహిక నిఘా పరికరంగా మారింది. చాలామంది యూజర్లకు తమ గురించి సోషల్ మీడియా సంస్థలకు ఎంత సమాచారం తెలుసు అన్నదానిపై అంచనా లేదు.
ఫేస్‌బుక్ ఇంత సంపన్న సంస్థగా మారడానికి కారణమైన బిజినెస్ మోడల్ - ఆ సంస్థ అందించే సమాచారం మీద ఆధారపడింది.
మీ దృష్టిని ప్రకటనదారుల వైపు ఆకర్షించేలా ఫేస్‌బుక్ ఆ సమాచారాన్ని ఉపయోగించుకుంటుంది. తద్వారా ప్రకటనదారులు స్మార్ట్ మెసేజింగ్ ద్వారా మిమ్మల్ని ప్రభావితం చేసే వాళ్ల ఉత్పత్తులు కొనేలా చేస్తారు.
హ్యూగో రిఫ్ కైండ్ 'ద టైమ్స్'లో రాసినట్లు ఇప్పడు జరిగిందేమిటంటే - అతి శక్తివంతమైన సోషల్ మీడియా సంస్థ అయిన ఫేస్‌బుక్, కేవలం ఉత్పత్తులనే కాకుండా రాజకీయాలను కూడా విక్రయించడం మొదలెట్టింది.
రాజకీయ పార్టీల కోసం పని చేసే సంస్థలు కూడా వ్యాపార సంస్థలలాగే వ్యక్తుల ప్రవర్తనను స్మార్ట్ మెసేజింగ్ ద్వారా ప్రభావితం చేసి ఏదో ఒక పార్టీకో, అభ్యర్థికో ఓటు వేసేలా చేయడానికో లేదా ఒక వాస్తవాన్ని వక్రీకరించడానికో పురిగొల్పుతాయి.
ఎలాంటి సమాచార ఉల్లంఘన జరగలేదని అంటూనే ఫేస్‌బుక్ కేంబ్రిడ్జి అనలిటికా, దాని విజిల్ బ్లోయర్ క్రిస్ వైలీ అకౌంట్లను సస్పెండ్ చేసింది. సమస్యల పరిష్కారం కోసం తమ సిబ్బందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
మార్క్ జుకర్‌బర్గ్ డీసీఎమ్‌ఎస్ సెలెక్ట్ కమిటీ ముందు హాజరు కావడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ దీనిపై ఆయన త్వరలో ఒక బహిరంగ ప్రకటన చేయాల్సి ఉంటుంది. కేవలం బ్లాగ్ పోస్టులు మాత్రం పెడితే సరిపోదు.

ఫొటో సోర్స్, Getty Images
పారదర్శకత మాటల్లోనేనా?
టెక్ సంస్థల ప్రపంచంలో ఫేస్‌బుక్ ఎగ్జిక్యూటివ్‌లు తమ కంపెనీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఆ ప్రపంచంలోని ప్రజలను మరింత చేరువ చేయడం, అందరి మధ్యా సంబంధాలను నెలకొల్పడం తమ 'మిషన్' అని అంటుంటారు.
అయితే రాజకీయంగా తటస్థంగా ఉంటుందని చెప్పే ఫేస్‌బుక్‌లో, ఉదారవాద భావాలు గల సిబ్బందితో పని చేసే ఒక బ్రిటిష్ కంపెనీ తమ వేదికను ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ఉపయోగించుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
అంతే కాకుండా తమ నిష్కాపట్యం గురించి పదే పదే చెప్పుకునే సంస్థ అధిపతి, ప్రజాప్రతినిధుల ముందు హాజరై వివరణ ఇవ్వమని కోరినా ఇప్పటి వరకు స్పందికపోవడం ఎంతటి వైరుధ్యం?
కొన్ని నెలల క్రితం నేను ఫేస్‌బుక్ దాని సంపద రీత్యానే కాకుండా, దాని ప్రభావం రీత్యా కూడా ఉచ్ఛస్థితికి చేరుకుందని అన్నాను. ఈ సిద్ధాంతమే అలెక్స్ స్టామోస్‌లా ఫేస్‌బుక్ నుంచి మరికొంత మంది ఉద్యోగుల నిష్క్రమణకు కూడా దారి తీస్తుందోమో అని నా అనుమానం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








