మీరు ఎక్కే విమానం ఎంత వరకు సురక్షితం?

ఫొటో సోర్స్, Getty Images
' భారత్ మినహా ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో విమానాలున్నాయి. అందులో.. ఇంజిన్ వైఫల్యాలు సంవత్సరానికి 25 జరుగుతున్నాయి. అంటే నెలకు రెండు చొప్పున అన్నమాట. కానీ భారత్‌లో వారానికి ఓ సంఘటన జరుగుతోంది''
భారత్‌లో విమానాల ఇంజిన్లు విఫలమవుతున్న ఘటనలు ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. దీంతో భారత వైమానిక రంగంలో ప్రయాణికుల భద్రతా సమస్య తెర మీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో 'డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్'(డీజీసీఏ) స్పందించింది.
గత నెల ఫిబ్రవరి 24న జమ్మూకు చెందిన గో ఎయిర్ వి.టి.డబ్ల్యూ.జి.బి. విమానం 'లేహ్' నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ పనిచేయడం ఆగింది. దీంతో ఆ విమానం తిరిగి వెనక్కు వెళ్లాల్సొచ్చింది.
మార్చి 5న ఇండిగో వి.టి-ఐ.టి.జె విమానంలో కూడా ఇంజిన్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో ఆ విమానాన్ని ముంబైలో అత్యవసరంగా దించేశారు.
అలాగే మార్చి 12న లక్నోకు చెందిన ఇండిగో వి.టి-ఐ.టి.ఎ. విమానం టేకాఫ్ అయిన వెంటనే ఒక ఇంజిన్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో ఆ విమానాన్ని అహ్మదాబాద్‌లో అత్యవసరంగా దించారు.
అయితే.. విమానాల్లో ఇంజిన్‌లు విఫలమవ్వడం తరచూ జరుగుతుంటుందని మాజీ వైమానిక శిక్షకుడు, సివిల్ ఏవియేషన్ భద్రతా సలహామండలి మాజీ సభ్యుడు కెప్టెన్ రంగనాథన్ చెబుతున్నారు.
' భారత్ మినహా ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో విమానాలున్నాయి. అందులో.. ఇంజిన్ వైఫల్యాలు సంవత్సరానికి 25 జరుగుతున్నాయి. అంటే నెలకు రెండు చొప్పున అన్నమాట. కానీ భారత్‌లో వారానికి ఓ సంఘటన జరుగుతోంది'' అని రంగనాథన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విమానం గాల్లో ఉన్నపుడు ఒక ఇంజిన్ పని చేయడం ఆగిపోయినా, కాసేపు అలాగే ప్రయాణించి సురక్షితంగా ల్యాండ్ చేయొచ్చు. కానీ టేకాఫ్ అవుతున్నపుడు ఇంజిన్ ఆగిపోవడం చాలా ప్రమాదకరం.
''తాజాగా ఇంజిన్ ఆగిపోయిన ఘటనలో ఇంజిన్‌లోని ఓ భాగం ఘోరంగా దెబ్బతింది. బహుశా ఈ కారణంచేతనే ఇంజిన్ ఆగిపోయి ఉండొచ్చు. భారత్‌లోని దాదాపు అన్ని విమానాశ్రయాల చుట్టూ భవనాలున్నాయి. ఒకవేళ విమానం టేకాఫ్ అవుతున్నపుడు ఇంజిన్ ఆగిపోతే.. ఈ భవనాలను తప్పించుకోవడం కష్టమవుతుంది'' అని రంగనాథన్ అన్నారు.
ఈ నేపథ్యంలో సమస్యకు కారణమవుతున్న 'ఏ320నియో' ఇంజిన్ కలిగివున్న విమానాలను నిలిపేయాలని డీజీసీఏ ఆయా సంస్థలను కోరింది.
''ఏ320నియో ఇంజిన్‌లతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ విమానాలకు కొత్త ఇంజిన్లు అమర్చాలి. విమానయాన భద్రతకు సంబంధించి త్వరలో ఓ నివేదికను వెల్లడిస్తాం'' అని డీజీసీఏ ఉన్నతాధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రయాణికులపై ప్రభావం..
తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దిల్లీలో ఉద్యోగం చేస్తున్న అనూప్.. తరచూ తన స్వస్థలం ముంబైకి వెళ్లి వస్తుంటారు.
''కుటుంబ సభ్యుల్ని చూడటానికి తరచూ ముంబై వెళుతుంటా.ఇప్పుడున్న పరిస్థితుల్లో విమాన చార్జీలు తప్పక పెరుగుతాయి. ఈ ధరల కారణంగా ప్రయాణాలను తగ్గించుకోవలసిందే. తప్పదనుకుంటే.. అధిక ధర వెచ్చించి ప్రయాణించాలి.'' అని వివరించారు.
సోషల్ మీడియాలోనూ చాలా మంది విమానాల తీరుపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
తమ ప్రయాణికులను ఉద్దేశించి.. ఇండిగో సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో..''ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయంగా మరికొన్ని విమానాలను సిద్ధం చేస్తున్నాం. సమస్యలకు కారణమవుతోన్న ఈ ఇంజిన్లను తయారు చేసిన కంపెనీతో సంప్రదింపులు జరుపుతూ శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాం. వీలైనంత త్వరగా పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయి'' అని ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
డీజీసీఏ ఆలస్యంగా స్పందించిందా?
