పెథాయ్: ‘యానాం, తుని మధ్య తీరం దాటొచ్చు’ - ఏపీ ఆర్టీజీఎస్

సముద్ర తీరం
ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద అలల ఉద్ధృతికి తీరం కోత

బంగాళాఖాతంలో పెథాయ్ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. సోమవారం ఉదయం 8.30 గంటల సరికి తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు 125 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ పెను తుపాను ఈ రోజు మధ్యాహ్నం 11.30 నుంచి 2.30 గంటల మధ్య యానాం, తుని పట్టణాల మధ్య తీరం దాటొచ్చని ఆంధ్రప్రదేశ్ రియల్‌టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఏపీ ఆర్టీజీఎస్) వెల్లడించింది.

తుపాను తీరం దాటేటప్పుడు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తుపాను ప్రస్తుతం 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని ఐఎండీ అనుబంధ 'రీజనల్ స్పెషలైజ్డ్ మెటియరలాజికల్ సెంటర్ ఫర్ ట్రోపికల్ సైక్లోన్స్' వెల్లడించింది.

తుపాను ప్రభావంతో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలు.. కృష్ణా, గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ ఐఎండీ హై అలర్ట్‌ ప్రకటించింది.

సముద్రం అల్లకల్లోలంగా ఉందని, సాధారణం కంటే మీటరు అంతకంటే ఎక్కువ ఎత్తులో అలలు వస్తాయని, తీర ప్రాంత జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది.

తుపాను తీరం దాటనున్న ప్రాంతం
ఫొటో క్యాప్షన్, తుపాను తీరం దాటనున్న ప్రాంతం

ప్రజలకు ఆర్టీజీఎస్ అప్రమత్తపు హెచ్చరికలు

కాగా తుపాను నేపథ్యంలో ఏపీ ఆర్టీజీఎస్ ప్రజలకు పలు సూచనలు చేసింది.

తుపాను తీరం దాటేటప్పుడు పెనుగాలులతో భారీ వర్షాలు కురవనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అరటి, ఉద్యాన పంటల రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని.. వరి, జొన్న, ఇతర పంటలు కోసినవారు తక్షణం పంటను గోదాముల్లో భద్రపరుచుకోవాలని సూచిస్తూ ఏపీ ఆర్టీజీఎస్ ప్రజలకు సందేశాలు పంపించింది.

గుడిసెలు, రేకుల ఇళ్లలో ఉన్నవారిని వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

ప్రత్యేకించి తూర్పుగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని.. రోడ్లపై వాహనాల్లో తిరగడం, చెట్లకింద తలదాచుకోవడం చేయరాదని సూచించింది.

సోమవారం ఉదయం 8.15కి కాకినాడకు 125 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన తుపాను

ఫొటో సోర్స్, APRTGS

ఫొటో క్యాప్షన్, సోమవారం ఉదయం 8.15కి కాకినాడకు 125 కి.మీ. దూరంలో పెథాయ్ తుపాను కేంద్రీకృతమై ఉంది.

మరోవైపు రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు మొదలయ్యాయి. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 400 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు విద్యాశాఖ సోమవారం సెలవు ప్రకటించింది. ప్రకాశం జిల్లాలోని 11 మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు మండలాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)