మనిషికి ఎలుక కామెర్లు... హాంగ్ కాంగ్‌లో మొట్టమొదటి కేసు గుర్తింపు

ఎలుక

ఫొటో సోర్స్, Getty Images

హాంగ్‌ కాంగ్‌లో నివసిస్తున్న ఒక 56 ఏళ్ల వ్యక్తికి ఎలుక కామెర్లు (ర్యాట్ హెపటైటిస్ - ఇ) సోకినట్లు గుర్తించారు. ఈ వైరస్ మనిషికి సోకగా గుర్తించిన మొట్టమొదటి ఉదంతం ఇది.

ఈ వైరస్ అతడికి ఎలా సోకిందన్నది స్పష్టంగా తెలియటం లేదని పరిశోధకులు చెప్తున్నారు. అయితే.. అతడి ఇంటి బయట ఉన్న చెత్తకుండీల నిండా ఎలుకలు ఉన్నాయన్న వాదనను తిరస్కరిస్తున్నారు.

ఈ రకం వైరస్ మనిషికి సోకగలదన్న ఆధారాలు ఇంతకుముందు ఎన్నడూ లేవు.

మానవ హెపటైటిస్-ఇ వైరస్ సాధారణంగా కలుషిత తాగనీరు ద్వారా వ్యాప్తిచెందుతుంది.

ఎలుక కామెర్లు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, వేడి వాతావరణం వల్ల హాంగ్ కాంగ్‌లో ఎలుకల బెడద తీవ్రంగా పెరిగింది

చాలా భిన్నమైన వైరస్...

ఆ వ్యక్తికి కాలేయ మార్పిడి జరిగిన అనంతరం.. అతడి కాలేయం అసాధారణంగా ఉండటాన్ని గుర్తించిన వైద్యులు.. పరీక్షల్లో అతడికి ర్యాట్ హెపటైటిస్-ఇ సోకినట్లు కనిపెట్టారు.

మనుషులకు సోకే రకం హెపటైటిస్ కన్నా ‘అతి విభిన్నమైన’ హెపటైటిస్ రకం అతడి ఒంట్లో ఉన్నట్లు మరిన్ని పరీక్షల్లో గుర్తించామని యూనివర్సిటీ ఆఫ్ హాంగ్‌కాంగ్ పరిశోధకులు చెప్పారు.

‘‘ఈ వైరస్ సోకిన ఎలుకల మలంతో కలుషితమైన ఆహారం వల్ల అది ఇతడికి సోకే అవకాశం ఉందని మేం భావిస్తున్నాం’’ అని వారు ఒక నివేదికలో పేర్కొన్నారు.

ర్యాట్ హెపటైటిస్ సోకిన వ్యక్తి కోలుకుంటున్నట్లు చెప్తున్నారు.

మానవ హెపటైటిస్-ఇ సోకిన వ్యక్తికి కామెర్లు వస్తాయి. కొన్నిసార్లు అలసట, జ్వరం, వాంతులు, పొత్తికడుపులో నొప్పి లక్షణాలతో కూడా బాధపడుతుంటారు.

చాలా మంది ఈ వైరస్‌ను అధిగమిస్తారు. కానీ వ్యాధినిరోధక శక్తి లోపం ఉన్నవారు, గర్భిణిలకు ఇది ప్రాణాంతకంగా పరిణమించగలదు.

జంతువుల నుంచి మనుషులకు జబ్బులు సోకటం సాధారణ విషయమే. కొత్తగా వస్తున్న అంటు వ్యాధుల్లో 60 శాతానికి పైగా జబ్బులు జంతువుల్లో పుట్టుకొచ్చినవే.

దీర్ఘ కాలం పాటు వేడి, ఉక్కపోత వాతావరణం కొనసాగుతుండటం వల్ల హాంగ్ కాంగ్‌లో ఎలుకల సమస్య తీవ్రంగా పెరిగింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)