కొన్ని నెలలుగా 'పీడబ్ల్యూ1100' ఇంజిన్లు సమస్యలు సృష్టిస్తున్నాయి. రాయిటర్స్ సమాచారం మేరకు.. అమెరికా ఏవియేషన్ రెగ్యులేటర్.. 'ప్రాట్ అండ్ విట్నీ'కి చెందిన ఇంజిన్లు ఉన్నట్టుండి పని చేయడం ఆగిపోతున్నాయని పేర్కొంది.
యూరోపియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ కూడా.. రెండూ ఏ320నియో ఇంజిన్లు కలిగిన విమానాలను నడపవద్దని ఎయిర్‌లైన్ కంపెనీలను కోరింది.
తాజాగా ఇండిగో.. ఏ320నియో ఇంజిన్లున్న 3 విమానాలను ఆపేసింది. 2017 ఆగస్టులో ఏ320నియో ఇంజిన్లు కలిగిన 8 విమానాలను ఇండిగో సంస్థ నిలిపేసింది. ఇతర ఇంజిన్లు అందుబాటులో లేకపోవడమే అందుకు కారణం. చెడిపోయిన ఏ320నియో ఇంజిన్ల స్థానంలో కొత్త ఇంజిన్లను 2018 జూన్ వరకు ఏర్పాటు చేస్తామని ప్రాట్ అండ్ విట్నీ సంస్థ తెలిపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో.. డీజీసీఏ కాస్త ముందుగానే స్పందించి ఉండాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
''భద్రత విషయంలో ఒక్క శాతం అనుమానం ఉన్నా.. అలాంటి విమానాలను అస్సలు నడపద్దు. అసలు.. ప్రయాణికుల జీవితాలతో ఎందుకు చెలగాటమాడాలి?'' అని మాజీ పైలట్ కెప్టెన్ మినూ వాడియా అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అభివృద్ధి దిశలో విమానయాన రంగం..
భారత వైమానిక రంగం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. కొన్ని సందర్భాల్లో విమాన చార్జీలు తక్కువగా ఉండటంతో ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది.
దేశీయ వైమానిక రంగాల్లో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని 2017లో 'ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్'(ఐఏటీఏ) పేర్కొంది.
2026 నాటికి.. వైమానిక రంగంలో భారత్.. మూడవ స్థానానికి ఎగబాకుతుందని ఐఏటీఏ అంచనా వేసింది.
''ఈ సమస్యను 2006లోనే గుర్తించారు. డీజీసీఏలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇప్పటికీ తగినంత మంది అర్హత పొందిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్, ఇంజినీర్లు, సేఫ్టీ ఇన్స్పెక్టర్లు లేరు. సిబ్బంది కొరత ఉండడంతో.. ఇంజినీర్ చేయాల్సిన తనిఖీలను టెక్నీషియన్లు చేయాల్సివస్తోంది'' అని రంగనాథన్ తెలిపారు.
''డీజీసీఏలోని ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలి. సాంకేతిక నిపుణులను వెంటనే నియమించాలి. భద్రతపై ఎక్కువ దృష్టి సారించాలి. ఇతర దేశాల మాదిరిగానే ఇక్కడా ఓ స్వతంత్ర భద్రతా మండలి ఉండాలి'' అని కెప్టెన్ వడియా అన్నారు.
ఓవైపు.. పెద్ద సంఖ్యలో విమానాలు గాల్లోకి ఎగురుతుంటే, మరోవైపు.. అసలు భారత్‌లో సుశిక్షితులైన అధికారులు తగినంత మంది ఉన్నారా? అన్న అనుమానాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భద్రత గురించి ఎందరు ఆలోచిస్తున్నారు?
''ప్రయాణికుల్లో చాలా మంది.. తమకు విమాన టికెట్లు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతాయోనని ఆలోచిస్తున్నారు కానీ.. తగిన భద్రతా ప్రమాణాలు కలిగిన విమాన సంస్థల గురించి ఎందరు ఆలోచిస్తున్నారు? ఈ ఆలోచనా ధోరణి మారనంత వరకు పరిస్థితుల్లో మార్పు రాదు'' అని రంగనాథన్ బీబీసీతో అన్నారు.
''భద్రతా ప్రమాణాలు కావాలంటే అధిక ధర చెల్లించక తప్పదు. నేను భద్రతకే మొగ్గు చూపుతాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకిదే మంచి ఆలోచన అనిపిస్తోంది'' అని అనూప్ బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
- గిరుల మీది గంగను ఊరికి తరలించిన గిరిజనులు!
- హవ్వా.. అంత్యక్రియల్లో అర్ధ నగ్న నృత్యాలా..!
- ‘అధికారం కొన్ని కులాల గుప్పిట్లోనే ఉండాలా? కుదరదు’
- వైష్ణవి సన్నాయి పడితే.. వీనుల విందే
- ఇంటి అద్దె వద్దు.. సెక్స్ కావాలంటున్నారు
- వివాహేతర సంబంధాల్లో ‘ఆమె’ను ఎందుకు శిక్షించరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








