పెథాయ్: తీరం దాటింది.. తీవ్రత తగ్గింది

పెథాయ్ తుపాను తీవ్రత కాస్త తగ్గింది. అది తీవ్ర వాయుగుండంగా మారింది. క్రమంగా రాత్రికి వాయుగుండంగా, రేపు ఉదయానికి అల్పపీడనంగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈ తీవ్ర వాయుగుండం యానాం కాకినాడ దగ్గర తీరం దాటింది. ఇది మళ్లీ తుని దగ్గర కూడా తీరం దాటుతుంది.
కాకినాడ దగ్గర సముద్రం కొద్దిగా లోనికి చొచ్చుకుని ఉండడంతో తుపాను కదులుతున్న ఈశాన్యం దిశలో ముందుగా భూమి తరువాత సముద్రం, తరువాత మళ్లీ భూమి రావడం వల్ల ఇలా జరుగుతుంది.
అంతే తప్ప తుఫాను తన గమనాన్ని మార్చుకోవడం కానీ, వెనక్కు సముద్రంలోకి వెళ్లడం కానీ జరగలేదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ తీవ్రవాయుగుండం ప్రభావంతో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ లలో వర్షాలు పడతాయి.
మరోవైపు విశాఖలో ఏడుగురు మత్స్యకారులతో ఉన్న పడవ ఆచూకీ గల్లంతయ్యింది

భోపాల్ నుంచి అమరావతి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రంలో తుఫానుపై సమీక్ష నిర్వహించారు.
సహాయక ఏర్పాట్లు, తుఫాను గమనం, చేయాల్సిన పనులపై మంత్రులు, అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు.
ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి అందించిన సమాచారం ప్రకారం 300 గొర్రెలు శీతల గాలులకు చనిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవులో 166 మి.మి. అత్యధిక వర్షపాతం నమోదైంది.
297 టెలికామ్ టవర్లు దెబ్బతిన్నాయి. తుఫాన్ సహాయక చర్యల్లో 2 వేలమంది సిబ్బందిని భాగస్వాముల్ని చేశారు. అమలాపురం ప్రాంతంలో కొబ్బరిచెట్టు విరిగిపడటంతో ఒకరికి గాయాలయ్యాయి. చికిత్స అందిస్తున్నారు.

ఫొటో సోర్స్, Twitter/Nara Lokesh
89 సబ్ స్టేషన్లు (33 కేవి) తుపాను ప్రభావం వల్ల దెబ్బతింటే 84 సబ్ స్టేషన్లను వెంటనే పునరుద్ధరించారు. 379 విద్యుత్ స్థంభాలు దెబ్బతింటే అందులో 146 స్థంభాలను పునరుద్దరించారు.
అంతకు ముందు.. పెథాయ్ తుపాను సోమవారం మధ్యాహ్నం 3.12 గంటలకు పుదుచ్చేరిలోని యానాం, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ మధ్య తీరం దాటిందని ఏపీ పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు.
ఇది తుని నుంచి ఒడిశా వైపు కదులుతోందని ఆయన చెప్పారు. తుని, పాడేరు, పాయకరావుపేట ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. తుపాను వల్ల ఇప్పటివరకు 400 కరెంట్ స్తంభాలు నేలకూలినట్లు సమాచారం ఉందన్నారు.
25 వేల మంది కి 147 పునరావాస కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేశామని మంత్రి వివరించారు.

ఫొటో సోర్స్, Cyclone Warning Centre, Visakhapatnam
అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన, ఎస్ యానాం (పుదుచ్చేరి) మధ్య పెథాయ్ తుపాను తీరాన్ని తాకిందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది.
తుపాను ప్రభావం వల్ల గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు బయటకు రాకుండా సురక్షిత ప్రాంతాల్లోకి ఉండాలని ఆంధ్రప్రదేశ్ రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ(ఆర్‌టీజీఎస్) హెచ్చరికలు జారీ చేసింది.
పెథాయ్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలో, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి.
సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తూర్పు గోదావరి జిల్లా ఇంజారంలో 11.95 సెంటీమీటర్లు, ఉప్పలగుప్తంలో 11.77, ఆర్యవటంలో 11.45 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
సోమవారం మధ్యాహ్నం వరకున్న సమాచారం ప్రకారం విజయవాడలో 13 సెంటీమీటర్లు, గుడివాడలో 10, కైకలూరు, తెనాలి, చింతపూడి, రేపల్లెల్లో ఏడు సెం.మీ. చొప్పున వర్షం కురిసింది.
తూర్పు గోదావరి జిల్లాలో ముందు జాగ్రత్తగా 101 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

విశాఖపట్నంలో విమానాల రాకపోకలు రద్దు
పెథాయ్ తుపాను నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం వరకు 14 విమానాల రాకపోకలు రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
తుపాను కారణంగా వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో విశాఖపట్నం విమానాశ్రయంలో 700 మంది ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
వాతావరణం అనుకూలించకపోవడంతో దిల్లీ- విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్‌లో దిగింది. చెన్నై- విశాఖపట్నం విమానం వెనక్కు తిరిగి చెన్నైకే వెళ్లిపోయింది. హైదరాబాద్- విశాఖ స్పైస్ జెట్ విమానం రద్దయ్యింది.
విశాఖపట్నం విమానాశ్రయంలో బలమైన గాలులు వీస్తున్నందువల్ల విమానాల రాకపోకలు ప్రభావితమయ్యాయని విమానయాన సంస్థ ఇండిగో ట్విటర్‌లో పేర్కొంది.పోర్ట్ బ్లెయిర్‌కు వెళ్లాల్సిన విమానాల రద్దు లేదా సమయాల మార్పు జరిగినట్లు వెల్లడించింది.
రైలు, బస్సు ప్రయాణాలపైనా ప్రభావం
పెథాయ్ తుపాను నేపథ్యంలో కోస్తాంధ్ర ప్రాంతంలో రైలు, బస్సు ప్రయాణాలపైనా ప్రభావం పడింది. విశాఖపట్నం-విజయవాడ మధ్య పదుల సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు.
తుపాను ప్రభావంతో విశాఖపట్నం నుంచి రాజమండ్రి,కాకినాడ, ఏలూరు, విజయవాడ వైపు వెళ్లే సర్వీసులను నిలిపివేసినట్లు ఆర్‌టీసీ అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో తుపాను సహాయక కేంద్రాల ఫోన్ నెంబర్లు
ఫెథాయ్ తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాల ఫోన్ నెంబర్లు ఇవి..
- మచిలీపట్నం -08672 252486
- గుడివాడ - 08674 243697
- నూజివీడు - 08656 232717
- విజయవాడ - 0866 2574454
- కాకినాడ కలెక్టరేట్ - 1800 4253077
- అమలాపురం ఆర్డీవో -08856 233208
- కాకినాడ ఆర్డీవో - 08842 368100
- తణుకు రూమ్ - 08819 224056/223022
- విశాఖపట్నం - 9866606175, 7013930217

పెథాయ్ తుపానుకు సంబంధించి బీబీసీ కథనాలు..


ఫొటో సోర్స్, http://satellite.imd.gov.in
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








