కాబూల్‌లో ఆత్మాహుతి దాడి - 26 మంది మృతి

అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఓ ప్రార్థనా స్థలం సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 26 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 18 మంది గాయపడ్డారు.
నూతన సంవత్సరం ప్రారంభ వేడుక వేడుకల్లో పాల్గొనడానికి గుమికూడిన వందలాది మందిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడ్డట్టుగా ప్రాథమిక నివేదికలను బట్టి తెలుస్తోంది.
దాడికి గురైన వారిలో అత్యధికులు అల్పసంఖ్యాకులైన షియాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
ఈ దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియలేదు. గత కొద్ది సంవత్సరాలలో షియాలపై మతవిద్వేష దాడులు బాగా పెరిగాయి.
ఇలాంటి చాలా దాడులకు తమదే బాధ్యత అని ఇస్లామిక్ స్టేట్ సంస్థ గతంలో ప్రకటించుకుంది.

ఫొటో సోర్స్, Reuters
ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ వ్యక్తి కాలి నడకనే ప్రార్థనా స్థలం వద్దకు వచ్చాడనీ, పోలీసులు అతన్ని గుర్తించగానే అతడు తన ఒంటి మీదున్న బాంబును పేల్చేశాడని ఆంతరంగిక భద్రతా విభాగం ప్రతినిధి ఒకరు బీబీసీతో చెప్పారు.
కాబూల్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న కాబూల్ యూనివర్సిటీకి సమీపంలో, అలీ అబాద్ ఆసుపత్రి వెలుపల ఈ పేలుడు జరిగినట్టు ఆయన చెప్పారు.
షియాలకు చెందిన ఈ ప్రార్థనా స్థలం (మజార్)పై గతంలో కూడా దాడులు జరిగాయి. 2016 అక్టోబర్‌లో జరిగిన ఓ దాడిలో 14 మంది మృతి చెందారు. 2011లో జరిగిన దాడిలో 59 మంది మరణించారు.
ఇది కాబూల్ నగరంలో ఉన్న అతి పెద్ద మజార్‌లలో ఒకటి. కాబూల్‌లో జరిగే నూతన సంవత్సర వేడుకలకు ఇది ప్రసిద్ధి గాంచింది.
అఫ్ఘానిస్తాన్ జనాభాలో షియాలు 15 శాతం ఉంటారు. వీరిలో అత్యధికులు హజారా అనే సముదాయానికి చెందినవారు.
జనవరిలో తాలిబాన్, ఐసిస్ మిలిటెంట్ సంస్థలు కాబూల్‌లో జరిపిన అనేక దాడుల్లో చాలా మంది మృతి చెందారు. నగరంలో భద్రతా పరిస్థితి ఎంత దయనీయంగా ఉందనడానికి ఇది నిదర్శనం.
ఈ రెండు సంస్థలు కాబూల్ నగరంలో వరుసగా దాడులకు పాల్పడుతున్నాయని బీబీసీ ప్రతినిధులు పేర్కొన్నారు.
ఇవి కూడా చూడండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








